గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2009, శనివారం

జగదంబ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు.


ఈ రోజు దుర్గాష్టమి. ఈ రోజూ, రేపూ, ఎల్లుండి,గొప్ప పర్వ దినాలు. మహాష్టమి, మహర్నవమి, మహా దశమి.
ఈ మూడురోజులూ దుర్గా మాత అందరి హృదయాలలోను కొలువై వుంటుంది.
అలా అందరి హృదయాలలోను కొలువైయున్న లోకమాతను మనం గ్రహించ గలగాలి. మనం చూస్తున్నది భౌతికమైన మానవులను అని అనుకొంటే మనకు రగద్వేషాలు చుట్టుముట్టుతాయి. మనం అందరిలోను ఆ లోకమాతయైన దుర్గాంబను చూడఁ గలిగితే నిరంతరము మనమా తల్లిని ధ్యానిస్తున్నట్టే ఔతుంది.

శ్లో:-
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా.
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.

గీ:-
యుక్తి నేతల్లి మనలోన శక్తి పేర
నుండి నిత్యంబు నలరారుచుండు, నట్టి
తల్లి దుర్గాంబ మది నెంచి తనివి తీర
నంజలించెద నామెకు నంజలింతు.

భావము:-
అన్ని ప్రాణులందును ఏ తల్లి శక్తి రూపములో నున్నదో అట్టి తల్లికి నేను త్రికరణ శుద్ధిగా నమస్కరించెదను.

అని మనం అందరిలోను మనకు కనిపించే లోక మాతను మనస్సులో ధ్యానించ గలగాలి. అప్పుడే మనం దౌష్ట్యాలకు దూరంగా వుంటాము. సత్ఫలితాలను పొంద గలుగుతాం.

దసరా సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆ లోక మాత కటాక్షములు మీకు సంప్రాప్తించాలని కోరుకొంటున్నాను.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.