గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జూన్ 2015, సోమవారం

పరమ ప్రయోజనకర శ్రీసూక్త రహస్యార్ధము

జైశ్రీరామ్.
శ్రీసూక్త రహస్యార్ధము
వేదముల యందు మహా శక్తి వంతమయిన మంత్రములలో పురుష సూక్తము,  శ్రీ సూక్తము, నారాయణ సూక్తము, దుర్గా సూక్తము మొదలగునవి వేదమునకు శిరస్సు వంటివి.  వేదము అంటే జ్ఞానము, జ్ఞానమంటే వెలుగు, వెలుగు అంటే ఆనందము,   ఆనందమే శ్రీమహాలక్ష్మి. వేద స్వరూపిణి, వేద మాత అయిన శ్రీమహాలక్ష్మి యొక్క మంత్ర౦, వేదాన్తర్గతమైన శ్రీసూక్తము, సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము.
శ్రీ సూక్తము యొక్క విశేష ప్రాశస్త్యము గురించి ఇప్పుడు మనము చర్చించుకొనెదము.
జీవుల పుట్టుకకు కారణమైన ప్రకృతి పురుషులలో ప్రకృతి స్వరూపిణి యైన జగన్మాతయగు శ్రీ మహాలక్ష్మిని ఉపాసించు మంత్రమే శ్రీ సూక్తము. ముగ్గురమ్మలలో ఒకరైన శ్రీదేవి  ఈ సూక్తమునకు అధిష్టాన దేవత. పదిహేను ఋక్కులతో, పదిహేను వేదమంత్రములతో శ్రీ మహాలక్ష్మి కీర్తింప బడినది. పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు గల 15 రోజులలో, 15 కళలతో, రోజుకు ఒక్కో కళ చొప్పున వృద్ది చెందుతూ పౌర్ణమి నాటి చంద్ర బింబములో షోడశిగా వెలుగొందే జగన్మాత యొక్క చంద్ర కళకు రహస్య సంకేతమిది.  గురుముఖత: నేర్చుకొని, స్వరయుక్తముగా సామాన్యుడు సహితము ఈ సూక్తమును ఉపాసించ వచ్చును.
దారిద్ర్య నాశనము కొఱకు, దుఖ నాశనము కొఱకు, కష్టములు తొలుగుట కొరకు, అన్న వస్త్రములు సమృద్ధిగా ఉండుట కొఱకు, సౌఖ్యము, సౌభాగ్యము, సౌందర్యము కొఱకు ఈ ఉపాసన చేయవచ్చును. అష్ట్యైశ్వర్య సిద్ధి, అధికార ప్రాప్తి, మహా భాగ్యము, భోగము, ఆనందము, సుఖ సంతోషముల కొఱకు, శాంతి కొఱకు, సత్సంతానము, వంశాభి వృద్ధి, మోక్ష ప్రాప్తి కొఱకు ఈ శ్రీ సూక్త పఠనము చేయుట చాలా చాలా ఉత్తమము.
వేదములను, మంత్ర శాస్త్రములను ఔపోసన పట్టిన వారికి మాత్రమే, నిగూడార్ధముతో ఉన్న ఈ మంత్ర సూక్తము యొక్క రహస్యములు తెలియును.  ఐదు వందల సంవత్సరములకు పూర్వము శ్రీ విద్యారణ్య మహా స్వామి శ్రీసూక్త రహస్యార్ధములను తమ భాష్యములో చాలా వివరముగా తెలిపి వున్నారు. భక్తీ, గౌరవములతో శ్రీసూక్త ఉపాసనా మంత్ర రహస్యములను తెలుసుకొనవలెనని, ఆసక్తి కలిగిన వారు ఇది పఠి౦చి సకల భోగ భాగ్యములను, ఆనందములను  పొందగలరని ఆశింతుము. సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము ఈ శ్రీసూక్తం. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. శ్రీసూక్తంతో అమ్మ వారికి  అభిషేకము చేయుట లోకాచారము.
1. హిరణ్య వర్ణాం హరిణీ౦ సువర్ణ రజతస్రజాం!
   చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా!!
బంగారు వర్ణముతో మెఱయుచు అష్ట్యైశ్వర్యము లను ప్రసాదించునది, హ్రీంకారము కలిగినది, విష్ణువును కలిగినది, సూర్య మరియు చంద్ర నాడులను మెడయందు హారములుగా కలిగినది, చంద్ర సహోదరి, నారాయణ శక్తి అయిన శ్రీ దేవి నన్ను ఆవహించు గాక.
౨. తాం మ ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం |
   యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషా నాహమ్ ||
యజ్ఞ సంపదల నిచ్చు ఓ అగ్నిహోత్రుడా, అష్ట్యైశ్వర్యములను, సిరి సంపదలను, కామధేనువును, మంది మార్బలము, బంధు మిత్ర పరివారమును ప్రసాదించుము. ఏ సమయములయందును మమ్ములను విడువకుండా ఉండునట్లుగా ఆ శ్రీ దేవిని మా యందు ఆవాహన చేయుము.
౩. అశ్వపూర్వా౦ రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ |
   శ్రియం దేవీ ముపహ్వాయే శ్రీర్మాదేవీ జుషతామ్ |
ఇచ్చట అశ్వములనగా ఇంద్రియములు, రథమధ్యాం అనగా రథమనేడి శరీర మధ్యమున అనగా మనస్సునందు ఆసీనురాలైన సామ్రాజ్యలక్ష్మీ, గజముల ఘీంకారముతో మేలుకొనెడి ఆ శ్రీ దేవిని శ్రద్ధాభక్తులతో పూజించు చున్నాను. మాతృమూర్తి అయిన ఆ దేవి నన్ను ప్రేమతో  అనుగ్రహించు గాక.
ఈ శ్లోకము ప్రతి దినము సహస్రం చేసిన అధికారం దక్కుటయే గాక, ఎల్లకాలం నిలబడుతుందని దుర్గా కల్పము నందు తెలుపబడినది.
౪. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం,          
     పద్మేస్థితాం పద్మ వర్ణాం తామిహోపహ్వాయే శ్రియం ||
బంగారు వర్ణముతో తయారయిన ప్రాకారమునందు నివసించెడిది, జీవుల మనస్సులయందు ఆర్ద్రతను కలిగించునది, అన్ని కోర్కెలను తీర్చి, జీవులకు తృప్తిని కలిగించునది, పద్మము నందు ఆసీనురాలై యుండెడిది, పద్మము వంటి వర్ణముతో ప్రకాశించునది అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని   శ్రద్ధా భక్తులతో ఆశ్రయించుచున్నాను.
ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ పఠి౦చుచున్న శ్రీ దేవి యొక్క కృపఁ గలిగి, సమస్త కోరికలు తీరి, జీవితమును సంపూర్ణ ఆనందముతో అనుభవించ గలరు.
౫. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం,  శ్రియం లోకే దేవ జుష్టాము దారాం
   తాం పద్మినిమీం శరణ మహం ప్రపద్యే అలక్ష్మీర్యే నశ్యతాం త్వాం వృణే ||
చంద్రుని వోలె ప్రకాశించునది, ప్రకృతి యందు విలీనమైనది, తెల్లటి యశస్సు చేత నలుదిక్కులు ప్రకాశించునది, కుండలినీ శక్తిని హృదయ పద్మము నందు వికసింప చేయునది, “ఈ౦” అను బీజాక్షరము చేత ద్యానింప బడునది, దారిద్ర్య దేవతను తరిమివేసి, అష్ట్యైశ్వర్యము లను సిద్ధింప జేయునది అయిన ఆ శ్రీ దేవిని అహం విడిచి శరణు జొచ్చుచున్నాను.
ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న అమ్మ అనుగ్రహముతో అఖండ సంపదలు ప్రాప్తించును.
౬. ఆదిత్య వర్ణే తపసోజ్ధిజాతో వనస్పతిస్తవ వృక్షోజ్ధ బిల్వః
   తస్య ఫలాని తపసానుదంతు బాహ్యాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ: ||
సూర్య భగవానునితో సమానమైన తేజస్సుతో ప్రకాశించు శ్రీదేవిని, శ్రీ మహాలక్ష్మి అధిష్టాన దేవతగా ఉండేడి బిల్వ వృక్షము క్రింద తపమాచరించు మహాలక్ష్మి యంత్రమునకు పూజలు చేసి మారేడు ఫల సమిధులతో పూర్ణాహుతి చేసిన,  ఆ శ్రీదేవి లోపల, బయట వుండే మాయను పూర్తిగా తోలగించి, జీవుని ఆవహించిన దారిద్ర్యమును నశింప చేయును.
ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న, జన్మ జన్మల దారిద్ర్యము కూడా నశించును.
౭. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
   ప్రాదూర్భూతోజ్స్మి రాష్ట్రే జ్స్మిన్ కీర్తి మృద్ధి౦ దధాతు మే ||
యక్షులకు అధిపతి, అనంతమైన సంపదలు నిచ్చునది కుబేర మంత్రము, అఖండమైన యశస్సును ఇచ్చేడి చింతామణి మంత్రమును రెండింటితో పాటు ఈ ఏడవ శ్లోకమును జపించిన శ్రీ దేవి మర్త్య లోకమున లేదా జీవుని శరీరము నందు సంపూర్ణారోగ్యము కలిగింప చేసి, అష్ట్యైశ్వర్యములను, కీర్తిని పెంపొందించును గాక.

ఈ శ్లోకమును భక్తితో 44 లక్షల జపము చేసి పూర్ణాహుతి చేసిన వారికీ దారిద్ర్యము నశించి, సంపూర్ణారోగ్యము,   అష్ట్యైశ్వర్యములు కలుగును.
౮. క్షుత్పిపాసా మలాం జ్యేష్టా౦ అలక్ష్మీర్ నాశయామ్యహం
   అభూతి మ సమృద్ధి౦చ సర్వాన్ నిర్ణుద, మే గృహాత్ ||
అలక్ష్మి దేవి, గృహమనేడి శరీరమును ఆవహించిన దారిద్ర్యమును కలుగ చేయును. జ్యేష్టా దేవి ఆవహించిన ఆకలి, అతినిద్ర, దప్పిక, ఆశుభ్రతను కలిగించు బద్ధకము వంటివన్నీ శరీరము యందు కలుగ చేయును, వీటి ఫలితముగా దారిద్ర్యమును అరిష్టములు సంభ విన్చును. కావున ఈ శ్లోకమును పఠి౦చిన ఇటువంటి దారిద్ర్యము అరిష్టము లన్నింటిని శ్రీదేవి నశింపచేసి సౌభాగ్య లక్ష్మిని వాని యందు ఆవహింపజేయును.
పై శ్లోకమును ప్రతి నిత్యమూ 108 పర్యాయములు జపించు చున్న ఆ దేవి కృపచే అలక్ష్మి, జ్యేష్టా దేవి ఇరువురు ఆ సాధకుని నుంచి అతి దూరముగా తొలగి పోవును.
౯. గంధద్వారా౦ దురాధర్షా౦ నిత్యపుష్టాం కరీషిణీ౦
   ఈశ్వరీం సర్వ భూతానాం తామిహోపహ్వాయే శ్రియం ||
పంచ ప్రాణముల యందు ముఖ్యమైన ప్రాణము శ్వాస యందుండును. అటువంటి ప్రాణము, ప్రాణాయామము చేయుటకు, ఉపాసించుటకు, వీలును కల్పించుతున్న ఆత్మ స్వరూపిణి, అనురాగవర్షిణీ, మాతృ స్వరూపిణి, ఈశ్వర శక్తి అయిన శ్రీదేవిని గోమయం తో అలికిన ప్రాంతము నందు ఆసీనులై ఆరాధించిన వారి యందు ధాన్య లక్ష్మిని ఆవహింప జేసి ధన, ధన్య, పశు సమృద్ధిని ప్రాప్తింప జేయును.
ఈ శ్లోకము 5000 పర్యాయములు జపము చేసి దశాంశము హోమ తర్పణము గావించి అన్న దానము శక్తి కొలది గావించిన మంత్రం సిద్దియగును. శ్వాశ మీద జయము కలిగి లక్ష్మీ కటాక్షము కలుగును.
౧౦. మనసః కామమా కూతిం వాచః సత్యమశీమహి
    పశూనాం రూపమన్నస్యమయి శ్రీ: శ్రయతాం యశః ||
మనస్సునందుండు కోరికలు, యిష్టములు సిద్దించుట, వాక్సిద్ధి మరియు అన్న వస్త్ర గో సంపద, రూప సంపద, లక్ష్మీ సంపదలను ఎల్లప్పుడూ నా యందు స్థిరముగా ఉంచమని శ్రీలక్ష్మీ దేవిని భక్తీ తో ఆశ్రయించు చున్నాను.
ఈ శ్లోకమును దీక్షతో మనస్సును, వాక్కును పవిత్రముగా నుంచి 8 లక్షల సార్లు జపించిన అనంతరం ప్రతినిత్యం 108 సార్లు జపించు చున్న భోగ భాగ్యములు, అన్న వస్త్రములు, గో సంపద, పాడి పంటలు అభివృద్ధి చెంది వాక్ సిద్ధి  కలుగును.
౧౧. కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
    శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ||
కర్దమ మహర్షి కోరికపై స్వయముగా లక్ష్మీ దేవి ఆయన కూమార్తేయై జన్మించినది. సర్వ జగత్తుకు మాతృమూర్తి అయినది, శరీరము నందలి మూలాధార పద్మము మొదలుకొని సహస్రార దళ కమలముల వరకు వెన్నును దండము వలే ధరించునట్టి, శ్రీ మహాలక్ష్మి నా వంశమునందు స్థిరముగా నివాసమును ఏర్పరచు కొనవలెను.
ఈ శ్లోకమును దీక్షతో లక్ష సార్లు జపించిన వారికి, సంతానముతో బాటు అష్ట్యైశ్వర్యములు కలుగును.
౧౨. ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే
    నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే ||
సృష్టికి కారణమైన మన్మధుడు లక్ష్మీ దేవి పుత్రుడు. మాయ అయిన ఈ సంసార బంధములను, ఆ కామ దేవునిని జయంచ వలెనన్న నారాయణ శక్తి యగు నారాయణిని ప్రార్ధించి, ఆమె అనుగ్రహము పొంది మోక్షము పొంద వచ్చును. ఇంకను జగన్మాత స్వరూపిణి అయిన ఆ మహాలక్ష్మిని మా వంశాభి వృద్ధిని చేయమని సదా ప్రార్ధన చేయు చున్నాను.
మారేడు చెట్టు క్రింద 64,000 జపము చేసి, అన్నదానము చేసిన ఈ మంత్ర సిద్ధి కలిగి వంశాభి వృద్ధి కలిగి అమ్మ స్థిర నివాసము ఏర్పరుచు కొనును.
౧౩. ఆర్ద్రాం పుష్కరిణీ౦ పుష్టిం పింగళా౦ పద్మ మాలినీం
    చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||
బంగారు వర్ణముతో మెరయుచున్న ఇడ పింగల నాడులు అనగా సూర్య చంద్ర నాడులను ధరించి కుండలినీ  శక్తిని మేల్కొలిపినందు వలన కలిగిన అపరితమైన ఆనందముచే కలిగిన ఆర్ధ్రతచే వచ్చిన కన్నుల యందు నీటితో తడిసినది, అన్న వస్త్రములను భక్తులకు ఇచ్చునటువంటి ఆ మహా తల్లి నన్ను ఆవహించుగాక.
౧౪. ఆర్ద్రాం యః కారిణీ౦ యష్టీం సువర్ణాం హేమమాలినీం
    సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||
ఆర్ద్రత చే కన్నుల యందు నీటితో తడిచినది, బ్రహ్మ దండము అనే మేరు దండమును కలిగి వుండి, అధర్మము వైపు వేడలుచున్న వారిని దండిన్చునది, బంగారు రంగు చ్చాయతో బంగారు వర్ణము కలిగిన పాదములతో సూర్యనాడి కలిగినది అగు ఆ శ్రీ మహాలక్ష్మి నన్ను ఆవహించుగాక.
౧౫. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
    యాస్యాం హిరణ్యం ప్రభూతం గావో, దాస్యో అశ్వాన్ విన్దేయం పురుషానహం ||
యజ్ఞముచే సంపదలు నిచ్చు ఓ అగ్నిహోత్రుడా ఎవరిచే బంగారము విశేషముగా ఉద్భవించినదో, గోవులు, అశ్వములు వంటి సంపదలు, దాసీ జనములు, పుత్ర, పౌత్ర బంధు మిత్ర, పరివారములను ఇచ్చును. అట్టి శ్రీ మహాలక్ష్మీ దేవి మా యందు ఎల్లప్పుడూ ఆవహించి మోక్షమును ప్రాసాదించుగాక.
ఈ మంత్రమును ప్రతి దినము జపించిన ఆరోగ్య, ప్రతిష్ట, కీర్తి, ఐశ్వర్యములు ప్రాప్తించును.
౧౬. యః శుచి: ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్వహం
    శ్రియః పంచ దశర్చ౦చ శ్రీ కామః సతతం జపేత్  ||
సాధకుడు ఏకాగ్రతతో ఇంద్రియములను జయించి బాహ్య అన్త్ర్యములను శుచితో నుంచుకొని ప్రతి నిత్యమూ ఆవు నేతితో అగ్ని హోత్రములో పై 15 ఋక్కులతో  ఆహుతులను వేసి యజ్ఞమును నిర్వహించ వలెను.
లేదా 15 ఋక్కులతో  15 రోజులు అఖండ పారాయణ చేసిన వారికి సర్వ కార్య సిద్ది కలుగును.
శ్రీ మహాలక్ష్మి సాధనకు అత్యంత విశిష్టమైన మంత్రములు ౧. కనకధారాస్తవము, ౨. శ్రీసూక్తము. ప్రతి నిత్యం నారాయణ సహిత శ్రీమహాలక్ష్మి దేవి యొక్క ఈ మంత్రములను పారాయణ గావించిన వారికి భగవదానుగ్రహము కలిగి మోక్ష ప్రాప్తి లభించును.
విద్య అంటే జ్ఞానము. జ్ఞానము అంటే గంగ లాంటిది. అది ఎప్పుడూ ప్రవహిస్తూనే వుండాలి గాని, అది నిలిచి పోకూడదు. నిలిస్తే నీరు పాడౌవుతుంది. ఈ జ్ఞాన గంగ ఏ ఒక్కరి సోత్తో కాదు, ఇది అందరిది మన అందరిది. దీనిని గోప్యముగా ఉంచ కుండా అందరికీ అందు బాటలోకి తీసుకొని రావాలనే మన మహర్షులు ఎంతో తాపత్రయ పడినారు. అర్హత కలిగిన వారు అందరూ ఈ విద్యను అభ్యసిస్తూ ముందుకు కదిలి ఆ జగన్మాత పాదములు పట్టుకో గలరని రాబోయే శ్రావణ మాసపు పర్వ దినములలో అందరూ శ్రీహరితో గూడిన శ్రీమహాలక్ష్మీని  సాధన చేసి అమ్మ అనుగ్రహమును పొంది, అష్ట్యైశ్వర్యములు బడసి, ఆనందముతో, సుఖ సంతోషములతో పిల్లా పాలలతో తరించేదరని ఆశిస్తూ, అందరూ సుఖముగా వుండాలని కోరుకొంటూ,   అతి సులభుడు శ్రీ వరదుడు. కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తుంది అమ్మ శ్రీమహాలక్ష్మి.
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియాం ||
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీసూక్తము యొక్క ప్రాసస్త్యమును వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.