గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

కావ్యకంఠ గణపతి ముని (1878-1936)వివరణ. శ్రీ కొప్పరపు మా. శర్మ.

జైశ్రీరామ్.
*కావ్యకంఠ గణపతి ముని* (1878-1936)

అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన – పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.

ఆ సంవత్సరం మాత్రం, తెలుగునాట నుంచి అక్కడ జరిగే పండిత పరీక్షలలో తన సత్తా నిరూపించుకోడానికి ఒక యువకుడు వచ్చాడు – వయస్సు 22 సంవత్సరాలు – పేరు గణపతి శాస్త్రి. వయసులో చిన్నవాడైనా, అప్పటికే గణపతి శాస్త్రి సకల శాస్త్ర పారంగతుడు, ఆశుకవితా దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకసంథాగ్రాహి – ఆపైన ఉపేంద్రుడినైనా లెక్కచెయ్యని ఉడుకు రక్తం. అంతకు ముందు, కాశీలో శివకుమారుడనే ప్రఖ్యాతి గాంచిన పండితుడు తనకిచ్చిన యోగ్యతా పత్రం ఒకటి ఈ యువకునికి పరీక్షలలో పాల్గొనే అవకాశం కల్పించటానికున్న ఒకే ఒక్క ఆధారం.

శితికంఠ వాచస్పతి అనే మహా పండితుడు అప్పుడు సభాపతి. పరీక్షలలో పాల్గొనదలిచేవాళ్ల యోగ్యతలు పరీక్షించి, పరీక్షకి అనుమతి ఇవ్వవలిసిందీ వాచస్పతే. గణపతి కొంత కష్టం మీద వాచస్పతి దర్శనం సంపాదించేడు. తనకి శివకుమారుడిచ్చిన యోగ్యతా పత్రాన్ని వాచస్పతికి వినయంగా చూపించాడు. ఆ ఉత్తరంలో మెదటి వాక్యం – దేవాసుర సమీకేషు బహుశోదృష్ట విక్రమః అనుంది. ఇది రామాయణంలో హనుమంతుని యుద్ధపరాక్రమము దేవతా ప్రశంసనీయమని కీర్తించే శ్లోకం. అది చూడగానే, వాచస్పతి గణపతినింకేమీ ప్రశ్నలు అడగకుండానే, ప్రత్యేక పరీక్షకి అనుమతినిచ్చి తన దగ్గరే ఉంచుకొన్నాడు. మర్నాడు, తనే స్వయంగా గణపతిని సభామంటపానికి తోడ్కొనిపోయాడు.

ఆ ఏడాది, ఆశుకవిత్వంలోనూ, శాస్త్ర సాహిత్యంలోనూ ఉత్తరదేశంలో తనంతవాడు లేడని కీర్తిగాంచిన అంబికాదత్తుడు పరీక్షాసంఘానికి అధ్యక్షుడు. అప్పటికే ఆయన వేదికనలంకరించి ఉన్నాడు. వేలకొలదీ ప్రేక్షకులు, పండితులతో సభ కన్నులపండుగగా ఉంది. సభ ప్రారంభించే లోపు గణపతిని అధ్యక్షుడికోసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వాచస్పతి, గణపతి తన వెంట వస్తుండగా అధ్యక్షపీఠం వద్దకి చేరుకొన్నాడు.

అధ్యక్షపీఠాన్ని అలంకరించియున్న అంబికాదత్తుడి గంభీరాకృతి గణపతి దృష్టినాకట్టుకొంది. బాల్య చాపల్యంతో “కోసౌ మహాశయః” అని వాచస్పతిని ప్రశ్నించాడు. అంత సమీపంలో అంబికాదత్తుడికి వినిపించేటట్టుగా అలా గణపతి అడిగేసరికి పాపం వాచస్పతి కాస్త తెల్లబోయాడు. అంబికాదత్తుడు సరసుడు, రసజ్ఞుడు. తొణకకుండా, గంభీరంగా చిర్నవ్వు నవ్వి:

సత్వర కవితా సవితా గౌడోహం కశ్చిదంబికాదత్తః

అంటూ, తన దేశ, నామ, సామర్థ్యాలు మూడూ గణపతికి చెప్పి, తెలివిగా శ్లోకంలో ఒక్కపాదమే చెప్పి, ఇక నీ పరిచయమేమిటి అన్నట్టుగా మిగతా సగభాగం చమత్కారంగా విడిచిపెట్టాడు. అది గ్రహించిన గణపతి తడుముకోకుండా వెంటనే:
గణపతి రితి కవికులపతిరతి దక్షో దాక్షిణాత్యోహం
ఈ విధంగా తాను కూడా, తన దేశ, నామ సామర్థ్యాలు ఒక్క పాదంలోనే ఇమిడ్చి, అధ్యక్షుడికంటే తానే అధికుడినన్నట్టుగా కవికులపతి అంటూ ఒక చమత్కారబాణం విసిరి, అంతటితో ఊరుకోకుండా – భవాన్ దత్తః, అహంత్వౌరసః (నీవు అంబికకి దత్తుడివి మాత్రమే, నేను ఔరస పుత్రుడిని) అని అంబికాదత్తుడి అహాన్ని రెచ్చగొట్టాడుకూడా. సభలోని వారందరూ, వాచస్పతితో సహా – ‘ఎవడీ యువకుడు, సింహం జూలుపట్టి లాగుతున్నాడే, పర్యవసానం ఎరుగుదుడా’ అని నివ్వెరపోయారు. అంబికాదత్తుడు మాత్రం చలించలేదు. వెంటనే గణపతిని వేదిక మీదకి రమ్మని సంజ్ఞ చేసి, వెనువెంటనే నాలుగు సమస్యలు ఇచ్చి వాటిని పూరించమన్నాడు. ఆ నాలుగు సమస్యలు:
స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి (కింత్యనవద్యచరితా)
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
సూర్య శశాంకేన సమం వినష్టః (నత్వమవాస్యా)
పిపీలికా చుంబతి చంద్రమండలమ్
ఇచ్చిన మరుక్షణంలోనే గణపతి, ఆ నాల్గు సమస్యలని తడుముకోకుండా పూరించి తన ప్రతిభ చాటాడు. ఆ పూరణలేమిటంటే:

హిడింబా భీమదయితా నిధాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిజ్యత్యా వధూ శ్వశుర మిచ్ఛతి
(భీముని భార్యయగు హిడింబ ఉక్కకోర్వలేక, తనమామగారైన గాలినిచ్చగించి స్తనవస్త్రమును విడిచెను అని అర్థం. ఇక్కడ, ద్రౌపదిని గాక హిడింబని చెప్పటంలో చాలా ఔచిత్యం ఉంది. దీనికి రెండు కారణాలు – మెదటిది ద్రౌపది ఒక్క భీమునికేగాక పాండవులందరికీ ఇల్లాలు. అదీగాక, ద్రౌపది రాచకన్య, కాబట్టి స్తనవస్త్రం పరిత్యజ్య అని ద్రౌపదినుద్దేశించి చెప్పటం అంత ఔచిత్యం కాదు)
చతుర్థ్యాం భాద్ర శుక్లస్య చంద్ర దర్శన శంకయా
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
(భాద్రపద శుద్ధ చవితినాడు (వినాయక చవితినాడు), శివుడి తలపైనున్న చంద్రుడిని చూడవలసి వస్తుందేమోననే శంకచే, సంవత్సరమున కొక్కసారి గౌరీదేవి తన పతి ముఖాన్ని చూడదు)
రాహుస్త్రీ కోణే చ గురుస్తృతీయే
కళత్ర భావే చ ధరా తనూజః
లగ్నే చ కోష్ఠే యది బాలకః స్యాత్
సూర్య శశాంకేన సమం వినష్టః
(పంచమ, నవమ స్థానములలో నొకదాని యందు రాహువు, తృతీయమునందు గురువు, కళత్ర స్థానమునందు కుజుడు ఉండగా పుట్టిన బాలునకు – లగ్నమందు సూర్యచంద్రులున్ననూ అరిష్టముండును)
సతీ వియోగేన విషణ్ణ చేతసః
ప్రభో శయానస్య హిమాలయే గిరౌ
శివస్య చూడాకలితం సుధాశయా
పిపీలికా చుంబతి చంద్ర మండలమ్
(దక్ష యజ్ఞమందు సతీదేవిని కోల్పోయి, విషణ్ణ చేతస్కుడై, శివుడు హిమవన్నగముపై పడుకొని యుండగా, అతని శిరోభూషణమైన చంద్రుడు భూమికంటియుండెను. అదే సమయమని యెంచి, చంద్రునియందున్న అమృతాన్ని అందుకోవాలనే ఆశతో చీమలు చంద్రమండలమును చుంబించెను)
కావ్యకంఠ గణపతి ముని
యువ గణపతి ముని
దీంతో, కవిత్వ పరీక్షలో నెగ్గినట్లే. ఇక వ్యాఖ్యాన పటిమని పరీక్షించాలి. ఇందుకోసం అంబికాదత్తుడు, రఘువంశంలోంచి ఒక శ్లోకము, కావ్య ప్రకాశమనే గ్రంథంలోంచి మరొక శ్లోకము ఇచ్చి – వీటిపై గణపతిని వ్యాఖ్యానించమన్నాడు. అనర్గళంగా, సుమారుగా ఒక గంటసేపు, ఈ రెండు శ్లోకాలపై తన కవిత్వ పటుత్వాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని, యుక్తిని, విమర్శనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ, సభాసదులందర్నీ మంత్రముగ్ధులని కావిస్తూ గణపతి ప్రసంగం కొనసాగుతోంది – ఇంతలో, ఒకచోట – సర్వాసాం అనుటకు బదులు సర్వేషాం అని గణపతి వాణి తొట్రుబడింది. తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న అంబికా దత్తుడు – వెంటనే ‘విరామాతావత్‘ అన హూంకరించి:

అనవద్యే నను పద్యే గద్యే హృద్యేపి తే స్ఖలతి వాణీ
తత్కింత్రిభువన సారా తారా నారాధితా భవతా

నిర్దుష్టమగు పద్యములో మనోహరమగు వచనమందు నీ వాణి స్ఖలించెను. నీవు త్రిభువన శ్రేష్టురాలగు సరస్వతినారాధించలేదా? అంటూ ఆక్షేపించాడు. స్త్రీలింగ శబ్దం వాడాల్సిన చోట పుల్లింగం వాడేడని ఇందులో చమత్కారం.సుమారొక గంటసేపు గంగాప్రవాహంలా పరవళ్ళు తొక్కుతూ, రసికజన హృదయాలని రసపూరితమొనర్చిన వాణి, అంత సేపు నిర్దోషంగా ఉన్నందుకు అభినందించడానికి పోయి, ఆక్షేపించిన అంబికాదత్తుడు కూడా పాపం పప్పులో కాలేసాడు. సారస్తారా అని పుల్లింగ శబ్దాన్ని ప్రయోగించడానికి బదులు, సారాతారా అంటూ ప్రాసకోసం పాకులాడేడు. గణపతి వెంటనే ఈ దోషాన్ని సభాసదులకెత్తి చూపి:

సుధాం హసంతీ మధు చాక్షిపంతీ
యశోహరంతీ దయితాధరస్య
న తే ల మాస్యం కవితా కరోతి
నోపాస్యతే కిం దయితార్ధ దేహః

(అమృతమును పరిహసించునట్టి, మధువునాక్షేపించునట్టి, ప్రియురాలి యధరోష్ఠ కీర్తిని హరించునట్టి కవిత్వము నీ ముఖమునలంకరించ లేదెందువలన? నీవు కాంతార్ధ విగ్రహుడగు నీశ్వరు నుపాసించలేదా?)ఈ ఆక్షేపణతో అంబికాదత్తుడు పరాభవాన్ని తట్టుకోలేక గణపతిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ వ్యక్తిగత సంవాదం ఆరంభమైంది. ఇద్దరూ తమ తమ ఆశుకవితా శక్తినే కొరడాలుగా మలచి ఒకరినొకరు చావబాదుకోవడం మొదలెట్టారు.

అంబి:
జ్యోతిరింగణ న కిం ను మన్యసే
యత్త్వమేవ తిమిరేషు లక్షసే
(ఓ మిణుగురు పురుగా, నీవు చీకటిలోనే కాని వెలుతురులో ప్రకాశించవు – అంటే, ఎదుటి వాళ్ళ దోషాలు ఎత్తి చూపించటమే నీ ప్రతిభ అని శ్లేష)

దీనికి దీటుగా గణపతి:
కిం ను దీప భవనే విభాససే
వాయునా బహిరహో విధూయసే

(ఓ దీపమా, నీవు గృహములోపలనే ప్రకాశించగలవు, వెలుపలకు వచ్చినచో గాలిచే కదల్పబడుదువు – అనగా సభలలో నీ పాండిత్యము నిలువ జాలదని పరిహాసం)

అంబికాదత్తుడు:
ఉచ్చైః కుంజర మాకార్షీః బృంహితాని మదోద్ధత
కుంభికుంభామిషాహారీ శేతే సంప్రతి కేసరీ

(ఓ కుంజరమా, మదముచే గర్వించి బృంహిత ధ్వనులను చేయుచుంటివి. ఏనుగుల కుంభస్థలములందుండు మాంసమును హరించు సింహమిచ్చటనే కలదు సుమా)

గణపతి:
మరల దోషమే. కర్మధారయ సమాసముపై హరీ యను మత్వర్ధీయము చెల్లదు. కుంభికుంభామిషాహారః అని బహువ్రీహి సమాసమును మాని ప్రాసకొరకే పాకులాడుతూ దోష ప్రదర్శన చేసుకొనుచున్నావు.
సమాసీనో రసాలే చేత్ మౌనమావహ మౌకలే
లోకః కరోతు సత్కారం మత్వాత్వా మపి కోకిలం
(ఓ కాకమా, నీవు మామిడి చెట్టు నెక్కి కూర్చుండ దలచితివేని మౌనముగా నుండుట మంచిది. లోకులు నిన్నుకూడా కోకిల అనుకొని సత్కరించుదురు)

ఇంతటితో ఊరుకోకుండా, గణపతి మరొక పరిహాసం కూడా అంబికాదత్తుడిపై ప్రయోగించాడు:
అపుష్పా చూత లతికా విపన్నా సా సరోజినీ
హేమంతే హంత రోలంబ నిరాలంబః క్వమోదసే
(మామిడి గున్న పుష్పించలేదు – శిశిర ఋతుకాలము రానందువల్ల, తామర పుష్పము నశించెను – హేమంత ఋతువైనందున, అక్కటా – తుమ్మెదా – హేమంత కాలమంతయూ నాశ్రయము లేనిదానివై నీవెక్కడ సంతోషింప గల్గుదువు?)
గణపతికి అంబికాదత్తుడెవరో, అతని వ్యక్తిగత జీవితమేమిటో అస్సలు తెలియదు. కాని, అంబికాదత్తుడి మొదటి భార్య సరోజిని చనిపోగా, అతను రెండో పెళ్ళి చేసుకొన్నాడు, కాని ఆవిడ అప్పటికింకా పుష్పవతి కానందువల్ల, సంసార సుఖానికి నోచుకోలేదు. ఈ విషయం, తెలియకుండానే ధ్వనింప చేసిన గణపతి సిద్ధకవి అని గ్రహించి, అంబికాదత్తుడు, వాదం చాలించి, గణపతిని ఒక ఆసనముపై కూర్చుండబెట్టి, మొహం చిన్నపుచ్చుకొని మౌనంగా ఉండిపోయాట్ట.
ఇది కనిపెట్టిన శితికంఠ వాచస్పతి – మీరిద్దరూ సంసారవిషయములను, వ్యక్తిగత దూషణలను విడిచిపెట్టి, గౌడ దాక్షిణాత్యులగుటచే, పరస్పరాంతర్జాతి పరముగా పరిహసించుకొని, సాహిత్య వృత్తాంతములచే వాదముపసంహరించండి అని ఇద్దరినీ ఆజ్ఞాపించాడు.

వెంటనే – అంబికాదత్తుడు:
భటోఖిలోట్టో పరివారవధ్వానిపీయ మధ్వారభతే విహారం
(భట్టులందరు – అనగా దక్షిణాత్యులు – మేడలపై వేశ్యలతోగూడి మద్యపానమును చేసి విహరింతురు)
గణపతి:

అసువ్యయో వాస్తువ్యయో వాప్య మీ న మీన వ్యసనం త్యజంతి
(ప్రాణము పోయిననూ సరే, డబ్బుపోయిననూ సరే మీ మీన వ్యసనమును మాత్రము విడువరు) గణపతి ఇలా శ్లోకం పూరించగానే, ఆనందం పట్టలేక అంబికాదత్తుడు ఆసనం మీంచి లేచివచ్చి గణపతిని కౌగలించుకొని, అతని నిరర్గళ కవితాపటుత్వానికి మెచ్చుకొని సంతోషం వెలిబుచ్చాడు. గణపతి – తాను వాదధోరణియందు చూపిన దూషణాపరాధమును మన్నించమని సవినయంగా వేడుకొన్నాడు. దానికి అంబికాదత్తుడు నవ్వుతూ – నీ మీనద్వయమే నీ అపరాధాన్ని తుడిచిపెట్టిందని పరిహసించాడు (మీనద్వయమనగా అ+మీన+మీన అని రెండు మీనములను బహూకరించుట. నిజానికీ పద విభాగం అమీ+న+మీన.. అనుంటుంది)
అప్పుడు మిగిలిన పరీక్షావర్గం వారు, గణపతినింకా పరీక్షించగోరి, భారతమందు పదునెనిమిది పర్వముల సారమునూ పర్వమునొక్కొక్క శ్లోకము చొప్పున 18 శ్లోకములను చే, అపి, హి, తు, చ అను పదములను ప్రయోగించకుండా చెప్పమని అడిగారు. అడిగిన వెంటనే, ఆశువుగా గణపతి పదునెనిమిది శ్లోకములతో భారతకథా సారమంతా మనోహరంగా చెప్పి, పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేడు.

నవద్వీపచరిత్రలో ఒక ఆంధ్రుడు గెలుపొందడం ఆకాలంలో అదే మొదటిసారి. పరీక్షావర్గం గణపతికి ‘కావ్యకంఠ’ అనే బిరుదుతో పాటుగా ఒక శ్లోకం బహుమానంగా ఇచ్చి సత్కరించారు.

ప్రాచీనై స్తైః కవికులవరైః కాళిదాసాదిభిర్యా
లబ్ధా కీర్తి దను గతా సైవ భూయ దిదానాం
సద్భిర్దత్తోయ ఇహ రుచిరః కావ్యకంఠోపహారః
తేవ శ్రీమానిహ భువి భవానుజ్జ్వల శ్చాపి భూయాత్
(ప్రాచీనులగు కాళిదాసాది కవివర్యులెట్టి కీర్తిని పొందిరో, వారి ననుసరించిన నీచే నట్టి కీర్తి యిప్పుడు పొందబడెను. ఇక్కడ సత్పురుషులచే మనోహరమగు కావ్యకంఠ బిరుదమేది యొసగబడెనో, ఆ బిరుదమువలన నీవీ భూలోకమందు శ్రీమంతుడవై ప్రకాశింతువు గాక !)అప్పటినుండి, గణపతి శాస్త్రి కావ్యకంఠ గణపతిమునిగా ప్రసిద్ధి కెక్కారు. ఈయన రమణమహర్షి అంతేవాసులలో అగ్రగణ్యుడు. సుమారు వందకు పైగా, సంస్కృత రచనలు చేసారు గణపతిముని స్పృశించని అంశమంటూ లేదు — వేదాంతసారం, యోగం, తంత్రశాస్త్రం, మీమాంస, జ్యోతిష్యం, ఆయుర్వేదం, విమర్శ, ఛందోదర్శనం – లాటి ఎన్నో విషయాలపై గణపతిముని రచనలు – పండితుల ప్రశంసలందుకొన్నాయి. తత్వచింతనలో శంకరుడిని, కావ్యమాధుర్యంలో కాళిదాసుని తలపించే కవిత్వం గణపతిమునిదని కపాళిశాస్త్రిలాటి పండితులభిప్రాయ పడ్డారు.
సద్దర్శనం, రమణగీత, ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమా శతకం, దశమహావిద్యలు వంటి వేదాంత, తాంత్రిక గ్రంధాలు, విశ్వమీమాంస, తత్వఘంటాశతకం, భారత చరిత్ర పరీక్ష వంటి విమర్శనాత్మక గ్రంథాలు, అంబికాగీతం, యోగసార గీతం, గురుగీతం, రేణుకాగీతం, గణపతిగీతం వంటి స్తోత్ర సాహిత్యం, సంస్కృతంలో *పూర్ణ* అనే ఆంధ్రవిష్ణువుకాలం నాటి చారిత్రాత్మక నవల ఇలా గణపతిముని సాహిత్య సృష్టి అపారం. అంతే కాకుండా, గణపతిముని భారతదేశ స్వాతంత్రపోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు, అస్పృశ్యతా నివారణోద్యమాల్లో కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

బొబ్బిలి దగ్గర కలవరాయి అనే అగ్రహారంలో 1878 సంవత్సరం కార్తీక బహుళ అష్టమి నాడు జన్మించిన గణపతిముని 58 సంవత్సరాలు మాత్రమే జీవించి, 1936 లో ఖరగ్‌పూరులో పరమపదించారు.
వివరణ. శ్రీ కొప్పరపు మా. శర్మ 
గారికి అభినందన పూర్వక 
ధన్యవాదములు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కావ్యకంఠ గణపతిముని , అంబికా దత్తుని వాగ్వివాదములను చక్కగా తెలియ జేసారు. చాలా బాగుంది .శ్రీ కొప్పరపు మాశర్మ గారికి , మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

అజ్ఞాత చెప్పారు...

చాలా మంచి తెలియని విషయాలు తెలిసినందుకు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.