గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

రథ సప్తమి సందర్భముగా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులకు రథసప్తమి శుభసందర్భంగా శుభాకాంక్షలు.

శ్రీ చక్రావధానుల రెడ్డప్ప ధవేజి గారు
మారన కవి కృత మార్కండేయపురాణముననున్న పద్యమును ఉదహరించి
ఈ రథసప్తమీ ప్రాశస్త్యమును చక్కగా వివరించారు. మీరూ గమనింపుడు.

ఆది తెలుగు ఉగాది---మన్వాది--రథసప్తమి


అనుపమ వేగసత్వ సముదంచిత వాహన నాహ్యమానకాం
చన రథచక్ర సంకషణ చారు సుమేరు నగేంద్ర సాను సం
జనిత సువర్ణరేణుచయ సంతత భూషిత దీప్తియైన ఈ
దినమణికిన్ నభోమణి దేవశిరోమణికేను మ్రొక్కెదన్.
    -మారన మహాకవి   మార్కండేయ పురాణం నుంచి

తన రథచక్రం గమనపు రాపిడి వల్ల రేగే మేరునగపు బంగారు రేణువులచే దినదినము దినమణి,నభోమణి,దేవశిరోమణి భూషితుడౌతున్న సూర్యునికి నమస్కరిస్తున్నాడట మారన మహాకవి.ప్రత్యక్ష దైవంగా ప్రపంచం అంతటి చేతా కొలవబడే సూర్యుని జయంతి ఈ రథసప్తమి. మనకు ప్రత్యక్ష సాక్ష్యం కనబరిచే దేవుడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని పుట్టినరోజు మాఘశుద్ద సప్తమి. ఈ సప్తమి ప్రస్తుత వైవస్వత మన్వాదిగా పిలవబడుతోంది.
రథసప్తమి ని పంచాంగ కర్తలు సూర్యజయంతి అంటారు. ఇది భారతదేశ వ్యాప్తంగా జరిగే పండుగ. దీనిని రాజపుత్రులు సౌర్యసప్తమి గానూ,బెంగాల్ లో భాస్కర సప్తమి అని,కొందరు జయంతి సప్తమి అని,కొందరు మహాసప్తమి అని పిలుస్తారు. తెలుగు వారు మాత్రం రథసప్తమి గా ఈ పండుగను పిలుస్తారు. ఈ మాఘసప్తమి సూర్యసంబంధమైన సప్తమి.ఈశ్వరుడు ఈ రోజున సూర్యుని సృష్టించినట్లు చెబుతారు.అందుకే ఈరోజు సూర్యజయంతి అయ్యింది. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని కూడ అర్థముంది. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయని నమ్మకం.స్త్రీలు చేసే చాల వ్రతాలు ఈనాడే ప్రారంభమవుతాయి..అందుకే పంచాంగ వివరణలో 'నిఖిల వ్రతాని కర్తవ్యాని'అని ఉంటుంది. ఫలతాంబూలం,దంపతి తాంబూలం, మాఘగౌరి,కాటుక గౌరి,సౌభాగ్య తదియ,చిత్రగుప్తుని వ్రతం మొదలైన ఎన్నో వ్రతాలు, నోములు ఈ రథసప్తమి నాడే ప్రారంభమౌతాయి.ఈ వ్రతాలలో చాల వాటికి ఏ విధమైన మంత్రాలు ఉండవు.మామూలు మాటలతో కథ చెప్పుకోవడంతో పూర్తవుతాయి.అనాది కాలంలో ఈ రథసప్తమి తెలుగు వారి ఉగాదిగా ఉండేదని అందువలననే ఈ రథసప్తమి అనేక వ్రతాలకు ఆరంభదినమై ఉండి ఉండాలని,తరువాతి రోజుల్లో రథసప్తమి సంవత్సరాదిగా ఉండటం మారిపోయి ఉంటుందని ప్రముఖ పండితులు టేకుమళ్ళ రాజగోపాలరావు గారు 'సౌత్ ఇండియన్ రీసెర్చ్'అనే పత్రికలో ప్రకటించారు. చతుర్వర్గ చింతామణి ప్రకారం రథసప్తమి నాడు ప్రారంభించే ఎన్నో వ్రతాలు ఉన్నాయి. అవన్నీ సూర్యునికి తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవి.ప్రాచీన కాలంలో ఈ రథసప్తమి ఉగాది అయినా కాకపోయినా, మనకు ప్రాచీన పండుగలలో ఇది చాల ముఖ్యమైనది.

ముఖ్యంగా ఆరోగ్యం కోసం జరుపుకునే అపురూపమైన పండుగ ఈ రథసప్తమి.'ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్'అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరోగ్యం కావాలంటే సూర్యారాధన చెయ్యాలి.

ఈ రథసప్తమి నాడు ఉదయాన్నే లేచి ఏడు జిల్లేడు ఆకులలో రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేస్తారు.కొంచెం ప్రొద్దెక్కి సూర్యుడు ఉదయించిన తరువాత పాలు పొంగిస్తారు.చిక్కుడు కాయలను వెదురు పుల్లలతో చదరంగా చేసి ఆ చిక్కుడు ఆకులలో పొంగలిని పెట్టి సూర్యునికి నివేదన చేసి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ చిక్కుడు కాయల చదరాన్ని 'సూర్యనాథం'అని పిలుస్తారు. ఈ సందర్భంగా చేసే జిల్లేడు ఆకుల స్నానానికి ఓ ప్రత్యేకత ఉంది.జిల్లేడు మంచి వీర్యవంతమైన మూలిక.ఈ ఆకులపైన నునుపు గానూ,క్రింది భాగంలో నూగుతోనూ ఉంటాయి. సంవత్సరం పొడుగునా ఈ జిల్లేడు పుష్పిస్తూనే ఉంటుంది. వీటి ఆకులు తుంచినా,కొమ్మలు వంచినా తెల్లటి పాలు కారతాయి.ఈ పాలల్లో ఉప్పు కలిపి పట్టిస్తే పంటిపోటు తగ్గుతుంది. జిల్లేడు చిగుళ్ళ రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. ఈ ఆకులను వెచ్చజేసి ఆముదం రాసి కడుపు పైన రాస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇన్ని రకాలుగా జిల్లేళ్ళు మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. అందుకే ఈ జిల్లేడు ఆకులను శిరస్సు పై ఉంచుకుని స్నానం చేస్తారు. ఏడు ఆకులను తలపై ఉంచుకోవాలి. మనలోని అంతఃశత్రువులైన కామ,క్రోధ,మోహ,మద,మాత్సర్యాలకు,వాటికి లొంగే మన బలహీనతకు ప్రతీకగా ఈ ఏడు ఆకులను చెబుతారు. వీటి విసర్జనకు దీనిని సూచికగా శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ రథసప్తమి కి ఏడు సంఖ్యతో ఎంతో సంబంధం ఉంది.సూర్యుని రథానికి ఏడు అశ్వాలు.సూర్యకిరణాలలో గల ఏడు రంగాలకు అవి చిహ్నాలు. ఈ పర్వం జరిగే రోజు ఏడవ తిధి.ఈ నాడు చేసే చిక్కుడు రథాలు ఏడు. ఈపూజ సూర్యుడ్ని పూజించడానికి ఏర్పడింది. ఈ సూర్యుని స్తుతించే మంత్రాలలో కూడ సూర్యునికి'సప్తలోక ప్రదీపన'అనే బిరుదు ఉ
రథసప్తమి నాడు చేసే స్నానం రెండు విధాలుగా చేయాలని 'భవిష్యోత్తర పురాణం'చెబుతోంది. ముందుగా ఒక లోహపు ప్రమిదలో చమురు పోసి వత్తి వేసి దీపం వెలిగించి దానిని నెత్తిన పెట్టుకొని.....

'నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయేనమః
అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే'

అనే మంత్రం పఠిస్తూ దీపం నీళ్ళమీద తేలేటట్టు మెలకువగా దీపాన్ని నీటిలో వదలాలి.తరువాత రెండవ స్నానంలో చెరకు గడతో నీళ్ళను కలియబెట్టి జిల్లేడు ఆకులు రేగుపళ్ళతో స్నానం చెయ్యాలి.

'ఇతి సప్తవిధం పాపం స్నానాన్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయక్తం హరమాకిరి!సప్తమి!

అనే మంత్రాన్ని పఠించి స్నానం చేసినట్లయితే ఏడు జన్మాంతరాలలో ఆర్జించిన పాపాలన్నీ హరించబడతాయని జనుల విశ్వాసం.
ఈ మాసంలో అంటే మాఘమాసం లో అన్ని ఆదివారాలు అత్యంత పుణ్యప్రదమైనవి.ఈ ఆదివారాల్లో తప్పనిసరి గా నదీస్నానం చేయాలి. వీటినే మాఘస్నానాలు అని పిలుస్తారు.
'నేను లోకానికంతకూ వెలుగునిచ్చే సూర్యుడ్ని దేవునిగా ఎంచుకోవడానికుంటాను'అన్నాడు నెపోలియన్.దీన్నిబట్టి భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా సూర్యారాధన ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు చంద్రభాగా నదీతీరంలో(నేటి చీనాబ్ నది)మిత్రవనం ఏర్పరిచి అందులో ఒక సూర్యాలయం నిర్మించాడని భవిష్యపురాణం చెబుతోంది. పారశీక దేశంలో సూర్యుని విగ్రహ రూపంలో మిత్రపూజ చేసేవారు. ఈ మిత్రపూజలో అనుభవజ్ఞులైన వారిని మగి(తెలివైన వారు)అని పిలుస్తారు. వీరు మిత్రపూజ ఆద్యులై ఆ పూజారుల సంతతి వారు 'మగి'తెగగా రూపొందారు.ఈ మగి ద్విజులు అజర్ బైజాన్ లోని మగి ప్రాంతం నుండి మనదేశానికి తరలి వచ్చారు. బృహత్సంహిత సంధాత అయిన వరాహమిహిరుడు ఈ మగి తెగవాడే!!వీరు సూర్య విగ్రహారాధన చేసేవారు. అంతకుమునుపు మన దేశంలో ప్రత్యక్ష సూర్యపూజ మాత్రమే జరిగేది. ఈ మగి ద్విజుల మూలంగానే మన దేశంలో కూడ సూర్యవిగ్రహారాధన ప్రారంభమయ్యింది. ఒరిస్సా లోని కోణార్క్ దేవాలయం ఈ మగి సంప్రదాయం లోనే కట్టబడింది.మిత్రదేవత రౌతుగా ఇనప కవచంతో ఆ దేవాలయం లో కనబడుతోంది. అక్కడి నుండి ఈ మగి ద్విజులు ఆంధ్రదేశానికి వలస వచ్చారు. ఆంధ్రదేశంలో కూడ అరసవల్లి,ఆకిరిపల్లిలలో ప్రసిద్ధమైన సూర్యదేవాలయాలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లలమామిడాడలో కూడ ప్రసిద్ధమైన సూర్యదేవాలయం ఉంది.తమిళనాడు లోని తంజావూరు దగ్గర 'సూర్యనాయర్ కోయిల్'అనే పేరుతో ఒక ఊరు ఉంది.అక్కడ రథసప్తమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. తిరుమల లో కూడ రథసప్తమి నాడు ఉదయం నుండి రాత్రి వరకూ ఏడు వాహనాలపైన ఊరేగుతూ దర్శనమిస్తాడు.

భాగవత కథ ప్రకారం ఈ తిధి మన్వాదిగా చెప్పబడింది. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది.వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు ఒక మనువు.మనకు మొత్తం 14మంది మనువులు ఉన్నారు. ఈ మనువుల పరిపాలనా కాలాన్ని మన్వంతరము అని పిలుస్తారు. వీరిలో ఏడవ మనువు వైవస్వతుడు.అతని మన్వంతరం వైవస్వత మన్వంతరం.ప్రస్తుతం జరుగుతున్నది ఈ వైవస్వత మన్వంతరమే!!!

ఈ మన్వంతరానికి రథసప్తమి మొదటి తిధి.అందుకే దీనిని మన్వాదిగా భాగవతం వర్ణించింది.ఇన్నివిధాలుగా రథసప్తమి అత్యంత ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున కొన్ని నిషేధాలు కూడ ఉన్నాయి. రథసప్తమి నాడు వేదాధ్యయనం మానివేస్తారు.రథసప్తమి నాడు పుస్తకపఠనం కూడ చెయ్యరు.రథసప్తమి నాడు తరిగిన కూరలు తినకూడదు. ఈ మూడు రధసప్తమి నాడు ఆచరించవలసిన విధులు.
ఇంతటి మహాపర్వం రథసప్తమి నాడు స్నానం చేసి.......

'సప్త సప్తివహ!ప్రీత!సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ!గృహాణార్ఘ్యం దివాకర!'

అంటూ ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడికి అర్ఘ్యమిద్దాం.

-చక్రావధానుల రెడ్డప్ప ధవేజి.

శ్రీమాన్ రెడ్డప్పగారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.