జైశ్రీరామ్.
అమ్మమ్మతో నేను లో నా అర్థాంగి శ్రీమతి చింతా విజయలక్ష్మి మనుమరాలు శ్రీవైష్ణవితీ చేసిన చివరి వీడియో.
తే.19 . 11 . 2023న.ఉదయం తొమ్మిది గంటలనుండి ఈ వీడియో చేసి, వీడియో రికార్డింగ్ పూర్తి అవగానే గదిలోనికి వచ్చి మంచముపై పడుకొని త్రేంచుచుండగా (గేస్ త్రేనుపులు ఆమెకు సహజమే) ఏమైందండత్తగారూ అని మాకోడలు అడుగగా ఏమో ఏమౌతోందో తెలియటం లేదు అని అన్నారు. ఆ మాటలు వినిన నేను తటాలున దగ్గరకు వెళ్ళి రా మనం హాస్పటల్‌కు వెళ్దామన్నాను. పడుకుంటే తగ్గిపోతుంది. నన్ను పడుకోనివ్వండి అన్నారు. అలా కాదు లే అని లేవదీస్తే, నాకు వాంతయేలాగుంది అన్నారు. సరే చేసేసుకో అన్నాను. మంచముపైనే చేసేసారు. మళ్ళీ పడుకుంటానని పడుకున్నారు. అలా కాదు మనం వెంటనే హాస్పటల్‌కి వెళ్ళాలని లేవదీసాను. మోషనయేలాగుంది అన్నారు. కోడలు తీసుకువెళ్ళింది. మోషనయినతరువాత ఆమెయే కడుక్కొని బైటకు కోడలి సహాయంతో రాగా నేనూ నా కోడలు ఆమెను హాలులో కుర్చీలో కూర్చోపెట్టాము. అంతే ఒళ్ళంతా చల్లబడిపోతోంది. మా పెద్దమ్మాయి బీపీ పరీక్ష చేయగా సున్నా చూపించింది. ఆక్సిజన్ మీటంతో చూడగా అదికూడా సరళరేఖే వస్తోంది కాని అంకెలు రాలేదు. వెంటనే పసుపు మర్దనా చేస్తూ నేను బిగ్గరగా అరిచి నావైపు చూడమన్నాను. ఊఁ అని తలపైకి తేల్చి కన్నులతో ఆకాశంవైపు చూసింది. ఇంతలో మా అబ్బాయి వీల్ చైర్ తేగా దానిలో కూర్చోపెట్టి కారుదాకా తీసుకొనిపోయి, కారు ఎక్కమన్నాను. ఆమె కారు ఎక్కి పడుకున్నారు. ఐదు నిమిషాలలో దగ్గరలో ఉన్న హాస్పటల్‌కు తీసుకువెళ్ళగా వారు పరీక్షించి ప్రథమ చికిత్స అందిస్తూనే ఇది సివియర్ హార్ట్ ష్ట్రోక్ వెంటనే మరో హాస్పత్రికి తీసుకు పొమ్మన్నారు. క్షణం ఆలస్యం చెయ్యక అంబులెంసులో ఏ.ఐ.జీ. హాస్పటల్‌కు తీసుకు వెళ్ళగా వారు వెంటనే జాయిన్ చేసుకొని పరీక్షలు చెయ్యడం ష్టంట్ వెయ్యడం మత్తుమందివ్వడం చేసి (సరిగా ఉదయం పది గంటలనుండి) ఐసీయూలో పెట్టారు.
తే. 20 . 11 . 2023. రాత్రి 9.49.నిమిషములకు మరణించినట్లు తెలియజేసారు. నాబ్రతుకును చూకటిలోనికి నెట్టి తాను కార్తీకసోమవారముపూటా ఆ లలితాపరాభట్టారికలో లీనమైపోయారు.
చం. చక్కని సూచనాళిని ప్రశాంతిగ చేసితి వింతదాక, నీ
కెక్కడి నుండి చేరె సతి! యీ విధి నిన్ గొనిపోవు మృత్యు వీ
యొక్కక్షణంబు మాత్రమునె? యుల్కును పల్కును లేక మమ్ము నీ
విక్కటులందు ముంచి, పరమేశ్వరిలోనికి చేరిపోతివా?
శివశివా శివశివా శివశివా.
3 comments:
Nuvvu leni lotu jeevitaantam mammalni ventaadutundi ammaa... okkasaarinaa kaneesam kalalo i naa kanipinchi maataadammaa.. nuvvu lekundaa antaa sunyam gaa vundi ammaaa
అమ్మలో ఐక్యమైన మరోఅమ్మ ఎక్కడికీ వెళ్ళలేదు మనలను విడిచి, మన మనస్సులోనే మనచుట్టూ తిరుగుచూ మనలను అడుగడునా పలుకరిస్తూ నడయాడుచున్నది.
అమ్మగారు కార్తిక మాసంలో దీపదానం గురించి సవివరంగా తెలియజేశారు. 🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.