గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఇహైవ తైర్జితః సర్గో యేషాం..|| 5-19 ||..//..న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య..|| 5-20 ||..//..5వ అధ్యాయము. కర్మసన్యాస యోగము.

  జైశ్రీరామ్.


శ్లో.  ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః|

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః.

తే.గీ.  ఎవరి మనసు సామ్యస్థితి నెల్లవేళ

లందు నిలుచునో వారలే యనుపమ

విజిత సంసార బంధ స న్నిజశరీరు

లరయ వారలా బ్రహ్మమే ధరణి దలప.

భావము.

ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో 

ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా 

సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.

|| 5-20 ||

శ్లో.  న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నోద్విజే త్ప్రాప్య చాప్రియమ్|

స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః.

తే.గీ. సుస్థిరంబగు బుద్ధితో శోభిలుచును

భ్రాంతి రహిత బ్రహ్మజ్ఞాని పరవశింప

డతని కానందదంబైనదందినపుడు,

క్రుంగ డప్రియప్రాప్తికిన్, గుణనిధాన!

భావము.

స్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలోనిలిచి ఉన్న 

బ్రహ్మజ్ఞాని, ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది 

లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు.

.జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.