జైశ్రీరామ్
శంకరు నవతారంబగు శంకర గురువర్యు దలతు సకలభయ వినా
శంకరు సర్వజ్ఞుని పద
పంకజముల గొలుతు జ్ఞాన వైభవ నిధులన్
శ్రీశ క్షీరాబ్ధివాస యోగీశ చక్రి
భోగివర భోగ మణి దీప్త పుణ్యమూర్తి
జన్మ వారిధి పోత శాశ్వత శరణ్య
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
కమలభవ శక్రముఖ దేవ గణ కిరీట
చయ విఘట్టిత పద సారసరుచిమంత
శ్రీరమా కుచసరసిజ శ్రీమరాళ
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
ఘోర సంసార జలధిలో క్రూర వక్ర
నక్ర దంష్ట్రలకున్ జిక్కి నలుగుచుంటి
వ్యగ్రుడను రాగ రసనోర్మి బాధితుడను
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
భవ మహా ఘోరవనమున పంచబాణ
దుష్ట మృగ బాధలొందు నార్తుడను దేవ
మత్సర నిదాఘమున నిట మాడుచుంటి
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
భవ గభీర కూపమ్మున బడితి దుఃఖ
సర్పశత బాధలకిట వేసారుచుంటి
దీనుడను నన్ను బ్రోవుమా దేవ దేవ
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
ఘోర సంసార సింధుర కుటిల హస్తఘాత నిష్పిష్టితాంగుడ నైతి దేవ
ప్రాణభీతిని బాపుమా భయవినాశ
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ
జన్మ సర్ప మహోగ్ర దంష్ట్రా కరాళ
గరళ దగ్ధాంగుడను నేను గరుడ వాహ
అమృతసాగరావాస దయాలవాల
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ
భవమహా జాలమున జిక్కు వడితి నింద్రి
యములనెడు గాలమునకు నేనగుదు నెరగ
తలయు దౌడలు వ్రక్కలౌ దయతలంచి
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ
భవము బీజమ్ము సంసార పాదపమున
కర్మములు బహుశాఖలు కాముడు విరి
ఫలము దుఃఖమా చెట్టెక్కి పడితి దేవ
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ
అతుల భయద సంసార దావానలంపు
జ్వాలలకు నూరువుల దాక కాలె దేవ
శరణు నాకింక నీ పాద సరసి యొకటె
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ
యమభటులు కంఠమునకు పాశమును వేసి
లాగుచుండిన విధము దలంప గలమె
మృత్యుభయనాశ నిన్ను స్మరింతు నీశ
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ
శ్రీమదిందిరాసేవిత శ్రీ పదాబ్జ
కరకమలముల శంఖచక్రములు నభయ
వరద ముద్రలు నలరునో భద్ర రూప
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
ప్రథిత ప్రహ్లాద నారద ప్రముఖ నైక
భాగవత భవ్య మానస పద్మవాస
భక్తజన పరిపాలన పారిజాత
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
అంధుడ హృతవివేక మహాధనుడను
దొంగలింద్రియములు నన్ను ద్రోసిరిందు
మోహకూపమ్మునన్ వ్యథల్ పొందుచుంటి
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
శ్రీశ వారిజనాభ సురేశ విష్ణు
ముక్తిదా మధుసూదన పుష్కరాక్ష
కేశవా వాసుదేవ శ్రీకృష్ణ వరద
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
మాయచేత భవప్రవాహ మగ్నుడయ్యు
నే విభుని సాయమంది రక్షింపబడెనొ
అట్టి లక్ష్మీనృసింహ పాదాబ్జ భృంగ
మనెడు శంకరుడీ స్తోత్రమును రచించె
ఫలశ్రుతి
అమిత భక్తి భావమ్ముతో హరిని దలచి
ఈ స్తవమును పఠించు వారీ ధరిత్రి
నఖిల భోగభాగ్యమ్ముల ననుభవించి
జీవితాంతమునన్ హరిన్ జేరగలరు.
జైహింద్.
2 comments:
శ్రీమత్ శంకరభగవత్పాదుల కరావలంబ స్తోత్రమునకు చక్కని తెలుగు అనువాదమునందించిన శ్రీ పండిత నేమానివారికి, పాఠకులు చదువుకొనుటకు అనుకూలముగా బ్లాగులో పోస్టు ఛేసిన శ్రీ చింతా రామామకృష్ణారావుగారికి పాదాభివందనములు.
చక్కని శైలిలో సాగిన కరావలంబ స్తోత్ర అనువాద పద్యములు నిత్యపఠనీయములు.
శ్రీ సరస్వత్యై నమః:
ఓ మిత్రమ చింతాన్వయ
సోమా శ్రీ రామకృష్ణ సుకవీ వినుమా
మా మధ్యకు మౌనమువిడి
రా మేలగు శంకరాభరణమునకు సుధీ!
Pandita Nemani
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.