గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మార్చి 2022, శుక్రవారం

పాండిత్యానికి ప్రతి రూపం విద్వన్మణి కొరిడే రాజన్న శాస్త్రి గారి వర్ధంతి సందర్భముగా నా నివాళి.

 జైశ్రీరామ్.


పాండిత్యానికి ప్రతి రూపం విద్వన్మణి కొరిడే రాజన్న శాస్త్రి గారు.

నిరంతర పఠన మందే మనసును లగ్నం చేసి, సిద్ది పొందిన సాహితీ తాపసి కొరిడె రాజన్న శాస్త్రి. కావ్య వ్యాఖ్యల్లో మల్లినాథసూరి వలె, శాస్త్ర వ్యాఖ్యలలో అభినవ గుప్తుని వలె, శ్లేష రచనలో శ్రీహర్షుని వలె, కమనీయ కవితలో కాళిదాసు వలె వచన రచనలో దండి వలె, ప్రసంగాలలో కవిసామ్రాట్ వలె భాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజన్న శాస్త్రి. వేద వేదాంగ శాస్త్ర ఆగమ సకల కళలకు కాణాచి అయిన ధర్మపురి క్షేత్రంలో 1933 జూన్ 2న జన్మించిన శాస్త్రి, ఇంటి వద్ద వేద సంస్కృత అధ్యయనాలు చేసి, మహారాష్ట్ర, గుజరాత్, ఇతర ప్రాంతాలలో లబ్ద ప్రతిష్టులైన తాడూరి బాలకృష్ణ శాస్త్రి వద్ద కావ్య పాఠాలు, పాలెపు వేంకటరాయ శాస్త్రి చెంత, అద్వైత పూర్వ మీమాంసాదులను అభ్యసించారు. సంస్కృతాంధ్రాలలో ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉపాధ్యాయ, అధ్యాపక స్థాయి నుండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్య స్థాయికి, స్వయం కృషితో చేరుకున్నారు. మనోహర కవితాధారలను స్రవించడమే కాకుండా, అమర భాషలు శ్లేషలో రెండర్గాలతో “బలి పుష్ట విలసితం”అనే పేరుతో కాకి, రాజకీయ నేతక్షుద్రవ్యంలో సమానులే అనే భావం ప్రకటితమ య్యేలా, ఆయన ద్వర్తి లఘు రచన సమస్త భారతావనిలో అభిమాన పాత్రతకు కారణమైంది. అలాగే , “గణనాయక స్తవం” పేరుతో రచన… పైకి గణపతి ప్రార్ధన, తరచి చూడ, లోన నాయకుల ప్రస్తావన ఇమిడించుకుంది. “మధుపవి గీతి” లో తేనెను త్రాగుతున్న తుమ్మెదను వర్ణిస్తూ త్రాగుబోతు దుశ్చర్యలను శ్లేషార్థంతో విరచించారు. హరిహర స్తుతి మరో శ్లేష కావ్యం. చలన చిత్రాలు కళ, విజ్ఞానం అందించాల్సిన సాధనాలుగా ఉండాలని, కానీ అది హింస, అశ్లీలతతో కూడి ఉంటున్నాయని ఆవేదన భరిత సామాజిక బాధ్యతలు వ్యక్తీకరించారు. అలంకార శాస్త్ర గ్రంథం పరిష్కారమే కాకుండా, అల్లసాని పెద్దనామాత్యుని “మను చరిత్ర” లోని ధ్వని సిద్ధాంత అనువర్తనాన్ని పరిశోధన గ్రంథ రూపంలో వెలువరించి, ప్రతిభను చాటి చెప్పి, డాక్టరేట్ పొందారు. చిన్నయసూరి బాల వ్యాకరణానికి వ్యాఖ్యానం రాశారు. మరో రచన తారావళి గ్రంథం పండితామోదం పొంది, దివంగత ప్రధాని పీ.వీ.నరసింహా రావు ద్వారా సన్మానితుల చేసింది. దివాకర్ల సాహితి ట్రస్టు నుండి పురస్కార గ్రహీతలు అయినారు. స్వర్ణ భారతి పురస్కారం లభించింది. హైదరాబాద్ సంస్కృత భాషా ప్రచార సమితికి “వైస్ ఛాన్సలర్” గా పనిచేసి సంస్కృత భాషామ తల్లికి నీరాజనాలు అందించే కృషి జరిపారు. దివాకర్ల పండిత మండలిలో “భువన విజయం’ భారతా వరణం, శ్రీనాధ కనకాభిషేకాది రూపకాలలో విభిన్న పాత్రలు ధరించి జీవం పోశారు. తాము పుట్టువు నొంది, పెరిగిన ధర్మపురి క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహుని సుప్రభాత శ్లోకాలు, నిత్య ఉషోదయ ప్రతిధ్వనులుగా, కొనసాగుతూ వస్తున్నాయి. భర్తృహరి శతక త్రయంకు సంబంధించి చతుర్థ శతకం పేరున, 1987 లో “ఓరియంటల్ కాన్ఫరెన్స్” లో నూతన ఆవిష్కరణలు గావించి, విశేషాలను వివరించారు. “వసుమతీ వసుధాకరం” పేరుతో రాసిన సంస్కృత నాటకం, నాలుగు దశాబ్దాల నాటి సంస్కరణలపై వెలుగొంది ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమై, సంస్కృత భారతిలో ప్రచురితమైంది. “వింశతి శతా బ్దీయ సంస్కృత కావ్యామృతం” లో భారత.దేశ వాసులకు సుపరిచితులైన, 20 మంది మహాకవుల సరసన స్థానాన్ని పొందారు. షోడశ్రీ అనే 16 మంది భారతీయ సంస్కృత కవుల పరిచయంలో, రాజన్న శాస్త్రి కవిత్వం ముద్రితంగా నిలిచింది. “నిబంధ రత్న సముచ్చయము”, సరస్వత సుషమం, సూర్యోదయం, సాగరికా, సంవిద్, అమృతలతా, సంస్కృత శోధనా, సంస్కృత భారతి, మధురవాణి లాంటి అనేక పత్రికలలో వచ్చిన తమ రచనలను సంకలనం గావించారు. 3,500 శ్లోకాలతో కూడిన “ధర్మపురి క్షేత్రమహాత్మ్యం” క్రీస్తుశకం 930 నాటి, ప్రాచీన తాళపత్ర గ్రంథాల్ని, స్థానికులు పండితులు కశోజ్ఞల సదాశివ శాస్త్రికి సహకరించి, పరిష్కరించి, దేవస్థానానికి ప్రచురణార్థం అందజేశారు. లక్ష్మీ నరసింహ సుప్రభాతం, ప్రపత్తి, కాళేశ్వర స్తుతి, హరిహర స్తుతి లాంటి దేవత స్తుతులతో తమ కవిత మాధుర్యాన్ని రంగరించారు. తమ పాండిత్య ప్రతిభతో యావత్ దేశానికి బహుముఖీన సాహిత్య సేవలందించి, తెలంగాణ పూర్వ పండిత సంప్రదాయ వారసునిగా, ప్రతినిధిగా నిలిచిన కొరిడె రాజన్న శాస్త్రి, 2013 మార్చి 11న పాంచభౌతిక శరీరాన్ని త్యజించి, పర బ్రహ్మలీనులైనారు.

https://filmimonks.com/rajanna-shastri/


ఇంతటి మహనీయులయిన రొరిడే రాజన్నశాస్త్రిగారికి నా నివాళులు అర్పిస్తున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.