గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జూన్ 2015, శనివారం

రుద్ర నమక చమకముల భావము.

జైశ్రీరామ్.
రుద్రము - నమకము
అనువాకము 1.
1వ మంత్రము.  ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.
2వ మంత్రము.  ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము.
3వ మంత్రము.  ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము నిన్ను ప్రార్థించు చున్నాము.
4వ మంత్రము.  ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని పాలించు ఓ రుద్రుఁడా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని ప్రార్థించెను.
5వ మంత్రము.  మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ!
6వ మంత్రము.  మహాదేవా! మాయందరిలో నీతడే యధికుఁడని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. దేవతలలో నీవే ప్రథముఁడవు, ముఖ్యుఁడవు కదా! నీవు దైవ్యుఁడవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్థుఁడవు) నిన్ను దలంచి నంతనే సర్వ రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుఁడవు. సర్వ సర్పములను, వ్యాఘ్రాదులను, సర్వ రాక్షసులను నశింపజేయువాఁడవు కదా! కావున మమ్ములను కాపాడుము తండ్రీ!
7వ మంత్రము.  ఏ రుద్రుఁడు ఈ మండలస్థాదిత్య రూపుఁడో అతఁడు ఉదయ కాలమున అత్యంత రక్త వర్ణుఁడాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త వర్ణుఁడాయెను.  అంతే కాదు ఉదయానంతర కాలమున పింగళ వర్ణుఁడాయెను.ఆయా కాలములందు అతనిలో మిగిలిన వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ స్వరూపుఁడాయెను.   కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు మున్నగు దిక్కులందును,  వ్యాపించి యున్నారో  వారునూ సహస్ర సంఖ్యాకులై కలరు.  సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందఱకును   ఏ క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము.
8వ మంత్రము.  ఏ రుద్రుఁడు కాల కూటమను విషము దాల్చుటచే నీలగ్రీవము కలిగి యుండెనో,  అట్టి ఈతఁడు విశేషమైన రక్త వర్ణము కలవాడై, మండల వర్తియై, ఉదయాస్తమయ సంపాదకుడై ప్రవర్తించుచున్నాఁడు. అంతే కాదు. వేద శాస్త్ర సంస్కార హీను లైన గోపాలురు కూడ ఈ ఆదిత్య రూపుఁడై మండలమున గల రుద్రుని చూచుచున్నారు.  నీరమును గొనివచ్చు వనితలును ఈ రుద్రుని చూచుచున్నారు. అంతే కాదు ఆదిత్య రూపుఁడగు ఈ రుద్రుని గోవులు, బఱ్ఱెలు మున్నగు సకల ప్రాణులును చూచుచున్నవి. వేద శాస్త్రజ్ఞుల చేతను, వేదశాస్త్రములు తెలియని వారిచేతను, పశుపక్ష్యాదుల చేతను చూడ బడువాఁడైన రుద్రుఁడు మమ్ములను సుఖ వంతులనుగా చేయును గాక.
9వ మంత్రము.  ఇంద్ర మూర్తి ధారణచే వేయి కన్నులవాఁడైన శివునకు నమస్కార మగును గాక.  ఫర్జన్య  రూప ధారియై, వృష్టి కర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతే కాదు. ఏవి ఈ రుద్రుని యొక్క భృత్య రూపములైన ప్రాణులు కలవో వానికి నేను నమస్కారము చేయుచున్నాను.
10వ మంత్రము.  ఓ భగవంతుఁడా! నీవు పూజా వంతుఁడవు. మహదైశ్వర్య  సంపన్నుఁడవు. ఓ రుద్రా! నీవు నీ ధనుస్సున రెండు చివరలకు కట్టిన త్రాటిని విడువుము. విప్పివేయుము. నీ చేతనున్న బాణములను విడిచిపెట్టుము. మాపై విడువకు తండ్రీ!
11వ మంత్రము.  ఇంద్ర రూపుఁడవైన ఓ రుద్రుఁడా! వందల కొలదీ అమ్ములపొదులు కలవాఁడా! ధనుస్సును దించి, బాణముల యొక్క ముఖములను అంప పొదులలో నుంచి, మా పట్ల అనుగ్రహ యుక్తుఁడవై శాంతుఁడవు  కమ్ము.
12వ మంత్రము.  జటాజూటము గల శివుని యొక్క ధనుస్సు విగతమైన వింటి త్రాడు కలది యగు గాక. అంతే కాదు. నీ యొక్క బాణములు గల అంప పొది బాణములు లేనిది అగు గాక. ఈ రుద్రుని యొక్క బాణములు అంప పొదిలో నుండుటచే చంపుట కసమర్ధములు అగుగాక. ఈ రుద్రుని యొక్క అంప పొది బాణ వహన మనెడి చిన్న పని చేయుటకు మాత్రమే సమర్ధము అగు గాక. కత్తులు దాచు ఒర కత్తులు మోయుటకు మాత్రమే సమర్ధమగు గాక.
13వ మంత్రము.  అందరి కోరికలను అధికముగా తీర్చే ఓ శివుఁడా! ఏ నీ ఆయుధము ఖడ్గాది రూపమున కలదో, నీ యొక్క చేతియందు ఏ ధనుస్సు కలదో, నీవు ఉపద్రవములు కావింపని ఆ ఆయుధముచే, ఆ ధనుస్సుచే, మమ్ములను అంతటను అన్ని విధములా పరిపాలింపుము.
14వ మంత్రము.  ఓ రుద్రుఁడా! ధనుస్సున బంధింప బడని కారణమున ప్రసరింపఁ జేయఁ బడినట్టియు, స్వరూపము చేతనే చంప సమర్ధమైనట్టి నీ యొక్క ఆయుధమునకు నమస్కార మగు గాక. అంతే కాదు నీయొక్క రెండు భుజములకు నమస్కారము అగు గాక. నీ యొక్క ధనుస్సునకు నమస్కార మగు గాక.
15వ మంత్రము.   శివుఁడా! నీధనుస్సునకు బాణాది రూపమైన ఆయుధము మమ్ములను అన్ని విధముల విడుచును గాక. అంతే కాదు. నీ యొక్క ఏ అంప పొది కలదో దానిని మా కంటె దూరముగా ఉంచుము.
అనువాకము 1 సమాప్తము.
భగవంతుఁడైన విశ్వేశ్వరునకు, మహా దేవునకు, త్ర్యంబకునకు, త్రిపురాంతకునకు, కాలాగ్ని యైన రుద్రునకు, నీల కంఠునకు, మృత్యుంజయునకు, సర్వేశ్వరునకు, సదా శివునకు, శ్రీమన్మహాదేవునకు నమస్కారము.

 అనువాకము 2.
యజుస్సు 1.  (13పదములు కల వచనరూప మంత్రమునే యజుస్సు అందురు) బంగారు నగలు గల బాహువు లందుఁ గల యట్టియు, యుద్ధ రంగమున సేనను జేర్చు సేనా నాయకు డగునట్టియు,  దిక్కులను పాలించు నట్టి వాడుఁను  రుద్రునకు నమస్కారము.
యజుస్సు 2.  హరిత వర్ణమైన కేశములు పర్ణ రూపమునఁ గల వృక్షాకార రుద్ర మూర్తులకు నమస్కారము అగు గాక. పశువులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక.
యజుస్సు 3.  సస్పి(లేత గడ్డి)వలె పసుపు, ఎఱుపు, రంగుల కలయిక గల మహా దేవునకు నమస్కార మగు గాక. కాంతి గల రుద్రునకు నమస్కార మగును గాక. శాస్త్రము లందు చెప్ప బడిన దక్షిణోత్తర తృతీయ మార్గములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 4.  వాహనమైన ఎద్దుపై కూర్చుండు నట్టియు, శత్రువులను విశేషముగ పీడించు శివునకు నమస్కార మగును గాక. అన్నములైన ఓషధులను పాలించు ప్రభువగు రుద్రునకు నమస్కారము.
యజుస్సు 5.  నల్లని జుత్తు గల, మంగళ ప్రయోజనమైన యజ్ఞోపవీతము గల రుద్రునకు నమస్కారము. పరిపూర్ణ గుణులైన పురుషులకు స్వామియైన రుద్రునకు నమస్కార మగును గాక.
యజుస్సు 6.  సంసార భేదకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక. లోకములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కారమగును గాక.
యజుస్సు 7.  విస్తరింప బడిన ధనుస్సులతో రక్షించునట్టి రుద్రునకు నమస్కార మగు గాక. క్షేత్రములకు (శరీరములకు-పుణ్యక్షేత్రములకు) పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు  8.  సారథి యైనట్టియు, శత్రువులను సంహరింప శక్యుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక. అరణ్యములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 9.  లోహిత వర్ణుఁ డైనట్టియు, ప్రభు వైనట్టి రుద్రునకు నమస్కారము. చెట్లకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.
యజుస్సు 10.  రాజ సభలో మంత్రాలోచన కుశలుఁ డైనట్టియు, మంత్రి రూపమున వణిజులకు స్వామి యైనట్టి రుద్రునకు నమస్కారము. వనము లందలి గుల్మ లతాదులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.
యజుస్సు 11.  భూమిని విస్తరింప జేయు రుద్రునకు నమస్కార మగుఁ గాక. ధనము చేకూర్చునట్టి (సేవచేయుభక్తులకుచెందినట్టి) రుద్రునకు నమస్కార మగుఁ గాక. ఓషధులకు ప్రభువగు రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 12.  యుద్ధ సమయమున మహోన్నత ధ్వనిగా కల శివునకు నమస్కారము. శత్రువుల నేడిపించు శివునకు నమస్కార మగు గాక. పాదచారులైన యోధులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 13.  చుట్టునూ ఆవరింపబడిన సకల సైన్యము గల రుద్రునకు నమస్కారము. పరుగులిడుచున్నశత్రుసైన్యముల వెనుకనేగు రుద్రునకు నమస్కారమగుగాక. సాత్వికులై శరణాగతులైనవారి పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుగాక.
అనువాకము 2 సమాప్తము.
అనువాకము 3.
యజుస్సు 1.  విరోధులను అభిభవించు (పరాభవించు) రుద్రునకు నమస్కారము
మిక్కిలి విరోధులను బాధించు రుద్రునకు నమస్కారము. అంతటను సంపూర్ణముగా బాధించు శూర సేనలకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 2.  కకుభ (అర్జునవృక్షము వలె ప్రథానుఁడైనట్టి) సదృశమైన, ఖడ్గము చేతఁ గల శివునకు నమస్కారము. గుప్త చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 3.  ధనుస్సును సంధించుటకు చేత బాణము కలిగినట్టియు, పృష్ఠ భాగమున కట్టఁ బడిన అమ్ముల పొది కలిగినట్టి శివునకు నమస్కారము. ప్రకట చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 4.  యజమానికి ఆప్తుఁడై అతని క్రయ విక్రయాది వ్యవహారము లందు మెలగుచు, ఎచ్చట నైనను, ఏమాత్ర మైనను అతని ద్రవ్యమును అపహరించుట యనెడి వంచన మొనరించు వాని స్వరూపముతో నుండు శివునకు నమస్కారము. పైన చెప్పినట్లు యజమానిని బాగుగా మోసగించు శివునకు నమస్కారము. రాత్రి యందు పగటి యందు అన్యులకు తెలియనీయక యజమాని సొత్తు నపహరించు వారికి పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 5.   నిరంతరము సంచార శీలము కలవాఁడు, బాగుగా సంచరించునట్టి శివునకు నమస్కారము. నిరంతరము అరణ్యమునందుండు వారి ప్రభువైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 6.  వజ్రమును బోలిన స్వశరీరమును రక్షించువారు సృకావినులు. వజ్రము వంటి తమ శరీరము రక్షించు వారికి నమస్కారము. కృషికులై స్వామి ధాన్యము అపహరించు వారికి ప్రభువైన శివునకు నమస్కారము.
యజుస్సు 7.  ఖడ్గము కల చోరులకు నమస్కారము. రాత్రి సంచరించువారై వీధులలో పోవు వారిని పీడించు చోరులకు నమస్కారము. కుత్తుకలు కత్తిరించి అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  శిరస్సును కాపాడు తలపాగా కలిగినట్టి పర్వతముల సంచరించు నట్టి శివునకు నమస్కారము. భూమిని అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.
యజుస్సు 9.  బాణములు కలిగినట్టి మీకు నమస్కారము. ధనుస్సులు కలిగినట్టి మీకు నమస్కారము.
యజుస్సు 10.  ధనుస్సున త్రాటిని ఆరోపించు మీకు నమస్కారము. ధనుస్సున బాణమును సంధించు మీకు నమస్కారము.
యజుస్సు 11.  వింటి త్రాటిని ఆకర్షించునట్టి మీకు నమస్కారము. ధనుస్సు నుండి బాణములను విడుచు నట్టి మీకు నమస్కారము.
యజుస్సు 12.  లక్ష్యము వరకు బాణము విడుచునట్టియు, లక్ష్యము నందు బాణము ప్రవేశ పెట్టు మీకు నమస్కారము.
యజుస్సు 13.  కూర్చుండునట్టియును, నిద్రించునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 14.  నిద్రించునట్టి మీకు నమస్కారము. మీల్కొని యుండునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 15.  నిశ్చలముగా నుండునట్టి మీకు నమస్కారము. పరుగెత్తునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 16.  సంఘముగా నున్న వారికి నమస్కారము. సంఘముగా నున్నవారికి ప్రభు వగు మీకు నమస్కారము.
యజుస్సు 17. అశ్వ విగ్రహులకు నమస్కారము.  తనదగు ధనము లేని వానికి నమస్కారము. ఎవరి నుండియు ఏమియును గ్రహింపకుండుటచే రేపటికవసరమగు ధనము లేనివారికి నమస్కారము. అశ్వాధ్యక్షులును మహాశ్రీ గల వారును అగు మీకు నమస్కారము.
అనువాకము 3 సమాప్తము.
అనువాకము 4.
యజుస్సు 1.  సంపూర్ణముగా వేధించుటకు సమర్థులైన స్త్రీలకు నమస్కారము. విశేషముగా పీడించుటకు సమర్థులైన స్త్రీలగు మీకు నమస్కారము.
యజుస్సు 2.  ఉత్కృష్ట గుణ రూపలైన సమస్త మాతృకలు మున్నగు స్త్రీలకు నమస్కారము. పరులను హింసించుటకు సమర్థులైన దుర్గ మున్నగు భయంకర దేవతలకు నమస్కారము.
యజుస్సు 3.  విషయాసక్తులకు నమస్కారము. విషయాసక్తులను రక్షించు మీకు నమస్కారము.
యజుస్సు 4.  నానా జాతుల సంఘములకు నమస్కారము. సంఘాధిపతులైన మీకు నమస్కారము.
యజుస్సు 5దేవానుచర గణములకు నమస్కారము. దేవానుచర గణములకు ప్రభువైన మీకు నమస్కారము.
యజుస్సు 6.  వికృత రూపులైన నగ్న ముండాదులకు నమస్కారము. తురంగ గజ వక్త్రాది నానా రూపములను దాల్చు భృత్యులును అగు మీకు నమస్కారము.
యజుస్సు 7.  అణిమా ద్యష్టైశ్వర్యములతో కూడుకొన్నవారికి నమస్కరము. అష్టైశ్వర్యములు లేని మీకు నమస్కారము.
యజుస్సు 8.  శరీర రథము నధిష్టించిన పరమాత్మకును, రథులైన యోధులకును, జీవులకును నమస్కారము.  రథము లేని సామాన్య జీవులకును, శరీర రథము లేని అప్రాణులున్నగు మీకును నమస్కారము.
యజుస్సు 9.  రథ రూపులకు నమస్కారము. రథములకు ప్రభువులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 10.  రథ గజ తురగ పదాతి రూప సేనలకు నమస్కారము. సేనా నాయకులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 11.  రథ శిక్షకులును, రథములను గ్రహించు సారథులును అగు మీకు నమస్కారము.
యజుస్సు 12.  దేవాధిష్టానులైన శిల్పి విశేషులకు నమస్కారము.  చక్కగా రథములను నిర్మించు శిల్పులగు మీకు నమస్కారము.
యజుస్సు 13.  కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము.
యజుస్సు 14.  పక్షి పుంజములను సంహరించు వారికి నమస్కారము. మత్స్య ఘాతుకులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 15.  చక్కని శరీరములను చేయునట్టి మీకు నమస్కారము. చక్కని ధనుస్సులను చేయునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 16.  మృగములను చంపెడి వ్యాధులకు నమస్కారము. కుక్కల మెడలయందు గట్టబడిన పాశములను దాల్చెడి మీకు నమస్కారము.
యజుస్సు 17. శ్వాన రూపధారులకు నమస్కారము. శునక స్వాములైన మీకు నమస్కారము.
అనువాకము 4 సమాప్తము.
అనువాకము 5.
యజుస్సు 1.  ప్రాణుల యుత్పత్తికి మూల కారణమైన, జీవుల రోదనమునకు కారణ మైనట్టియు దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.  పాప నాశకులకును, అజ్ఞానులైన పురుషులను పాలించు వారికిని నమస్కారము.
యజుస్సు 3.  నీలగ్రీవము స్వేత కంఠము కలవాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 4.  జటాజూటము కల వానికి, వ్యుప్త ముండిత కేశునకు (జుత్తులేనివానుకు) నమస్కారము.
యజుస్సు 5.  ఇంద్ర వేషముచే సహస్రాక్షుఁడైన వాఁడును, సహస్ర భుజములు గల అవతారములు ధరించుటచే శతధన్వుఁడును ఐన శివునకు నమస్కారము.
యజుస్సు 6.  కైలాసమున ఉండువాఁడును, శయనించువాఁడును, విష్ణువును తన హృదయమున ధరించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.  మేఘ రూపమున మిక్కిలి వర్షము కురిపించువాఁడును, బాణములు కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  (అల్ప ప్రమాణుడగుటచే) హ్రస్వముగా నున్నట్టియును, (వ్రేళ్ళు మున్నగు అవయవముల సంకోచమువలన) వామనుఁడుగా నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 9.  ఆకారముచే ప్రౌఢుఁడైనట్టియు, గుణములచే సమృద్ధుఁ డైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 10.  వయసుచే అధికుఁడైనట్టియు, శృతులచే బాగుగా వృద్ధి పొందునట్టివాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 11.  జగదుత్పత్తికి పూర్వమున్నట్టియు, సభలో ముఖ్యుఁడును అగు పరమ శివునకు నమస్కారము.
యజుస్సు 12.  అంతటను వ్యాపించినట్టి గమనకుశలుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 13.  శీఘ్రముగా పోవు వాఁడును, ఉదక ప్రవాహముననున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 14.  తరంగములతో గూడి యున్నట్టియు, ధ్వని రహితమైన స్థిరమైన జలమున ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 15.  ప్రవాహమున నున్నట్టియు, జల మధ్యస్థములైన ద్వీపములందున్నట్టి శివునకు నమస్కారము.
అనువాకము 6.
యజుస్సు 1.  విద్య ఐశ్వర్యము మున్నగు వానిచే జ్యేష్ఠుఁడైనట్టి వాఁడున్నూ విద్యాదులతో కనిష్ఠుఁడైన వాడును అగు మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 2.  జగదాదిని హిరణ్య గర్భ రూపమున జన్మించి నట్టి జగ దవసాన సమయమున అగ్ని రూపమున జన్మించినట్టి మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 3.  మధ్య కాలమున దేవ తిర్య గాది రూపమున జన్మించి నట్టియును, ప్రరూఢములు కాని ఇంద్రియములు కలవాఁడును అగు మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 4.  గవాదులపశ్చాత్భాగమున వత్సాది రూపమున నున్నట్టియును, వృక్షాదుల మూలమున శాఖాదుల రూపమున నున్నట్టి పరమ శివునకు నమస్కారము.
యజుస్సు 5.  పుణ్య పాపములతో కూడుకొన్నవాఁడును, రక్షాబంధమున కర్హమైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 6.  యమలోకమునఁ బాపులను శిక్షించు వాని రూపమున జన్మించి నట్టియును, మోక్షమున కర్హుడై యున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 7.  సర్వ సస్యములతో నిండిన భూమితో ధాన్యాది విశేష రూపమున ఉన్నట్టియు, మేడి, నక్కు నాగలి రూపమున భూమిని దున్ని, అందలి సారమును వెలిబుచ్చునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 8.  వేదమంత్రములచే తెలియ దగు మహిమ కలవాఁడై, వానిలోనున్నట్టియును, వేదాంతములైన ఉపనిషత్తులచే నిరూపింప దగు తత్వము కలవాఁడు కాన వానిలో నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 9.  వృక్షాది రూపమున నున్నట్టియును, లతాది రూపమున నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 10.  శబ్ద రూపుఁడును ప్రతి ధ్వని రూపుఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 11  వేగముగా పోవు సేన కలిగినట్టి, వేగముగా పోవు రథము కలిగినట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 12.  యుద్ధమున ధైర్యము కలవాఁడును, శత్రువులను సంహరించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 13.  కవచము కలిగినట్టియు, గృహము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 14.  బిలము ఉపమానముగా కలదియును, యుద్ధమున శిరో రక్షకమునగు కిరీటము కలవాఁడును, శరీర రక్షకమైన కవచము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 15.  వేద ప్రసిద్ధుఁడైనట్టియు, శత్రు నిగ్రహమందు ప్రసిద్ధమైన సేన కలవాఁడునగు శివునకు నమస్కారము.
అనువాకము 6 సమాప్తము.
అనువాకము 7.
యజుస్సు 1.  భేరీ నుండి బయల్వెడలిన శబ్దము స్వరూపముగా కలవాఁడును, దుందుభిని మ్రోగించు దండముతో మొత్తుటచే బయల్వెడలిన నాదము రూపముగా కలవాఁడును, వంశ దండోద్భవుఁడు అగు శివునకు నమస్కారము.
యజుస్సు 2.  యుద్ధమున పలాయన రహితుఁడును, పర సైన్య వృత్తాంతమును పరామర్శించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 3.  స్వామి వృత్తాంతములను స్వస్వామి జనులకు తెలియ జేయుటలో కుశలుఁ డైనట్టియు, స్వామిచే పంపఁ బడిన పురుషుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 4.  ఖడ్గము కలవాఁడును బాణాధారమైన అమ్ముల పొది కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 5.  వాడి బాణములు కలవాఁడును, బహ్వాయుధములు కలవాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 6.  శోభనమైన త్రిశూల రూపమగు ఆయుధము కలవాఁడును, శోభనమైన పినాక రూపమగు ధనుస్సు కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.  పాద సంచార యోగ్యమైన క్షుద్ర మార్గమునకు అర్హుఁడును, రథాశ్వాది సంచార యోగ్యమైన ప్రౌఢమార్గము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  కుత్సితమైన జలము అనగా అల్ప జలము ప్రవహించు చోటును కటము అందురు. అందు జల రూపమున నున్న శివుఁడు కాట్యుఁడు. అతనికి నమస్కారము. అథో ముఖము గాను, అడ్డము గాను జలము ప్రవహించు చోటను జల రూపమున నున్న శివునకు నమస్కారము.
అనువాకము 7 సమాప్తము.
అనువాకము 8.
యజుస్సు 1.  ఉమతో గూడి యున్నట్టియు, సకల జీవుల రోదన హేతువైన దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.  ఉదయ కాలమున ఆదిత్య రూపుఁడగుటచే అత్యంత రక్త వర్ణుఁడై ఉన్నట్టియు, ఉదయానంతరమున ఇంచుకంత రక్త వర్ణుఁడై ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 3.  సుఖమును పొందించు వాఁడును, సుఖము నుత్పాదించు వాఁడును, భయ హేతువులైన పాప రోగ చోరాదుల నుండి రక్శించు వాఁడును అగు  మహా దేవునకు నమస్కారము.
యజుస్సు 4.  విరోధులను నశింప జేయుటకు క్రోధ యుక్తుఁ డైనట్తి వాఁడును, దర్శన మాత్రము చేత విరోధులకు భయ హేతు వైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 5.  అగ్రమునందు వధ కలవాఁడును (ముందున్నవానిని సంహరించువాఁడు) దూరమునందు వధ కలవాఁడును, అగు శివునకు నమస్కారము.
యజుస్సు 6.  దూర సమీప వర్తి శత్రువులను ధ్వంసము చేయువాఁడును, శత్రు ధ్వంసము చేయువాఁడును, సర్వాతిశాయి శక్తిచే సర్వులను సంహరించు వాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.  కల్పవృక్షాది స్వరూపుఁడును, హరిత వర్ణములును, కేశ సదృశములునగు ఆకులు గల వృక్షములు స్వరూపముగా కలవాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  ఓంకార రూపమైన ప్రణవముచే ప్రతిపాదింపఁబడు శివునకు నమస్కారము.
యజుస్సు 9.  సుఖము నుత్పాదించు వాఁడును, లోకములకు సుఖము భావించు వాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 10.  విషయ సుఖములను జేకూర్చు వాఁడును, మోక్ష సుఖమును జేకూర్చువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 11.  కల్యాణ స్వరూపుఁడై స్వయముగ నిష్కల్మషముగ నుండు వాఁడును, మిక్కిలి కల్యాణ స్వరూపుఁడుగా నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 12.ప్రయాగాది తీర్థములందు సన్నిహితుఁడై యుండునట్టియును, నదీ తీరములందు ప్రతిష్టింపఁబడిన లింగరూపమున నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 13.  సంసార సముద్రము దాటించి, మోక్ష కాములచే ధ్యానింప దగిన వాఁడును, సంసార మధ్యమున నున్నవారికి కామ్య ఫలదుండునగు శివునకు నమస్కారము.
యజుస్సు14.  గొప్ప మంత్ర జపాదుల యొక్క రూపము వలనఁ బాప తరణమునకు హేతువైనట్టియు, తత్వ జ్ఞాన రూపమున సంపూర్ణముగా సంసారము నుండి దాటించు వాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 15.  జీవ రూపమున మరల సంసార గమనమునకు అర్హుఁడైనట్టియు, సంపూర్ణముగా కర్మఫలము ననుభవించు జీవుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 16.  గంగా తీరాదులతో జన్మించు కుశాంకురాదులకు అర్హుఁడైనట్టియును, నదీ మధ్య గత ఫేనమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 17.  సికతకు అర్హుఁడైనట్టియును, ప్రవాహమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
అనువాకము  8 సంపూర్ణము.
అనువాకము 9.
1) ఊషర క్షేత్రములం దుండునట్టియును, పది మంది నడుచు త్రోవలోనుండు నట్టి శివునకు నమస్కారము.
2) కుత్సితములు అనగా క్షుద్రములగు శిలలు గల ప్రదేశముల నుండునట్టి, నివాస యోగ్య ప్రదేశమునం దుండునట్టి శివునకు నమస్కారము.
3) జటా బంధము కలవాఁడును భక్తుల యెదుట నుండు నట్టి శివునకు నమస్కారము.
4) గోశాలలో నుండునట్టియు, సామాన్య గృహములలో నుండునట్టి శివునకు నమస్కారము.
5) తల్పము నందును మంచము పైని శయనించునట్టియును, ధనికుల ప్రాసాదమునం దుండు వాఁడు నగు శివునకు నమస్కారము.
6) కుత్సితముగా తిరుగువాఁడును, ముండ్లతో నిండిన లతాదులచే ప్రవేశింప నలవి కాని ప్రదేశమున నుండువాఁడును, విషయములైన గిరి గుహాదులలో నుండువాఁడునగు శివునకు నమస్కారము.
7) అగాధ జలములం దుండువాఁడును, నీహార జలమం దుండువాఁడునగు శివునకు నమస్కారము.
8) పరమాణువులం దున్నట్టియును విస్పష్టమైన ధూళిలోనున్నట్టి శివునకు నమస్కారము.
9) కాష్ఠములం దున్నట్టియును, తడిసిన దాని యందు క్రొత్త దాని యందున్నట్టి శివునకు నమస్కారము.
10) తృణాదికము లోపించు కఠిన ప్రదేశమున నున్నట్టియును, రెల్లు మొదలగు తృణములం దున్నట్టి శివునకు నమస్కారము.
11) భూమియందుండువాఁడును, చక్కని కెరటములు గల నదులయందుండు వాఁడునగు శివునకు నమస్కారము.
12) ఆకులం దున్నట్టియును, ఎండుటాకుల మొత్తమునం దున్నట్టి శివునకు నమస్కారము.
13) సిద్ధము చేయబడిన ఆయుధములు కలవాఁడును, సంపూర్ణముగా సంహరించునట్టి శివునకు నమస్కారము.
14) ఇంచుకంత దుఃఖము కలిగించునట్టియు, అత్యంత దుఃఖము కలిగించునట్టి శివునకు నమస్కారము.
15) భక్తులకు ధనమును చిమ్మెడి ఉదారులగు రుద్రావతారులకును, సర్వ దేవ ప్రియుఁ డగుటచే సర్వ దేవతల హృదయమగు వారికి నమస్కారము.
16) క్షీణించు వాని కంటే విపరీతములై ఎపుడునూ నశింపని శివ శక్తులకు నమస్కారము.
17) అపేక్షించు అర్థమును సంపాదించి యొసంగు శివునకు నమస్కారము.
18)  సంపూర్ణముగా, నిశ్శేషముగా జీవుల యొక్క పాపములను, అచేతనము లందలి దోషములను, లోపములను, తొలగించు శివునకు నమస్కారము.
19) సంపూర్ణముగా స్థూల భావము పొంది దేవతలలో కల శివునకు నమస్కారము.
అనువాకము 9 సమాప్తము.
అనువాకము 10.
ఋక్కు 1.  కుత్సితమైన గతిని పొందించువాఁడా! అన్నమును రక్షించువాఁడా! ఏమియునూ లేనివాఁడా! కంఠమున నల్లనివాఁడవై ఇతరత్ర ఎఱ్ఱనివాఁడా!  పుత్రపౌత్రాదుల యొక్కయు ఈ మాదగు గో మహిష్యాదుల యొక్కయు, సమూహమును భయపెట్టకుము. ఈ మోక్షమందిన అందఱిలో ఒక వస్తువునైనను నశింప జేయకుము. రోగమందినవారిగా జేయకుము.
ఋక్కు 2.  ఓ శివుఁడా! నీదగు ఒక శరీరము శాంతమైనది. ఆ శరీరముతో మమ్ములను జీవింప జేయుటకు సుఖింప జేయుము. ఆ శరీరము అన్ని దినములందును రోగ దారిద్ర్యాదులను తొలగించుటకు ఔషధము వంటిది కాన శుభకరమైనది. శివుని యొక్క తాదాత్మ్యము పొందుటకు ఔషధ రూపమైనదియును, జ్ఞాన దానముచే సంసార దుఃఖమును తొలగించును గాన మంగళకరమైనదియును అగుచున్నది.
ఋక్కు 3.  ఏ ప్రకారముగా మా యొక్క పుత్ర పౌత్రాది రూప మనుష్యునకును మహిష్యాది రూప పశువునకును, సుఖము అగునో, ఇంతే కాదు. ఈ గ్రామము నందలి ప్రపంచము సుఖ పూర్ణమును, ఉపద్రవ శూన్యమును అగునో అట్లు మేము రుద్రుని కొఱకు ఈ పూజ ధ్యానము మున్నగు వానికి చెందిన బుద్ధిని గొప్పగా పోషించు చున్నాము. బల యుక్తుఁడును, తాపస వేషుఁడును, క్షీణించు ప్రతిపక్ష పురుషులు కలవాఁడు నగు రుద్రునకు సకలమును సమర్పించు చున్నాము.
ఋక్కు 4.  ఓ శివా! మమ్ములను ఇహ లోకమున సుఖింపఁ జేయుము. ఇంతే కాదు. మాకు పర లోకమునను సుఖమును చేయుము.   నశింప చేయ బడిన మా పాపములును, వీరులును గల నీకు నమస్కారముతో సేవించెదము. పాలకుఁడైన ప్రజాపతి ఏ సుఖమును, దుఃఖమునకు దూరముగా నుండుటను, ఏ లేశమును సంపాదించెనో ఆ సర్వమును మేము ఓ శివుఁడా! నీ యొక్క ప్రణయమును, స్నేహాతిశయమును కలుగగా పొంద గలము.
ఋక్కు 5.  ఓ రుద్రుఁడా! మా యొక్క ముదుసలియైన పురుషుని హింసింపకు. అంతే కాదు. మా యొక్క బాలుని హింసింపకుము. అంతే కాదు. మాయొక్క నీరు చిమ్ముటకు సేవ చేయుటకును సమర్ధుఁడైన పురుషుని హింసింపకుము. అంతే కాదు. మా యొక్క గర్భమందలి పురుషుని హింసింపకుము. మా యొక్క తండ్రిని చంపకుము. అంతే కాదు.మా తల్లిని కూడా చంపకుము. మా యొక్క ప్రియమైన శరీరములను హింసింపకుము.
ఋక్కు 6.  రుద్రుఁడా! మా యొక్క సంతానమందును దయ చూపి హింసింపకుము.   మా యొక్క ఆయుర్దాయము విషయమై హింసింపకుము. మాయొక్క గోవులందును, మాయొక్క గుఱ్ఱముల విషయమై హింసను ఆచరింపకుము. కృద్ధుఁడవై మాయొక్క వీరులను, భృత్యులను వధింపకుము.  మేము హవిస్సు గలవారమై నిన్ను నమస్కారముతో సేవించెదము.
ఋక్కు 7.  గోవులను చంపునట్టియు, అంతే కాదు పుత్ర పౌత్రాది పురుషులను సంహరించు నట్టియు నశింపఁ జేయఁ బడిన సేవకులు గల్గినట్టి  నీయొక్క (ఉగ్ర)రూపమున ఉండు గాక. సుఖకరమగు నీయొక్క రూపము మాయందుండుగాక. ఇంతే కాదు. మమ్ములను అన్ని విధముల కాపాడుము. అంతే కాదు. ఓ ప్రభూ! మమ్ములను ఇతరుల కంటే అధికులుగ చెప్పుము. ఇంతే కాదు రెండు లోకములను వృద్ధి చేయు నీవు సుఖమునొసంగుము.
ఋక్కు 8.  గుహను పోలిన హృదయ పద్మమును సర్వదా ఉండునట్టియును, నిత్యము యువకుఁడైనట్తియును, భయంకరమైన సింహము వలె ప్రళయ కాలమున సర్వ జగత్తును నశింపఁ జేయుటకు భయంకరుఁడైనట్టియు ప్రసిద్ధుఁడైన రుద్రుని ఓ నాదగు వాకా! స్తోత్రము చేయుము. మా వచనము చే స్తుతింప బడిన వాడవై ప్రతి దినము నశించు మా శరీరమునకు సుఖము చేకూర్చుము. నీ సేవలు అన్యుఁడగు శత్రువును నశింపఁ జేయు గాక.
ఋక్కు 9.  శివుని యొక్క ఆయుధము మమ్ములను పూర్తిగా క్రోధముచే ప్రజ్వరిల్లునట్టియు పాప పరిహారక రూపమును గోరు శివుని యొక్క భయంకరమైన బుద్ధి మమ్ములను విడిచి పెట్టును గాక. వొరోధ వినాశనకై చెక్కుచెదరక యున్న భయంకర బుద్ధిని హవిస్సనెడి అన్నముతో గూడిన యజమానుల నుండి తొలగింపుము. భక్తుల కోరికలను అమితముగా నొసంగు రుద్రుఁడా! మా పుత్రులకు మా మనుమలకును సుఖమునొసంగుము.
ఋక్కు 10.  అతిశయముగా వర్షించి తడుపువాఁడా!(కామముల నొసంగువాఁడా)మిక్కిలి శాంతమైన స్వరూపము కలవాఁడా! మమ్ములను గూర్చి శాంతుఁడవును, మంచి మనస్సుతోడను స్నేహముతోడను గూడినవాఁడవగుము. త్రిశూలాదికమును అత్యున్నతమైన మఱ్ఱి రావి మున్నగు వృక్ష జాతమునందుంచి, వ్యాఘ్ర చర్మమును మాత్రము దాల్చువాఁడవై మా కెదురుగా రమ్ము. పినాకమను ధనుస్సును హస్తమున ధరించుచు రమ్ము.
ఋక్కు 11.  విశేషముగ భక్తుల సన్నిధిని బహు విధముల ధన రాసులను జిమ్మి ఒసంగువాఁడా! తెల్లనివాఁడా! లేదా, మిక్కిలి ఎఱ్ఱనివాఁడా! ఓ భగవంతుఁడా! నీకు నమస్కారమగు గాక. నీకు ఏ ఆయుధములు వేలకొలది కలవో (వానిని) వాటి చే మాకంతే ఇతరుఁడైన విరోధిని నశింపజేయును గాక.
ఋక్కు 12.  ఓ శివా నీ యొక్క చేతులందు ఆయుధములు వేయి విధముల వేలకొలదీ కలవు. ఓ భగవంతుఁడా! సమర్థుఁడవగ్చు, ఆ ఆయుధములకు ముఖములను, శల్యములను మాకు పరాఙ్ముఖమగునట్లు చేయుము.
అనువాకము 10 సమాప్తము. 
అనువాకము 11.
ఋక్కు 1.  భూమి యొక్క ఉపరి భాగమున ఏ రుద్రులు సహస్ర ప్రకారులై సహస్ర సంఖ్యాకులై, కలరో ఆరుద్రులయొక్క ధనుస్సులును, మాకంటే సహస్ర యోజనములు దాటిన పిమ్మట గల దేశమున తొలగింపబడిన వింటి త్రాడు కలవిగా జేసి ఉంచుము.
ఋక్కు 2.  ఈ కాన వచ్చు మహా సముద్రముతో సమానమైన అంతరిక్షము నాశ్రయించి యున్న రుద్రమూర్తి విశేషములు సహస్ర యోజనముల దూరమున ఉండుగాక.
ఋక్కు 3.  రుద్రుని యొక్క మూర్తి విశేషములు కొన్ని ప్రదేశములందు నీల వర్ణములును, ఇతర ప్రదేశములందు శ్వేత వర్ణములై యుండును. నీల కంఠములు హింసించు నవియును పాతాళమున సంచరించు నవియును ఐయున్నవి.
ఋక్కు 4.  నీల శ్వేత వర్ణములును, నలుపు కంఠమునందు గల రుద్రాంశ గల దేవాదులు  స్వర్గమును ఆశ్రయించి యుండిరి.
ఋక్కు 5.  వృక్షము లందు ఏ రుద్రులు కలరో వారు లేత గడ్డి వలె పింజర వర్ణము కలవారు. నీల వర్ణమైన గ్రీవము కలవారు. కొందరు విశేషముగ రక్త వర్ణము కలవారు.
ఋక్కు 6.  ఏ రుద్రులు కాన రాని శరీరము కలవారై మనుష్యులకు ఉపద్రవములను గావించు భూత గణములకు ప్రభువులో వారిలో కొందరు నున్నగా చేయ బడిన   శిరస్సులు కలవారై జటాజూటము లకలవారై జీవులను హింసిచు చున్నారు. వారు దూరముగా నుందురు గాక.
ఋక్కు 7.  ఏ రుద్రులు (రుద్రాంశ గలవి) భుజింప దగిన వస్తువు లందు గూఢముగా నున్నవై జనులను విశేషముగా బాధించు చున్నవో త్రాగ తగిన పాలు మున్నగు వానిలో నున్నవై త్రాగుచున్న జనులను విశేషముగా బాధించు చున్నవో అవి దూరముగా నుండును గాక.
ఋక్కు 8.  ఏ రుద్రులు లౌకికములును వైదికములునగు మార్గములను రక్షించువారో , అన్న సమూహమును భరించువారో, అన్న ప్రదానముచే జీవులను పోషించువారో, వారు మిశ్రములై విరోధులతో యుద్దము చేయువారు అగుచున్నారు. వారు దూరముగా ఉందురుగాక.
నవమము, 
యజుస్సు1.  ఏ రుద్రులు కాశీ ప్రయాగాది క్షేత్రములను రక్షించుటకు సంచరించుచున్నారో వారు ఈటెలు కలవారును, కత్తులు కలవారును అయి యుండిరి.
దశమము.
యజుస్సు 2.  ఏ రుద్రులు వేలకొలది కలరో అంతకంటె అధికులై అన్ని దిక్కులను ప్రవేశించి కలరో వారి యొక్క ధనుస్సులను వేయి యోజనముల దూరమున వింటి త్రాడు తొలగించి ఉంచుడు.
ఏకాదశ. 
యజుస్సు 3.  ఏ రుద్రులు భూమిపై కలరో,ఏరుద్రులకు ఆహారమే బాణములో, అన్నమే బాణములుగా గల రుద్రులకు నమస్కారము. ఏ రుద్రులు ఆకాశమునందుఁ గాలరో, ఏ రుద్రులకు వాయువు బాణములో, ఆ రుద్రులకు నమస్కారము. ఏ రుద్రులు స్వర్గమునందు కలరో, ఏ రుద్రులకు వర్షము బాణములో, ఆ రుద్రులకు నమస్కారము. తూర్పు ముఖముగా పది వేళ్ళ చివరలు గల అంజలుల తోడను, దక్షిణ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, పడమట ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఉత్తర ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఊర్ధ్వ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఆ రుద్రులకు నమస్కారములు. ఆ రుద్రులు మమ్ములను సుఖపఱచుదురు గాక.  ఎవనిని ద్వేషింతుమో, ఏ శత్రువు మమ్ములను ద్వేషించునో, ఆ శత్రు ద్వయమును రుద్రులారా! మీయొక్క తెరచి యున్న నోటిలో ఉంచుచున్నాను.
అనువాకము 11 సమాప్తము
కాల స్వరూపుఁడు, అఖండ ఆనంద స్వరూపుఁడు ఐన ఆ పరమాత్మతో యోగము ద్వారా మన దేహము పవిత్రమగును గాక.పండిన దోస పండు తనంతట తానే తొడిమ నుండి వేరు పడినట్లు మనమూ మృత్యువు నుండి వేరు పడి అమృతత్వమును పొందుదుము గాక.
అగ్ని, నీరు మున్నగు వానియందును, ఓషధులు విశ్వమున భువనములందును ఏ రుద్రుఁడు లీనమై యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగును గాక.
ఉత్తమమైన అస్త్ర శస్త్రములు కలిగివైద్యుడై మన రోగాలను నిర్మూలించే,రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు.
శివుని తాకిపూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము.
ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము,ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.
నమక భావము సమాప్తము.
శ్రీ రుద్ర  చమకము. 
అనువాకము 1.
శ్రుతి:-  ఓ అగ్నావిష్ణులారా! అన్నమును, అన్న భోజనమునకు అనుమతియును, శుద్ధియును, బంధనమును, అనగా అన్న విషయకమైన ఔత్సుక్యమును నాకు సంపాదించెదరు గాక. 
అన్న ధారణమును, అన్న హేతువైన యజ్ఞమును, ఉదాత్తాది మంత్ర స్వరమును, స్తుతిని నా కొసంగుము.  
విని, వినిపించెడి శక్తిని, సామర్థ్యమును, ప్రకాశమును, స్వర్గమును నా కొసగుము.
ప్రాణ వాయువును, అపాన వాయువును, వ్యాన వాయువును, ప్రాణాపానాది వృత్తులు కల వాయువును నాకొసగుము.
మనస్సున జనించిన జ్ఞానమును, మనోజ్ఞానముచే సర్వదా ఇంద్రియములను గోచరించు ద్రవ్యమును, వాక్కును, మనస్సును నా కొసంగుము. 
నేత్రమును చెవిని జ్ఞానేంద్రియములకు చెందిన నేర్పును నా కొసంగుము.
బల హేతువగు అష్టమ ధాతువును, శత్రువును పరాభవింప గల శక్తిని, ఆయుర్దాయమును, ఆయుస్సు తగ్గి చర్మము ముడతలు పడి, జుత్తు పండే స్థితిని నాకు చేకూర్చుము.
శాస్త్ర ప్రసిద్ధ పరమాత్మయును, చక్కని సన్నివేశము గల శరీరమును, సుఖమును, శరీరమును రక్షించు కవచాదికమును నాకు అగు గాక.
శరీరావయవముల నన్నింటిని, యథా స్థానమున గల యముకలను అంగుళ్యాది పర్వములను, ఇంతకు మున్ను చెప్పని అవయవములను, నాకు చేకూర్చుదురు గాక.
అనువాకము 1 సమాప్తము.
అనువాకము 2.
1) అన్నిటి కంటే  శ్రేష్ఠముగా నుండుటను, ప్రభువుగా నుండుటను, మనస్సున నుండు క్రోధమును, ఓరిమి లేకుండుట మున్నగు కారణములచే కల్గు బాహ్య క్రోధమును నాకు ఒసంగుము.
2) స్వల్ప ప్రయత్నముతో శత్రువులు  ఛేదింప శక్యము కాకుండుటను, శైత్య మాధుర్యము గల జలమును జయింప సామర్థ్యమును, మహత్వమును, జయించి సంపాదించిన ధనాది సంపదను నాకు(చేకూర్చుము) .
3) కోర దగిన పూజ్యత్వమును, గృహ క్షేత్రాది విస్తారమును,  పుత్ర పౌత్రాదుల శరీరములను, పుత్ర పౌత్రాదులకు చెందిన దీర్ఘత్వమును, నాకు ఒసంగుము.
4) ఉత్కృష్టమగు అన్నమును, అధికమగు ధనమును, విద్యాదులకు చెందిన గుణములచే కలిగిన గొప్పదనమును, యధార్ధ మాడుటను, పర లోకము కలదను బుద్ధిని, నాకు ఒసంగుడు. 
5) స్థావర జంగమమైన గవాదికమును, సువర్ణాది ధనమును, సర్వము స్వాధీనముననుండుటను, శరీర కాంతిని నాకొసంగుము.
6) పాచికలాడుట మున్నగు దానిని, క్రీడలచే కలుగు ఆనందమును, కలుగబోవు సంతానమును నాకొసంగుడు.
7) ఋక్కుల సమూహమును, ఋగాది మంత్రములచే కలిగిన అపూర్వమును, పూర్వ లబ్ధమైన ధనమును, ఇటుపైన పొంద దగిన ద్రవ్య జాతమును నాకు ఒసంగుము.
8) పూర్వ సిద్ధమైన క్షేత్రాదులను, మున్ముందు చక్కగా పొంద దగిన దానిని, చక్కగా వెళ్ళ తగిన తావును, బంధువులు గల గ్రామాంతరాదులను, దొంగలు మున్నగు ఈరి బాధలు లేని మార్గమును, నాకు ఒసంగుడు.
9) వేద్ధి చేయఁ బడిన ధనాదికమును గాని, ఆచరించిన కర్మ ఫలమును గాని, అనుష్టించ బోవు యజ్ఞముల ఫలమును, తమ పనులు చేయుటకు సమర్థమైన ద్రవ్యమును, స్వకీయమైన సామర్ధ్యమును,  పదార్థమును మాత్రమే నిశ్చయించుటను దుర్ఘటములైన రాజ కార్యాదులకు చెందిన నిశ్చయమును నాకొసంగుడు.
అనువాకము 2 సమాప్తము.
అనువాకము 3.
1) ఐహిక సుఖమును, పర లోక సుఖమును, ప్రీతి కారణమైన వస్తువును, అనుకూలముగానున్న కారణమున కోరఁబడిన పదార్థమును నా కొసంగుము.
2)మనస్సునకు స్వాస్త్యమును కూర్చు బంధు వర్గమును, ఇహ లోకమున రమణీయమైన కల్యాణమును, పరలోకమును నాకొసంగుడు.
3) నివాస హేతువులగు గృహాదులను, కీర్తిని, సౌభాగ్యమును, ధనమును నా కొసంగుడు.
4) ఆచార్యాదుల వలె నియమకుడనగుటను, పిత్రాదుల వలె పోషకుఁడ నగు శక్తిని, ధైర్యమొంది నిశ్చలముగా నుండుటను, నాకొసంగుడు.
5) సర్వ జనులకు అనుకూలముగ నుండుటను, పూజను, వేద శాస్త్రము లకు చెందిన విజ్ఞానమును, జ్ఞాపకము చేయు సామర్థ్యమును నాకొసంగుడు. 
6) పుత్రాదులను ప్రేరేపించు సామర్ధ్యమును, భ్రుత్యాదులను ప్రేరేపించు సామర్ధ్యనును, గోలాంగూలాదులతో వ్యవసాయమును సాధించు సంపత్తిని, పైని చెప్పిన పనులు చేయుటకు వీలు కాకుండ చేయు ప్రతి బంధమును నివారించుటను నాకొసగుడు.
7) యజ్ఞాది కర్మను, యజ్ఞాది కర్మ ఫలమును, క్షయ మున్నగు వ్యాధులు లేకుండుటను, జ్వరము మున్నగు చిన్న వ్యాధులు లేకుండుటను, నాకు ఒసంగుడు.
8) జీవన కారణమైన వ్యాధి పరిహారకమైన ఔషధమును, అప మృత్యువు లేకుండుటను, శత్రువులు లేకుండుటను, భయము లేకుండుటను నాకు ఒసంగుడు.
9) శోభనమైన గమనమును, శయ్య, తలగడ మున్నగు సంపదను, స్నానాదులచే ప్రకాశించు ప్రాతః కాలమును, యజ్ఞ దానాధ్యనాదులతో కూడిన సంపూర్ణ దినమును నాకు ఒసంగుడు.
అనువాకము 3 సమాప్తము.
అనువాకము 4.
1) అన్న సామాన్యమును ప్రియ వచనమును, అన్న విశేషములను, వానిలో చేరిన పాలను, అన్న విశేషములందు సారమును నాకు ఒసంగుడు.
2) ఆవు నేయియును, పూతేనియును, బంధువులతోడి భోజనమును, సహ పానమును నాకు ఒసంగుడు.
3) అన్నమునకు హేతువైన వ్యవసాయమును, వర్షమును, జయ స్వభావమును, భూమిని దొలుచుకొని జన్మించు చెట్టులు, పొదలు మున్నగు వానిని నాకు ఒసంగుడు.
4) సువర్ణమును, మణులు ముత్యములు మున్నగు వానిని,  పూర్వమే చెప్పఁ బడిన సువర్ణము యొక్క సమృద్ధిని, శరీర పోషణమును నా కొసంగుడు. 
5) విభువును, ప్రభువును,బహు యను దానిని, భూయః అను దానిని, నాకు ఒసంగుడు. 
6) పూర్ణమును, పూర్ణ తరమును, అక్షితిని, కుత్సితములైన యవలను నాకు ఒశంగుడు.
7) ఆహారమును, అన్నము చేత ఆకలి బాధను పోగొట్టుటను, ప్రసిద్ధము లైన యవలు మాషములు, తిలలు, ముద్గములు మున్నగు ధాన్యములను, బార్లీలను నాకు ఒసంగుడు.
8)  మినుములను, నూవులను, ముద్గములను, పెసలు కంటే పెద్దవిగా నుండు ధాన్య విశేషములను నాకు ఒసంగుడు.
9) గోధుమలను, ముద్గల వలె సూపమునకు పనికి వచ్చు వానిని, ప్రియంగవములను, సూక్ష్మమైన శాలి ధాన్యములను, గ్రామము లందలి ధాన్య విశేషములను, అరణ్యమందలి ధాన్యమును నాకు ఒసంగుడు.
అనువాకము 4 సమాప్తము.
అనువాకము 5 .
1) రాయియును, మట్టియును, పెద్ద కొండలును, కొండలును, నాకు అగు గాక.
2) ఇసుకలను, అశ్వత్థాది వృక్షములను, బంగారమును, వెండిని నాకు ఒసంగుడు.
3) సీసమును, తగరమును, నల్లటి ఇనుమును, కాశ్య తామ్రాదులను నాకు ఒసంగుడు.
4) అగ్నిని, జలములను,  లతలను, ఓషధులను నాకు ఒసగుదు.
5) దున్నబడిన భూమిలో పండింప బడిన దానిని, దున్న బడని భూమిలో పండిన దానిని,  గ్రామము లందలి పశువులను అరణ్యమునందలి పశువులను నాకొసంగుడు.అవి నిమిత్తమైన యజ్ఞముచే సమర్థములు అగు గాక. 
6) పూర్వులచే లబ్ధమైన ధనమును, తన జన్మలో రాబోవు ధనమును, ఐశ్వర్యముతో గూడిన పుత్రాదికమును, స్వకీయమైన ఐశ్వర్యాదికమును నాకు ఒసంగుడు. 
7) నివాస సాధనమైన గవాదికమును, నివాసాధారమైన గృహాదికమును, అగ్నిహోత్రాది కర్మ జాతమును, కర్మాచరణమునకు అనుకూలమైన సామర్థ్యమును నాకు ఒసంగుడు.  
8) ప్రయోజన విశేషమును, పొంద దగిన సుఖమును, ఇష్ట వస్తువును పొందుటకుపాయమును, ఇష్ట ప్రాప్తిని నాకు ఒసంగుడు.
అనువాకము 5 సమాప్తము.
అనువాకము 6.  
1) నాయొక్క అగ్నియును నాకు ఇంద్రుఁడు. నాయొక్క చంద్రుఁడును నాకు ఇంద్రుఁడు. నా యొక్క నాయొక్క సమస్తమును ప్రేరేపించు సూర్యుఁడును నాకు ఇంద్రుఁడు. నాయొక్క సరస్వతియును నాకు ఇంద్రుఁడు.
2) నాయొక్క సూర్యుఁడును నాకు ఇంద్రుఁడు. నాయొక్క వేద మంత్రార్థమును చెప్పు బృహస్పతియును నాకు ఇంద్రుఁడు. నాయొక్క మిత్రః మిత్రుఁడగు సూర్యుఁడు నాకు ఇంద్రుఁడు. నాయొక్క వరుణ దేవు@డు నాకు ఇంద్రుఁడు అగు గాక.
3) నా యొక్క త్వష్ట ప్రజాపతియును నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క బ్రహ్మయు నాకు ఇంద్రుఁడగు గాక. నా యొక్క విష్ణువున్ నాకు ఇంద్రుఁడగు గాక. నాయొక్క అశ్వినీ దేవతలును నాకు ఇంద్రుఁడు అగు గాక. 
4) నా యొక్క వాయువు నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క సమస్త విశ్వ దేవతలు నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క భూదేవి నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క ఆకాశము నాకు ఇంద్రుఁడగు గాక.
5) నా యొక్క స్వర్గము నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క దిక్కులు నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క ఊర్థ్వ దిక్కును నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క విశ్చ కర్మ యను ప్రజా పతియును నాకు ఇంద్రుఁడు అగు గాక.
అనువాకము 6 సమాప్తము.
అనువాకము 7.
1)  సోమ గ్రహమును నాకు అగు గాక. రశ్మి గ్రహమును నాకు అగు గాక. అదాభ్య గ్రహమును నాకు అగు గాక. అధిపతి గ్రహమును నాకు అగు గాక.
2) ఉపాంశువును నాకు అగు గాక. అంతర్యామమును నాకు అగు గాక. ఇంద్ర వాయువులకు చెందిన ఇంద్ర వాయవమును నాకు అగు గాక. మైత్రావరుణులకు చెందినవియును నాకు అగు గాక. 
3) అశ్వినులును నాకు ఒసంగుము. ప్రతి ప్రస్థానమును నాకు అగు గాక. శుక్రమును నాకు ఒసంగుము. మంథీ యనునదియును నాకు ఒసంగుము.
4) ఆగ్రయణమును నాకొసంగుము. వైశ్వ దేవమును నాకు ఒసంగుము. ధృవగ్రహమును నాకొసంగుము. వైశ్వానరమును నాకు ఒసంగుము.
5) ఆరు ఋతువులును నాకు ఒసంగ బడును గాక. నవ గ్రహములును నాకొసంగబడుదురు గాక. మిక్కిలి గ్రహింప దగిన ఇతర గ్రహమును నాకొసంగబడుదురు గాక. ఇంద్రాగ్నుల కలయికయును నాకొసంగబడును గాక. వైశ్వ ద్ఫేవమును నాకొసంగభడును గాక.
6) మరుత్వతీయములును నాకు అగు గాక. మహేంద్రమును నాకు అగును గాక. ఆదిత్యమును నాకు అగును గాక. సావిత్రమును నాకు అగును గాక.  
7) సారస్వతమును నాకు ఒసంగుఁడు. పౌష్ణమును నాకు ఒసంగుఁడు. పత్నీవతమును నాకు ఒసంగుఁడు. హరియోజనమును నాకు ఒసంగుఁడు.
అనువాకము 7 సమాప్తము.
అనువాకము 8.
1) ఇధ్మమును నాకు ఒసంగుము. బర్హిస్సును నాకు ఒసంగుము. వేదిని నాకు ఒసంగుము. ధిష్టియములను నాకు ఒసంగుము.
2) స్రుక్కులను నాకు ఒసంగుడు.  చమసలను నాకు ఒసంగుడు.  గ్రావాణములను నాకు ఒసంగుడు.  ఒక విధమగు యజ్ఞాంగములను నాకు ఒసంగుడు. 
3) ఉపరవములును నాకు అగు గాక. అధిషవణములును నాకు అగు గాక. ద్రోణ కలశమును నాకు అగు గాక.వాయవ్యములును నాకు అగు గాక. 
4) పూత భృత్తును నాకు ఒసగుఁడు.అధవనీయమును నాకు ఒసగుఁడు. అగ్నీధ్రవమును నాకు ఒసగుఁడు.  హవిర్ధానమును నాకు ఒసగుఁడు.  
5) పత్నీశాలౌదులను  నాకు చేకూర్పుఁడు.సదస్సులను  నాకు చేకూర్పుఁడు.పురోడాశములను నాకు చేకూర్పుఁడు. శామిత్రాదులను  నాకు చేకూర్పుఁడు.అవభృధమును  నాకు చేకూర్పుఁడు.శంయువాకమును   నాకు చేకూర్పుఁడు.  
అనువాకము 8 సమాప్తము.
అనువాకము 9.
1) చీయమానమైన అగ్నుయును నాకు అగును గాక. ప్రవర్గ్యమును నాకు అగును గాక. అర్కయాగమును సూర్య యాగమును నాకు అగును గాక. 
2) ప్రాణాహుతి హోమమును నాకు ఒసంగుము. అశ్వమేథమును నాకు ఒసంగుము.పృథివిని నాకు ఒసంగుము. అదితిని నాకు ఒసంగుము.  
3) దితియును స్వర్గమున్ వృషభ సంబంధమైనవియును  అంగుళి వలె నుండు విరాట్పురుషుని అవయవ విశేషములును దిశలును, విదిశలును అవన్నియును నా యొక్క యజ్ఞముతో స్వస్వవ్యాపార సమర్థములు అగు గాక. 
4) పద్య రూప స్తోత్రములతో నిండిన ఋగ్వేదమును  నాకు ఒసంగుఁడు.గానముతో మిళితమైన మంత్రములు గల సామ వేదమును నాకు ఒసంగుఁడు.సోమావృత్తి రూప స్తోత్రమును  నాకు ఒసంగుఁడు.వచన రూప మంత్రమును గల యజుర్వేదమును నాకు ఒసంగుఁడు. 
5) దీక్షను నాకు అగు గాక.  తపస్సును నాకు అగు గాక.  ఋతువును వ్రతమును నాకు అగు గాక.  రాత్రిందివములు కురియునట్టి వర్షముచే కలుగు సస్యమును నాకు అగు గాక. బృహత్తు రథంతరము అను సామములును నాకు అగు గాక. నా యజ్ఞముచే తమతమ వ్యవహారములందు సమర్థములు అగు గాక. 
అనువాకము 9 సమాప్తము.
అనువాకము 10.
1) కడుపులో నున్న ప్రాణులను నాకు ఒసంగుము. వత్సలను నాకు ఒసంగుము.ఒకటిన్నర సంవత్సరముల వయసు మగ గోవులను నాకు ఒసంగుము. అదే వయసు గల ఆడ గోవులను నాకు ఒసంగుము. 
2) రెండు సంవత్సరముల వయసు గల ఋషభమును నాకు ఒసంగుము. రెండు సంవత్సరముల గోవును నాకు ఒసంగుము. రెండున్నర సంణ్వత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. రెండున్నర సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము. 
3) మూడు సంవత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. మూడు సంవత్సరముల వయసు కల గోవును  నాకు ఒసంగుము.మూడున్నర సంవత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. మూడున్నర సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము. 
4) నాలుగు సంవత్సరముల వయసు కల ఋషభమును  నాకు ఒసంగుము.నాలుగు సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము. సేచన క్రియకు సమర్థమైన ఋషభమును నాకు ఒసంగుము. వంధ్య యైన గోవును నాకు ఒసంగుము.
5) వేహత్తును నాకు ఒసంగుము. శకట వాహనమునకు ఉపయోగ పడు ఋషభమును నాకు ఒసంగుము. ధేనువును నాకుఒసంగుము. ఆయువును నాకు ఒసంగుడు.ప్రాణ శక్తిని నాకు ఒసంగుడు. అపానమును నాకు ఒసంగుడు.వ్యాన శక్తిని నాకు ఒసంగుడు. చక్షు శ్శక్తిని నాకు ఒసంగుడు. శ్రోత్ర శక్తిని నాకు ఒసంగుడు. మనశక్తిని నాకు ఒసంగుడు. వాక్శక్తిని నాకు ఒసంగుడు.  
అనువాకము 10 సమాప్తము.
అనువాకము11
1) ఒకటి సంఖ్యకు ప్రతీకయగు ప్రకృతి నా పట్ల ప్రసన్న మగును గాక. మూడుకు ప్రతీకయైన ఇచ్చ్ఛా క్రియా జ్ఞాన శక్తులు(సరస్వతి.లక్ష్మి,పార్వతి)నాయందు ప్రసన్నమగును గాక. ఐదుకు ప్రతీకలైన పంచ భూతమును నాయందు ప్రసన్నమగును గాక. జ్ఞానేంద్రియములు, మనస్సు బుద్ధి యను ఏడును నయందు ప్రసన్నమగును గాక. నవ దుర్గలు నాయందు ప్రసన్నమగును గాక. నవద్వారములు కపాల బిలము మరియు నాభి బిలము అను పదకొండును నాయందు ప్రసన్నమగును గాక. పది దిక్కులును త్రిమూర్తులును నాయందు ప్రసన్నమగును గాక. శ్రోత్రాది పదులాలుగు నాడులు, సుషుమ్నాడి నాయందు ప్రసన్నమగును గాక. దశేంద్రియములును వాటికి తోడుగా ఉన్న సప్త ధాతువులును నాయందు ప్రసన్నమగును గాక. నవదశ ఓషధులును నాయందు ప్రసన్నమగును గాక. 
2) మనో జ్ఞాన కర్మేంద్రియమును (11) పంచ తన్మాత్రలు(5) పంచ భూతములు (5) అను 21 జీవ తత్వములకు చెందిన మర్మములువైద్య శాస్త్ర ప్రసిద్ధమైనవి నాకు అనుకూలముగానుండును గాక. జ్వరము మొదలుగా గల 23 రోగములు నాయందు ప్రసన్నమగును గాక. అప్సరాదులు 25 మందియు నా యందు ప్రసన్నమగుదురు గాక. చిత్రసేనాది 27 మంది గంధర్వులు నాయందు ప్రసన్నమగుదురు గాక. కృత్యాది విద్యుద్దేవతలు 29 మందీ నాయందు ప్రసన్నమగుదురు గాక. ఊర్ధ్వ లోకములు 7 అధో లోకములు 7వైకుంఠ, రాధా లోక, గోలోక, మణిద్వీప, మహాకాలపుర,శివపుర, గణేశ లోకములను ఉపస్వరగములు అను 7 అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ అవంతిక, ద్వారావతి యను 7 భూస్వర్గములును, కైలాస, మానస, మేరు వను 3 ఈ మొత్తము 31 నాయందు ప్రసన్నమగును గాక.   వసువులు 8మంది,రుద్రులు11 మంది, ఆదిత్యులు 12 మంది, అస్వినీ దేవతలు2, (ప్రజాపతి) యను 33 మంది దేవతలు నాయందు ప్రసన్నమగుదురుగాక.
3) ధర్మార్థకామమోక్ష అను 4 విద్యలు నాయందు పేసన్నమగును గాక. అష్టవిధ ప్రకృతులు నాయందు ప్రసన్నమగును గాక. శిక్షాది వేదాంగములు 6 ను, ధర్మ శాస్రాదులు 6ను, ఈ మొత్తము 12 నాయందు ప్రసన్నమగును గాక.  దూర శ్రవణ దూర దర్శన విద్య1. జ్ఞానేంద్రియములకు చెందిన సిద్ధి విద్యలు5.కర్మేంద్రియములకు చెందిన సిద్ధివిద్యలు5. స్థాపత్య వేద సిద్ది1.ఫర్జన్య సిద్ధి1. జ్యోతిర్విద్య1. ఆయుర్విద్య1. పరోక్ష బ్రహ్మ విద్య1.
ఈ 16 నాయందు ప్రసన్నమగును గాక.  పంచ భూతములు సూక్ష్మ రూపముచే5 స్థూలరూపముచే5.  శబ్దస్పర్శాది విషయములు స్థూలము5 సూక్ష్మము5 ఈ20 నాయందు ప్రసన్నమగును గాక. పంచ భూతములు, శబ్దస్పర్శాదులు5 జ్ఞాన కర్మేంద్రియములు10 మనోబుద్ధి చిత్త అహంకారములు4 .ఈ 24 నాయందు ప్రసన్నమగును గాక. ఆవు, మేక మున్నగు భేదములతో 28 విధములగు సృష్టి నాయందు ప్రసన్నమగునుగాక. దేవసృష్టివిధములు 8 స్థావర సృష్టి విధములు 6 కౌమార మానస సృష్టి విధములు 2 జ్ఞాన కర్మేంరియ సృష్టి విధములు 10 అహంకార సృష్టి విధములు 3. సత్వ రజస్తమోగుణసృష్టి విధములు 3 ఈ 32 నాయందు ప్రసన్నమగును గాక. 36 అక్షరములు గల బృహతీ ఛందస్సు నాయందు ప్రసన్నమగును గాక. 40 అక్షరములు గల పంక్తి ఛందము నాయందు ప్రసన్నమగును గాక. 44అక్షరములు గల త్రిష్టుప్ ఛందము నాయందు ప్రసన్నమగును గాక.  48 అక్షరములు గల జగతీ ఛందము నాయందు ప్రసన్నమగ్ను గాక. 
4) అన్నమును, ఉత్పత్తియును, మరల మరల ఉత్పత్తియును, భోగాది విషయకమైన సంకల్పమును, భోగాది సంకల్పము కలుగుటకు కారకుఁడైన ఆదిత్యుఁడును, ఆకాశమును, విశేషముగనంతటను వ్యాపించు ఆకాశమున సంభవించునదియును, అంతమున జనించునదియును, అంతమందున్నదియును, భువనమున ఉండునదియును, జగదాత్మకమును, అధిష్ఠించి పాలించు రాజును, నాకు సంభవించును గాక. 
అనువాకము 11సమాప్తము.
చమక భావము -  సంపూర్ణము. 
దేవతల నాహ్వానించు గోరూపిణి యగు ఇడ, మనువు మంత్రము రూపముగా గల వాగ్దేవి యగు యజ్ఞని, బ్రహ్మ, బృహస్పతి, ఉక్తామద(కర్మ జన్య సుఖములు)ప్రతిపాదియు, ప్రశంసించు వాడును అగు పరమేశ్వరుఁడు, పూర్వోక్త దేవతా సహితులై యున్న విశ్వేదేవులును, నన్ను హింసింపకుందురు గాక. అటులనే ఓ పృథ్వీ! నీవు తల్లివై రక్షింతువు గాక. నన్ను హింసింపకుందువు గాక. మాచే చేయదగు పని యేమి? అని చింతించెదరేని చెప్పెదను వినుండు.  నేను మీ మధు రూపమును మనసారా చింతించు చున్నాను. స్తోత్రమును మధురమైనదిగా జనింప జేయ గలను. స్వయముగా మధుర వచనమునే పలుక గలను. మాధుర్యముకల హవిర్యుక్తమైన వాక్కులనే పలుక యత్నింప గలను. కర్మాభిమానులైన మీ ముందువినదగు యదార్థమునే పలుక యత్నింతును.  మృషావాక్యములు పలుకనొల్లను. యథోక్తము నాచరించు నన్ను దేవతలు రక్షింతురు గాక. ఈ లోకమున కీర్త్యాదులచే శోభిల్లునట్టి పితరులును నన్ను ఆమోదింతురు గాక. 
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.   
జైహింద్.
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

చాలా సంతోషమండీ..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమకారములు
" అర్ధముతో వినినంతనె పరమార్ధము పొందగలము రుద్ర నమక చమకము లందున్
ధన్యోస్మి "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.