గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2020, మంగళవారం

కాళిదాసుపాటి కవియు లేడు.

జైశ్రీరామ్.
భోజ కాళిదాస కథలలో ఎక్కువ కథలు భోజుడి ఔదార్యాన్నీ , కాళిదాసు కవిత్వ మహాత్వాన్నీ ప్రశంసిస్తూ
చెప్పేవి. కొన్ని కథలలో కాళిదాసు యుక్తితో సమస్యల నుంచి తప్పించుకోవడం గురించి చెప్తారు.యిది అలాంటి కథ.

ఒక దూరదేశం లో దుర్యోధను డనే కవి వుండేవాడు.ఆయన కాళిదాసు కవిత్వము గురించీ ఆయన పొందుతున్న సత్కారాలను గురించీ విన్నాడు.భోజుడి రాజ్యం లో కాళిదాసునే భోజుడికంటేఎక్కువ గౌరవిస్తారానీ విన్నాడుదుర్యోధనుడు స్వయం గా మంచి విద్వాంసుడూ.కవీ దానికి తోడు
మహా భక్తుడు,దేవీ ఉపాసకుడు కూడా.అయితేనేమి కొంచెం అసూయా పరుడు.కాళిదాసును మించిన కవిత్వం చెప్పాలనే కోరిక తో
దేవిని గూర్చి తపస్సు చేశాడు.దేవి ప్రత్యక్ష మైంది.మాతా!నాకు కాళిదాసు ను మించిన కవితా పాటవాన్ని ప్రసాదించు.కాళిదాసును ఓడించాలని నాకోరిక. అని అడిగాడు..అప్పుడు దేవి భక్తా! నీ కోరిక లో ఈర్ష దాగి వుంది అది నీకు మంచిదికాదు.కాళిదాసు నా భక్తుడు.నా వరం తోనే మహా కవి యైన వాడు.ఆయన తో నీకు పోటీ కూడదు.అయినా తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి,నీకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నాను. కానీ
రాబోయే పౌర్ణమి నాటికి భోజుడి ఆస్థానం చేరితే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. అని చెప్పి అంతర్ధాన మైంది.
సంతోషం తో తన పరివారాన్ని తీసుకొని ధారనగారానికి వెళ్లి నగర శివార్లలో విడిది చేసి పొర్ణమి నాడు తను
రాజాస్థానానికి వస్తున్నానని కబురు పంపాడు.ఆ సాయంత్రం కాళిదాసు రోజు లాగే కాళీమాతను పూజిస్తూండగా దేవి పలుకులు వినిపించాయి కాళిదాసా! రేపు మీ ఆస్థానం చేరబోతున్న దుర్యోధన కవికి రేపు పున్నమి రోజు ఒక్క రోజుకూ నేను నిన్ను ఓడించగల శక్తి ప్రసాదించినాను.ఈ ఒక్కరోజూ దుర్యోధనుడిని గెలవటానికి నేను ఏమీ సహాయం చేయలేను.నీ వేమయినా జాగ్రత్త పడతావేమో నని నిన్ను హెచ్చరిస్తున్నాను.అని చెప్పి మాయమై పోయింది.కాళిదాసు ఒక యుక్తి పన్నాడు.గడ్డి మోపులు అమ్మేవాడిలాగా వేషం వేసుకొని ఊరిబయట వున్నగుడారాలలో విడిది చేసిన దుర్యోధనుడి పరివారాల దగ్గరికి వెళ్లి గుర్రాలకు కావలిసిన మేత కారు చౌకగా అమ్మాడు.రాత్రయిపోయిందని సాకు చెప్పి అక్కడే వుండి పోయాడు.
గుడారం లో దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు,బయట వున్న కాళిదాసుకూ నిద్ర పట్టలేదు.యిద్దరికీ రేపేంజరుగుతుందో నని ఆందోళనా భయం.దుర్యోధనుడు తెల్లవారక ముందే తన గుడారం నుంచి బయటికి వచ్చిఅక్కడే తిరుగుతున్నాడు. కాళిదాసు అయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు.పడమటి దిక్కున చంద్రుడు యింకా ప్రకాశిస్తున్నాడు.సూర్యోదయం యింక కాలేదు.పక్షుల కలకలా రావాలు అప్ప్దప్పుడే మొదలవుతున్నాయి.ప్రకృతి ఎంత అందం గా వున్నది.యిదంతా చూస్తుంటే నీ హృదయం స్పందించడం లేదా?అని అడిగాడు.దుర్యోధనుడు మారువేషం లో వున్న కాళిదాసును.గడ్డి అమ్ముకునే వాడిని నాకవన్నీ
ఏమి తెలుస్తాయి?మీరే  ఏదైనా మంచి వర్ణన చెప్పండి వింటాను అన్నాడు.అయితే విను అని దుర్యోధనుడు

చరమగిరి కురంగీ శృంగ కండూయనేన
స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః

అంటే అర్థ మయిందా?నీకు కాలేదనుకుంటాను నేను చెప్తాను అన్నాడు.చిత్తం అవసరం లేదండీ.కాళిదాసు గారి గుర్రాలకు కూడా నేనే గడ్డి అమ్ముతాను అక్కడి సేవకులతో మాట్లాడుతుంటాను.కాళిదాసుగారి కవిత్వం అప్పుడప్పుడూ వింటూ వుంటాను మరీ కఠిన మైనవి అర్థం కావు కానీ ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు అర్థం చేసుకోగలను.అన్నాడు.దుర్యోధనుడు నివ్వెర పోయి ఏదీ చెప్పుచూద్దాం అన్నాడు.
చరమగిరీ అంటే పడమటి కొండ కురంగీ అంటే లేడి శృంగం అంటే క్మొమ్ము కండూయనం అంటే దురద పోయేలా హాయి కలిగించేలా మెల్లగా గీరటం.అంతరిందో:కురంగః అంటే ఆ చంద్రుని లోపల కనిపిస్తున్న లేడి.
(చంద్రుడికి హరిణాంకుడు అని పేరు.మధ్యలో హరిణం వున్నవాడు.అని అర్థం)వెరసి మీరనేది పడమటికొండ అనే లేడి తన కొమ్ములతో చంద్రుడి లో వున్న లేడికి హాయి గొలిపేలా గీరుతూ వుంటే అది నిద్రావస్థ లోకి యిప్పుడు జారుకుంటున్నది అని అంతే కదా కవిరాజా! అన్నాడు.అమాయకత్వం నటిస్తూ.ఆరి పిడుగా అని ఆశ్చర్య పోయాడు దుర్యోధనుడు.గడ్డి అమ్ముకునే వాడికే యింత పాండిత్యం వుంటే యిక ఆస్థానం లోని కవులేంతటి వారో అని అతనికి వణుకు పుట్టింది.పైకి మాత్రం డాంబికంగా చూశావాఅలంకారం యెంత బాగా
వేశానో అన్నాడు.అలంకారానికేమి స్వామీ అద్భుతం గా వున్నది.కాకపొతే నాదొక చిన్న సందేహం
'చరమగిరి కురంగీ' అన్నారు కదా!కురంగీ అంటే ఆడలేడి.ఆడ లేడికి కొమ్ములు వుండవు కదండీ మీరు ఏ
భావం తో చెప్పారో వివరం చెప్పరా?అన్నాడు కాళిదాసు.దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
తను పప్పులో కాలేశాడు.పైకి మాత్రం ఆ ఏదో తెల్లవారు ఝాముననె నిద్రకళ్ళతో ఆశువుగా రెండు ముక్కలు చెప్పానులే నువ్వు కనుక్కో గలవో లేదో అని నిన్ను పరీక్షించ డానికి చెప్పాను అన్నాడు.దానికి కాళిదాసు .ఇది నిజంగా   అద్భుతమైన ఊహండీ
ఇలాంటి తప్పులు సవరించడం నేను కాళిదాసు గారి దగ్గర నేర్చుకున్నానండీ మీరు నన్నుప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను దీన్ని సవరించి చెప్తానండీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు.
మీ శ్లోకం లో కురంగీ కి బదులుగా 'తుండీ' అని మారిస్తే సరిపోతుందండీ తుండి అంటే ముట్టే అని అర్థం వస్తుంది కదండీ అందుకని సరిపోతుంది.మిగతా రెండు పాదాలూ చెప్పేయండి.అన్నాడు.
శ్లోకం పూర్తీ చెయ్యటం అంటే గడ్డిమోపులు అమ్మినంత సులభం కాదు.అలంకారం,ధ్వనీ రసం అన్నీ సరిచూసుకోవాలి కదా!వున్న పళాన చెప్పేది కాదు అన్నాడు.నిజమే లెండి అవన్నీ ఆలోచించి మీరు శ్లోకాన్ని ఎలా పూరిస్తారో నాకు తెలియదు కానీ నేను పూరిస్తాను చూడండి.నేను కాళిదాసు గారు పండితులతో ముచ్చటి స్తూంటే విని నాకూ కొంచె పూర్తి చెయ్యటం అబ్బింది లెండి అని యిలా చెప్పాడు.

'పరిణిత రవి గర్భ వ్యాకులా పౌరుహూతీ
దిగపి ఘన కపోతీ హుంకృతై:క్రంద తీవః
మీరు పడమటి దిక్కు గురించి రెండు పాదాలు చెప్పారు.తూర్పుదిక్కు గురించి మిగతా రెండు పాదాలూ
చెప్తే సరిపోతుంది కదా! అని చేప్పాను.పౌరుహూతి అంటే తూర్పు దిక్కు కదండీ 'పరిణత రవి గర్భ వ్యాకుల'
అంటే సూర్యుడిని గర్భం లో వుంచుకొని నెలలు నిండిన వనితలా ప్రసవ వేదన తో కేకలు పెడుతున్నది కదండీ అదిగో 'ఘన కపోతీ హుంకృ తై క్రందతీ యివ అంటే పెద్ద పెద్ద పక్షుల అరుపుల రూపం లో ఆమె ప్రసవ వేదన పడుతున్నట్లు అనిపించడం లేదూ?అంటూ అప్పుడే లేచి కలకలా రావాలు చేస్తున్న పక్షులను చూపించాడు.కాళిదాసు.శ్లోకం పూర్తయింది.

చరమగిరి కురంగీ తుండ కండూయ నేన
స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః
పరిణిత రవి గర్భ వ్యాకులా పౌర హూతీ
దిగపి ఘన కపోతీ హుంకృతై :క్రందతీవః

పడమటి కొండ అనే ఆడ లేడి తన తుట్టేతోచంద్రుడిలో వుండే హరిణాన్ని తనముట్టెతో దానికి హాయి గోలిపేలా గీరుతున్నది.యిక తూర్పుదిక్కు సూర్యుడిని తన గర్భం లో దాచుకొని నెలలు నిండిన వనిత ప్రసవ వేదన పడుతున్నప్పుడు చేసే ఆక్రందనల్లాగా పక్షుల కిలకిలా రావాలు అనిపిస్తున్నాయి.
దుర్యోధనుడికి ఆ కవిత్వ సౌందర్యానికి ఒళ్ళు పులకరించింది.కాళిదాసు యొక్క గుర్రాలకు గడ్డి అమ్మే వాడికే యింత కవిత్వం వస్తే యింక కాళిదాసును నేనెలా ఎదుర్కొన గలను?యింక రాజాస్థానం లోపరాభవం తప్పదని
భయం వేసి దేవీ కటాక్షం మీద కూడా నమ్మకం పోయి ఈ కవుల ముందు తాను నిలువ లేనని పించి
అప్పటికపుడే తన సేవకులందరినీ లేపేసి తెల్లవారక ముందే సపరివారం గా వూరు విడిచి వెళ్లి పోయాడు.
కాళిదాసుr
' మాణిక్యవీణా ముపలాలయంతీం'
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీల ద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసాస్మరామి
అని దేవిని స్తోత్రం చేసుకుంటూ ఇల్లు చేరాడు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా చాలా బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

Excellent.This literary beauty should be revived to establish Italian of East.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.