గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2020, సోమవారం

అవధానిప్రవరులు1......శ్రీ మద్దూరి రామమూర్తి.

జైశ్రీరామ్.
అ వ ధా ని  ప్ర వ రు లు.1
రచన.
శ్రీ మద్దూరి రామమూర్తి.
మత్తేభ మాలిక.
అవనిన్ మానవ జన్మ దుర్లభము, కావ్యజ్ఞాన సంబంధ సం
భవ మెన్నన్ కడు దుర్లభమ్ము, భువి విద్వద్వంద్యయౌ భారతీ
ప్రవిమత్ దివ్య కృపావలోకనముచే రాజిల్లి గణ్యాత్ములై
నవనీత ప్రతిమాన మానసమునన్ జ్ఞానమ్ము నందించుచున్
భువి శిష్యాళిని సృష్టి చేసిరి మహా మోదమ్మునన్‌ సద్గురు
ప్రవరుల్. జ్ఞాన సరస్వతీ కృపను భ్రాజత్పండితాఖండులై
స్తవమున్ గాంచిరి. వారి వత్సలతచే ధన్యాత్ములై మించుచున్
అవలోకింపగ శిష్య రత్నములు ప్రత్యంగమ్మునన్ మిన్నలై
కవులై,మేటి వధానులై, సరసులై కావ్యమ్ములన్ నిల్పరే
అవనిన్ పుణ్యఫలమ్ము చేత గద గణ్యంబౌచు వర్ధిల్లు నా
కవితాశిల్పము,దానిలో నమరు ప్రాగ్జన్మంపు సంస్కారతన్
అవధాన ప్రవణత్వ లాస్యమును కావ్యానంద సంచారమున్
దివిషద్వాహిని నోలలాడుచు కవుల్ దీవ్యద్దయామూర్తులై
యవధానంబులు జేసి ధన్యతములై యాహ్లాదులై రెంతయో
ధ్రువమీ పల్కు మహానుభూతులకు,చిద్రూపమ్ముగా నిల్చి భ
వ్య విరించిన్ బలె వెల్గు సత్కవికి విద్యాదేవి తోడుండదే.
అవలోకింపగ సాహితీవనిని విద్యరామ పుంస్కోకిలల్
ప్రవణత్వమ్మగు కూజితమ్ముల సదా వాసంతికల్ నింపుచున్
చవులూరించు రసార్ద్ర
భావములతో సాహిత్యమున్ నిల్ప నా
కవితారామ మనోజ్ఞ సీమల రసజ్ఞానీక భృంగమ్ములే
కవితాపుష్ప మరంద బిందువుల తత్కాలాను గుణ్యమ్ముగా
స్తవనీయంబుగ గ్రోలి మత్త తనులై ధాత్రిన్ విరాజిల్లి రా
కవిలోక ప్రముఖాళి నెన్న తరమే? కావ్యమ్ములే కాక వా
రవధానాటవి సంచరించి యట సింహంబుల్ వలెన్ దుష్ట కా
కవి మత్తేభ దురంత కుంభముల రక్తాస్వాదనన్ జేసి సం
స్తవ నీయోజ్జ్వల మూర్తులై ధర యశో ధన్యాత్ములై మించి రా
కవిలోకమ్మున మాడభూషి గురుడై జ్ఞానాత్ముడై వేంకటా
ర్య వధాని ప్రవరుండు నిల్చె, కవులన్ రాడ్వర్యులై ధీరతన్
పవినాన్ తిర్పతి వేంకటేశ్వరులు వాగ్భామామణీ మూర్తులై
స్తవమున్ గాంచిరి.వారి గీరతము విశ్వస్తుత్యమై యొప్పెడిన్
అవలన్ దేవలపల్లి సోదరులు విద్యామూర్తులై యొప్ప స
త్కవియౌ పోకురి వంశ భానుడగు శ్రీ కాశీపతి స్వామి తా
నవధానాగ్రణియై యశమ్ముగనె,సద్యస్ఫూర్తు లొప్పార ధీ
రవి యయ్యెన్ పిసుపాటి వంశమణి విభ్రాజద్యశోధన్యుడై
అవధానంబులు జేయుచున్ గుణ రసజ్ఞాత్మీయ విద్వత్కవి
ప్రవరుల్ మెచ్చెడిరీతి కొప్పరపు సమ్రాట్టుల్ ధరన్ మించగా
కవిగా  మేటి విమర్శకుండుగ దివాకర్లాన్వయుండెన్న
తా
నవలీలన్ బహుళా
వధానములచే ఖ్యాతిన్ గడించెన్ భువిన్
అవధానాంగణ సార్వభౌమ శివరామాఖ్యుండటంచున్ దగన్
కవియౌ వేలురి వంశ సంభవుని నుద్ఘాటింతురా సత్కవి
ప్రవరున్ పాదములంటి మ్రొక్కెదను. సద్భక్తిన్ మనోజ్ఞంపు శ
బ్ద విలాసోజ్జ్వల భావ సద్రస కవిత్వానల్ప శిల్పంబుచే
యవధానాంచిత చంద్రశేఖరుడు తా నయ్యెన్ మహా స్రష్టగా.
శివుడై జ్ఞాన సురాపగన్ నిలిపె  కాశీ కృష్ణమాచార్యుడున్.
సువచోరమ్య మనోజ్ఞ ధీ ప్రవణతల్ శోభిల్లగా జేయుచున్
కవులై పింగళి కాటురీ వరులు విఖ్యాతావధానమ్ములన్
అవలీలన్ ధృతి సల్పి వెల్గిరిల. విద్యామూర్తి డోకూరియున్
ప్రవణుండౌచు వధానమందు నలరెన్. నండూరి శ్రీ రామకృ
ష్ణ వధానమ్మున సూర్యుడై వెలిగె, పాణ్యం శ్రీ నృసింహుండు సం
స్తవమున్ బొందె మహావధాని యనగా సత్కావ్య నిర్మాతయై
పవియై వెల్గెను రాళ్ళబండి కవి శుంభన్మూర్తి మంతమ్ముచే
కవిమూర్ధన్యుని పద్య గద్య రచనా కంజాత సంజాతు శాం
భవి పాదార్చకు సద్వధాన కవి దోమా వేంకటస్వామి గు
ప్త వధానామృత పానచిత్తు నిట సంభావింతు .నారీతి స
త్కవియై,రమ్య వధానియై గురుడునై,జ్ఞాన ప్రసూనమ్ములన్
సు విలాసమ్ముగ నిచ్చుచున్ తత విశుద్ధంబైన చిత్తంబుతో
నవలోకించెడి గౌరిపెద్ది కుల పద్మాదిత్యు నర్చింతు, వా
క్ప్రవరుండై శివభారతాది కృతులన్ వర్ధిల్లగా జేసె నా
యవధానాగ్రణి శేషశాస్త్రి గడియారాఖ్యాత వంశ్యున్ సుధీ
స్తవ పాదాబ్జు నుతింతు భక్తి
మెయి విద్వత్కుంజరున్ మాన్యు , భ
వ్య వచః స్మేరముఖీ కృపాస్రవ దకంప ప్రాజ్య కారుణ్య పూ
ర వియన్నిర్ఝరిణీ నిరంతర విహారాదృష్ట సమ్మోద భా
గ్య విశేషమ్మున దిక్తటిన్ వెలిగె గాడేపలీ కృష్టి, ప
ల్లవ పాణిన్ వర శారదన్ దలచు పుల్లాపంతు లాఖ్యాతునిన్
కవి శ్రీ వేంకటరామశర్మను వధానిన్ జ్ఞాను నర్చింతు. వా
గ్రవి జంధ్యాల కులోత్తమున్ సుకవి సుబ్రహ్మణ్యశాస్త్రిన్ మదిన్
స్తవమున్ జేతును
.జోస్యులాన్వయుని సమ్మాన్యున్ సదానంద ధీ
ప్రవరున్ దివ్య వధాన సింహమును సంభావింతు నిచ్చల్ హృదిన్.

భువి మత్తేభ మహద్వధానివరుడీ పూజ్యుండు మద్దూరి స

త్కవితా వాహిని రామమూర్తి యన తా గణ్యంపు మత్తేభమున్

జవనాశ్వంబన మాలికన్ గొలిచిరా సంస్తుత్యులన్ పూజ్యులౌ

యవధాన్యగ్రణులందరిన్ సరసులాహాయంచు మెచ్చన్. భళీ!
🙏🏻
చింతా రామకృష్ణారావు.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.