జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు.
ఈ రోజు సాహితీ సమితి - శేరిలింగంపల్లి శాఖవారు నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమం నిస్సందేహంగా బాగా జరిగిందని చెప్పుకొనవచ్చును.
కవి సమ్మేళనమునకు ముందు సాహితీ సభ జరిపి అందు పాల్గొనినసభాధ్యక్షులు శ్రీ ఆర్.రామచంద్రరావు, ముఖ్య అతిథి శ్రీ బిజ్జం వేంకటేశ్వర రెడ్డి, విశిష్ట అతిథి డా.చంద్రభూషణ రావు, వక్త శ్రీవడ్లూరి ఆంజనేయ రాజు, సంయోజకులు శ్రీ బీ.సత్యనారాయణరెడ్డి, వారి వారి ప్రసంగాలతో శ్రోతల హృదయాలను ఆకట్టుకొన్నారు.
తదుపరి కవిసమ్మేళనమునకు కవితిలక, భారత్ భాషా భూషణ్, సాహిత్య రత్న డా. తిరునగరి , సభాధ్యక్షులుగా వ్యవహరించారు.
కవులు ఒక్కరొక్కరుగా తమ కవనపటిమకు అద్దం పట్టుతూ కవితా గానం చేశారు.
అధ్యక్షులు ప్రతీ కవి యొక్క కవనమును తన భావనా నైపుణ్యంతో అత్యద్భుతమైన సాహితీ కోణంలో చూపించి ప్రతీ కవికీ ప్రత్యేక గౌరవాన్ని ఇనుమడింపజేశారు. నండూరి కృష్ణమాచార్యులవారి సుపుత్రులు శ్రీ నండూరి శోభనాద్రి గారు కూడా సభలో మాటాడి సభను రంజింపజేశారు. సాహితీ సమితి వారు కవులందరినీ ఉచిత రీతిని సత్కరించారు. కవులకు చక్కని గౌరవమును ఇనుమడింప జేసే చక్కని ఈ కార్యక్రమమును నిర్వహించిన శేరిలింగంపల్లి సాహితీ సమితివారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను.
అక్కడ సభలో నేను చదివినపద్యాలను మీ ముందుంచుతున్నాను.
మాతృభాష మనుగడ - కవి పాత్ర
రచన :- చింతా రామ కృష్ణా రావు
ఉ:-
శ్రీ సుమ పేశ లాన్విత విశేష పదజ్ఞులు, జాను తెల్గు స
ద్భాషణ భూషణుల్, మధుర వాఙ్మయ స్రష్టలు, గౌరవార్హులై
యీ సభనొప్పి యుండుదురనేకులు సత్కవి పండితుల్,సద
భ్యాస పరుల్,మహాత్ములును,భక్తిగనందరికంజలించెదన్.1.
శా:-
కాలం బింతనెఱుంగు నాడు ఘన సంస్కారాన్వితోద్భాగ్య స
మ్మేళంబై వెలుగొందినట్టి తెలుగున్.దీనంబుగా నేడు తా
బేలై రక్షణచేయుఁ డంచునిలిచెన్
భీతిన్ సుధా మాధురుల్
గ్రోలం జేసిన యాంధ్ర మాత. సుగతింగోల్పోయె
నే డీగతిన్.2.
ఆ.వె.:-
మాతృ గర్భ ముక్త మణి హార మగు కవి
మాతృ భాష నిలను మనుపు నతఁడు
మార్గ దర్శి యతఁడు మహనీయ
వరులకు.
మనుజ వరుల లోన మహితుఁ డతఁడు. 3.
చ:-
సుకవికలంబుచేసుధలు శోభిలఁ జేయఁగ చింద మాతృభా
షకు జవజీవముల్ కలుగు. సద్గతిభాషకుసత్కవీంద్రులే.
సకల జనంబు నేర్వ దగు
చక్కని తేలిక పాటి మాటలన్
చక చక వేసి పద్యములు చక్కగ వ్రాసిన . . . తెల్గు వెల్గదే? 4.
గీ:-
తెలుగు భాషను గల తీపి తెలుప వలయు.
తెలుగు సామెత లెల్లెడ తెలుప వలయు.
తలుగు ఛందపు రీతులు తెలుప
వలయు.
తెలుగు బంధ కవిత్వము తెలుప వలయు. 5.
ఆ.వె.:-
తెలుగులోన పలికి, తెలుగు మాటాడించి,
తెలుగు ఘనత నెన్ని తెలుప వలయు.
తెలుగు భాష మనకు తేనె వాగని చెప్పి ,
తెలియ పరచ వలయు తెలుగు వెలుగ. 6.
చతుర్విధ కంద – గీత గర్భ చంపక మాల :-
మనతెలుగేభువిన్సుగుణమాన్యులుమెచ్చఁగ
శోభఁగాంచునూ
తనకళలన్గొనున్.తెలుగుతమ్ములునన్నలుతృప్తిఁజెందుభూ
జనగళమున్సదాధ్వనిగసత్యలసద్వరభాషయౌను.ధా
రణ విలువన్ గనున్ కవులు భ్రాంతిలఁ జేసెడి
కావ్య మాలతిన్ 7
1వ క.
:-
తెలుగే భువిన్ సుగుణ మా
న్యులు మెచ్చఁగ శొభఁ గాంచు నూతన కళలన్
గళమున్ సదా ధ్వనిగ స
త్య లసద్వర భాష యౌను ధారణ విలువన్ .
2వ క.
:-
గళమున్ సదా ధ్వనిగ స
త్య లసద్వర భాష యౌను ధారణ విలువన్
తెలుగే భువిన్ సుగుణ
మా
న్యులు మెచ్చఁగ శొభఁ గాంచు నూతన కళలన్ .
3వ క.
:-
కళలన్ గొనున్ తెలుగు త
మ్ములు నన్నలు తృప్తిఁ జెందు. భూజన గళమున్
విలువన్ గనున్ కవులు భ్రాం
తిలఁ జేసెడి కావ్య మాలతిన్ మన తెలుగే.
4వ క.
:-
విలువన్ గనున్ కవులు భ్రాం
తిలఁ జేసెడి కావ్య మాలతిన్ మన తెలుగే
కళలన్ గొనున్ తెలుగు
త
మ్ములు నన్నలు తృప్తిఁ జెందు. భూజన గళమున్ ,
గీ.: -
సుగుణ మాన్యులు మెచ్చఁగ శొభఁ గాంచు
తెలుగు తమ్ములు నన్నలు తృప్తిఁ జెందు.
ధ్వనిగ సత్య లసద్వర భాష
యౌను
కవులు భ్రాంతిలఁ జేసెడి కావ్యమాల .
చ:-
సదమల సంస్కృతంబు సరి చక్కని తెల్గు కనంగ. పద్యముల్
ముదము దలిర్ప వ్రాసి కడు ముచ్చటతో పఠియింప జేయుచున్
మధుమయ భావనాగరిమ మాన్యులు మెచ్చగ చూపి, సత్కవుల్
విధి కృత తెల్గు భాషనిక వేల్పుల భాషగ మార్చగావలెన్ 8
అశ్వధాటి:-
జీవంబుతో ఘన విభావంబుతో మృదుల రావంబుతో తెలుగిలన్
నీవారలిచ్చిరిది నీవారసత్వమిది. నీవర్ధనంబగునిదే.
నీవాఙ్మయోజ్వలిత భావ ప్రపూర్ణమిది, నీవాక్సుతేజస మిదే.
దేవాది దేవులును భావించి నేర్తురిది. నీవేల నేర్చుకొనవో?9
క:-
తెలుగును విడువక చదువుఁడు.
వెలుగుల గని తెలుగు. తెలుగు వెలుగయి నిలుడీ.
తెలుగునఁ గల పలుకుబడులు
తెలుగు జనులు పలుకు నటుల తెలుపుడు సతమున్.10.
గీ:-
జయము కలుగుత తెలుగును చదువ మనకు.
వివిధ గతులను తెలుగిల వెలుగు సతము.
కవిత లొలికెడి కలములఁ గలుగు జయము
జయము సుకవుల జగతికి జయము జయము.11.
స్వస్తి.
చూచారుకదండీ!
మీరూ ఈ అంశమును స్వీకరించి మీ కవితా పటిమను ప్రదర్శించుతూ పద్య సుమాల మాలతో ఆంధ్రామృత భాండాన్ని అలంకరింప జేస్తారని ఆశిస్తున్నాను.
జైహింద్.