గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, మార్చి 2020, శుక్రవారం

శ్రీ శివభారతము -గడియారము వేంకట శేషశాస్ర్తీ

 జైశ్రీరామ్
శ్రీ శివభారతము -గడియారము వేంకట శేషశాస్ర్తీ

సంస్కృతంలో రామాయణం ఆదికావ్యమైతే, తెలుగులో మహాభారతం ఆదికావ్యం. ఇది కవిత్రయ కృతం. ‘అందు ఇది దొడంగి మూడు కృతులు ఆంధ్ర కవిత్వ విశారదుండు, విద్యా దయితుం డొనర్చె మహితాత్ముడు నన్నయభట్టు దక్షితన్ అని చెప్పి తిక్కన సోమయాజి పదియేనింటి తెలుగు చేసెదనన్నాడు. కథ ముగించి ‘హరిహరనాథ సర్వభువనార్చిత నన్ను దయజూడు మెప్పుడున్’’ అని చెయ్యి కడుక్కొన్నాడు. తిక్కన లెక్క ప్రకారం పదునెనిమిది పర్వములు వెలువడినవి. ‘అరణ్య పర్వశేషము.. కవీంద్ర కర్ణపుట పేయముగన్’ పూరించినఎఱ్ఱన ఎక్కడున్నాడు? ఈ కించిత్పూరణమే ఎఱ్ఱనకు, నన్నయ తిక్కనల ప్రక్క ప ఈఠం కల్పిస్తుందా? అంటే, ఎఱ్ఱన హరివంశం తెనిగించినాడు. అది ప్రౌఢరచన. మహాభారతానికి హరివంశం శిష్టం. హరివంశం కలి వస్తే కాని, మహాభారతానికి పూర్ణత్వం రాదు. అందుచేత హరివంశకర్త ఎఱ్ఱన గణేయుడైనాడు. అయినా ఎర్ఱనకు తిక్కనపట్ల అపారమైన భక్తి. తిక్కనను కవిబ్రహ్మ అన్నాడు. తిక్కన సృష్టి తిక్కనదే. అది తక్కొరులచేత కాదు అన్నాడు. తరువాత వచ్చిన నాచన సోమనాథుడు- తన ఉత్తర హరివంశ కావ్య గద్యలో ‘తిక్కన సోమయాజి ప్రణీతంబైన మహాభారత కథానంతరం తిక్కనను మఱపించే కావ్యసృష్టి చేసినవాడననిసగర్వంగా చెప్పుకున్నాడు. తరువాత ఒకరిద్దరు తిక్కనకు ఉద్ది కావలెనని ప్రయత్నించినారు. చెప్పుకొన్నారు కూడా. కాని, ఎఱ్ఱన చెప్పిన మాటనే మనం గ్రహించక తప్పదు. తిక్కన కావించిన సృష్టి సృష్టి తక్కొరులచేతకాదు.
కాలం కడిచింది. ఇరువదవ శతాబ్ది వచ్చింది.
శ్రీమంతము సకల కళాసీమ ప్రకృతి సహజభాగ్యసేవధి విజ్ఞానామృత భాండము, దైవతభూమి, ఋషుల భూమి, భరతభూమి- కళ తప్పింది. పరుల పాలనలో ప్రజలు క్రక్కలేక, మ్రింగలేక, అల్లాడుతున్నారు. నలుదిక్కుల మబ్బులు. ఈ పరిస్థితిలో-
‘‘అలసాయాత సమీర సంయమిత సంధ్య గర్భనిర్బిన్న కం
దల బాలారుణ పాదచోదన దళన్మందేహ సందోహమూ
చెలువౌ ఒండొక సుప్రభాతం’’ వచ్చింది.
అరుణోదయం,మందేహరాక్షస పలాయనం, మబ్బులు విచ్చిపోగా కళకళలాడే ప్రకృతి శోభ అదే సుప్రభాతం. అదే శివభారతం. తిక్కనామాత్యుడు ‘ఆంధ్రావళి మోదమున్ బొరయ’ భారతం కూర్చినాడు. శివభారతకర్త శ్రీ గడియారం వేంకట శేషశాస్ర్తీగారు జగములున్నంత వరకెల్ల జనులు చదివి తనియుదురుగాక అన్నారు. అంటేశివభారతం ఆచంద్రార్కం నిలుస్తుందన్నమాట. ఇతివృత్తం భారతహృదయమే. రచన తిక్కన సోమయాజి అడుగుజాడల్లో నడిచిన రచన. ఎందుకు నిలవదు?
శ్రీ విశ్వనాథవారు తిక్కన శిల్పపు తెనుగుతోట అన్నారు. శిల్పపుతోట అంటే అందంగా చూడముచ్చటగా కత్తిరించి, పందిరికెక్కించి, మలచిన పుష్పలతా తరువిలాసం కలిగిన ఉద్యానవనం. తిక్కన తన నిర్వచనోత్తర రామాయణావతారికలో అమలోదాత్త మనీష! నే నుభయ కావ్యప్రౌఢి వాటించు శిల్పమునన్ సారగుడన్ కళావిదుడ అన్నాడు. అటువంటి కోటికెక్కినశిల్పం శివభారతంలో అడుగడుగునా కనిపిస్తుంది.
శాస్ర్తీగారు కాళిదాసాది గీర్వాక కవుల, నన్నయాధిక ప్రాక్తనాద్యత నాంధ్ర కవుల ఒక్క ముక్కలో చెప్పి, సోమయాజికి చంపకమాలిక అర్పించినారు.
‘‘హరిహరనాథ శాంతమధురాకృతి లోపలి చూపునన్ పురా
చరిత తఫః ఫలం ఋభయసత్కవిమిత్రత వెల్గ ధ్యాన త
త్పరుడయి భారతాగమము పల్కెడు తిక్కన వాక్కు వెంట త
త్కరమున తాండవించు వరదాయిని లేఖిని నే భజించెదన్
సోమయాజి ధ్యానతత్పరుడై భారతరచనను చేస్తున్నాడు. కాదు, పలుకుచున్నాడు. ఆ పలుకు వెంట గంటం నడుస్తూ వుంది. శాస్ర్తీగారి స్వానుభవం కూడా ఇదే లాగున వుంటుంది.
మాఘమహాకవి- ‘‘గహన మపరరాత్రప్రాప్త బుద్ధిప్రసాదాః కవయః ఇవ మహీపాః చింతయంత్యర్థజాతమ్’’ అన్నాడు. రాజులు కవుల వలె వేకువ జామున రాజకీయ విషయాలు ఆలోచిసాతరట. అంటే, నాలుగవ జామున బుద్ధికి ప్రసన్నభావం కలుగుతుంది. శాస్ర్తీగారు తెల్లవారుజామున లేచి, కూర్చుండి, కళ్ళు మూసుకొని, కథలో లీనమై, తనలో తాను పద్యాలు అల్లుకుంటూ పోతారు. చేతిలో చక్కగా మెదిపిన ఏకులోనుండి వడుకుతూ దారం తెగకుండా తీసినటుక్ల, పద్యపరంపర సాగిస్తారు. అదంతా సృదయ కమలంలో ఒదిగి వుంటుంది. ఉదయం లేచి కాల్యములు తీర్చి, జపాదులు ముగించుకొని కూర్చుండి, కాగితాలు కలం తీసుకొని అదంతా వ్రాస్తారు. అవి వంద పద్యాలు కావచ్చు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)
-సి.వి.సుబ్బన్న శతావధాని
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.