గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సమస్య యేదైనా సమాధానం ఒక్కటే.

ప్రియ పాఠకులారా! నిన్ననే నేను మన ఆంధ్రామృతం ద్వారా కవులు పూరణ చేయు నిమిత్తం
వరినీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.
అనే సమస్య ఉంచాను. అంతే వెన్వెంటనే కంది శంకరయ్యగారి దృష్టి ఆ సమస్యపై పడింది.
అంతే భాగ్యనగర ప్రజల దాహార్తి యదార్థ దృశ్యానికి అద్దం పట్టుతూ, ముచ్చటగా మూడు పూరణలు చేసి పంపించారు. ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరే చూడండి.

1)
రమణీయోపవనోపశోభితము హైద్రాబాదులో నాపగో
త్తమమై నీటినొసంగినట్టి ముచికుందన్ నమ్ముకున్నన్ వృధా!
సుమతిన్ నాయకులేకలక్ష్యముగ నస్తోకాంబుసంపూర్ణ గా
త్రము గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

2)
ఆగెన్ హైదరబాదు వాసులకు నీళ్ళందించు సత్కార్యమే
యేగెన్ "మూసి" కృషించి, నీటికొఱకై యెన్నెన్ని కష్టంబులో
బాగైనట్టివి సత్వరంబుగను కాల్వల్ ద్రవ్వి తెప్పించు కృ
ష్ణా గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

3)నిజానికి మొదటగా రాసిన పద్యమిది. ఎందుకో తృప్తికరంగా లేదు.......
రమణీయోపవనాంతరస్థకుజరాడ్రక్షైకదీక్షావిలో
లమతుల్ సంతతరాజకీయకరణాలంకారు లొక్కింత లో
కము మెచ్చన్ పథకమ్ము లక్ష్యముగఁ గాల్వల్ దీసి రప్పించు కృ
ష్ణమ గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

సమస్య యేదైనా సమాధానం ఒక్కటే. అది - కంది శంకరయ్యగారిని అడగండం.

మీరూ యత్నించి పూరించే ప్రయత్నం చేయఁగలిగితే ధారణ పెరుగుతుందని నానమ్మకం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.