గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఏప్రిల్ 2012, ఆదివారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 5 / 14

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
వః-
అంతఁ జని దానిం గనుంగొనుమన మున. ౨౧.
అంతట ఆ వసురాజు ఆ పాట యొక్క సంగతిని కనుఁగొనుము అనగానేసచివుఁడు మునుగా చని,......
చః-
కనె నవరత్న భాసితముఁ, గాంచన శోభిత, మార ఘట్ల మం
డన కదళీ వనాంతము, ఘన స్వన బంభరవా సిత ప్రఫు
ల్ల నవ సుమాతిగంధి మృదులచ్ఛదరాజి లతా ప్రతాన నీ
కనదురు కాయమాన పరి కల్పిత శీత మనోజ్ఞ హర్మ్యముల్. ౨౨.
నవరత్న భాసితము, కాంచన శోభితము, ఆరఘట్ట(ఏతము) మండన(అలంకారముగాఁగల) కదళీ వనాంతమున, ఘన స్వననమిక్కిలి రొద చేయుచున్న)   బంభర(తుమ్మెదలకు, వాసిత(నివాస యోగ్యమై యున్న)  ప్రఫుల్ల(చక్కగా వికసించిన) నవ సుమ(ములయొక్క), అతి గంధ(గొప్ప సువాసన చేత) మృదుల ఛద రాజి(లేత యాకు జొంపము చేత), లతా ప్రతాననీ(అల్లుకొనిన తీగల గుబురుల చేత), కనత్(విలసిల్లుచున్న) ఉరు(విశాలమైన) కాయమాన(పందిళ్ళచే)పరికల్పితమైనశీత మనోజ్ఞ హర్మ్యమును కనెను.   
కః-
కనుఁగొని హర్మ్యోపాంతం - బునకుం జని లోనికేఁగఁ బొలఁతి యొకతె వీ
ణను బూని కంఠ నాదం - బును మేళము సేసి గానము సలుపఁ జూచెన్. ౨౩.
ఈ విధముగ నర్మసచివుఁడు కనుఁగొని, హర్మ్యోపాంతమునకు చని, లోనికి ఏగఁగా, పొలతి యొకతె వీణను పూని, కంఠ నాదంబును వీణా నాదముతో మేళన చేసి, గానము సలుపు చుండగా చూచెను. 
ఆః-
అంత నాకె యంద మారసి వేవేగ - వచ్చి విభుని చాయ భావమంచు,
మెచ్చి మనుజ వర్య! మీర లేలిన నన్ను - మిన్న యంచు జనము నెన్నకుంద్రె? ౨౪.
అంతట ఆకె (ఆచిన్నదాని యొక్క) అందము ఆరసి, వేవేగ (రాజు కడకు) వచ్చి, తన భావము నందు మెచ్చి, విభుని చాయను (వసురాజు చెంగట) మనుజ వర్య! మీరలు ఈమెను పరిణయమాడి ఏలినచో ఆమెను అన్నుల మిన్న యంచు జనులెన్నకుందురా? అనెను.
కః-
అనిన నేకతంబుగను వనంబున నీవు - వచ్చి యుంటివ! బల!! యిచ్చటికిని
దారిఁదప్పిపోక నేరక యుంటి, మా - ర్గమ్ముఁ జూపుమన్న నెమ్మి ద్విజుఁడు. ౨౫.
సచివుఁడు ఆ విధముగా అనగా, ద్విజుఁడు(క్షత్రియుఁడైన వసురాజు) నీవు వనంబునందు ఏకతంబుగను,  ఇచ్చటికిని వచ్చియుంటివా! బల!(భళీ)దారి తప్పి, పోక(పోవుట)యనునది, నేరకఉంటివి.నెమ్మి మార్గమ్మును చూపుము.అని అనగా.

(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.