గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2009, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 59.

పాఠక పుంగవులారా! జన్మతః మనకున్న సంస్కారం కారణంగా మనం మంచి విషయాల్ని తప్పక ఆదరిస్తుంటాం. మంచిని గౌరవిస్తుంటాం. మంచి మాటలను గుర్తుంచుకోవడంతో పాటు సందర్భానుసారంగా మనం వాటిని తరచూ ప్రయోగిస్తుంటాం.
ఐతే మనకు ఒక్కొక్కమారు ఆ మంచి మాటలు సరిగా గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంటాం కూడా. ఔను కదా! ఐతే మనకెంత మంచి విషయం తెలిసినా సమయానికి గుర్తుకు రాకపోతే కర్ణుని అస్త్రాల్లాగా నిష్ఫలమే ఔతుంది కదా. అందుకే మనం కంఠస్థం చేయ గలిగిన నాడు అట్టి సమస్య ఉత్పన్నం కాదుకదా.
ఒక మహాకవి ఈ విషయంలో ఒక చక్కని శ్లోకం చెప్పాడు. పరిశీలిద్దామా?

శ్లో:-
కంఠస్థా యా భవేత్ విద్యా సా ప్రకాశ్యా సదా బుధైః.
పుస్తకే, పర హస్తేచ న సా విద్యా న తత్ ద్ధనం.

గీ:-
వినగ కంఠస్థమైనట్టి విద్య విద్య.
బుధులు వర్ధిల్లఁ గలుగు తత్ సుధను గలిగి.
పుస్తకమునున్న విద్య తో పొసఁగు నేమి?
పరుల నున్నట్టి ధనముతో ఫలమదేమి?

భావము:-
ఏ విద్య మనకు కంఠస్థమై యుంటుందో ఆ విద్యయే విద్య అనబడుతుంది. అట్టి విద్య వలన బుధులు ప్రకాశింతురు.
పుస్తకమునందుఁ గల విద్య వలన గాని, పరుల వద్ద గల ధనము వలన గాని మనకు ఏమి ప్రయోజనము కలుగును?

చాలా చక్కని విషయాలను తెలుసుకో గలిగాం కదండీ! ఐతే ఇంక మనం మనకు నచ్చిన మంచి విషయా లన్నిటినీ కంఠస్థం చేసెద్దామా మరి?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.