గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2020, శుక్రవారం

సైనక్ పురిలో అష్టావధానం నేడే. మీకు స్వగతమ్.

జైశ్రీరామ్.

3వతేదీ సాయంత్రం సైనిక్ పురి శృంగేరీ శంకరమఠంలో లలిత్ ఆదిత్య అష్టావధానం

రాజమండ్రిలో అద్భుతంగా శతావధానాన్ని చేసి 25 నిముషాల్లోనే 75 పద్యాలు ధారణ చేసి ఉద్దండులయిన సంస్కృతాంధ్ర పండితులను అబ్బురపరిచి భళా అని ప్రశంసలు పొందిన అమెరికా వాసి యువ శతావధాన శిరోమణి శతావధాన శరచ్చంద్ర తెలుగింటి ముద్దుబిడ్డ లలిత్ ఆదిత్య మరో అద్భుత అవధానం చేయబోతున్నారు..అత్యంత వేగంగా మహాపండితులు పృచ్ఛకులుగా.. మహా సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు గారి సమక్షంలో లలిత్ అవధాన విన్యాసం 3వతేదీ శుక్రవారం జరగబోతోంది.ఒకరకంగా రాజమహేంద్రవరం శతావధానం విజయోత్సవంగా ఈ అద్భుత అష్టావధానం సాహితీ ప్రియులను ఓలలాడించనుంది. *దర్శనమ్* ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సైనిక్ పురిలోని హై టెన్షన్ రోడ్ లోని శ్రీ విజయగణపతి దేవాలయం ,శ్రీ శృంగేరీ శంకరమఠంలో 3వతేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నవయువ అవధాని లలిత్ అష్టావధానం జరుగుతుంది.. సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం

*మరుమాముల వెంకటరమణ శర్మ* *దర్శనమ్ మాసపత్రిక* *9441015469*

*రాజమండ్రి లో జరిగిన లలిత్ శతావధానం విశేషాలు*
*రాజమండ్రి అద్భుతంగా లలిత్ ఆదిత్య శతావధానం*
*25 నిమిషాల్లో 75 పద్యాలు ధారణ*

*విజయతీరాలకు చేరుకున్న లలిత్‌ ఆదిత్య* 

*పులకించిన గోదావరి* 

*పద్యాల పండగకు తరలివచ్చిన సాహితీలోకం*

*ముగిసిన శతావధానం*

 లలితాదిత్యుడు మధ్యందిన మార్తాండుడిలా జాజ్వల్యమానంగా ప్రకాశించాడు. పృచ్ఛకవరేణ్యుల అక్షర అస్త్రశ్రస్తాలను అతి లాఘవంగా ఎదుర్కొన్నాడు. పద్యాలను ఛందోబద్ధంగా మాత్రమే కాదు, రసరమ్య గీతాలుగా, భావస్ఫోరకంగా చెప్పి పండితుల ఆమోదాన్ని, ఆశీస్సులను అందుకున్నాడు. ఆదికవి నన్నయ భట్టారకుడు, తిరుపతి వేంకట కవులు, కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వంటి హేమాహేమీలు నడయాడిన గడ్డ మీద.. అమెరికాలో జన్మించి, అక్కడే చదువు‘సంధ్య’లు సాగిస్తున్న ఈ నూనూగు మీసాల నూత్నయౌవనంలో ఉన్న కుర్రాడు మంగళవారం శతావధానం విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మహత్తర ఘటన తెలుగు సాహితీ జగత్తుకు గర్వకారణంగా నిలిచిపోతుందని పలువురు సాహితీవేత్తలు ఈ సందర్భంగా ముక్తకంఠంతో పేర్కొన్నారు.. ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, శుభోదయం ఇన్‌ఫ్రా సంయుక్త ఆధ్వర్యాన కళాశాలలో ఆదివారం ప్రారంభమైన శతావధానం నిర్వాహకుల అంచనాలకంటే ముందుగానే ఉదయం 11.43 గంటలకు ముగిసింది.

ఘంటానాదం చేస్తున్న ధూళిపాళ

శతావధానంలోని అంశాలు
మూడు నిషిద్ధాక్షరులు, 24 సమస్యలు, 24 దత్తపదులు, 24 వర్ణనలు, 19 ఆశువులు, నాలుగు ఘంటావధానాలు, మూడు అప్రస్తుత ప్రసంగాలు వెరసి.. 101 అంశాలపై పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలకు యతిప్రాసలు చెడకుండా, రసాత్మకంగా లలిత్‌ ఆదిత్య పద్యాలను అలవోకగా అందించాడు. ‘శ్చి’, స్త్వం’ వంటి ప్రాసలతో పద్యాలు చెప్పవలసివచ్చినా అదరలేదు.. బెదరలేదు. ‘శిష్యవాత్సల్యము చెలువుమీర’ అవధాన ప్రాచార్య డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి అవధానిని ప్రోత్సహిస్తూ, పృచ్ఛకులను కవ్విస్తూ, రసజ్ఞులను మెప్పిస్తూ అంతటా తానే అయి, అన్నీ తానే అయి అవధాన క్రతువు నిర్వహించారు. అవధానిని ‘అవధాన శరచ్చంద్ర’ బిరుదుతో సత్కరించారు.

25 నిమిషాల్లో 75 పద్యాలు
మూడు రోజులుగా పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు తాను పద్యరూపంగా ఇచ్చిన సమాధానాలను సాయంత్రం జరిగిన మహాధారణలో లలిత్‌ ఆదిత్య 25 నిమిషాలలో చదివాడు. ‘గురువులయ్యె గురువుల దీవెనల్, లఘువులయ్యె నాదు శ్రమల్‌’ అని గురువులను స్తోత్రం చేశాడు. ఇది సరికొత్త రికార్డు అని మహాదేవమణి శిష్యుని ఆలింగనం చేసుకున్నారు. మహామహోపాధ్యాయులు, సంస్కృత శతావధానులు కొలువు తీరిన సభలో ఆదిత్య మహాధారణకు కరతాళధ్వనులు ఆగకుండా మోగాయి.

పూరి, గారె, వడ, దోసెలతో వాతావరణ కాలుష్యంపై పద్యం చెప్పమని సరసకవి డాక్టర్‌ ఎస్‌వీ రాఘవేంద్రరావు కోరగా.. అవధాని ఇలా చెప్పారు.
‘పూరి’త మయ్యె ముజ్జగము భూస్థితి భంగ రసాయనంబులన్‌
దూరినభ్యాదతన్‌గొనగ ‘దోసి’ళు లొగ్గిన వారు లేరు పొం
‘గారె’ను బాష్పముల్‌ కువలయాంగనకున్‌ కలుషమ్ము మీరగా
ఆరయచిత్తకంధి ‘వడ’వాగ్నిగ రేగెను దిర్నివారమై.. 

పండితుల ప్రశంసలు
ధార, ధారణ, పూరణ అవధానానకి ప్రాణాలు. శీలసంపద లేని పాండిత్యం, హారతి లేని పూజ, పూలు తలలో లేని మగువ కొప్పు, ధారణ లేని అవధానం వ్యర్థం. ధారణలో లలిత్‌ సందీప్‌ అసామాన్యమైన ప్రతిభ చూపాడు.
– ప్రవచన రాజహంస డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి

అత్యద్భుత ప్రతిభ
లలిత్‌ ఆదిత్యుని ప్రతిభ అద్భుతం. దేవీదత్తం, ఉపాసనాసిద్ధి పొందిన లక్షణాలు అవధానిలో కనిపిస్తున్నాయి.
– మహామహోపాధ్యాయ

శలాక రఘునాథశర్మ పురాకృత సుకృతం
పద్యవిద్యలో లలిత్‌ ఆదిత్య సాధించిన ప్రతిభ పురాకృత సుకృతం. గురువుల ఆశీస్సులను మెండుగా అందుకున్న లలిత్‌ ఆదిత్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను.
– చింతలపాటి శర్మ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత

*లలిత్ ఆదిత్య గురించి...*
సంస్కృతాంధ్రావధాని గన్నవరం లలిత్ ఆదిత్య

తండ్రి: గన్నవరం మారుతి శశిధర్
తల్లి: గన్నవరం శైలజ
జన్మదినము: 23 సెప్,2000

విద్యార్థి - Aerospace Engineering 2nd year
ప్రవృత్తి:
సంస్కృతాంధ్రసాహిత్యపఠనకవనములు, ప్రవచనాలు, అవధానములు, సంగీతము, టెన్నీస్

బిరుదులు:
అవధానయువశిరోమణి, అవధానశరచ్చంద్ర, అవధానయువకిశోరము
సంస్కృతగురువులు
శ్రీరాయప్రోలు కామేశ్వరశర్మగారు - ప్రారంభము
శ్రీధూళిపాళమహాదేవమణిగారు - వ్యాకరణము,అవధానవిద్య
శ్రీచిఱ్ఱావూరి పద్మనాభశర్మగారు - వ్యాకరణము - శృంగేరికి వెళ్ళి ఈ సెలవులలో వారి వద్ద చదువుకున్నాను

శ్రీవెంపటి కుటుంబశాస్త్రిగారు - అద్వైతవేదాంతము,అలంకారశాస్త్రము
శ్రీమల్లాప్రగడ శ్రీనివాస్ గారు - వేదము

11 అవధానాలు - రవీంద్రభారతి, నల్లుకుంట శంకరమఠము(హైదరాబాద్), రామకోటి శంకరమఠము(విజయవాడ), రాజమహేంద్రి, ఇత్యాది ప్రాంగణాలలో జరిగాయి in USA India and Canada
రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం
రాజమండ్రిలో శతావధానం

రచనలు:
నారసింహనమశ్శతం (సంస్కృతం)
నఖశతకం (సంస్క్రతము - నృసింహుని నఖములను 108 శ్లోకాలలో కీర్తిస్తూ)
హనుమద్దోర్దండశతకము (తెలుగు)
ఆవిర్భావము,పర్యావరణావనము, ఇత్యాది ఆంధ్రఖండకావ్యాలు
సంస్కృతములో వివిధదేవతాస్తోత్రములు

శతావధానములో 24 సమస్యలు 24 దత్తపదులు, 24 వర్ణనలు 3 నిషిద్ధాలు, 4 ఘంటావధానాలు, 18 ఆశువులు, 3 అప్రస్తుతాలు

75 పద్యాలు ధారణ - సమస్యాదత్తపదివర్ణననిషిద్ధాలు

శతావధానము ముందు శృంగేరివళ్ళి జగద్గురువులను దర్శించుకున్నాను. వారు సంతోషముతో దయతో అనుగ్రహించి ‘అవిఘ్నమస్తు...జయముగా చేసిరా’ అని ఆశీస్సులను కురిపించారు
*************************

 *శతావధాన శరచ్చంద్ర*
*లలితాదిత్య అష్టావధానం*

నూతన ఆంగ్ల సంవత్సర, సంక్రాంతి  శుభాకాంక్షలు
నమస్కారం 
దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో 
అమెరికా వాసి, తెలుగు ముద్దుబిడ్డ  18 ఏళ్ల ,యువ శతావధాన శిరోమణి
శ్రీలలిత్ ఆదిత్య అష్టావధానం
తేదీ సమయం:  2020 జనవరి 3 వతేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు
వేదిక:  సైనిక్ పురి హై టెన్షన్ రోడ్ లోని శ్రీ విజయగణపతి దేవాలయం , శృంగేరీ శంకర మఠం
 శ్రీ భారతీతీర్థ కల్యాణ మండపంలో 
ముఖ్య అతిథి : మహాసహస్రావధాని డా. శ్రీ గరికిపాటి నరసింహారావు
అవధాన సమన్వయం : శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ
సాహితీ మిత్రులందరికీ సాదర స్వాగతం

భవదీయుడు
మరుమాముల వెంకటరమణ శర్మ
సంపాదకులు
దర్శనమ్ ,
ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక 9441015469

 *పృచ్ఛకులు-అంశాలు*

నిషిద్ధాక్షరి ...మావుడూరి సూర్యనారాయణ మూర్తి

సమస్య... కంది శంకరయ్య

దత్తపది... కె.చంద్రశేఖరరావు

వర్ణన... చింతా రామకృష్ణారావు

న్యస్తాక్షరి... ముత్యంపేట గౌరీశంకరశర్మ

అనువాదం... ముదిగొండ అమరనాథశర్మ

ఆశువు... సాధన నరసింహాచార్య

అప్రస్తుత ప్రసంగం..రంగి సత్యనారాయణ శాస్త్రి
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.