గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2022, ఆదివారం

రమ్మా శుభకృత్ సుమమా...శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ.

జైశ్రీరామ్. 

రమ్మా శుభకృత్సమమా

✍️ కొరిడె విశ్వనాథ శర్మ


కం.

అమ్మా శుభకృత్సమమా

రమ్మా యిక నీ వసంత రంజచ్ఛోభన్

తెమ్మా యోగము క్షేమము

నిమ్మహి నింపగ సతతము నీశ్వరకృపతోన్


మత్తకోకిల.

కొమ్మ కొమ్మన చేరి కోయిల, కొత్త పూతల మేయుచున్

కమ్మగా మరి గొంతు నెత్తుచు, కొత్త రాగము పాడెనే

పొమ్మనంచును వీడుకోలును, పోయెడేటికిఁ జెప్పుచున్

రమ్ము రమ్మని కొత్త యేటికి రంజితంబుగ గూసెనే.


భౌమ్యసంగరదర్పనాశనమానసంబులనొప్పచున్ 

‌‌స్వామ్యకామ్యము వీడి దేశనృపాలవర్గము మెల్గుగాన్

సౌమ్యులై జనులందరొందగ సాధుజీవనమేర్పడన్

రమ్యమౌ శుభకృత్సు వత్సరరాజ ! చేయుమ లోకమున్.


వ్యాధిబాధలనిచ్ఛె శార్వరి యశ్రువుల్ జగమొందగాన్

వ్యాధిమాన్పి ప్లవాబ్ధి గూర్చెను స్వామ్యయుద్ధమునెల్లడన్

బాధలన్ గలిగింప బూనె సువత్సరంబులు జూడగా

సాధకంబిక నీవె లౌకిక శాంతి కై శుభకృత్సమా !


శుభకృత్తు ! జేయు మానిక

శుభాభివృద్ధియె జగంబు క్షోభను వీడన్

విభవముల గల్గ జేయుచు

ప్రభవిం చుమికనె పుడుర్వి వైరము వీడన్


శ్రీ శుభకృద్ వత్సరాది శుభాకాంక్షలతో

✍️ కొరిడె విశ్వనాథ శర్మ

ధర్మపురి. జగిత్యాల జిల్లా. తెలంగాణ.

2/4/22

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.