జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి .. అయోధ్య. 95507 54389 .
వీరి వితరణ అసామాన్యం. రామభక్తి అసాదృశం. ప్రజా సేవ అమోఘం.
వీరికి వీరి అర్థాంగి గారికి పాదాభివందనములు.
మహోదార గుణ సంపన్నులయిన బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి మహోదయులకు
అభినందన చందన చర్చ.
శా. శ్రీమన్మంగళ సూర్యవంశ తిలకా! శ్రీరామ చంద్రప్రభూ!
ధీమంతుల్, మహనీయ భక్తియుతులున్, దివ్యాత్ములైనట్టి చ
ల్లా మాన్యాన్వయ శ్రీనివాసు, జగతిన్ లక్ష్యంబుతో సేవలన్
నీమంబొప్పఁగ చేయు నీకు, మహితున్ నీవే కృపన్ బ్రోవుమా.
శా. లక్ష్యంబొప్పఁగ సేవఁజేయు ఘన చల్లావంశ భాస్వన్మణీ!
సాక్ష్యంబారఘు రామచంద్రుఁడగు మీ సన్మార్గ సత్ సేవకున్,
భక్ష్యంబుల్ వరభోజనంబు, వసతిన్ భక్తాళికిన్ గొల్పు మీ
లక్ష్యంబున్ నెరవేర్చు నిత్యముగనా లక్ష్మీధవుండాప్తితోన్.
చం. ధనమది కల్గవచ్చు, వరదానగుణంబు, నుదార తత్త్వమున్,
వినయము, సత్యశీలమును, విశ్వజనీనత కల్గుటన్న దా
జనకజ రామచంద్రుల యసాదృశ సత్కృప చేత సాధ్యమౌ
ననితరమైన మీ కృషికి నా మహితాత్ములె శక్తినిచ్చుతన్.
ఉ. భాగ్యులు మిమ్ముఁ గన్న గుణవంతులు మీ తలిదండ్రులే కదా,
భోగ్యములన్ సుఖాదులను బొందఁగఁ గోరక, రామ సేవయే
భాగ్యముగాఁ దలంచి, వర భక్తిని నిత్యము సేవచేయు మీ
యోగ్యతఁ గాంచి, మిమ్ముల నయోధ్యనె నిల్పె రఘూద్వహుండహో!
ఉ. మంగళమార్య! మీకు, శుభమంగళముల్ వర శ్రీనివాస మీ
సంగతిఁ వెల్గు మీ సతికి, మంగళముల్ తమ బంధుకోటికిన్,
మంగళలౌత రామునకు, మంగళముల్ నిత సీతకున్, సదా
మంగళమౌ నయోధ్యకును, మంగళముల్ మన భారతాంబకున్.
మంగళం ... మహత్ ... శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
వినమ్రతతో
చింతా రామకృష్ణారావు.
జైహింద్.