గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, సెప్టెంబర్ 2009, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 61.

"యథా రాజా తథా ప్రజా" అన్న నానుడి గల శ్లోకం మనం పూర్తిగా తెలుసుకొందాం. ముందుగా శ్లోకాన్ని, పిదప నా అనువాదాన్ని, ఆ తరువాత భావాన్ని, తెలిపే ప్రయత్నం చేస్తాను. గమనించండి.

శ్లో:-
రాజా రాక్షసశ్చైవ శార్దూలాః తత్ర మంత్రిణః.
గృద్రాశ్చ సేవకాః సర్వే యథా రాజా తథా ప్రజా.

గీ:-
రాజు రాక్షసుండైనచో రాజ్యమందు
మంత్రులందరు పులులట్లు మసలు నిజము.
సేవకులు గ్రద్దలటులుండు. చిత్రమదియె.
రాజ్యమందలి ప్రజలుండు రాజులటులె.

భావము:-
ప్రజా రంజకముగా పరిపాలన చేయ వలసిన రాజే రాక్షసుడిలా ప్రవర్తిస్తే అతని వద్ద నున్న మంత్రులు ప్రజల పాలిట పెద్ద పులులగుదురు. సేవకులు గ్రద్దలై ప్రజలను పీకుకు తిందురు. రాజ్యమునేలే రాజు ఎలా ఉంటే ఆ రాజ్యమునందలి ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు సుమా!

కావున రాజ్యాధికారము ప్రాప్తించిన రాజు అతి జాగరూకతతో సద్వర్తనుడై మెలగ వలెను. అప్పుడే మంత్రులు, సేవకులు చక్కగ నుందురని గ్రహించుకొని మసలుకొన వలెను.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.