గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2009, ఆదివారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 13

విశ్వనాధ వారి రామాయణ కల్ప వృక్షం లోని భావుకతను కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యాస ము నుండి మరొక పద్యం ఇప్పుడు మీ ముందుంచుతున్నాను. ఇక చదవండి.

లక్ష్మణునితో శ్రీ రాముడు పంప అరణ్యము నందు సంచరిస్తున్నప్పుడు ఆయనను పారిజాత వృక్షములు ఆకర్షించినవి. అవి ఒత్తుగా చిక్కగా విరబూసి ఉన్నవి. ఆ పారిజాత పుష్పముల సౌందర్యము - సౌకుమార్యమును గాంచగానే శ్రీ రామునకు సీతా సంబంధి ప్రణయము స్మృతికి వచ్చినది. దాంపత్యపు తొలి దినాల్లోని జానకీ ప్రణయ భావనతో మనస్సు నిండిపోగా శ్రీరాముడు ఆ పారిజాతమును తనివితీరా వర్ణించును.

చ:-
అలఘులు పారిజాతముల నార్తవమీ తరురాజి ప్రొద్దుటిం
తలనుచు లేదు. - కాదు దిన నాధుడు తా నడి మింట నుండె నం
చలయదు. ప్రొద్దు గ్రుంకిన దటంచును లేదు. మనోజ్ఞ భావనా
విలసిత హేలయౌ ననుగు ప్రేయసి పోలె సదా సుమాకృతిన్.

ఈ పారిజాతమునకు ఆ ఋతువు ఈ ఋతువు అని లేదు. ఇది అనార్తవములు. ఉదయము - మధ్యాహ్నము - సాయంత్రము అనే కాల నియమం లేదు. మనోహరమైన భావనల చేత ఒప్పుచున్న ప్రేమ మయి అయిన ప్రేయసి వలె సదా సుమాకృతితో విల్ససిల్లుతున్నవి ఈ పారిజాతాలు.

పెండ్లయి అత్తవారింట అడుగు పెట్టిన ప్రతి యువతికి దాంపత్యపు తొలి దినాల్లో తన భర్త అనురాగమును ప్రేమను, సంపాదించుటయే పరమ లక్ష్యము. ఆమెకు ఆనాటి ఆ భావనయే ప్రపంచము. ఆమె ప్రతి చేష్ట ప్రతి మాట ప్రతి కదలిక అన్నియు హృదయమందు అంతట నిండిన తన జీవితాధారుడైన వానిని గూర్చియే. నూరేండ్లపవిత్ర దాంపత్యము నందు అది తొలి అధ్యాయము. ఆ అధ్యాయమున ఆమె ప్రేమ సర్వావస్థా రమణీయము. నిత్య వికస భాసురము. నిరంతర ప్రత్యగ్రతా బంధురము.

అటువంటి సీతా ప్రణయమును అనుభవించిన శ్రీరామునకు కొత్త పెండ్లి కూతురైన సీతాదేవి ప్రేమ మాధుర్యము ఆ నాడే పారిజాత వాసనగా అనుభవమునకు వచ్చినది. తిరిగి ఇన్నేళ్ళ తరువాత ఈ పారిజాతములు శ్రీరామునిలో నాటి అనుభవమును స్మృతి ూపముగ నిద్ర లేపినవి.

మనోజ్ఞ భావనా విలసిత హేల అయిన నెచ్చెలియట. సదా సుమాకృతి ఎల్లప్పుడూ వికసిత కుసుమము వంటిదన్న మాట. మనసులో నున్న భావము మిక్కిలిగా వ్యక్త పరచుటయే హేల- అని కావ్యాలంకార సంగ్రహం పేర్కొంటుంది. రాముని విషయంలో ఇది స్మృతి. పూర్వానుభవ జాగృతము స్మృతి.

రాముని మేని లోని ప్రతి రక్తపు బిందువు జానకీ మనో
జ్ఞామృత భావనా సు మధురాంచిత కోమల పారిజాత మా
లా మధు వాసనా భర విలసముగా అయిదింద్రియమ్ములన్
బ్రామినదౌ అవాచ్య మధురంబనుభూతి యొకండు పొల్చుచున్. {బాల - కల్యాణ ఖండము 151}

శ్రీరామునకు ప్రతి రక్తపు బిందువు నందును జానకీ ప్రణయ గత మాధుర్యము పారిజాత పూల వాసన వలె అవాచ్య మధురిమములను అనుభూతిగా నింపినదని కవి బాల కాండ లోనే వర్ణించెను. ఆ పారిజార వాసనా అనుభవమే ఇక్కడ స్మృతి రూపముగా శ్రీరామునకు జానకీ ప్రణయము ుర్తుకు వచ్చెను.

మహా కవులు గాలిలో దీపము పెట్టి దేవుడా నీదే భారము అనరు. ప్రతి భావమును నిర్దిష్ట లక్ష్యముతో కావ్యమున ప్రవేశపెట్టి, కావ్యమును నిర్మింతుర్. శబ్దార్థ శక్తి నుండి ధ్వని పుట్టును. కావ్య ధ్వని ఆకాశమునుండి ఊడి పడదు.శబ్దము అర్థము పార్వతీ పరమేశ్వరుల వంటివి. అవి శక్తి సంపన్నములు. విడదీయ రానివి. అందుకే కాళిదాసు వాగర్థావివ సంపృక్తౌ అనినాడు. తెలుగున విశ్వనాథ కాళిదాసు వంటి కవి.

తెలుసుకొన్నాం కదా! మరొక పర్యాయం మరొక పద్యం తెలియఁజేసే ప్రయత్నం చేయ గలను.
జైహింద్. Print this post

3 comments:

మనోహర్ చెనికల చెప్పారు...

good one, keep it up

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

chinta vijaya
కి మనోహర్

వివరాలను చూపించు 7:08 AM (13 నిమిషాల క్రితం)



మత్తకోకిల:-
ధన్యుడైతి మనోహరా! కడు ధన్యమాయెను జన్మమున్.. అన్యభావము లెన్ని యున్నను హాయినిచ్చెను మీ నుడుల్.
పుణ్య మూర్తులు మీరు మీదు సమున్నతంబగు జ్ఞానమున్
గణ్యమయ్య! మహాశయా! మముఁ గాంచుచుండుడు నెమ్మదిన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.