గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 3 / 14

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శిక్తిమతిని అడ్డగించుట.
వః-
ఆ ద్విజ రాజ వంశజుఁడు దిగంతములఁ గను కీర్తిఁ గల్గి యుండునంత. ౧౧.
ఆద్విజ రాజ (చంద్ర) వంశజుఁడైన వసు రాజు దిగంత వ్యాప్త కీర్తుఁడై యుండగా,
గీః-
అమర నాథానుమతి స్వస్థలమున కొకట -వచ్చి యుండినఁ బల్వురు పాక శాస
నత్వమునఁ బవిత్రప సదనమునఁ బొగడ - నాతి మోదానఁ బతి వసు నేతఁ గనును. ౧౨.
అమర నాథానుమతిచే స్వ(ర్గ)స్థలమునకు ఒకపర్యాయము వసురాజు వచ్చి యుండగా పల్వురు పాకశాసనత్వము (ఇంద్రపదవి)కారణముగా ఇంద్ర సదనమున పొగడగా, పవి (వజ్రాయుధము) వలని త్రప (సిగ్గుచే) ఆతి మోదాన (తగ్గిన సంతోషముతో) వసునేతను  గనును.
కః-
అతఁడీ విధమున నభ్యా - గత సేవాభిరతిఁ గొంత కాలము భాగ్యో
న్నతి నుండు నంత నభ్యా- గత వేళం గౌతుకంబు గడలు కొనంగన్. ౧౩.
అతఁడు (వసురాజు) ఈ విధమున అభ్యాగత సేవాభిరతిచే కొంత కాలము భాగ్యోన్నతి నుండగా, అభ్యాగత (రాబోయే) వేళలో కౌతుకము కడలు కొనగా,
సీ:-
ఎఱ్ఱని జటలతో నెసఁగు జొంపము గల - వి లసితమగు క మండలువు తోడ,
భస్మ గర్భామోద బంధుర రుద్రాక్ష - మాలికా సత్ కదంబముల తోడఁ
దళతళ ద్యుతులతో దళమెత్తు పోల్కి నెం - తయు వన్నె గల మృదు త్వక్కు తోడ,
నందమై కొనసాగు యర్జునంబున నొప్పు - కమనీయ మౌ తిలకంబు తోడ,
గీః-
ఎంతయును జెన్ను మీఱి వసంతుఁడనఁగఁ - బరగు నౌషధ సిద్ధుండు ప్రజల కెల్ల
నయన పర్వంబుగా మహోన్నతిని గాంచి - మించి యతని కొలమున కేతెంచె నొకట. ౧౪.
(వసంత ఋతువర్ణనము.)
ఎఱ్ఱని జట (ఊడ) లతో, ఎసగు (ఒప్పెడు) జొంపము (చివురు) గలిగిన, వి (పక్షులచే) లసిత (ప్రకాశమాన) మగు కమండలువు (జువ్విచెట్టు) తోడ, భస్మగర్భ (ఇరుగుడు చెట్టు) తోను, ఆమోద (పరిమళముతోఁగూడిన) బంధుర (మనోహర) మైన రుద్రాక్ష మాలికలతోను, సత్ కదంబ వృక్షముల తోడను, 
తళతళ ద్యుతులతోదళమెత్తు (చివురులెత్తు) టకు పోల్కిని, ఎంతయు వన్నె గలిగిన, మృదు త్వక్కు (భుజపత్రపు చెట్టు) తోడను, 
అందమై కొనసా (ఎది) గి, అర్జునంబు (ఏరు మద్ది చెట్టు) న, ఒప్పుచున్న ఎంతయు చెన్ను మీఱి, ఒకట (ఒక్క సారిగా) ప్రజలకెల్ల నయన పర్వంబుగావసంతుఁడనగఁ బరగు సమస్త అఒషద్గములను సిద్ధింపఁ జేసిన వాఁడగు వసంతుఁడుమహోన్నతిని గాంచి (అతిశయించి) మించి పోవుచు అతని (ఆ వసురాజు యొక్క) కుల (జనపద) మునకు, ఏతెంచెను.
వః-
ఇట్లుండునంత నతి బలాధికుండు.౧౫.
ఈ విధముగా వసంత ఋత్వు వచ్చి యుండగా, అతిబల(పవనుఁడు అను) అధికుఁడు,
(సశేషం)

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.