జైశ్రీరామ్.
పద్య పక్షమ్ ఛందస్సు ( 5 )
ఆర్యులారా! వందనములు.
ఇంతవరకు మనము
పద్య పక్షమ్. ఛందస్సు
(1) లో శ్రీకారము కృత్యాదిని కలిగినచో
దాని ప్రభావము. / కృతి రచనకుఁ
బ్రశస్త వారములు, గురు లఘువుల స్వరూపము,
పద్య పక్షమ్ ఛందస్సు ( 2 ) లో గణ స్వరూప నిరూపణము. గణముల కుదాహరణములు,
‘సూర్య - ఇంద్ర - చంద్ర’ గణములు వివరణము.
పద్య పక్షమ్ ఛందస్సు ( 3 ) లో యతులు యతికి పర్యాయపదములు. ౧. స్వర యతులు .
పద్య పక్షమ్ ఛందస్సు ( 4 ) లో ౨. వ్యంజన
యతులు. మనము
తెలుసుకొన్నాం కదా.
ఇప్పుడు
పద్య పక్షమ్ ఛందస్సు ( 5 ) లో ఇరువది నాలుగు నుండి ముప్పది ఆరు వరకు ఉన్న
ఉభయ యతులను, ప్రాస యతిని తెలుసుకొను ప్రయత్నము చేద్దాము.
౩. ఉభయ
యతులు.
24) యుష్మదస్మచ్ఛబ్ద
యతులు.
యుష్మదాగమనము
< యుష్మత్ + ఆగమనము > యుష్మద్ + ఆగమనము >
ఇందులో
పూర్వ పదాంతము ‘ద’ - పరపదాది ‘అ’ వర్ణములున్నవి.
ఈ రెంటిలో దేనికైనా యతి చెల్లును.
ఉదా.
తే.గీ. యుష్మదా
(త్ + ఆ = ద్ + ఆ) గమనాదులనుండు
త - అలు
రెంటికిన్ జెల్లు యతులిట
శ్రీ నృసింహ!
అలరఁ జేయును కద యుష్మదా (త్ + ఆ = ద్ + ఆ) గమనము.
తరలి రా. దేవరా! అస్మద (త్ +
ఆ = ద్ + అ) ర్థమనఁగ.
25) పరరూప
యతి.
శకంధు శక + అంధు = శకదేశమునందలి బావి. శకంధువు
తత్సమరూపము.
శకంధ్వాదిషు పరరూపం
వాచ్యమ్. అను
వ్యాకరణ సూత్రముననుసరించి శక +
అంధు =
శక్ + అంధు = శకంధు అను రూపము అగును.
అటులనే వేదండ శబ్దమునెఱుంగునది.
వేదండ < వేద + అండ
> అఖండ
శబ్దము వలె గాన వచ్చుటచే యిట్టి పదములలో ఉభయ యతి.
అనగా
" ద - అ " అను రెండింటిలో ఏ వొక్క
అక్షరంతోనైనా యతి చెల్లును.
ఉదా.
తే.గీ. అనుపమానుండ
మత్తవేదం (వేద+అండ=వేద్ + అండ) డ పక్ష !
దయను గావించినావు వేదం (వేద+అండ=వేద్ + అండ) డ రక్ష!.
అనుచు చెప్పిన పరరూప
యతిగ చెల్లు.
తత్సమంబున వ్యాకర్త
తలచెనిటుల.
26) ప్రాది
యతి.
ప్రాప్తి < ప్ర + ఆప్తి > యిందు " ప్ర
- ఆ " అనే
2 వర్ణములలో ఏ
వొక్క దానితో నైనను యతి చెల్లును.
ఉదా.
తే.గీ. ప్రా
(ప్ + ర్ + ఆ) ప్తమైనది కను పరమా (మ + ఆ) త్మ కృపగ.
ప్రా (ప్ + ర్+ ఆ) ప్తమవనిది కోరక వదిలిపెట్టు.
ప్రాదియతులిట్లు చెల్లును
పద్యకృతుల.
పద్య పక్షాన వ్రాయుచు ప్రబలవచ్చు.
27) అఖండ
యతి ( లేదా ) నిత్య సమాస యతి.
కర్ణాట < కర్ణ + అట
> ఇది పద
విభాగము తోపని నిత్య సమాసము. కావున యిట్టి పదములలో " ర్ణ - అ "అను 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి చెల్లును.
ఉదా.
తే.గీ. ఆంధ్ర భోజుండు చూడ కర్ణా (ర్ణ + అ) ట రాజు.
నాణ్యమాంధ్రమ్మువోలె కర్ణా (ర్ + ణా) ట భాష.
ఖండనంబిందు మనలకు కానఁబడమి
రెంటినేదైన చెల్లుట
కంటిమిచట.
28) దేశ్య
నిత్యసమాస యతి.
దేశీయమైన
తెలుగు పదములు దేశ్యములు.
క్రిక్కు+ఇఱియుట=క్రిక్కిఱియుట
రూపు+అఱ=రూపఱ, అఱు=నశించు. రూపఱు= రూపు నశించు
పెంపు+అఱ=పెంపఱ.
పెల్లు+అఱ=పెల్లఱ.
ఏపు+అఱచుట=ఏపఱచుట,
విడదీసినప్పుడు
వచ్చిన హల్లు తోగాని అచ్చు తోగాని ఉభయ యతి
చెల్లుట దేశ్యనిత్యసమాసవిశ్రాంతి.
క్రిక్కిఱియుట
< క్రిక్కు + ఇఱియుట
> అచ్ సంధి (ఎడ లేక వ్యాపించుట అని అర్థము) అయి యేక పదముగా
కనిపించుచున్న దేశ్య పదములందు " క్కు
- ఇ "
వంటి 2
వర్ణములలో ఏ వొక్క వర్ణముతో నయినను యతి చెల్లును.
ఉదా.
తే.గీ. ఇపుడు సభలోన జనులుక్రిక్కి (క్రిక్కు + ఇ) ఱిసి యుంట
పద్యపక్షము మహిమయే భవ్యులార!
కూర్చునుండిరి జనులు క్రిక్కి (క్రిక్కు + ఇ) రిసి యచట
రాయతీలను పంచునాప్రభువటంచు.
29) నిత్య
యతులు.
క్రూర
కర్ముడేనియు < క్రూరకర్ముడు + ఏనియు
> యిందు
" ఐనాసరే అనే అర్ధంలో ఏనియు అనేపదంతో కూడిన మొదటిపదం నిత్య సమాసంగా
కనిపిస్తున్నందున యీ పదంలో " డు
- ఏ " అనే
2 వర్ణాలలో
ఏవొక్కవర్ణంతోనైనను యతి చెల్లును.
ఉదా.
ఆ.వె. ఇలను క్రూరకర్ముడే (డు + ఏ) నియు గురువుతో
డున్న యగును సిద్ధుడే (డు + ఏ) నిజంబు.
ఇటుల మీరు చెప్పిరేని
నిత్యయతిగ
పద్యపక్షమందు ప్రబలకున్నె?
30) రాగమ
సంధి యతి.
జవరాలు; జవ + ఆలు; ఇందు { ర్ + ఆగమ } (ర్) ర ఆగమంగా
వచ్చినందున యిట్టి చోట " ర - అ " అను 2 వర్ణములలో ఏ వొక్క దానికైనను యతి వేయ వచ్చును.
ఉదా.
తే.గీ. రమ్య గుణ పూర్ణ! నా ముద్దరాలవీవు.
ఆలయంబునకున్ జవరా (ర్ + ఆ) ల రమ్ము.
ఇటుల రాగమ సంధిలో నెఱిఁగి చేయ
రెండిటికి కూడ యతులు
సత్కృతులనొప్పు.!
31) విభాగ
యతి.
గంపెడేసి; గంపెడు + ఏసి
> ఇట్టివి
నిత్య సంధులు. ఇట్టిపదములలో " డు
- ఏ " అను
2 వర్ణములలో ఏవొక్క
వర్ణమునకైనను యతి వేయ
వచ్చును.
ఉదా.
ఆ.వె. ఇతఁడు గడ్డి గంపెడే
(డు + ఏ)
సి గోవుకుఁ
బెట్ట
డు తను కోరు కడివెడే (డు + ఏ) సి
పాలు.
‘ఇ -
డు’ ల దేనికైన నిటులయతిని వేయ
కను విభాగ యతిగ. ఘనుఁడ! కృష్ణ!
32) నామాఖండ యతి.
రామయ్య; రామ + అయ్య; ఇట్టి
అఖండ నామములలో " మ - అ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి వేయ వచ్చును.
ఉదా.
తే.గీ. మహిని యతి చెల్లుకృతిని రామయ్యయనిన.
అతఁడు సరిపోలు నయ్య రామ (మ + అ) య్యకనిన.
అగును కనగ నామాఖండ యతి. నిజంబు.
మ అ లు రెంటికిన్ యతికి
సమ్మతము కృష్ణ!
33) పంచమీవిభక్తి
యతి.
రామునికన్న
< రామునికి
+ అన్న > < రామునకు + అన్న
>
రామునికంటే
< రామునికి + అంటే
>
ఇట్టి
పదాలలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ వచ్చును.
ఉదా.
తే.గీ. కుంభినిన్ గన రామున క (కు + అ) న్న ఏడు.
అరయ లక్ష్మయ్య రాముని కం (కి + అం)
టె చిన్న.
కుదురు రామునకన్నలో
‘కు -
అ’
ల రెంటి
లోన దేనికైనను వేయనౌను
కృష్ణ!
34) కాకుస్వర
యతి.
లేరో < లేరు + ఓ
> ఇట్టి
పదములందు " రు - ఓ " అనునటువంటి 2 వర్ణములలో
ఏ వొక్క
వర్ణమునకైనను యతి వేయ
వచ్చును.
ఉదా.
తే.గీ. ఉండిరో? దివ్యులిలను లేరో (రు + ఓ) యనినను,
రుక్మిణీపతి సములుందురో (రు + ఓ) యనినను,
తగును రు ఓ లు రెంటికి
తగిన యతులు.
అమరు నిదియె కాకుస్వర
యతిగ కృష్ణ!
35) ప్లుతయుగ
యతి.
ఏ (ఎ+ఎ+ఎ) గతి కాచెదో రఘుపతీ < ఏ గతి కాచెదో రఘుపతీ (త్+ఇ+ఇ+ఇ) > మొదటి వర్ణమునందు, యతి స్థానమునందు ప్లుతవర్ణములున్నందున ఈ 2 ప్లుత వర్ణములకు యతి వేయ వచ్చును.
ఉదా.
ఆ.వె. ఓ (ఒ + ఒ + ఒ)
మహేశ! మేలుకో (క్ +
ఒ + ఒ + ఒ)
మహితాత్మ! శం
భో (భ్ + ఒ +
ఒ + ఒ)
జనహిత! యేలుకో (క్ +
ఒ + ఒ + ఒ)
నితాంత!
ప్లుత యుగమునకుయతి పూజ్యతనొప్పును
పైన తెలిపినటుల వరలు
కృష్ణ!
౪. ప్రాస
యతి
36) ప్రాస
యతి. యతి స్థానమునకు బదులు ప్రాస స్థానమున యతిని వేసినప్రాసయతి.
దీనికి అచ్చుమైత్రి అక్కరలేదు.
ప్రాస
నియమమే
వర్తించును.
సీసము.
తేటగీతి. ఆటవెలది. మున్నగు పద్యములందు యతికి బదులు ప్రాస యతి వేయ
జెల్లును.
ఉదా:-
తే.గీ. తెలుఁగు భాషయే జగతికి జిలుఁగు నిజము.
తెలుఁగు చదివినఁ బాపముల్ తొలఁగు నిజము.
తెలుఁగు పాండిత్య శోభయు కలుగు నిజము.
తెలుఁగు సుకవియె లోకాన వెలుఁగు నిజము.
< తెలు - వెలు > తె మొదటి అక్షరము. యతి స్థానమున యతి వేయ బడలేదు.
ప్రాసాక్షరమునకు
యతి వేయబడినందున యిది ప్రాసయతికి ఉదాహరణ యగుచున్నది. స్వస్తి.
జైహింద్.