గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, సెప్టెంబర్ 2009, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 61.

0 comments

"యథా రాజా తథా ప్రజా" అన్న నానుడి గల శ్లోకం మనం పూర్తిగా తెలుసుకొందాం. ముందుగా శ్లోకాన్ని, పిదప నా అనువాదాన్ని, ఆ తరువాత భావాన్ని, తెలిపే ప్రయత్నం చేస్తాను. గమనించండి.

శ్లో:-
రాజా రాక్షసశ్చైవ శార్దూలాః తత్ర మంత్రిణః.
గృద్రాశ్చ సేవకాః సర్వే యథా రాజా తథా ప్రజా.

గీ:-
రాజు రాక్షసుండైనచో రాజ్యమందు
మంత్రులందరు పులులట్లు మసలు నిజము.
సేవకులు గ్రద్దలటులుండు. చిత్రమదియె.
రాజ్యమందలి ప్రజలుండు రాజులటులె.

భావము:-
ప్రజా రంజకముగా పరిపాలన చేయ వలసిన రాజే రాక్షసుడిలా ప్రవర్తిస్తే అతని వద్ద నున్న మంత్రులు ప్రజల పాలిట పెద్ద పులులగుదురు. సేవకులు గ్రద్దలై ప్రజలను పీకుకు తిందురు. రాజ్యమునేలే రాజు ఎలా ఉంటే ఆ రాజ్యమునందలి ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు సుమా!

కావున రాజ్యాధికారము ప్రాప్తించిన రాజు అతి జాగరూకతతో సద్వర్తనుడై మెలగ వలెను. అప్పుడే మంత్రులు, సేవకులు చక్కగ నుందురని గ్రహించుకొని మసలుకొన వలెను.

జైహింద్.

26, సెప్టెంబర్ 2009, శనివారం

నవదుర్గా ప్రార్థన

4 comments

నవదుర్గా ప్రార్థన.

శా:-
శ్రీ
శైలాత్మజ ! నీదు దివ్య తపమున్ శ్రీ శంభుఁడే మెచ్చి, తా
నాశించెన్ నినుఁ బెండ్లి యాడె. తను నిన్నర్థాంగిగాఁ బొందె. మా
యాశల్ తీర్చఁగ నీకు మ్రొక్క, నతడు న్నర్థించు మాబోంట్ల, తా
క్లేశంబొందఁగనీక కాచును గదా లీలన్ ! కృపాంభోనిధీ !

మ:-
మనమున్ భక్తి ప్రమోద భావమమరం బ్రహ్మంబునే బ్రహ్మచా
రిణి ! కాంచన్ సుకరంబె యయ్యెఁ దమకున్. శ్రేయంబులన్ గూర్చు నీ
మణిమన్ మందిర ద్వీపమంద మనముల్ మళ్ళించు సద్భక్తులన్
గని, కావంగ నుపేక్ష యేల? విలసత్ కారుణ్య మాహేశ్వరీ !

శా:-
భక్తిన్ మ్రొక్కెద, చంద్రఘంట ! కరుణా భాస్వన్మనోజ్ఞాకృతీ !
శక్తిన్ గొల్పుమ నిన్ను మాదు మదులన్ సౌమ్యంబుగా నిల్ప! దు
శ్శక్తుల్ మాయఁగఁ జేయఁ జేయుమ ! కృపన్. చాంచల్య భావంబులన్
యుక్తిన్ బాపుమ ! సద్గుణంబు లిడుమా ! యుక్త్యుక్తులం జేయుమా !

శా:-
శ్రీ కూష్మాండ శుభాఖ్య ! మాదు ప్రణతుల్ చేకొమ్మ ! జీవాళిలో
నీకాంతుల్ ప్రసరింప, వెల్గు నిలపై. నీ ధ్యాస లేకున్నచో
శోకాగ్నుల్ మము చుట్టి ముట్టు. కరుణా జ్యోత్స్నళి నీ నుండియే
చేకొన్నన్ శుభ సంహతుల్ గలుగు. సుశ్రేయంబులున్ గల్గెడున్.

మ:-
కన రావా ! మము స్కందమాత ! విలసద్గాంభీర్య సద్రూపిణీ !
కనులన్ మమ్ములఁ బెట్టి గాంచ తగదో ! కారుణ్య భావోజ్వలా !
తను హృద్భాషల నిన్ను భక్తిఁ గొలువన్, తత్వజ్ఞతన్ గల్గి, నిన్
మనమందెప్పుడు గాంచు భాగ్య మిడుమా ! మమ్మున్ గృపన్ జూడుమా !

శా:-
కాత్యాయని ! యో సు పూజిత పదా ! ఓ దుష్ట సంహారిణీ !
శ్రీ కాత్యాయన సన్మునీశ్వర సుతా ! శ్రీ చక్ర సంచారిణీ !
నీ కారుణ్యమె మాకు జీవనముగా ! నిన్ గొల్చు సద్భాగ్యముల్
లోకంబందున మాకుఁగొల్పి, కృపతో లోలాక్షి ! కాపాడుమా !

ఉ:-
శ్రీ కర కాళ రాత్రి ! నిను చిత్త సరోజము నందు నిల్పి, నీ
భీకరమైన రూపమును ప్రీతిగఁ జూడఁగ నిచ్చగించెదన్.
నీకరవాల మీ ధరణి నింగికిఁ బంపును దుష్ట సంహతిన్.
ప్రాకటమొప్పఁ గాచెదవు భక్తుల పాలిటి కల్పవల్లివై.

మ:-
కరుణా సాంద్ర ప్ర పూరితా ! వర మహా గౌరీ ! శివానీ! మమున్
దరిఁ జేర్చన్ నిను మించు వారు కలరే ! దాక్షిణ్య మొప్పారఁగా
ధరపై దుష్ట జనాళి నుండి మములన్ దప్పించి కాపాడుమా !
వరమై నీ మహనీయ నామ మెదలో వర్ధిల్లఁగాఁ జేయుమా !

మ:-
పరమేశానివి, సిద్ధి ధాత్రి ! కృపతో భక్తాళి నెల్లప్పుడున్
పరమేశుండును, నీవుఁ గూడి, కనుచున్, భక్తిన్ ప్రవర్ధింపుచున్,
వరమై తోడుగ నుండుఁడీ! సుజనులన్ వర్ధిల్లగాఁ జేయుచున్
దురితంబుల్ పొనరింపకుండ కనుడీ! దుష్టాత్ములన్ బాపుడీ!

జైహింద్.

జగదంబ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు.

0 comments


ఈ రోజు దుర్గాష్టమి. ఈ రోజూ, రేపూ, ఎల్లుండి,గొప్ప పర్వ దినాలు. మహాష్టమి, మహర్నవమి, మహా దశమి.
ఈ మూడురోజులూ దుర్గా మాత అందరి హృదయాలలోను కొలువై వుంటుంది.
అలా అందరి హృదయాలలోను కొలువైయున్న లోకమాతను మనం గ్రహించ గలగాలి. మనం చూస్తున్నది భౌతికమైన మానవులను అని అనుకొంటే మనకు రగద్వేషాలు చుట్టుముట్టుతాయి. మనం అందరిలోను ఆ లోకమాతయైన దుర్గాంబను చూడఁ గలిగితే నిరంతరము మనమా తల్లిని ధ్యానిస్తున్నట్టే ఔతుంది.

శ్లో:-
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా.
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.

గీ:-
యుక్తి నేతల్లి మనలోన శక్తి పేర
నుండి నిత్యంబు నలరారుచుండు, నట్టి
తల్లి దుర్గాంబ మది నెంచి తనివి తీర
నంజలించెద నామెకు నంజలింతు.

భావము:-
అన్ని ప్రాణులందును ఏ తల్లి శక్తి రూపములో నున్నదో అట్టి తల్లికి నేను త్రికరణ శుద్ధిగా నమస్కరించెదను.

అని మనం అందరిలోను మనకు కనిపించే లోక మాతను మనస్సులో ధ్యానించ గలగాలి. అప్పుడే మనం దౌష్ట్యాలకు దూరంగా వుంటాము. సత్ఫలితాలను పొంద గలుగుతాం.

దసరా సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆ లోక మాత కటాక్షములు మీకు సంప్రాప్తించాలని కోరుకొంటున్నాను.

జైహింద్.

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

శ్రీ వేపా భీమ శంకరం గారి దివ్య వ్యక్తిత్వము

0 comments

-:చూపరము:-

రచన: శ్రీ జయంతి సుబ్బా రావు, అనకాపల్లి.
రచనా కాలము:- 1940.
విషయము:- శ్రీ వేపా భీమ శంకరం గారి మహోన్నత వ్యక్తిత్వ వివరణాత్మకము.
సందర్భము: శ్రీ భీమ శంకరం గారి సప్తతి పూర్తి మహోత్సవము.

సంక్షిప్తీకరణ:- చింతా రామ కృష్ణా రావు, విశ్రాంతాంధ్రోపన్యాసకుడు, చోడవరము.

-:శ్రీ వేపా భీమ శంకరం గారి దివ్య వ్యక్తిత్వము:-
* * * * *
జననము:- విభవ నామ సంవత్సర కార్తీక శుద్ధ 11 తత్కాల 12 అనగా తే : 17 - 10 - 1868.
తల్లి : నరసమ్మ. తండ్రి : శ్రీరాములు.. తాత : వెంకన్న. ముత్తాత : వేంకటరామావధానులు.
నివాసము : చోడవరము. 12 వ యేట ఉపనయనమయ్యెను.

పరోపకారి:- తీర్థాటనములు చేయుచు, తెలుగు విద్యార్థులకు రెండవపూట భోజన సదుపాయము స్వయముగా యత్నించి, కల్పించెను. పేద విప్రులకు లకు వివాహార్థము ధనసహాయము చేసెడివారు.
అనేక మందికి వివాహములు జరిపించిరి.
వీరికి మేన మామ యగు ఆకెళ్ళ జగన్నాధము గారి 2 వ కుమార్తె బాల కామేశ్వరమ్మతో నందన వత్సర మాఘ బహుళ పంచమి నాడు వివాహమయ్యెను.
వీరి కుమార్తె కు చిన్నతనముననే వివాహము కాగా భర్త గతించెను. తల్లి మరణింపగా తండ్రి సంరక్షణ చూచు కొనుచు, అతిథి సేవ చేసెడిది. 1917 లో ఆమె స్వర్గస్తురాలవగా ఆమె పేర వికలాంగుల ధర్మ సత్రవును భీమశంకరం గారు స్థాపించిరి.

ఉద్యోగము:-1894 లో వకీలు గుమస్తాగా విజయనగరంలోను,
పిదప చోడవరంలో పనిచేసిరి.ఈ ఉద్యోగము వారి భవిష్యత్ సత్కార్యాచరణకు ఎంతగనో తోడ్పడినవి.
పిదప ఏజన్సీ కోర్టు వకీలుగా, కోర్టు కమీషనరుగా పనిచేసిరి.
1921సం.లో గవరవరం,మాడుగుల ఖండములకు తాలూకాబోర్డుప్రతినిధి అయిరి.
సాంఘిక సేవలు:-1910 లో చోడవరం లో రక్షక భటుల భక్షణ ప్రారంభమయ్యెను.
వారి దుండగములను వెల్లడిస్తూ " గూఢ లేఖరి", మున్నగు పేర్లతో అనేక పత్రికలలో అనేక వ్యాసములు వ్రాసిరి.
తాలూకాబోర్డ్ ప్రతినిధిగా పెక్కు సేవలు చేసిరి.
పెక్కు చోట్ల దాహోదక వసతులు కల్పించిరి. భూముల దురాక్రమణకు వ్యతిరేకముగా పోరాడిరి.
వైద్య శాలలు, పాఠశాలలు, గ్రంథాలయములకొఱకు శ్రమించిరి.
వ్యవసాయము కిట్టక రైతులు వలసపోవుచుండుటతో భూములు బీడువారుతుండుటను గ్రహించి వ్యవసాయభివృద్ధికై కృషి చేసిరి.

పాఠశాలలు:- భక్తి, నీతి, సత్య శీలత, పంటలు పండించుటకనువగు జ్ఞానము నిచ్చుటకు రాత్రి పాఠశాలలు ఏర్పాటు కొఱకు పత్రికలలో వ్రాసిరి.

ఋణదాతలు ఋణ పిశాచులని, పత్రికలలో ఖండించిరి.
పరిశ్రమలు, వాణిజ్యములను గూర్చి పోరాడిరి.

ఆడువారికి విద్య:- ఆడువారికి విద్య యొక్క ఆవశ్యకత అత్యంత నిర్వివాదాంశమనుచు, విద్యా విషయమున
ఆడువారి కొఱకు చేయవలసిన మార్పులను సూచించిరి.
సన్మార్గ ప్రశంస, దుర్మార్గ సంస్కరణము:- నిరంతరము సన్మార్గ వర్తుల ప్రశంస, దుర్మార్గ సంస్కరణముల కొఱకు కృషి చేసిరి. మంచి వారిని ప్రశంసించుచు, సన్మాన పత్రములను కూడా వ్రాసి సభాముఖముగా యిచ్చెడి వారు. వీరు సాంఘిక సంస్కరణార్థము పత్రికలలో సుమారు 121 వ్యాసములను వ్రాసిరి. అందు
"భరత ఖండ విద్యా విధానము" ముఖ్యముగా చదువ దగినది.

వికలాంగుల ధర్మ సత్రము:- ఇతడు మానవ సేవయే మాధవ సేవగా నమ్మిన కర్మ యోగి. వికలాంగులకు అన్న దానము కొఱకు చందాలెత్తెడివారు. అనేక మంది సహకరించిరి.విజయ నగర మహారాజా వారి నుండి ఐదెకరముల భూమి ఇందు నిమిత్తము పొంద గలిగిరి. ఇప్పటికి సుమారు డబ్భై సంవత్సరాల క్రితము నాటికే ఆ సత్రవులో లక్షా ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్ఫైవొక్క మంది వికలాంగులు భుజించిరి. కన్ను, కాలు లేని, రాత్రులు రాలేని వికలాంగులకు ఆహారము ఇంటికే పంపెడివారు.
తన ధర్మపత్ని జ్ఞాపకార్థము తమ పెరటిలో "బాల కామేశ్వరమ్మ వికలాంగుల ధర్మ సత్ర భవనము" కట్టించిరి. హరిజన బాలురనేకమందికిది ఆధారమై యుండి, 1940 నాటికే నలుబదేండ్ల క్రితము నుండి నిరాఘాటముగా సాగినదీ సత్రవు.
"చోడవరము" నేటికినీ ఈ సత్రవే అనాథ శరణాలయమను పేర నిర్విఘ్నముగా కొనసాగుతూ అనేకమందికి జీవనాధారమై యున్నది.
వానప్రస్థము:- 1917 నుండి వీరు వానప్రస్థాశ్రమము స్వీకరించిరి. వీ్రేర్పాటు చేసిన హరిజన ఆశ్రమమే
వీరి నివాస స్థానము. వారికి ప్రాణికోటి సేవయే నిత్య దైవారాధన.

సప్తతి పూర్త్యుత్సవము:-వీరికి సప్తతిపూర్త్యుత్సవము అత్యంత భక్తి శ్రద్ధలతో, అబాల గోపాలము అత్యద్భుతముగా తే.22 - 6 - 1940 దీన నిర్వహించిరి.
ఆ సభలో వీరిని అందరూ పరోపకార పరాయణుడుగా, ప్రజా సేవక మణిగా, ఆర్త త్రతగా, హరిజన సేవకాగ్రణిగా, దేశాభిమానిగా, అతిథి పూజా దురంధరునిగా, సజ్జనోత్తమునిగా, ఇంకా పెక్కు విధములుగా సంబోధించి, ప్రశంసలతో ముంచెత్తిరి. భీమశంకరం గారు వారికందరికినీ, వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపిరి.

ఈ దివ్యుని సచ్చరిత్ర ఈ నాడు మనకందరికీ ఆదర్శము.
ఈతని చరిత ఏనాటికినీ ఆదర్శమే యనుటలో సందేహము లేదు.

జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 60.

0 comments

సజ్జన పుంగవులారా!
మనం ధన మూల మిదం జగత్ అని అందరం అనడం తెలుసు. ఐతే దానికి మూల శ్లోకం అంతా మనం తెలుసుకొంటే బాగుంటుంది కదా? ఐతే యీ క్రింది శ్లోకాన్ని పరిశీలించండి.

శ్లో:-
వేద మూల మిదం జ్ఞానం. భార్యా మూల మిదం గృహం.
కృషి మూల మిదం ధాన్యం. ధన మూల మిదం జగత్.

గీ:-
వేద మూలము జ్ఞానము విజ్ఞు లరయ.
భార్య మూలము గృహమిల ప్రస్పుటముగ.
కృషియె ధాన్యము మూలము, కీలు చీల.
ధనమె మూలము జగతిని, మనుజులకును.

భావము:-
జ్ఞానమునకు వేదమే మూలము. గృహమునకు భార్యయే మూలము. బ్రతుకుటకు మూలాధారమైన ధాన్య సంపత్తికి వ్యవసాయమే మూలము. ఈ ప్రపంచమున మనవాళికి ధనమే మూలము.

కావున - - -
వేద జ్ఞాన సముపార్జనము, గృహమునకు మూలమైన గృహిణిని గౌరవించడము, జీవనాధారమైన వ్యవసాయ భూములను తాత్కాలిక ధనాశతో తెగనమ్ముట మాని చక్కని వ్యవసాయము చేయడము, అవసరములకు తగినంత ధనమును ధర్మ బద్ధముగ సంపాదించడము మనకు అవశ్యాచరణీయములని గ్రహించి, ఆచరింప వలసి యున్నది.

జైహింద్.

24, సెప్టెంబర్ 2009, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 59.

0 comments

పాఠక పుంగవులారా! జన్మతః మనకున్న సంస్కారం కారణంగా మనం మంచి విషయాల్ని తప్పక ఆదరిస్తుంటాం. మంచిని గౌరవిస్తుంటాం. మంచి మాటలను గుర్తుంచుకోవడంతో పాటు సందర్భానుసారంగా మనం వాటిని తరచూ ప్రయోగిస్తుంటాం.
ఐతే మనకు ఒక్కొక్కమారు ఆ మంచి మాటలు సరిగా గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంటాం కూడా. ఔను కదా! ఐతే మనకెంత మంచి విషయం తెలిసినా సమయానికి గుర్తుకు రాకపోతే కర్ణుని అస్త్రాల్లాగా నిష్ఫలమే ఔతుంది కదా. అందుకే మనం కంఠస్థం చేయ గలిగిన నాడు అట్టి సమస్య ఉత్పన్నం కాదుకదా.
ఒక మహాకవి ఈ విషయంలో ఒక చక్కని శ్లోకం చెప్పాడు. పరిశీలిద్దామా?

శ్లో:-
కంఠస్థా యా భవేత్ విద్యా సా ప్రకాశ్యా సదా బుధైః.
పుస్తకే, పర హస్తేచ న సా విద్యా న తత్ ద్ధనం.

గీ:-
వినగ కంఠస్థమైనట్టి విద్య విద్య.
బుధులు వర్ధిల్లఁ గలుగు తత్ సుధను గలిగి.
పుస్తకమునున్న విద్య తో పొసఁగు నేమి?
పరుల నున్నట్టి ధనముతో ఫలమదేమి?

భావము:-
ఏ విద్య మనకు కంఠస్థమై యుంటుందో ఆ విద్యయే విద్య అనబడుతుంది. అట్టి విద్య వలన బుధులు ప్రకాశింతురు.
పుస్తకమునందుఁ గల విద్య వలన గాని, పరుల వద్ద గల ధనము వలన గాని మనకు ఏమి ప్రయోజనము కలుగును?

చాలా చక్కని విషయాలను తెలుసుకో గలిగాం కదండీ! ఐతే ఇంక మనం మనకు నచ్చిన మంచి విషయా లన్నిటినీ కంఠస్థం చేసెద్దామా మరి?

జైహింద్.

21, సెప్టెంబర్ 2009, సోమవారం

దత్తపది పూరణ. విషయం: రాజశేఖరుని చరమ యాత్ర.

1 comments

సుజనులారా!

శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన సమస్యాపూరణలను నేను చేసినవి చూచిన జయభారత్ గారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని వ్రాస్తూ దత్త పదిని పూరించమని వారి సరదా తీత్చమని వ్రాశారు . నేను పూరించే ప్రయత్నం చేశాను. మూరూ పరిశీలించండి.

మా సంభాషణ యిలా సాగింది. చూడండి.

jaiabhaarat గారిలాగన్నారు.

నమస్కారం రామకృష్ణ రావు గారు
పూరణ చాలా బాగుంది

నా సరదా కూడా కొంచెం తీర్చండి
ఈ కింది పదాల తో పద్యం కావాలి

ఒక్కొక్క లైన్ లో ఈ పదాలతో

రాజశేఖరుడు
హెలికాప్టర్ [లేక]లోహ విహంగం
నల్లమల అడవులు
పావురాల గుట్ట

regards
jayabharath

September 20, 2009 6:59 PM



ఆర్యా! మీ సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవదములు.
మీరిచ్చినది దత్త పది . విషయం చెప్పలేదు. ఐనా మిమ్మల్ని నిరాశ పరచ కుండా పూరించుతున్నాను చూడండి.

విషయం:- రాజ శేఖరును చరమ యాత్ర.
సీ:-
రాజశేఖరుడు విరాజ మానముగను - రచ్చబండకు నేగె. రహిని వెడల
లోహవిహంగము సాహసంబున నేగ - మేఘమడ్డుగ వచ్చె మింటిపైన.
నల్లమలడవులు తెల్లబోవుచు చూచె. - పావురాయిల గుట్ట భయము నొందె.
కాల వాహిని వాని కబళింపగాఁ బూనె. - యేమి చెప్పగనగు నీశ్వరేచ్చ
గీ:-
గాలిలో నేగు యంత్రము నేలఁ గూలె.
జాడఁ గానుట కైనను సాధ్య పడని
భీకరంబైన యడవితో నేకమ్మయ్యె.
శేఖరుండేగె దివికిని చిత్రముగను.


చూచారుకదండి. మీ అభిప్రాయాలను, వాటితో పాటు పూరణకై యివ్వ దలచుకుంటే సమస్యలను కాని, దత్త పదిని కాని, వర్ణనలను కాని, ఛందో భాషణను కాని, వ్రాసి పంపండి. ఆ శారదాంబ నాచే పూరింపఁ జేస్తుందేమో చూద్దాము.ఆన్నట్టు చెప్పడం మరిచాను. ఏ తేదీ ఏ వారమౌతుందో మీరడిగితే నేను సమాధానమిచ్చే ప్రయత్నం కూడా చేయగలనని మనవి.

జైహింద్.


20, సెప్టెంబర్ 2009, ఆదివారం

నవ దుర్గలలో బ్రహ్మచారిణి.

0 comments

శరన్నవ రాత్రులలో నేడు అమ్మవారు బ్రహ్మచారిణీ రూప ధారియై భక్తుల కోరికలు తీర్చనున్నారు.

బ్రహ్మచారిణీ రూప ప్రత్యేకతను తత్ భక్తుల కొనగూడు ఫలమును తెలుసుకొందాము.

క:

శ్రీకర నవ దుర్గలలో

ప్రాకటముగ బ్రహ్మ చర్య భద్రాకృతితో

లోకులఁ గావగ నేడు శు

భాకరమయి తోడు నిలిచె భవ్యోజ్వలయై.

సీ:-

తపమాచరించెడి తల్లి యీ జగదంబ - బ్రహ్మమున చరించు భక్తి తోడ.

కుడిచేతఁ జపమాల ఎడమ చేతను కమం - డలమునూనినభక్త సులభురాలు.

పరమేశు పతికాగ పరమతపముఁ జేసి - ఉమయను పేరొందె. కమల నేత్రి.

జ్యోతిర్మయాకృతి సోభిల్లు జగదంబ. - శుభములు గొలిపెడి యభవు రాణి.

గీ:-

భక్తులను, సిద్ధులను గాచు శక్తి యీమె.

బ్రహ్మ చారిణి కృపఁ గోరు భక్తులకును

దీక్ష, సిద్ధియు, విజయంబు, రక్ష గొలుపు.

బ్రహ్మ చారిణిఁ గొలువుడీ! భక్త జనులు.

జైహింద్.

19, సెప్టెంబర్ 2009, శనివారం

శరన్నవరాత్రి శుభాకాంక్షలు.

0 comments

పాఠకవరులందరికీ శరన్నవ రాత్రులు సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు.

రక్షణ గొల్పుఁ గావుత! విరాజిత సద్గుణ గణ్య పాళికిన్.
శిక్షణ చేయుఁగావుత వశీ కృత దుష్కృతు లైన వారికిన్.
మోక్షము నిచ్చుగావుత ముముక్షులకిద్దర నెల్ల వారికిన్
దీక్షను బూను భక్తులను దేవి పరాత్పరి కాచు గావుతన్.

జైహింద్.

కంది శంకరయ్యగారిచ్చిన సమస్యలు - నాపూరణలు.

2 comments

ప్రియ సాహితీ బంధువులారా! కొన్నిసమస్యలను, వాటికి సంబంధించిన పూరణలను మీ ముందుంచుతున్నాను.

రామకృష్ణారావు గారూ, సమస్యలను పంపమన్నారుగదా. ప్రస్తుతానికి నాలుగు ఆందిస్తున్నాను. చూడండి....అంటూ శ్రీ నంది శంకరయ్య గారు పంపిన సమస్యలు, వాటికి సంబంధించిన నా పూరణలు

ఇక చూడండి..

1) కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.
2) మాంసాహారమె శ్రేష్ఠమైనదనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.
3) రాజేడ్చెను రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.
4) నటులెవ్వరు లేని వింత నాటకమయ్యెన్.


1}

కోటులు సంపాదించెను.
వాటముగా దానినంత వారసుకిచ్చెన్
వాటా గొని, తరిమె నతడు.

కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.


2}
మాంసంబమ్ముచు నున్ననొక్కరుడు తా మాన్యుండయెన్. భుక్తికిన్

మాంసాహారము శ్రేష్టమైన దనుచున్. మాన్యుండయెన్ విప్రుడే.
హింసామార్గము జేరనీక ప్రజలన్ హేయంబుగాఁదెల్పుటన్
హింసామార్గమదేలగొంటి వకటా! హృద్యంబొకో? శంకరా?

3}
రాజూ, రాణీ, రాజ్యము,
రంజిలి, యాడంఁగ బోవ, "రాజ్యము" గెలిచెన్.
రాజూ రాణీ యోడిరి.

రాజేడ్చెను. రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.

4}
జటిలపు నాటకమును గొని
యెటులో తమలోన తామె యిది నడిపించెన్.
నటులౌదురె వారు? మహా

నటులెవ్వరు లేని వింత నాటక మయ్యెన్.

అవకాశముంటే మీరూ పూరించి పంపగలందులకు ఆశిస్తున్నాను.

జైహింద్.


18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సమస్య యేదైనా సమాధానం ఒక్కటే.

0 comments

ప్రియ పాఠకులారా! నిన్ననే నేను మన ఆంధ్రామృతం ద్వారా కవులు పూరణ చేయు నిమిత్తం
వరినీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.
అనే సమస్య ఉంచాను. అంతే వెన్వెంటనే కంది శంకరయ్యగారి దృష్టి ఆ సమస్యపై పడింది.
అంతే భాగ్యనగర ప్రజల దాహార్తి యదార్థ దృశ్యానికి అద్దం పట్టుతూ, ముచ్చటగా మూడు పూరణలు చేసి పంపించారు. ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరే చూడండి.

1)
రమణీయోపవనోపశోభితము హైద్రాబాదులో నాపగో
త్తమమై నీటినొసంగినట్టి ముచికుందన్ నమ్ముకున్నన్ వృధా!
సుమతిన్ నాయకులేకలక్ష్యముగ నస్తోకాంబుసంపూర్ణ గా
త్రము గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

2)
ఆగెన్ హైదరబాదు వాసులకు నీళ్ళందించు సత్కార్యమే
యేగెన్ "మూసి" కృషించి, నీటికొఱకై యెన్నెన్ని కష్టంబులో
బాగైనట్టివి సత్వరంబుగను కాల్వల్ ద్రవ్వి తెప్పించు కృ
ష్ణా గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

3)నిజానికి మొదటగా రాసిన పద్యమిది. ఎందుకో తృప్తికరంగా లేదు.......
రమణీయోపవనాంతరస్థకుజరాడ్రక్షైకదీక్షావిలో
లమతుల్ సంతతరాజకీయకరణాలంకారు లొక్కింత లో
కము మెచ్చన్ పథకమ్ము లక్ష్యముగఁ గాల్వల్ దీసి రప్పించు కృ
ష్ణమ గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.

సమస్య యేదైనా సమాధానం ఒక్కటే. అది - కంది శంకరయ్యగారిని అడగండం.

మీరూ యత్నించి పూరించే ప్రయత్నం చేయఁగలిగితే ధారణ పెరుగుతుందని నానమ్మకం.
జైహింద్.

16, సెప్టెంబర్ 2009, బుధవారం

సమస్యా పూరణము చేద్దామా ?

6 comments

అభిమాన ధన సాహితీ బంధువులారా! మీ ఆంధ్రామృతాస్వాదనా తత్పరతకు అభినందనలు.
ఆకలి పోకార్పే అన్న పూర్ణ యైన ఆంధ్ర దేశంలో ఎందరో దాహార్తితో ప్రభుత్వానికి అనేక విన్నపాలు చేసుకొంటున్నారు. "వరి" నీరైపోతే మనకి ముందుగా దాహార్తి తీరుతుంది కదా అనిపించింది. అదే విషయాన్ని వ్రాశాను.
ఐతే"వరి" నీరైపోతే దాహార్తి సమస్య తీరినా ఆహార సమస్య వచ్చి పడుతుంది కదా! అందుకే ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది.

ఇటువంటి సమస్యాయుత సమయాల్లో ధీవరులైన కవివరులు మాత్రమే నన్నీ సమస్య నుండి గట్టెక్కించ గలరని నమ్ముతూ, సమస్యా పూరణము చేయగలందులకు మనవి చేయుచున్నాను.

"వరి" నీరమైన ప్రజకున్ "దాహార్తి" పోకార్చెడున్.

మీకు కూడా నాకు వచ్చినట్లుగానే సమస్యలు వస్తూ ఉండ వచ్చు కదా! ఐతే మీ సమస్యలను కూడా మాతో పంచుకోండి. తప్పక అందరం కలిసి నివారించుకొందాం.

పై సమస్యకు సంబంధించి మీ కేమైనా సందేహాలుంటే నిస్సందేహంగా వ్రాయవలసినదిగా మనవి.
జైహింద్.

12, సెప్టెంబర్ 2009, శనివారం

" బాష్పాంజలి "

1 comments

అశ్రు తర్పణం.

కీ.శే.Dr.Y.S.రాజశేఖర రెడ్డి గారు తే. 02 - 09 - 2009. దీని అకాల మరణం పొందిన సందర్భంగా
వనస్థలి పురం - శారదా నగర్ కోలనీ వాసులు
తే.12 - 09 - 2009. దీని శ్రద్ధాంజలి ఘటిస్తున్న సందర్భముగా సమర్పించిన

" బాష్పాంజలి "
సమర్పణ:- చింతా రామ కృష్ణా రావు. హైదరాబాదు.

సీ.
అన్న దాతకు నీరు నందింప జల యజ్ఞ
మార్గాన నడచిన మహితమూర్తి !
రెండు రూకల బొజ్జ నిండ బియ్యమునిచ్చి,
పేదల పాలిటి పెన్నిధివయి,
ఆరోగ్య పథకంబు నమలు జేయుచు నాయు
రారోగ్యములు పెంచి, ధీరుడవయి,
గృహములు నిర్మించి, గ్రహ గతి మార్పించి,
గూడు లేని జనుల గోడు తీర్చి,
అమ్మలారా ! నాదు అక్కలారా ! యంచు
నాప్యాయముగ పిల్చి, యాదరించి,
గీ.
ప్రేమఁ జూపుచు, మదులలో రాముడవయి,
స్థిరుడవైనావు. యింతలో చెప్పకుండ
స్వర్గ పథమందితివి నీవు. సఖుడ ! నేను
చేతు, బాష్పాంజలులు, రాజశేఖరుండ !!

5, సెప్టెంబర్ 2009, శనివారం

వై.య.స్సార్.అమరులు. సుకృతినో రల్పాయుః.

0 comments

ఆంధ్ర ప్రజానీకాన్ని దుఃఖ సగరంలో ముంచి, తాను దైవ సన్నిధికి చేరిన వై.య.స్సార్. గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. శోక మగ్నులై యున్నవారికి, వారి కుటుంబ సభ్యులకు, నా ప్రగాఢ సానుబూతి తెలియఁ జేస్తున్నాను.