గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2020, ఆదివారం

అన్నీ గుడులతో పద్యము. రచన...కాశీపత్యవధానులు గారు.

జైశ్రీరామ్.
అన్నీ గుడులు వుండే పద్యం --కాశీపత్యవధానులుగారు.

కినిసి సిరి దీసి నీలిగి
తిని సిగ్గిడి కింగిరి కిని దిగి తీరితికి గి
త్తిని జీరినించి చిక్కిడి
తిని జియ్యా యింతి కీరితిని నిల్చిరిసీ

హరిశ్చంద్రుని పై కోపంతో అతని ఐశ్వర్య మంతా పోయేటట్లు చేశాను. సిగ్గులేక నీచ కార్యానికి (కింగిరిసి) దిగాను.అగ్ని (కిత్తి) వంటి హరిశ్చంద్రుని పిల్చి,నిందించి, ఎన్నో
కష్టాలకు గురి చేశాను. అయినా ఈ రాజు,రాణి (జియ్యా యింతి) కీర్తిని గెల్చుకున్నారు.
అని పైన పేర్కొన్న పద్య భావం. విశ్వామిత్రుడు తనను తాను నిందించుకునే సందర్భాన్ని పురస్కరించుకొని. అన్నీ గుడులతోనే పద్యం వ్రాయడం ఎంతో
ఔచిత్యవంతంగా వుంది.
శుద్ధ నిరోష్ట్యం 
అలికాంచి తా శ్రాయాశా
ఖల దైత్యానీక నాశ కలితాంత్యాశా
లలితాంత రిక్ష కేశా
సలిల జనయ నేశ యీశ శశి నీకాశా

టీక:---నాలిక= నొసటి యందున, అంచిత= ఒప్పుచుండిన, ఆశ్రయాశా=అగ్నిహోత్రుడు గలవాడా, ఖల= దుర్మార్గులగు,దైత్యానీక =రాక్షస సైన్యముల, నాశ= హతము చేసినవాడా, కలిత=ఒప్పుచున్న, అంత్య= చివరిదియగు
ఆశా =దిక్కు గలవాడా,(ఈశాన్య మూల యనుట)లలిత-మనోజ్ఞమైన,
అంతరిక్ష= ఆకాశమునే, కేశా=వెంట్రుకలుకల వాడా, సలీలజ నయన =కమలాక్షుడగు
విష్ణునకు,ఈశ= ఈశ నామము గలవాడా, శశి= చంద్రుని వంటి, నీకాశా=కాంతి గలవాడా.
ఈ పద్యం పెదవులకు తగలకుండా చదవడానికి వీఎలుగా రచింప బడినది. అందుచేత
దీనిని 'శుద్ధ నిరోష్ట్యం' అంటారు.

అన్నీ యేత్వాలు గల పద్యం---కాశీపత్యవధానులు గారి రచన.
కేలే దే తేతేలే
వే లేవే మెట్లె దేబేవే యెల్చేడె
న్నే లేనే వేరే యె
గ్గే లేనే లేదే యేడ్చే దేవే మేలే

టీక:- కేలు= హస్తం, యేదే=ఎచ్చటనే, తేతేవే =తెమ్ము తెమ్ము, లే= శీఘ్రముగా
లేవే మెట్లే =లేవలేమి యెట్లనే, దేబేవే = దీనురాలవా, ఏల్చేడెన్= రక్షించు వనితను,
నేలేనే=నేనుండ లేదా, వేరే= వేరుగా, ఎగ్గే లేనే లేదే =కీడు,లేక దోషము లేనే లేదే
ఏడ్చేదేవే=యేడ్చెదవెందుకే, మేలే =శుభమే లే.
ఈ పద్యమంతా ఎత్వాలతో రచింప బడింది.(అచ్చ తెలుగులో)
ఇన్ని ప్రయోగాలు చేసిన తెలుగు కవి మరొకరు ఈ 20 వ శతాబ్దములో ఎవరూ లేరేమో.

 పద్యభ్రమకం.
చిత్ర కవిత కర్ణపేయంగా ఉన్నప్పటికీ, వ్యర్థ పదాడంబరము తో నిండి సులభంగా అర్థం కాదు. రసపుష్టి కూడా లోపిస్తుంది. చిత్రకవితా పంచాననులైన కాశీపతిగారు చిత్రకవిత్వము లో వ్రాసిన పద్యాలలో పేర్కొనదగినవి రెండు. అందులో రెండవది 'పద్యభ్రమకం'
. 'పద్యభ్రమకం' లో పద్యమంతా క్రిందినుంచి చదివినా ఒకటిగానే వుంటుంది.

సారసజ నుత జయ తరల
శూరహరా సాదర వర సు సురా పరమా
మార పరా సుసుర వరద
సారా హర శూలరత యజతనుజ సరసా

టీక:--సారసజ =పద్మసంభవుడైన బ్రహ్మ చేత, నుత =కొనియాడబడు, జయ=జయము
గలవాడా, తరళ=చరించునట్టి, శూరహర = రణ సాహసులను హరించిన వాడా,
సాదర=ఆదరముతో గూడిన, వర=ప్రభువా, సు=శ్రేష్ఠుడవైన సుర =దేవతా,పర =పరమాత్ముడా, మార=మన్మథునకు,పరా=శత్రువైనవాడా,సుసుర=మంచి వేల్పులయొక్క, వర=కోరికలను, ద =యిచ్చువాడా, స+ఆరా =వేగయుక్త
హర= హర నామము గలవాడా, శూలరత =త్రిశూలాయుధము నందాసక్తి కలవాడా,
సరసా=సరసుడైనవాడా.
ఈ పద్యాన్ని చివరినుండి మొదటికి చదివినా, మొదటినుండి చివరికి చదివినా
ఒకే విధంగా వుంటుంది.
ఇన్ని ప్రయోగాలు చేసిన తెలుగు కవి మరొకరు ఈ 20 వ శతాబ్దములో ఎవరూ లేరేమో.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.