గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2012, సోమవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 6 / 14

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
కః-
మును వచ్చిన దారిని - నే - వినుత చరిత! చనఁగ వచ్చు, వేఱె యొరులు దా
రిని చూప వలెనె? పోవం - గను జూపెద, నంటి వచ్చి కనుఁగొనెదు గదా! ౨౬.
నే మును వచ్చిన దారిని చనగ వచ్చును. వినుత చరితుఁడా! వేఱె ఒరులు దారి చూప వలెనా? పోవంగను చూపెదను. అంటి వచ్చి, నీవే రా కనుగొనెదు కదా!అని వసువుతో నర్మ సచివుఁడు పలికెను.
గీః-
అనుచుఁ దా వరూధిని నిల్వ నతని "ననఘ! - కొంత తడవోపి యుండినఁ గుతుక మొప్ప
నశ్రమంబున నేఁగంగ నగును గాదె?" - యంచుఁ గోరఁగ బోవఁగా నెంచి యతఁడు. ౨౭.
అని పలుకుచు, ఆ నర్మ సచివుఁడు వరూధిని (సేన అంతయు) నిల్వ (ఆగిపోఁ) గా,  అతనిని (ఆ వసువును) అనఘ! కొంత తడవు ఓపి యుండిన కుతుకమొప్ప ఆశ్రమంబునకు ఏగంగనగును కదా! అంచు కోరఁగా అతఁడు(ఆ వసురాజు) పోవగా నెంచి,.....
గీః-
పోవలయు వేగ, నా యింటి పువ్వుబోడిఁ - జూడవలె, నిత్య కృత్యముల్ చొప్పు దప్పి,
యుండె, నా మది దానిపై నొనర - నెపుడు  -  గాంతునని హిత! కార్య సంహటన కొఱకు. ౨౮.
ఓ హిత!(స్నేహితుఁడా)! వేగన్ పో వలయు, ఆ ఇంటి పువ్వుఁ బోడిని చూడ వలెను. నా మది దానిపైన ఒనర(ఒప్పి యుండ)గా, నిత్య కృత్యములు చొప్పు(క్రమము) తప్పి,  కార్య సంఘటన కొఱకు ఎప్పుడు కాంతును? అని ఉండెను. 
కః-
అన, నను గూడఁగ నీకున్ - గననగు సౌఖ్యంబటంచుఁ గైకొని యాలిం
గన మును జేయఁదగ, దనియుఁ - జను పొమ్మని గెంటని హిత సంభ్రమ మొలయన్. ౨౯.
అని వసు రాజు అనగా, (నర్మ సచివుఁడు) నను కూడఁగ(నన్ను అనుసరించి) వచ్చినచో, ఓ రాజా నీకు సౌఖ్యంబు కన నగును. అటంచు (అనుచు) కైకొని (పూని), ఆలిని(కాంతను) తగు విధముగ కనునట్లు చేయగా, తనియును.  చను(ఇది చేయనొప్పును) పొమ్మని, గెంటని(తొలగింప సాధ్యము కానిదగు) హిత  (మిత్రుని యొక్క)  సంభ్రమము ఒలయగా(ప్రకాశింపగా).......
గీః-
పిలిచికొని పోయి చూపినఁ బ్రేమ మీఱ - నంగనను పెద్ద సేయఁగ నాత్మ - మాటు
సేసి కనుఁ బురుషవరుండు చిత్తమలరఁ - గా మముల నువిదల మించు కామ మున్నె! ౩౦.
పిలిచి, కొనిపోయి, ఆకన్యను చూపిన, ప్రేమ మీఱ ఆత్మ యందు ఆ అంగనను పెద్ద సేయగను(గౌరవించుటకై) మాటు సేసి (చాటున ఉండి) పురుష వరుండగు  వసురాజు చిత్తము అలరునట్లు చూచును. కామము లన్నింటను ఉవిదలకు మించిన కామము ఉన్నె?
(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.