గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఏప్రిల్ 2022, సోమవారం

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే..|| 5-13 ||..//..న కర్తృత్వం న కర్మాణి లోకస్య..|| 5-14 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

 జైశ్రీరామ్. 

పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

|| 5-13 ||

శ్లో.  సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ|

నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్.

తే.గీ.  కర్మసన్యాసి విజితాత్ము డర్మిలి తన

దేహదదేవాలయంబున తేలుచుండు

సంతసమ్మున యెమియు సుంతయేని

చేయడిక చేయజేయడు జితవిధాత. 

భావము.

మానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను 

స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో 

తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.

|| 5-14 ||

శ్లో.  న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః|

న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే.

తే.గీ. క్షితిని కర్తృత్వమున్ కర్మ సృజన చేయ

డరయ దైవమ్ము, కర్మ మహాఫలంబు

లందబోవడు, ప్రకృతియె యట్టు లమరి

నడచుచుండును సృష్టి నీవరయు మిదియు.

భావము.

భగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. 

కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా 

వ్యవహరిస్తుంది.

.జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.