గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2020, బుధవారం

అరుణోదయం. ఖండిక(౧ నుండి౧౫). రచన. డా. నలవోలు నరసింహారెడ్డి

జైశ్రీరామ్.
అరుణోదయం.
డా. నలవోలు నరసింహారెడ్డి
1.చ॥ అదియొక పూల తోట విరు లందము జిందుచు తావు లొప్పెడిన్‌
అది సెలయేటి హోరు విను మల్లదిగో జలపాత సధ్వనుల్.
అది భ్రమరాలు ఝుమ్మనుచు హాయిగ బాడెడు గాన మాధురుల్‌
అది తిలకించ బూని దరహాసముతో నొక కాంత యుండెడిన్‌

2.ఆ॥ ఆమె పేరు ‘‘అరుణ’’ అత్యంత ధీ ధీత
అశ్వముపయి నెక్కి ఆమె వెంట
సరస హృదయులైన సఖులు తోడై రాగ
వచ్చె తాను పుష్పవనము నరయ

3.శా॥ ధాత్రిన్‌ మించిన సోయగంబులను సందర్శించు నాకాంక్షతో
ఆత్ర మ్మాత్రము సంచరించుచును, దృశ్యంబుల్‌ సమీక్షించుచున్‌
మిత్ర ద్వంద్వము వెంటనంటి చనగా, మించైన లేనవ్వుతో,
రాత్రిన్‌ బూచిన పూవు కన్నుగవతో, రంజిల్లె పూదోటలో

4.ఆ॥ ప్రాణ సఖులు వెంట పయనమై చనుదెంచ
కాంత గనుచు ప్రకృతికాంత సొగసు
సఖుల తోడ తాను సరదాలు పచరించి
నడువసాగె వనము నంత నంత

5.ఉ॥ అల్లన నీలిమబ్బు కురులందము జిందెడు వేణికట్టుతో,
పుల్ల సరోజ నేత్ర ముఖపుష్పముతో, మధురంపు వాక్కుతో,
తెల్లని యాణిముత్యములు తేటగ రాల్చెడు హాసరేఖతో,
మల్లెల బోలు దివ్యమగు మాటలతో విలసిల్లు చుండెడిన్‌

6.గీ॥ పోత బోసిన బంగారు బొమ్మ వోలె
బ్రహ్మ దిద్దిన అందాల భరిణ వోలె
అప్సరాంగనలను మించు నంద మొప్పి
యలరుచుండెను వీక్షింప తలపు లూర

7.గీ॥ మధుర భావాలు విచ్చేయ మనసు నిండ
ఊహ లోకాల యంచుల నొదిగిపోయి
గాలి కెరటాల తేరులో తేలిపోయి
తనరు చుండగ నా వనితా త్రయంబు

8.కం॥ విర బూసిన పూ దోటను
విరుల నడుమ దిరుగుచుండి వేవేల గతుల్‌
‘‘అరుణ’’ మెగొందెడు నచ్చట
చిరు గాలులు మేను సోకి చిందులు వేయన్‌.

9.ఉ॥ అంతట నేగు దెంచినది ఆలము అల్పుచు తోపునుండి బల్‌
వింతగ నొక్క మత్తకరి బృందము చిర్రుగ బిట్టు రేగుచున్‌
గాంతల గాంచి వెంటబడ కన్నెలు మువ్వురు వేరు వేరుగన్‌
సొంతపు దారులన్‌ పరుగు జొచ్చిరిగా నిజ ప్రాణభీతితో

10.కం॥ దొరకిన దారుల నంటియు
పరుగు లిడుచు చాల దవ్వు వనితాత్రయమున్‌
కరియూథము చేష్ట కతన
పురమును జనునట్టి దారి బోల్చన్ ‌ లేకన్‌

11.ఆ॥ చెదిరి పోయినట్టి చెలుల జాడలు లేక
భ్రాంతితోడ నడవి ప్రాంతమందు
వెళ్ళు దారి గనక వేరు దారులలోన
ఉండి పోయె ‘‘నరుణ’’ ఒంటరిగను

12.ఆ॥ పశ్చిమాద్రి వైపు పరుగు వెట్టుచు సూర్యు
డస్తమించ గానె యవని నిండ
నలము కొనియె తమసు లంచు నెగబ్రాకి
మింట చుక్క లెల్ల మెరువ దొడగె

13.మ॥ రజనీకాంతుడు మెల్ల మెల్లగను మార్గంబున్‌ విలోకించుచున్‌
విజయుండై విను వీధులం దలరి వేవేగన్‌ ప్రయాణించి రా
గ, జడాకారపు చిమ్మచీకటి తెరల్‌ కంపించుచున్‌ జీలిపో
యి, జగంబందున పండువెన్నెలలు తా మింపారుచున్‌ నిండెడిన్‌

14.కం॥ కాంతుతో నా రజనీ
కాంతుం డాకాశమందు కనబడగా నే
కాంతము నందుండిన నా
కాంతకు మైకొన్న భయము కరిగె నొకింతన్‌

15.కం॥ ఇంటికి జను తెరువెరగక
వెంట సఖులతోడు లేక విలపించుచు తా
నొంటరియై తిరుగాడుచు
కంటకము పాలబడియె కానలలోనన్‌.
(సశేషమ్)
నలవోలు నరసింహారెడ్డి.
ఇంత చక్కని ఖండిక వ్రాసిన నరసింహారెడ్డి గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.