గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

నవ దుర్గలలో బ్రహ్మచారిణి.

శరన్నవ రాత్రులలో నేడు అమ్మవారు బ్రహ్మచారిణీ రూప ధారియై భక్తుల కోరికలు తీర్చనున్నారు.

బ్రహ్మచారిణీ రూప ప్రత్యేకతను తత్ భక్తుల కొనగూడు ఫలమును తెలుసుకొందాము.

క:

శ్రీకర నవ దుర్గలలో

ప్రాకటముగ బ్రహ్మ చర్య భద్రాకృతితో

లోకులఁ గావగ నేడు శు

భాకరమయి తోడు నిలిచె భవ్యోజ్వలయై.

సీ:-

తపమాచరించెడి తల్లి యీ జగదంబ - బ్రహ్మమున చరించు భక్తి తోడ.

కుడిచేతఁ జపమాల ఎడమ చేతను కమం - డలమునూనినభక్త సులభురాలు.

పరమేశు పతికాగ పరమతపముఁ జేసి - ఉమయను పేరొందె. కమల నేత్రి.

జ్యోతిర్మయాకృతి సోభిల్లు జగదంబ. - శుభములు గొలిపెడి యభవు రాణి.

గీ:-

భక్తులను, సిద్ధులను గాచు శక్తి యీమె.

బ్రహ్మ చారిణి కృపఁ గోరు భక్తులకును

దీక్ష, సిద్ధియు, విజయంబు, రక్ష గొలుపు.

బ్రహ్మ చారిణిఁ గొలువుడీ! భక్త జనులు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.