గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మార్చి 2020, గురువారం

వార్ధక్యం వయసా నాస్తి.....మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.
శ్లో.  వార్ధక్యం వయసా నాస్తి
మనసా నైవ తద్భవేత్‌
సంతతోద్యమ శీలస్య
నాస్తి వార్ధక్య పీడనమ్‌

ఆ.వె. వయసులోన లేదు వార్ధక్యదుస్స్థితి.
మనసుకూడ వీడి మనుటె యొప్పు.
నిరతముద్యమించు నేర్పిరిఁ జేరదు
ఉద్యమమున సతతమొప్పుమయ్య.

భావము. ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు.
ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదు.

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం.
వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.
కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు.
 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు.* కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.

పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు.* _అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన పరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి.
ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగు లాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.

మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి.
భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు.
నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.