గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

శ్రీ వేపా భీమ శంకరం గారి దివ్య వ్యక్తిత్వము

-:చూపరము:-

రచన: శ్రీ జయంతి సుబ్బా రావు, అనకాపల్లి.
రచనా కాలము:- 1940.
విషయము:- శ్రీ వేపా భీమ శంకరం గారి మహోన్నత వ్యక్తిత్వ వివరణాత్మకము.
సందర్భము: శ్రీ భీమ శంకరం గారి సప్తతి పూర్తి మహోత్సవము.

సంక్షిప్తీకరణ:- చింతా రామ కృష్ణా రావు, విశ్రాంతాంధ్రోపన్యాసకుడు, చోడవరము.

-:శ్రీ వేపా భీమ శంకరం గారి దివ్య వ్యక్తిత్వము:-
* * * * *
జననము:- విభవ నామ సంవత్సర కార్తీక శుద్ధ 11 తత్కాల 12 అనగా తే : 17 - 10 - 1868.
తల్లి : నరసమ్మ. తండ్రి : శ్రీరాములు.. తాత : వెంకన్న. ముత్తాత : వేంకటరామావధానులు.
నివాసము : చోడవరము. 12 వ యేట ఉపనయనమయ్యెను.

పరోపకారి:- తీర్థాటనములు చేయుచు, తెలుగు విద్యార్థులకు రెండవపూట భోజన సదుపాయము స్వయముగా యత్నించి, కల్పించెను. పేద విప్రులకు లకు వివాహార్థము ధనసహాయము చేసెడివారు.
అనేక మందికి వివాహములు జరిపించిరి.
వీరికి మేన మామ యగు ఆకెళ్ళ జగన్నాధము గారి 2 వ కుమార్తె బాల కామేశ్వరమ్మతో నందన వత్సర మాఘ బహుళ పంచమి నాడు వివాహమయ్యెను.
వీరి కుమార్తె కు చిన్నతనముననే వివాహము కాగా భర్త గతించెను. తల్లి మరణింపగా తండ్రి సంరక్షణ చూచు కొనుచు, అతిథి సేవ చేసెడిది. 1917 లో ఆమె స్వర్గస్తురాలవగా ఆమె పేర వికలాంగుల ధర్మ సత్రవును భీమశంకరం గారు స్థాపించిరి.

ఉద్యోగము:-1894 లో వకీలు గుమస్తాగా విజయనగరంలోను,
పిదప చోడవరంలో పనిచేసిరి.ఈ ఉద్యోగము వారి భవిష్యత్ సత్కార్యాచరణకు ఎంతగనో తోడ్పడినవి.
పిదప ఏజన్సీ కోర్టు వకీలుగా, కోర్టు కమీషనరుగా పనిచేసిరి.
1921సం.లో గవరవరం,మాడుగుల ఖండములకు తాలూకాబోర్డుప్రతినిధి అయిరి.
సాంఘిక సేవలు:-1910 లో చోడవరం లో రక్షక భటుల భక్షణ ప్రారంభమయ్యెను.
వారి దుండగములను వెల్లడిస్తూ " గూఢ లేఖరి", మున్నగు పేర్లతో అనేక పత్రికలలో అనేక వ్యాసములు వ్రాసిరి.
తాలూకాబోర్డ్ ప్రతినిధిగా పెక్కు సేవలు చేసిరి.
పెక్కు చోట్ల దాహోదక వసతులు కల్పించిరి. భూముల దురాక్రమణకు వ్యతిరేకముగా పోరాడిరి.
వైద్య శాలలు, పాఠశాలలు, గ్రంథాలయములకొఱకు శ్రమించిరి.
వ్యవసాయము కిట్టక రైతులు వలసపోవుచుండుటతో భూములు బీడువారుతుండుటను గ్రహించి వ్యవసాయభివృద్ధికై కృషి చేసిరి.

పాఠశాలలు:- భక్తి, నీతి, సత్య శీలత, పంటలు పండించుటకనువగు జ్ఞానము నిచ్చుటకు రాత్రి పాఠశాలలు ఏర్పాటు కొఱకు పత్రికలలో వ్రాసిరి.

ఋణదాతలు ఋణ పిశాచులని, పత్రికలలో ఖండించిరి.
పరిశ్రమలు, వాణిజ్యములను గూర్చి పోరాడిరి.

ఆడువారికి విద్య:- ఆడువారికి విద్య యొక్క ఆవశ్యకత అత్యంత నిర్వివాదాంశమనుచు, విద్యా విషయమున
ఆడువారి కొఱకు చేయవలసిన మార్పులను సూచించిరి.
సన్మార్గ ప్రశంస, దుర్మార్గ సంస్కరణము:- నిరంతరము సన్మార్గ వర్తుల ప్రశంస, దుర్మార్గ సంస్కరణముల కొఱకు కృషి చేసిరి. మంచి వారిని ప్రశంసించుచు, సన్మాన పత్రములను కూడా వ్రాసి సభాముఖముగా యిచ్చెడి వారు. వీరు సాంఘిక సంస్కరణార్థము పత్రికలలో సుమారు 121 వ్యాసములను వ్రాసిరి. అందు
"భరత ఖండ విద్యా విధానము" ముఖ్యముగా చదువ దగినది.

వికలాంగుల ధర్మ సత్రము:- ఇతడు మానవ సేవయే మాధవ సేవగా నమ్మిన కర్మ యోగి. వికలాంగులకు అన్న దానము కొఱకు చందాలెత్తెడివారు. అనేక మంది సహకరించిరి.విజయ నగర మహారాజా వారి నుండి ఐదెకరముల భూమి ఇందు నిమిత్తము పొంద గలిగిరి. ఇప్పటికి సుమారు డబ్భై సంవత్సరాల క్రితము నాటికే ఆ సత్రవులో లక్షా ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్ఫైవొక్క మంది వికలాంగులు భుజించిరి. కన్ను, కాలు లేని, రాత్రులు రాలేని వికలాంగులకు ఆహారము ఇంటికే పంపెడివారు.
తన ధర్మపత్ని జ్ఞాపకార్థము తమ పెరటిలో "బాల కామేశ్వరమ్మ వికలాంగుల ధర్మ సత్ర భవనము" కట్టించిరి. హరిజన బాలురనేకమందికిది ఆధారమై యుండి, 1940 నాటికే నలుబదేండ్ల క్రితము నుండి నిరాఘాటముగా సాగినదీ సత్రవు.
"చోడవరము" నేటికినీ ఈ సత్రవే అనాథ శరణాలయమను పేర నిర్విఘ్నముగా కొనసాగుతూ అనేకమందికి జీవనాధారమై యున్నది.
వానప్రస్థము:- 1917 నుండి వీరు వానప్రస్థాశ్రమము స్వీకరించిరి. వీ్రేర్పాటు చేసిన హరిజన ఆశ్రమమే
వీరి నివాస స్థానము. వారికి ప్రాణికోటి సేవయే నిత్య దైవారాధన.

సప్తతి పూర్త్యుత్సవము:-వీరికి సప్తతిపూర్త్యుత్సవము అత్యంత భక్తి శ్రద్ధలతో, అబాల గోపాలము అత్యద్భుతముగా తే.22 - 6 - 1940 దీన నిర్వహించిరి.
ఆ సభలో వీరిని అందరూ పరోపకార పరాయణుడుగా, ప్రజా సేవక మణిగా, ఆర్త త్రతగా, హరిజన సేవకాగ్రణిగా, దేశాభిమానిగా, అతిథి పూజా దురంధరునిగా, సజ్జనోత్తమునిగా, ఇంకా పెక్కు విధములుగా సంబోధించి, ప్రశంసలతో ముంచెత్తిరి. భీమశంకరం గారు వారికందరికినీ, వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపిరి.

ఈ దివ్యుని సచ్చరిత్ర ఈ నాడు మనకందరికీ ఆదర్శము.
ఈతని చరిత ఏనాటికినీ ఆదర్శమే యనుటలో సందేహము లేదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.