గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఏప్రిల్ 2012, బుధవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 1 / 14

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శిక్తిమతిని అడ్డగించుట.
ఆః-
ఆట పట్టు సిరికి న్యాయంబునకు, నధి - ష్ఠాన మనఁగ దనరి సౌధ వినిహి
తాబ్జ రాగ కాంతి నరుణాస్పదంబనఁ - బురము దనరు లోక భూషణంబు. ౧.
సిరికి, న్యాయమునకు, ఆటపట్టై, సౌధము లందు వినిహితమైన ( తాపఁబడిన) అబ్జ (పద్మ) రాగమణుల యొక్కకాంతిచే అరుణ కాంతికి ఆస్పదము అను విధముగా  తనరి యుండి, లోకము లన్నింటికీ భూషణమై అధిష్ఠానము అను పేరు గల పురము తనరుచుండెను. 
చః-
పురి ద్విజ కోటి ధాత, నృప పుంగవు లర్జును, వైశ్య పాళి కి
న్నరవరు, నంఘ్రిజుల్ హలిని, నట్టువకత్తెలు రంభ, నాగముల్
తురగములున్, మహీరుహతతుల్ సుర సింధుర సైంధవాద్రులన్
నిరతముఁ గ్రిందు సేయఁ దగు నేర్పున రంజిలు మంజు వైఖరిన్. ౨.
ఆ అధిష్ఠాన పురము నందలి ద్విజ కోటి ధాతను, నృప పుంగవులు అర్జునుని, వైశ్య పాళి కిన్నర వరులను, అంఘ్రిజులు హలి(బలరాము)నినట్టువ కత్తెలు రంభను, నాగములు, తురగములు, మహీరుహ తతులు - సుర సింధుర(ఐరావతము), సైంధ, అద్రులను (క్రమాలంకారము)నిరతమూ క్రిందు చేయుటకు తగిన నేర్పుతో, మంజు వైఖరితో రంజిలి యుండును. 
గీః-
పచ్చడాల్ పూని సకలార్థ భవ్య సాధ - నాత్మ పౌరుష వాగ్జాల మతిశయింప,
నతి ముదంబున వీర పండితు లనంగ - వెలయు చుందురు వీఁటఁ బ్రవీణులెపుడు. ౩.
ఆ అధిష్ఠానము అను వీఁటను ఎప్పుడూ పచ్చలు పొదగ బడిన డాలు ధరించి సకల అర్హముల భవ్యమైన సాధన వలన కలిగిన ఆత్మ పౌరుష వాగ్జాలము అతిశయించుచుండగా,  ప్రవీణులు వీర పండితులు అని అతి ముదంబున అనంగా (పలికేవిధముగా) యుద్ధ కుశలురు వెలయుచుందురు.
ఆః-
భూమి దేవుఁడందుఁ బొల్చును ప్రవరాఖ్య - నుపరిచరుడనంగ నొప్పి వసువు
న్యాయ రీతి మిగుల నార్జించిన ఘనుండు - తేజ మొప్పఁగ ద్విజ రాజ కులము. ౪.
ఆ అధిష్ఠాన పట్టణ మందు ప్ర-వర- ఆఖ్యన్ (మిక్కిలి శ్రేష్ఠమైన నామముతో) ఉపరిచరుఁడు (ఆకాశ గమనము కలవాఁడు) అనంగ, ఒప్పి, వసువు ద్విజ రాజ కులము (చంద్ర వంశము) తేజ మొప్పునట్లుగా న్యాయ రీతిలో మిక్కిలి ఆర్జించిన ఘనుఁడు.భూమిపై దేవుఁడు అను విధముగా ఒప్పును.
కః-
ఆర్యావర్తన రహితుఁ, డ - శీర్యత్సుగుణ ప్రవృత్తి, చేది వినుతుఁడై
ధైర్య గుణ మొప్ప నాతని - చర్యన్ వినుతింప వశమె! శత ధృతికైనన్. ౫.
ఆర్యుల యెడ అవర్తన రహితుఁడు, అశీర్యత్(తక్కువ కాని) సుగుణ ప్రవృత్తి కలవాఁడును, చేది దేశమున వినుతుఁడై, ధైర్య గుణముతో ఒప్పు ఆ వసు రాజు యొక్క చర్యను శరధృతి(బ్రహ్మ)కైనను వినుతింప వశమా! 
Print this post

2 comments:

సో మా ర్క చెప్పారు...

"ప్రవరాఖ్య - నుపరిచరుడనంగ"ఈ పదాలు ఎంతో విశిష్టంగా పలికి శిష్టులలో వశిష్టులైనారు!ద్వ్యర్ధిలో ఇద్దరి పేర్లకు అర్ధం చెడలేదు పైగా సార్ధక మవడం విశేషం.పేరును పేరు లాగా తీసుకురావడం నిజంగా నాన్యతోదర్శనీయం!
ద్వర్ధి రచన సామాన్యంకాదు.రామక్రుష్ణా రావు గారూ!
ఆనందం అర్ణవమైంది.సంబరం అంబరమంటింది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! సోమార్క గారూ! మీ సంతోషాన్ని వ్యక్తం చేసిన విధానం నాకెంతో ముచ్చట గొలిపిందండి.
కవి క్రొత్తపల్లి సుందర రామయ్య గారు వసు స్వారోచిషోపాఖ్యాన రచనలోనే అత్యద్భుతమైన ద్వ్యర్థివాక్య నిర్మాణ నైపుణ్యము ఉందండి. ఒఅకటి రెండు పర్యాయములు కొంచెం ఆలోచించి చదివినట్లైతే ఆ పదములలో విరుపు అర్థమౌతుందండి.
మీ అభిమానానికి ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.