గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, సెప్టెంబర్ 2009, శనివారం

కంది శంకరయ్యగారిచ్చిన సమస్యలు - నాపూరణలు.

ప్రియ సాహితీ బంధువులారా! కొన్నిసమస్యలను, వాటికి సంబంధించిన పూరణలను మీ ముందుంచుతున్నాను.

రామకృష్ణారావు గారూ, సమస్యలను పంపమన్నారుగదా. ప్రస్తుతానికి నాలుగు ఆందిస్తున్నాను. చూడండి....అంటూ శ్రీ నంది శంకరయ్య గారు పంపిన సమస్యలు, వాటికి సంబంధించిన నా పూరణలు

ఇక చూడండి..

1) కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.
2) మాంసాహారమె శ్రేష్ఠమైనదనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.
3) రాజేడ్చెను రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.
4) నటులెవ్వరు లేని వింత నాటకమయ్యెన్.


1}

కోటులు సంపాదించెను.
వాటముగా దానినంత వారసుకిచ్చెన్
వాటా గొని, తరిమె నతడు.

కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.


2}
మాంసంబమ్ముచు నున్ననొక్కరుడు తా మాన్యుండయెన్. భుక్తికిన్

మాంసాహారము శ్రేష్టమైన దనుచున్. మాన్యుండయెన్ విప్రుడే.
హింసామార్గము జేరనీక ప్రజలన్ హేయంబుగాఁదెల్పుటన్
హింసామార్గమదేలగొంటి వకటా! హృద్యంబొకో? శంకరా?

3}
రాజూ, రాణీ, రాజ్యము,
రంజిలి, యాడంఁగ బోవ, "రాజ్యము" గెలిచెన్.
రాజూ రాణీ యోడిరి.

రాజేడ్చెను. రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.

4}
జటిలపు నాటకమును గొని
యెటులో తమలోన తామె యిది నడిపించెన్.
నటులౌదురె వారు? మహా

నటులెవ్వరు లేని వింత నాటక మయ్యెన్.

అవకాశముంటే మీరూ పూరించి పంపగలందులకు ఆశిస్తున్నాను.

జైహింద్.


Print this post

2 comments:

bharath చెప్పారు...

నమస్కారం రామకృష్ణ రావు గారు
పూరణ చాలా బాగుంది

నా సరదా కూడా కొంచెం తీర్చండి
ఈ కింది పదాల తో పద్యం కావాలి

ఒక్కొక్క లైన్ లో ఈ పదాలతో

రాజశేఖరుడు
హెలికాప్టర్ [లేక]లోహ విహంగం
నల్లమల అడవులు
పావురాల గుట్ట
regards
jayabharath

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మీ సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవదములు.
మీరిచ్చినది దత్త పది . విషయం చెప్పలేదు. ఐనా మిమ్మల్ని నిరాస పరచ కుండా పూరించుతున్నాను చూడంది.

విషయం:- రాజ శేఖరును చరమ యాత్ర.
సీ:-
రాజశేఖరుడు విరాజ మానముగను - రచ్చబండకు నేగె. రహిని వెడల
లోహవిహంగము సాహసంబున నేగ - మేఘమడ్డుగ వచ్చె మింటిపైన.
నల్లమలడవులు తెల్లబోవుచు చూచె. - పావురాయిల గుట్ట భయము నొందె.
కాల వాహిని వాని కబళింపగాఁ బూనె. - యేమి చెప్పగనగు నీశ్వరేచ్చ
గీ:-
గాలిలో నేగు యంత్రము నేలఁ గూలె.
జాడఁ గానుట కైనను సాధ్య పడని
భీకరంబైన యడవితో నేకమ్మయ్యె.
శేఖరుండేగె దివికిని చిత్రముగను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.