గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జూన్ 2015, శుక్రవారం

నా గురు దేవులు, శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారు, వారి సతీమణి శ్రీమతి సుభద్రమ్మగారు.

జైశ్రీరామ్.
శ్రీగురుభ్యోనమః.
ఆర్యులారా! నాకు విద్యాబుద్ధులు కరపి, జ్ఞాన భిక్షను పెట్టి, ఈ గౌరవప్రదమైన జీవన మార్గమును కల్పించిన నా గురుదంపతులు, 
స్వర్గీయ శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారు, శ్రీమతి సుభద్రమ్మ గారు.
1967లో మా ఇంటిలో దొంగలు ప్రవేశించి, ఉన్న కొద్దిపాటి విలువైన వస్తువులతో పాటు మా నాన్న గారు నన్ను చదివించుట కొఱకు ఆరు సంవత్సరాలుగా  అప్పుడప్పుడు పావలా, అర్థ రూపాయి ఇలా వేస్తూ ఉంచిన కఱ్ఱ హుండీని కూడా వారు దోచుకొనిపోయారు.
తెల్లవారింది. కాఫీగుండ కొనుక్కోడానికి సహితం అణా డబ్బులయినా మా యింట మిగల లేదు. మా గురువు గారు మా యింట జరిగిన దొంగతనమును గూర్చి తెలుసుకొని, మా నాన్న గారిని పరామర్శించడానికి వచ్చారు. మానాన్నగారు "పోయిన వస్తువులకై విచారించ లేదండి. మా అబ్బాయి ఇప్పుడు SSLC పాసయ్యాడు. వాడిని చదివిద్దామని ఆరేళ్ళుగా పావలా, అర్థా దాచి ఉంచిన హుండీ పట్టుకుపోయారండి. వాడికి చదువు చెప్పించే స్తోమతను కోల్పోయానని బాదపడుతున్నానండి." అని మాగురువుగారికి చెప్పారు. అంతే. 
మాగురువుగారు- రామంగారూ!! మీరేమీ బాధ పడకండి. నేను మీ వాడిని తీసుకు పోయి చదువు చెప్పిస్తాను. అని చెప్పి మంచి ముహూర్తం చూసి పంపించండి. అని చెప్పి, నాన్నగారిని సముదాయించి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు.
అంతే మా నాన్న గారు మంచి ముహూర్తం చూసి గురువుగారింటికి తోడ్కొనిపోయి, రోజూ మీరే సమయానికి రమ్మంటే ఆసమయానికి వచ్చి మా అబ్బాయి చదువుకొంటాడండి. అని చెప్పి అప్పగించారు.
అంతే మాగురువుగారు నాటి నుండి నాకు సంస్కృతంలో నామాలు, ధాతువులు, అమరకోశము, మున్నగునవి నేర్పుతూ, నాచేత ఏడ్మిషన్ టేష్ట్ టు భాషాప్రవీణ పరీక్షకి కట్టించారు.
స్వయముగా వారు విజయనగరం వచ్చి, వారికి తెలిసిన శ్రీమాన్ గోవిందాచార్యులవారి యింటిలో నన్నుంచి, పరీక్ష శ్రద్ధగా వ్రాసి రమ్మన్నారు.
ఆ పరీక్ష నేను వ్రాసి, మా గ్రామం యస్.రాయవరం వెళ్ళిపోయాను.
ఆ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను.
అంతే మాగురువుగారి ఆనందానికి అవధులు లేవు. నన్ను విజయ నగరం తీసుకొనిపోయి, వారి అన్నగారయిన శ్రీమాన్ శరణ్యాచార్యులవారి పుత్రికామణి శ్రీమతి చిన్నారి అక్కయ్యగారి ఇంటిలో ఉంచి, నాకు సత్రవు భోజనం కుదిరేదాకా భోజనం వారినే పెట్టమని అప్పగించి వెళ్ళారు.
తరువాత శ్రీ సింహాచలం దేవస్థానం భోజన సత్రవులో శ్రీ మానాప్రగడ శేషశాయిగారిద్వారా నాకు భోజనం కల్పించారు.
నాటి నుండి నా భాషాప్రవీణ చదువు నిరాఘాటంగా సాగింది.
నేను పద్యాలు వ్రాస్తూ ఉంటే మాగురువుగారెంతో మురిసిపోయేవారు.
అమ్మగారయితే మరి చెప్పనక్కరలేదు.  నన్ను వారి దత్త పుత్రుఁడనని చెప్పేవారు.
మాగురువుగారి వాఙ్మహిమ ఎంతగొప్పదంటే- "ఒరేయ్ రామ కృష్ణా! నేను గ్రేడ్ 2 తెలుగుపండితుఁడుగా ఉద్యోగంలో ప్రవేశించానురా! నీవు నా శిష్యుఁడివి. నీవల్లా కాకుండా డైరెక్టుగా ఘ్రేడ్ 1 తెలుగు పండితుఁడుగా ఉద్యోగంలో చేరాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానురా!" అన్నారు. 
1973 డిశంబర్30 వ తేదీని తెలుగు పండిట్ ట్రైనింగ్ కోర్సు పూర్తయింది. ఈ మధ్యలో అనేక పాఠశాలలో గ్రేడ్ 2 గా ఉద్యోగం వచ్చినప్పటికీ, నాకు చేరాలని ఉన్నప్పటికి ట్రైనింగ్  అగుచున్నందున  చేరే అవకాశం కలుగ లేదు. ఇది గురువాక్య ప్రభావం కాక మరేమిటి?
1973 డిశంబర్ 31 వ తేదీన దిమిలి గ్రామంలో, శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్ లో గ్రేడ్ 1 పండితుఁదు ఉద్యోగానికి ఎంప్లాయ్మెంట్ ద్వారా కాల్ లెటర్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూకి హాజరయిన 20 మందిలో నేనొకడిని.
ఇంటర్వ్యూ జరిగిపోయింది. నా ట్రైనింగ్ రిజల్స్ వచ్చేశాయి, నేను పాసయ్యాను. ఆ ఉద్యోగానికి కూడా నేను ఎంపిక చేయబడ్డాను. మా గురువుగారి అప్రతిహతమైన అనుజ్ఞను ఆ పరమేశ్వరుఁడే గ్రహించి, నన్ను గ్రేడ్ 1 తెలుగు పండిత ఉద్యోగిగా చేశాడు. అంతటిస్థిత ప్రజ్ఞులు మా గురుదేవులు.
విచిత్రమేమిటంటే వారియొక్క చిత్రపటం ఇంత కాలం వరకు నాకు లభించకపోవటం.
గురు దంపతులు నన్ను కరుణించారు. వారి సుపుత్రులు చి. శ్రీనివాసాచార్యులవారి దూరవాణి సంఖ్య నాకు లభించడంతో వారితో మాటాడే అవకాశం లభించింది. తద్వారా వారి చిత్రపటాన్ని నాకు ఆ పరమాత్మ లభింపచేశాడు. మా గురు దంపతుల ఆశీర్వాద బలంతోనే అంతో యింతో సజ్జన సాంగత్యానికి నోచుకొన్నాను. కవితా వధూటి క్రీగంటి చూపుకై ఆశించే భాగ్యం నాకు కలిగింది.
నా గురుదంపతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
మాగురుదేవుల కటాక్షం నాపై ప్రసరించినందున కలిగిన ఫలితాలు మళ్ళీ కలిసినప్పుడు చెప్పే ప్రయత్నం చేయగలను. నమస్తే.
జైహింద్.
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

ఇటువంటి గురువు గారిని పొందిన మీరు ధన్యాత్ములు. ఓం శ్రీగురుభ్యోనమః.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
దైవ స్వరూపమైన గురుత్వంలొ మీరు అదృష్ట వంతులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.