గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2016, బుధవారం

పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో వడ్ల గింజల లెక్క !

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో వడ్ల గింజల లెక్క ను
 వివరించి చూపారు.  
మీరూ చూడండి.
చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగంలో ఉండే 64 గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా ! అనే లెక్క గురించి మనకి తెలిసిందే కదా ? 
పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో యీ లెక్కనీ, దాని జవాబునీ యిచ్చాడు . చూద్దామా! ...
మొదలొకట నిల్పి, దానిం
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్

ఇదీ లెక్క. దీనికి జవాబు :
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మ జాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్
ఇందులో కవి అంకెలకి బదులుగా కొన్ని సంకేత పదాలు ఉపయోగించాడు. వాటి అర్ధాలు తెలుసుకుని వరుసగా అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది . ఐతే, అంకెలను వెనుక నుంచి, అంటే, కుడి నుండి ఎడమకు వేసుకుంటూ వెళ్ళాలి.
పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు ...
శరములు = సాయకములు = ఐదు
శశి =చంద్రుడు = తుహినకరుడు = ఒకటి
షట్కము = ఆరు
వియత్తు = గగనము = సున్న
వేదములు = నాలుగు
పద్మజాస్యుడు = నాలుగు ముఖములు గల వాడు =బ్రహ్మ = నాలుగు
రంధ్రములు = నవ రంధ్రములు = తొమ్మిది
అగ్నులు = మూడు
నగములు = భూ ధరములు = గిరులు = ఏడు
తర్కములు = ఆరు
కుంజరములు = అష్ట దిక్కులలో ఉండే ఏనుగులు = ఎనిమిది.
ఈ సంకేత పదాల అర్ధాలను అనుసరించి వెనుక నుండి అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది !
అలా చేస్తే వచ్చే జవాబు చేంతాడంత !
ఇదిగో, చూడండి ...
ఈ లెక్ఖ ప్రకారం 18446744073709551615.  వడ్లగింజలవతాయి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వడ్లగింజల లెఖ గమ్మత్తుగా ఉంది. పంతుల జోగారావు గారికి+చింతా వారికీ ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.