గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2020, ఆదివారం

కరుణించి కావుమో కరోనా.........

జైశ్రీరామ్.
కరుణించుచు కావుమో కరోనా! ...........🙏🏻

చ. కరుణయె లేనిదానవయి, కష్టపు జీవుల నింటఁ గట్టి, సుం

దరముగ నట్టహాసమున, దర్పిలి యుంటివహో! కరోన!  యే

తెరవున భుక్తి నాకొదవు? తిండికి లేక గృహాంతరంబులన్

నిరుపమ దుఃఖమున్ బొగిలి నిన్ మది తిట్టుచునుంటి. కానవో?


క. కష్టమునే తినుమాకిల

నష్టము కలిగింపఁ దగునొ? ఘనముగ కనెదో?

సృష్టిని గల పాపుల కిల

నష్టము కలిగింపవచ్చు. 
నాకేలనిటుల్?


క. రెక్కాడిన డొక్కాడును

ముక్కాలములందు మాకు, బోధపడదొకో? 

ఒక్కదినంబె యనందువొ?

ఎక్కడికిన్ పోక తిండదెట్టులు కలుగున్?


ఉ. పేదలసాదలన్ గనవు. విజ్ఞతనొప్పవు. విశ్వమంతటన్

మోదముతో జరించుదువు. పుణ్యము పాపము లేదు నీకు. దు

ర్వ్యాధిగ తిట్టినన్ వినవు. ప్రాణములన్ గొనిపోవుబుద్ధితో

ఖేదము గొల్పుచుండెదవు. కిమ్మనవేమి? కరోన రక్కసీ!


క. ధర్మాత్ముల, సుగుణ పరుల,

మర్మమెఱుంగని మనుజుల, మాన్యులఁ గనుచున్

గర్మము కాల్చకు. భువిపై

దుర్మార్గుల పీచమడచు. దుష్ట కరోనా!


క. వేగముగా పొమ్ము విడిచి

భూ, గగనములను. మసలకు. పుణ్యంబుండున్.

మాగతి మార్చకు మింకను.

రోగార్తిని బాపుమా కరోనా! కొలుతున్ 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగున్నాయి కరోనా ప్రార్ధన పద్యాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.