గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2009, గురువారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 }

శ్రీ సాహితీ మిత్రులారా! నాచే రచింపఁబడిన " శ్రీ షిరిడీశ దేవ శతకము "ను పరిశీలనార్థము మీ ముందించుచుంటిని. సదసద్వివేకజ్ఞులగు మీరు నిశితముగా పరిశీలించి గుణ దోష విచారణ చేసి నాకు తెలియఁజేయఁ గోరు చున్నాను. దోషములున్న సవరించు ఒన గలనని సవినయముగా మనవి చేసుకొను చున్నాను.దయతో ఇక పరిశీలించండి.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
శ్రీ షిరిడీశ దేవ శతకము
రచన:- చింతా రామ కృష్ణా రావు
http://devotionalonly.com/wp-content/uploads/2009/09/shirdisaibaba-mantras.jpg
ఉ:-
శ్రీద! విరూప!  భాగ్యదుఁడ! శ్రీ యుత! నా మమందు నిల్చి,
మ్మోదము నాపయిన్ నిలిపి, ముక్తిని గొల్పి, మో గుణాదులన్
నాదరిఁ బా జేయుమయ. నాథుఁడ! నిన్ గని ప్రస్తుతించెదన్.
నీ దరిఁ జేర్చి కావుమయ! నిత్యుడ! శ్రీ షీరిడీశ దేవరా! 1
ఉ:-
సుందర సత్ ప్రబంధముగ సూనృత! నీ మహిమాదికంబు స
ద్బంధుర సత్ పదంబులను పన్నుగ గైకొని, వ్రాయఁ గోరి, మున్
ముందుగ నీపయిన్ శతకమున్ భువి వ్రాయగఁ బూనితయ్య! యి
బ్బందులు పారద్రోలి, నిలు ప్రాపుగ. శ్రీ షిరిడీశ దేవరా! 2
చ:-
ప్రమద గణాభిసేవితము పావన శ్రీ షిరిడీ పురంబు. స
ద్విమల యశో విరాజితము, విస్తృత సత్కృతికాకరంబు, మా
భ్రమలను రూపు మాపి, గురు పాదయుగంబునుఁ గొల్వ జూపి, నే
రములను సేయనీయకుమ!, పరాత్పర!  శ్రీ షిరిడీశ దేవరా! 3
ఉ:-
శ్రీ సమ! సాయినాథ! గుణ శేఖర! శ్రీ షిరిడీ నివాస! నీ
ధ్యాస యొకింత గల్గి, పర తత్వముఁ గాంచి, భజించు వారికిన్
మోసములంటనీయవుగ! ముక్తిని గొల్పి రహింపఁ జేతువే!
నీ సరి దైవమేడ? మహనీయుడ! శ్రీ షిరిడీశ దేవరా! 4
ఉ:-
కన్నుల నిచ్చినావు నినుఁ గన్గొను భాగ్యమునీయనెంచి, మా
కన్నులవేమి జూచు? కళ కాంతులఁ గోల్పడు భౌతికమ్ములన్.
పన్నుగ నీదు రూపమును ప్రస్ఫుటమొప్పగఁ జూడగా వలెన్
కన్నులు గల్గు భాగ్యమది కాదొకొ? శ్రీ షిరిడీశ దేవరా. 5
చూచారు కదండీ! మీఅపురూపమైన సూచనలకై ఎదురు చూస్తుంటాను.
జైహింద్.
Print this post

6 comments:

రాఘవ చెప్పారు...

విరూప, కేవల, సుచేతన, సూనృత, నిత్య, గుణశేఖర, ... భలే. ఈ ఐదు పద్యాలూ బావున్నాయండీ. నాకు ప్రత్యేకంగా "శ్రీసమ సాయినాథ" అన్న పద్యం చాలా నచ్చేసింది. మీ ఈ శతకంలోని మిగతా పద్యాలకోసం ఎదురుచూస్తూంటాను. నమస్సులతో భవదీయుడు.

రవి చెప్పారు...

మీ పద్యాలపై వ్యాఖ్యానించేంత అనుభవము లేదు.
పద్యాలు చాలా చక్కగా ఉన్నవి. ధన్యవాదాలు.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మాస్టారు గారు,
రవి గారు అన్నట్టే మీ పద్యాలపై వ్యాఖ్యానించె అనుభవము మాకు లేదు. పద్యాలన్ని చాలా బాగా భక్తి రసమయముగా వచ్చినవి.

నాకు రెండు సందేహాలు..
1. "నీ సరి దైవమేడ?" లో "ఏడ" - సాధు రూపమేనా?
2."కళ కాంతులఁ గోల్పడు" - సాధారణంగ "కళాకాంతులు" అంటూఉంటాము కదా! ఇక్కడ "ళ" హ్రస్వము కావచ్చునా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సత్యనార్యా! సంతోషం. మీ స్పందనకు, నిశిత పరిశీలనా నైపుణ్యమునకు అభినందనలు.
1. ఏడ = ఎక్కడ. యొక్క రూపాంతరము. దేశ్య పదము.
2.కళ కాంతులు = కళయు, కాంతులును. { కళా క్షేత్రము = కళకు సంబంధించిన క్షేత్రము } ఈ విధంగా సందర్భానుసారంగా ప్రయోగించడం శిష్ట సంప్రదాయమే.
కృతజ్ఞతలతో,
చింతా రామ కృష్ణా రావు.

కొత్త పాళీ చెప్పారు...

సత్యనారాయణగారూ, మీరు ప్రశ్నించిన రెండు విషయాలూ సాధు ప్రయోగాలే. కళాకాంతులు వంటి ప్రయోగాలు వచనంలో ఒక విధంగానూ పద్యంలో మరొకవిధంగానూ ఉండే వీలున్నది, అది జాతీయము కాబట్టి, వ్యాకరణ బద్ధము కాదు. ఐతే ఉత్సాహంతో కొత్తగా పద్యాలు రాసే కొందరు వ్యాకరణ బద్ధమైన పదబంధాల్లో దీర్ఘాలుండాల్సిన చోట హ్రస్వం వాడ్డం (ఛందస్సులో ఇరికించేందుకు) కనబడుతుంటుంది మనకి.

రామకృష్ణ మాష్టారూ, పద్యాలు భక్తి భావమూ, వేదాంత వైరాగ్య భావమూ సమపాళ్ళలో మేళవించి బహు రుచిగా ఉన్నాయి. కొనసాగించండి.

Bolloju Baba చెప్పారు...

పద్యాలు చాలాబాగున్నాయి. అర్ధమైనంతమట్టుకు అద్భుతంగా ఉన్నాయి.
ఒకటి రెందు వాక్యాలలో టీకా, తాత్పర్యం కూడా ఇచ్చినట్లయితే మరింత మేలు చేసెడివారు కాగలరు.
అన్యధా భావించరనే
బొల్లోజు బాబా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.