గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2025, బుధవారం

తెలంగాణ సాహిత్య సమాలోచన. దోమకొండ కోటలో తే. 12 - 01 - 2025 న.

0 comments

 జైశ్రీరామ్.




ఓం శ్రీమాత్రే నమః.

తెలంగాణ ప్రాచీన శతక సాహిత్యం.

ఆంధ్ర వాఙ్మయమున కావ్య ప్రక్రియలలో శతకమొకటి.

ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది.

తెలుగులో 12వ శతాబ్దంలో శతకమావిర్భవించినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది. తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడంలో సందేహం లేదు.

కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడా ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.

శతకం లక్షణాలు

శతేన ప్రోక్తం శతకం  వందకాని అంతకు మించి కాని పద్యములు లేదా శ్లోకములుంవలెను. శతకములో ప్రతి పద్యానికీ చివరలో మకుటము ఉండవలెను. విశ్వదాభిరామ వినురవేమ, సుమతీవేంకటేశ్వరా, దాశరథీకరుణాపయోనిధీ వంటివి.

తెలంగాణ ప్రాచీన శతకములు.

మల్లికార్జున పండితారాధ్యుడు రచించిన శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు మొదటిదిగా చెప్పవచ్చును.

1) పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము.

2) భద్రభూపాలుడు(బద్దెన) (13)- ”సుమతిశతకము,

3) కంచర్ల గోపన్న(17) -  దాశరథీ శతకము,

4) కాకుత్థ్సం శేషప్పకవి (18) - నరసింహ శతకము,  శ్రీనృకేసరి శతకము, నరహరి శతకము,

ఇతని మనుమడు

5) కాకుత్థ్సం నరసింహదాసు (18)- కృష్ణ శతకము,

6) బమ్మెర పోతన (15)- నారాయణ శతకము,

7) శివదేవయ్య ప్రతాపరుద్రుని మంత్రి (14) - శివదేవ ధీమణీ శతకము,

8) శరభాంకుఁడు.  రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానకవి (1296-1323)  - శరభాంక లింగమ శతక కర్త,

9) త్రిపురాంతక కవి - అంబికా శతకము,

10) వెన్నెల కంటి చంద్రశేఖర కవి - హరిశ్చంద్ర శతకము,

11) పరశురామ రామ్మూర్తి పంతులు - పరశురామ శతకము,

12) ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు - ముకుంద శతకము,

వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు తమ అనేక ప్రబంధాలలో (వాటిలో అచ్చ తెనుగు కావ్యాలు, నిరోష్ట్య, నిర్వచన కావ్యాలు ఉన్నవి) 60 విలక్షణమైన బంధ భేదాలు నిర్మించారు. ఈ పద్యాలు నూరుకు మించే ఉన్నాయి.

13) సముద్రాల లక్ష్మీనరసింహాచార్యులు - లక్ష్మీ నృసింహ శతకము,

 

1) పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము.

పాల్కురికి సోమనాథుడుమల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు. "శివకవి త్రయం"గా ప్రసిద్ధులు.

శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే వైష్ణవ దంపతులకు పాల్కురికి గ్రామంలో జన్మించాడు.  తెలుఁగు, సంస్కృత, కన్నడ, ద్రవిడ భాషలలో పండితుఁడు.  వీరశైవం లోకి ప్రవేశించి దీక్ష ధరించెను.

1. అనుభవసారము 2. బసవ పురాణము 3. వృషాధిపశతకము 4. అక్షరాంక గద్య 5. అక్షరాంక పద్యములు  6. పంచప్రకారగద్య 7. శరణుబసవ గద్య (కన్నడం, తెలుగు) 8. అష్టోత్తర శతనామ గద్య (సంస్కృతం) 9. సద్గురు రగడ (తెలుగు, కన్నడం) 10. గంగోత్పత్తి రగడ (అలభ్యం) 11. బసవోదాహరణము (తెలుగు, సంస్కృతము) 12.చతుర్వేదసారము (బసవలింగ శతకము) 13.  సోమనాధ భాష్యము (సంస్కృతం) 14. రుద్రభాష్యము (అలభ్యము) 15. వృషభాష్టకము (సంస్కృతం) 16. చెన్నమల్లు సీసములు 17. సోమనాధ స్తవము 18. మల్లమదేవి పురాణము (అలభ్యం) 19. పండితారాధ్య చరిత్ర మొదలైనవి.

 

ఉ.  శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వల కీర్తి! సత్క్రియో

ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా

భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే

వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా! 1

 

ఉ.  అక్షయభక్తిపక్ష! బసవాక్షర పాఠక కల్పవృక్ష! రు

ద్రాక్ష విభూతిపక్ష! ఫలితార్థ ముముక్ష! శివప్రయుక్త ఫా

లాక్ష! కృపాసమంచిత కటాక్ష! శుభాశుభ పాశమోక్ష! త

త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!       7

 

ఉ.  "హృన్నళినే స్మరామి భవదీయ పదద్వితయం భవాటన

స్విన్న తను శ్రమాపహ మశేష జగత్ప్రణుతం మదీశ ని

ష్పన్న దయానిధే" యనుచు 'సంస్కృతభాష' నుతింతు నిన్ను వి

ద్వన్నుత నామధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!     59

 

చ.  "పరమనె యన్నె యాండవనె పన్నగతానె యనాథ నాధనే

పెరియనెపే నివుందనవె పేరు డయాననె పేరు జెప్పనే

తరి మురియాయనే" యనుచు 'ద్రావిడభాష' నుతింతు మన్మనో

వరకరుణా విధేయ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!      60

 

చ.  "హసుళెయరన్న రక్షిసు వుహారయలెన్న వనీవనెందు

న్నిసువుడు నిమ్మడింగెరగ నిమ్మ ప్రసాదిత నిమ్మదాత్మ వే

కసిగతి" యంచు భక్తి నినుఁ 'గన్నడభాష' నుతింతు షడ్గుణ

శ్వసన పురాతనాత్మ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!     61

 

చ.  "అనయముఁ జేతులందు భవదంఘ్రి సరోజయుగం నమామి నె

మ్మనమున సంస్మరామి యను మాటల నిన్‌ వరివస్క రోమ్య హ"

మ్మనుచు 'మణిప్రవాళము'న నంకన సేయుదు భక్తలోక హృ

ద్వనజ విహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా!    63

 

చ.  బలుపొడ తోలు చీరయును పాపసరుల్‌ గిలుపాడు కన్ను వె

న్నెల తలఁ జేఁదు కుత్తుకయు నిండినవేలుపుటేఱు పల్గు పూ

సలు గలఱేని లెంకవని 'జానుఁదెనుంగు'న విన్నవించెదన్‌

వలపు మదిన్‌ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా!    67

------------------

2) భద్రభూపాలుడు(బద్దెన)(1300) నీతి ప్రబోధకమైన సుమతిశతకాన్ని, నీతి శాస్త్ర ముక్తావళిని రచించాడు. కమలాసన బిరుదాంకితుడైన ఈ కవి గణపతి చక్రవర్తి సామంతులలో ఒకడు.

క.  శ్రీ రాముని దయ చేతను - నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా

ధారాళమైన నీతులు - నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ!         1

 

క.  అక్కఱకు రాని చుట్టము - మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా

నెక్కినఁ బాఱని గుఱ్ఱము - గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !   2

 

క.  ఉపకారికి నుపకారము - విపరీతము గాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము - నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ!        16

 

క.  ఎప్పటి కెయ్యది ప్రస్తుత - మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌

నొప్పింపక తానొవ్వక - తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!         18

 

క.  ఎప్పుడు సంపద కలిగిన - నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్‌

దెప్పలుగఁ జెఱువు నిండినఁ - గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ!      20

 

క.  కనకపు సింహాసనమున - శునకముఁ గూర్చుండఁబెట్టి శుభ లగ్నమునం

దొనరఁగఁ బట్టము గట్టిన - వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!      26

 

క.  కొఱగాని కొడుకు పుట్టినఁ - గొఱగామియె కాదు తండ్రి గుణములఁ జెఱచున్‌

జెఱకు తుద వెన్ను పుట్టినఁ - జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ!  41

 

క.  తన కోపమె తన శత్రువు - తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ

దన సంతోషమె స్వర్గము - తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!            49

---------------------------------

3) కంచర్ల గోపన్న దాశరథీ శతకాన్ని రచించాడు. భద్రాచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ. ఈయన శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా గా సుప్రసిద్ధుడైనాడు.

 

ఉ.  శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం

గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు

ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!   1

 

ఉ.  రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో

త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స

త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా

తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!         4

 

ఉ.  ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్‌

గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్‌

గప్పిన వేళ మీ స్మరణ గల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే

తప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!         16

 

ఉ.  శ్రీరమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా

చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠము

న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాఁగ వసించు చేతనో

ద్ధారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ! కరుణాపయోనిధీ!        20

 

ఉ.  భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో

దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌

రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా

డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే

దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!      34

-------------------------------------

 

4) కాకుత్థ్సం శేషప్పకవి (18)రచించిన - నరసింహ శతకము,  శ్రీనృకేసరి శతకము, నరహరి శతకము, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు కవి. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు. శతక సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన నరసింహ శతకం రాసిన కవి ఇతనే.

 

సీ.  శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ!

కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర! - సాధురక్షణ! శంఖచక్ర హస్త!

ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!

పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల! - పల్లవారుణపాదపద్మయుగళ       

తే.  చారుశ్రీచందనాగరుచర్చితాంగ! - కుందకుట్మలదంత! వైకుంఠధామ!

భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! 1.

 

సీ.  పద్మలోచన! సీసపద్యముల్‌ నీమీఁదఁ - జెప్పఁ బూనితినయ్య!చిత్తగింపు

గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁగలేదు - పంచకావ్య శ్లోకపఠన లేదు

అమరకాండత్రయంబరసి చూడఁగలేదు - శాస్త్రీయ గ్రంథముల్‌ చదువలేదు

నీ కటాక్షంబుననే రచించెదఁ గాని - ప్రజ్ఞ నాయది గాదు ప్రస్తుతింపఁ

తే.  దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె - చెఱకునకు వంకపోయిన చెడునె తీపు?

భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! 2

 

సీ.  నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దురితజాలములెల్ల ద్రోలవచ్చు

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - బలువైన రోగముల్‌ బాపవచ్చు

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు        

తే.  భళిర నేనీ మహామంత్రబలముచేత - దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు 3

 

సీ.  ఆదినారాయణా! యనుచు నాలుకతోడఁ - బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి - ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను - నిన్నుఁ గాననివారి నే స్మరింప

మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడివారి - చెంతఁ జేరఁగఁబోను శేషశయన!      

తే.  పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల - దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన 4

 

సీ.  శ్రవణ రంధ్రముల నీసత్కథల్‌ పొగడంగ - లేశ మానందంబు లేనివాఁడు

పుణ్యవంతులు నిన్నుఁబూజసేయఁగఁ జూచి - భావమం దుత్సాహపడనివాఁడు

భక్తవర్యులు నీ ప్రభావముల్‌ పొగడంగఁ - దత్పరత్వములేక తలఁగువాఁడు

తనచిత్తమందు నీ ధ్యానమెన్నఁడు లేక - కాలమంతయు వృథాగడుపువాఁడు       

తే.  వసుధలోనెల్ల వ్యర్థుండువాఁడె యగును - మఱియుఁ జెడుఁగాక యెప్పుడు మమతనొంది 8

 

సీఅధిక విద్యావంతు లప్రయోజకులైరి - పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి

సత్యవంతుల మాట జన విరోధంబయ్యె - వదరుబోతుల మాట వాసికెక్కె

ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి - పరమలోభులు ధనప్రాప్తులైరి

పుణ్యవంతులు రోగభూత పీడితులైరి - దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి

తే.గీపక్షివాహన మా వంటి భిక్షుకులకు - శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు

భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !!  26

-------------------------------------

5) కాకుత్థ్సం నరసింహదాసు. కాకుత్థ్సం శేషప్పకవి మనుమడే. ఇతడు రచించినది కృష్ణ శతకం”.

 

క.  శ్రీ రుక్మిణీశ కేశవ - నారద సంగీతలోల నగధర శౌరీ

ద్వారకనిలయ జనార్దన - కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా.       1

 

క.  నీవే తల్లివి తండ్రివి - నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము - నీవే నా పతియు గతియు నిజముగఁ గృష్ణా.      2

 

క.  నారాయణ పరమేశ్వర - ధారాధర నీలదేహ దానవవైరీ

క్షీరాబ్ధిశయన యదుకుల - వీరా ననుగావు కరుణ వెలయగఁ గృష్ణా.       3

 

క.  హరి యను రెండక్షరములు - హరియించును పాతకముల నంబుజనాభా

హరి నీ నామమహత్త్వము - హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా.   4

 

క.  దుర్జనులగు నృపసంఘము - నిర్జింపఁగఁ దలచి నీవు నిఖిలాధారా

దుర్జనులను వధియింపను - నర్జును రధచోదకుండ వైతివి కృష్ణా.                  28

 

6) బమ్మెర పోతన - నారాయణ శతకము, నేటి జనగామ జిల్లా లో ని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసన దంపతులకు జన్మించాడు.  శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి సోమనాథుడు”. వీరభద్ర విజయం, భోగినీ దండకం, శ్రీమదాంధ్రభాగవతం, నారాయణ శతకం

శా.  నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరి\న్‌

ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబున\న్‌

నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గిన\న్‌

వానిన్‌ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా!    3

 

శా.  నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా

నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా

నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా

నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా!            8

 

మ.  ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్‌ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై

సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై

వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా!  10     

 

11 - 20..దశావతారాలు వర్ణించాడు.

 

7) శివదేవయ్య (13) కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల ఆస్థానంలో మహామంత్రిగా ఉన్నాడు.- శివదేవ ధీమణీ శతకము, ఇతనికి సంస్కృతాంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. గోళకీ మఠాధిపతి అయిన విశ్వేశ్వర శంభువు ఇతని గురువు. మనుమసిద్ధికి తిరిగి రాజ్యాధికారం కట్టబెట్టడంలో ఇతడు తిక్కనకు మిక్కిలి సహకరించాడు.

 

చం.  అరయగ పిన్ననాట సిరియాళుడనై, యెలప్రాయమందు సుం

దరుడను నంబియై, పదను తప్పిన గుండయగారి చందమై

ధర చరియింపగల్గిన తథాస్తు! వృథా పరిపాక రూప దు

ష్కర జననం బిదేమిటికి గాలుపనే శివదేవ ధీమణీ.

---------------------------

8) శరభాంకుఁడు.  పార్వతీదేవి, శివ లింగయ్యల కుమారుడు. రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానకవి (1296-1323)  - శరభాంక లింగమ శతక కర్త, శరభాంకుడు అష్టసిద్దుల్లో ఆరితేరిన కవి. అంతేకాక వాటిని అప్పుడప్పుడూ ప్రయోగించి ప్రసిద్ధిగాంచాడు. వేములవాడ భీమకవిలా శివానుగ్రహమున ఆడినది ఆటగా పాడినది పాటగ అన్నట్లు చేయగలడు.

 

ఉ॥ శ్రీరమనాథుమ్రొక్కి జయశిద్దుల సన్నుతిజేసి భానుచం

ద్రారుణ వహ్ని నేత్రునకు నంజలి జేసి తమిన్నుతించి స

త్కార మొనర్పనొక్క శతకంబు రచించెద చిత్తగింపు మీ

సారమనేక దివ్యముని సన్నుతయో శరభాంక లింగమా!!

-----------------------------------

9) రావిపాటి త్రిపురాంతక కవి ఈ కవి 1) కళికోత్కళికలు, సమవృత్తాలతో సలక్షణమైన త్రిపురాంతకోదాహరణము 2) 'అంబికా!'అన్న మకుటాన్ని కలిగిన చంపకోత్పలమాలలతో అంబికా శతకము 3) 'చంద్రా! రోహిణీవల్లభా!' అన్న మకుటంతో శార్దూల-మత్తేభవిక్రీడితాత్మకమైన చంద్ర తారావళి అన్న మూడు లఘుకృతులనురచించెను.

 

ఉ.  లాఁచి పరాంగనల్ వరవిలాసమనోహరవిభ్రమంబులన్

జూచినఁ జూడఁ డుత్తముఁడు; చూచినఁ జూచును మధ్యముండు; దాఁ

జూచినఁ జూడకుండినను జూచుఁ గనిష్ఠుఁడు; నన్ను వీరిలోఁ

జూచినఁ జూడకుండు ఘనుఁ జూచిన చూపునఁ జూడు మంబికా!

 

ఉ.  వ్రాలిన కన్ను, ముంగురులు, వాతెఱ కెంపు మెఱుంగుఁ, జంటిపైఁ

గ్రాలెడు తారహారములుఁ, గంకణచారుకరంబు, డాపలం

దూలుచు నున్న పయ్యెదయుఁ, దోఁచిన కన్నులు మోడ్చి, మోడ్చి నీ

పాలగు నీశుమేను సగపాలు మనంబునఁ జేర్తు నంబికా!

 

ఉ. 'ఆదిమశక్తి యీ తరుణి, యాద్యకుటుంబిని యీ కుమారి, ము

త్తైదువ యీ తలోదరి, చిదాత్మక యీ సతి, విశ్వమాత యీ

పైదలి, సర్వలోకగురు భామిని యీ చపలాక్షియంచు బ్ర

హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి ని న్నెఱిఁగింతు  రంబికా!

 

త్రిపురాంతకుడు త్రైలోక్యాధీశ్వరి త్రిపురాంబికను సన్నుతిస్తూ అంబికా!' “అంబికా!' అని నోరారా నూఱుమార్లు సంబోధించటమే గాక ఈ శతకస్తోత్రంలో అడుగడుగున శ్రీవిద్యాదర్పణమైన పావన శ్రీ లలితా సహస్రనామ స్త్రోత్రాన్ని అంతర్భవింపజేసినట్లు పద్యశిల్పాన్ని బట్టి గోచరిస్తున్నది.

జైహింద్.

శ్రీమదాంధ్రామృత పాఠకులకు 2025. ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు. ... చింతా రామకృష్ణారావు.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీమదాంధ్రామృత పాఠకులకు 2025. ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.

శా.  *శ్రీమన్మంగళ* యాంగ్లవత్సరముగా   శ్రీలన్ బ్రసాదింపఁగాఁ

బ్రేమన్ వచ్చె ప్రశోభితాద్భుతముగా, వెల్గొందుడీ మీరు, సు

క్షేమంబున్, ధనధాన్యముల్, సుఖములున్, చిద్భావనాభాగ్యమున్,

ధీమాన్యత్వము, వత్సరాంతమును సద్దీప్తిన్, ధరన్ బొందుడీ!

చం.  మనము సతమ్ము నాంగ్లతిథి మానక వాడుచునుండుచుండుటన్

ఘనముగ వత్సరాంతమును గౌరవమొప్ప రహింపఁ గోరుచున్

జనహితమాశచేయుటది చక్కని పద్ధతిగాఁ దలంచెదన్,

మనములఁ గోపగించకుడు, మంచిని గాంచుడు నా ప్రవర్తనన్.

శా.  అమ్మా! కాల మహాస్వరూప జననీ! ఆనంద సంధాయినీ!

సమ్మాన్యంబుగ నీదు భక్తతతి సంస్కారాక్షరప్రాజ్ఞులై

నెమ్మిన్ నీ పదసేవనామృత మతన్ నిత్యంబు వెల్గొందగా

సమ్మోదమ్మున వత్సరాంతమును ధ్యాసన్ జేసి కాపాడుమా.

ఉ.  దైహికమైన రుగ్మతలు తల్లివి నీవె నశింపఁ జేయుమా,

మోహము వాపి, సత్యము నమోఘముగా గ్రహియింపఁ జేయుమా,

దేహమునందు శక్తినిడి, దివ్యముగా శుభకార్యముల్ సదా

స్నేహముతోడ లోకులకుఁ జేయఁగఁ జేయుమ భక్తపాళికిన్.

ఉ.  వేల్పువు నీవె, మానసిక వేదనలన్ దరిఁ జేరనీక, సం

కల్పము సత్ప్రవృత్తిపయిఁ గల్గల్ఁగఁ జేయుచు నాదుకొమ్మ,  యీ

యల్పులమైన మేము పరమార్థము నీవని నమ్మియుంటిమే,

నిల్పుము భక్తితో భువిని నీపదసేవసుఖంబునిచ్చుచున్.

🙏🏼🙏🏼🙏🏼

👍

అమ్మ అనుగ్రహంతో🙏🏻

జైహింద్.

31, డిసెంబర్ 2024, మంగళవారం

అవధాన కళానిధి శతావధాన విద్వన్మరాళ శ్రీ ఆముదాలమరళి గారి అష్టావధానం తే.30 - 12 - 2024. నేరెళ్ళమెట్టలో. సెంట్ మార్క్స్ గ్రామర్ హైస్కూల్ లో.

0 comments

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః🙏🏼

చం.  జనని వచింపఁ జేసినది చక్కని ఛందపు భాషణమ్మునన్,
ఘనమగు సత్కృతిన్ సభను కల్పనఁ జేసి గ్రహింపఁజేసె, నా
జననిది శక్తి యంతయును, చాలను నేను గ్రహింపనివ్వి, దీ
వనలను సద్గురుండిడగ భాగ్యము నాకు లభించెనంతియే.

సవినయముగా🙏🏼
చింతా రామకృష్ణారావు.

జైహింద్.

30, డిసెంబర్ 2024, సోమవారం

సంతోషక్షతయే పుంసా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సంతోషక్షతయే పుంసా - మాకస్మిక ధనాగమః ౹

సరసాం సేతుభేదాయ  - వరషౌఘః స చ న స్థిరః ౹౹        

తే.గీ. అధిక ధనమకస్మాత్తుగా నమరెనేని

యున్నసంతోషమును మాపునన్న నిజము,

కోరకుండనే వర్షంబు కుండపోత

పడినచో గట్లుతెగిగొట్టి పాడుచేయు.

భావము.  అకస్మాత్తుగా మనిషికి ధనం వస్తే సంతోషం దూరం అవుతుంది. 

అలాగే నిరీక్షణ చేయకుండా వచ్చే వాన ప్రవాహము చెరువు గట్టులను 

పడగొడతాయి..అలాంటివి ఎప్పుడూ స్థిరం కాదు.

జైహింద్.

29, డిసెంబర్ 2024, ఆదివారం

పాతబస్తీ గోపాలకృష్ణ ఆలయంలో ఆ సాంఘిక కార్యకలాపాలు...

0 comments

జైశ్రీరామ్.
ఇంతటి అతిప్రాచీన దేవాలయంలాటిని మనమెలాగా నిర్మించలేము. కనీసం వాటిని రక్షించుకోవడం కూడా చాతకాని దౌర్భాగ్యస్థితిలో నిద్రపోతున్నామంటే అతిశయోక్తి కాదేమో. కాపాడే ప్రయత్నం ప్రతీ ధర్మాత్ముఁడూ చేసిననాడే మనఅస్తిత్వం నిరూపితమౌతుంది.
జైహింద్

భారత దేశానికి ఆ పేరు ఎంత పురాతనమైనదో మరుగునపడ్డ అసలు చరిత్ర తెలుపు వీడియో.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

పెట్టుకో నీవు బొట్టు. శుభాళికి నీకిది మెట్టు.

0 comments

 

జైశ్రీరామ్.
ఉ.  బొట్టు పవిత్రమైనదని పూజ్యులు చెప్పిన మాట నిక్కమే,
బొట్టునుపెట్టుకొండదియె పూర్ణఫలప్రదమౌను మీకు నే
పట్టుననైన మానకుడు భవ్యపు బొట్టును పెట్టుకొంట, మీ
రిట్టుల నిత్యమున్న మిము నీశ్వరు రూపముగా గ్రహింతురే..
జైహింద్.

పుస్తకం వనితా విత్తం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  పుస్తకం వనితా విత్తం - పర హస్తం గతం గత:

అధవా పునరా యాతి - జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

తే.గీ.  పుస్తకంబు, వనితయును, పూజ్యమైన

ధనము పరులచేతికిఁ జిక్క, తరలిపోవు

చేతులవిమారి, మరలవి చేరెనేని, 

జీర్ణముగనయి, భష్ఠమై, సిధిలముగనె.

భావము.  పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరుల చేతిలో 

పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా.

సర్వ నాశన మయిపోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. 

( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి).  

జైహింద్.

గజానాం మంద బుధ్ధిశ్చ. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  గజానాం మంద బుధ్ధిశ్చ - సర్పాణా మతి నిద్రతా

బ్రాహ్మణానా మనేకత్వం - త్రిభిర్లోకోపకారకమ్.

తే.గీ. ఏనుగులమందబుద్ధియు, నిలను నాగు

పాములకునతినిద్రయు, బ్రాహ్మణులకుఁ

జూడ నైక్యత లేకుంట మూడునివ్వి

లోకమునకుపకారమే, శ్రీకరుండ!

భావము.  ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, 

బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

జైహింద్.

అపి స్వర్ణ మయీ లంకా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

 శ్లో.  అపి స్వర్ణ మయీ లంకా - న మే రోచతి లక్ష్మణ !

జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసి.(రామాయణము)

తే.గీ.  లక్ష్మణా!స్వర్ణపూర్ణమే  లంక కనఁగ,

నైననున్ నాకు రుచియింప దనుపమమగు

జననియున్ జన్మ భూమియున్ సమము చూడ

స్వర్గమును మించి గొప్పవి జయనిధాన!

భావము.  సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు 

నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు 

స్వర్గం కంటె గొప్పవి కదా !

జైహింద్.

అణుమాత్ర మనస్తస్మా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అణుమాత్ర మనస్తస్మా - దాశా నామ లతోద్గతాl

తస్యా నాలముపఘ్నాయ  - భువనాని చతుర్దశ ll

తే.గీ.  మనసు కాంచగ నణువంత మసలు దాని

యందుఁ గోరిక లత, తా నమందగతిని

యెదుగుచుండును గన చాల వెదుగు దానిఁ

గాయఁ బదునాల్గు లోకముల్,కమల నయన!

భావము.  మనసు అనేది ఒక అణువంతది. ఆ మనసులో ఆశ అనే లత 

పెరుగుతుంది. అది విశాలంగా అల్లుకోవడానికి పదునాలుగు లోకాలు చాలవుగదా!

జైహింద్.

ధనమార్జాయ కాకుత్స్థ. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  ధనమార్జాయ కాకుత్స్థ ! - ధన మూల మిదం జగత్

అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ.(రామాయణము)

తే.గీ.  ధనమునార్జింపుమో రామ ధరణిపైన,

ధనమె మూలము జగతిలో, దానిలోనఁ

గలుగు నాంతర్యమును గను ఘనతరముగ,

ధనము లేమిచో మృతతుల్యుడనగనొప్పు.

భావము.  ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతోనే 

లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. 

ధనం లేని వాడు మృతునితో సమానం.

జైహింద్.

అహింసా పరమో ధర్మ:. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అహింసా పరమో ధర్మ: - తథా2 హింసా పరం తప:

అహింసా పరమం ఙ్ఞానం - అహింసా పరమార్జనమ్.(మహాభారతం)

తే.గీ.  పరమధర్మ మహింసయంచరయవలయు,

పరమ తపమహింసయే నిరుపమమది,

జ్ఞానమనగ నహింసయే కనఁగ మనము,

గొప్ప సాధనమె యహింస, కువలయమున.

భావము.  అహింస గొప్ప ధర్మము.  అదే  గొప్ప తపము. అదే మంచి ఙ్ఞానము. అదే గొప్ప సాధనము.

జైహింద్.

సత్యమేవ జాయతే నాఽనృతః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  సత్యమేవ జాయతే నాఽనృతః - సత్యేన పంథా వితతో దేవయానః 

యేనాక్రమన్త్యృషయో హ్యప్తకామా - యత్ర తత్ సత్యస్యా పరమం నిధానమ్.

తే.గీ.  సత్యమేజయించును కాదసత్యమెపుడు,

దేవమార్గము పెరుగును దీని వలన,

తీరు కోరికల్ దీనిచే, దివ్యమునులు,

దీనిచే ముక్తిఁ గనుదురు తృప్తిఁబడసి.

భావము. "సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా, 

దైవిక మార్గం విస్తరించబడింది, దీని ద్వారా కోరికలు పూర్తిగా నెరవేరిన ఋషులు 

అంతిమ సత్యం యొక్క మూలాన్ని చేరుకుంటారు."

జైహింద్.

పితా ధర్మః పితా స్వర్గః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  పితా ధర్మః పితా స్వర్గః  - పితా హి పరమం తపః |

పితరి ప్రీతిమాపన్నే  - ప్రియతే సర్వదేవతాః || 

(పద్మ పురాణ శ్లోకం 1.50.9) 

తే.గీ.  తండ్రి ధర్మంబు, స్వర్గమున్ దండ్రి ధరను,

తండ్రి సేవయే మనలకు తపము తలఁప,

తండ్రి మన సేవలను గొని తనిసిరేని

దేవతాళియు నెంతయు తృప్తినొందు.

భావము.  తండ్రియే  ధర్మము, తండ్రియే స్వర్గము, తండ్రియే పరమ తపము, 

ఆతడు సంతోషపడితే సర్వదేవతలు సంతుష్టులౌతారు.

జైహింద్.

28, డిసెంబర్ 2024, శనివారం

సంస్కృతమహాసమ్మేళనం. संस्कृतमहासम्मेलनम् 2024 # |

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

27, డిసెంబర్ 2024, శుక్రవారం

మాజీ భాతర ప్రథాని శ్రీ మన్మోహన్ సింగ్ కన్నుమూత.

0 comments

 ఓం నమశ్శివాయ.

ఇక సెలవు అంటూ తనువు చాలించిన మాకీ ప్రథాని మన్మోహన్ సింగ్.
భాతరదేశ మాజీప్రథాని గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త.   ప్రజా సంక్షేమం కోసం  ఎన్నో సంస్కరణకు రూపకల్పన చేసిన మన్మోహన్ మరణము మనకు తీరని లోటు.
ఆంధ్రామృతం ఈ మహనీయునకు ఘన నివాళులర్పిస్తూ వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోంది.
ఓం శాంతిః.


ఇక్షోరగ్రాత్ క్రమశః . ... మేలిమిబంగారం నమ సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఇక్షోరగ్రాత్ క్రమశః  - పర్వణి పర్వణి యథా రసవిశేషఃl

తద్వత్ సజ్జనమైత్రీ  - విపరీతానాం తు విపరీతాll

(భోజప్రబన్ధః)

తే.గీ.  కణుపు కణుపున తీపిని కలిగి యుండు

ఘనత పెరుగుచున్ జెరకున, ఘనులతోడ

స్నేహమట్టులే వృద్ధియౌన్, నీచ జనుల

స్నేహము విరుద్ధమిందుకు, చిద్విభాస!

భావము. "చెఱకు చివరినుంచి మొదటివరకు కణుపు కణుపునా ఎట్లు 

రసవిశిష్టముగనుండునో సజ్జనులతోడి స్నేహము అట్లే క్రమవృద్ధిగనుండును. 

దుర్జనులతో మైత్రి దానికి విరుద్ధముగానుండును."

జైహింద్.

26, డిసెంబర్ 2024, గురువారం

అవుసుల భానుప్రకాశ్ 'కశ్పి' ఆవిష్కరణోత్సవం.

0 comments

జైశ్రీరామ్.


శా.  భాసిల్లన్ భువి శ్రామికుల్ నిరతమున్  భానుప్రకాశాఖ్యులీ

భాసించే వర కస్పి గ్రంథ సుమమున్ భాగ్యంబుగా నిచ్చుటన్

భాషాపాండితినొప్పువారి నుతులన్ భాగ్యంబుగా పొందెడున్.

మీ సాన్నిధ్యము మేలు గూర్చు ప్రజకున్ మీకున్ మమస్కారముల్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
శ్రమజీవన సౌందర్యం / పని సంస్కృతి 


1) శా.  శ్రీమన్మంగళ భారతావని జనుల్ చిద్భావనోద్భాసితుల్,
ప్రేమన్ బంచుచు నెల్లవారి సుఖమున్ విశ్వంబునన్ గోరుచున్,
భూమిన్ శ్రామిక జీవులై జగతికే పూజ్యంబుగా నొప్పుచున్,
శ్రీమంతంబుగ వెల్గుచుందురు ధరిత్రిన్ దివ్య సత్కీర్తితో.

2) ఉ.  శ్రామిక జీవన మ్మవనిఁ జక్కని సన్నుత జీవనమ్ము, స
ద్ధీమతులెల్లవేళలు క్షితిన్ శ్రమఁ జేయుచు నాత్మ గౌరవం
బే మహితంబుగాఁ దలచి వెల్గుచునుందురు విశ్వమందునన్,
భూమియు పొంగు నా జనుల పూజ్య విధానము గాంచి మెచ్చుచున్.

3) మ.  తినునాహారము శ్రామికాళి కృషి, యత్నంబున్ సదా చేయుచున్,
ఘనమౌ పంటలు పండఁ జేయు కృషిచే, ఘర్మంబు చిందించుచున్,
వినయంబున్ సువివేకమున్ గలిగి సద్విజ్ఞాన తేజంబుతో
ననయంబున్ సుభకారులై జగతికిన్ హాయిన్ బ్రసాదింతురే.

4) ఉ.  కమ్మరివారు, కుమ్మరులు, కాడిని పట్టుచు దున్నువారు, యా
తమ్ములు పట్టువారు, ఘవతన్ గృషిచేసెడి నేతవారు, మ
త్స్యమ్ముల బట్టువారు, వినుతంబుగ వీధులనూడ్చువారు, క్షే
మమ్మును గోరువారె కద, మాన్యులు కార్ముక వీరులిందరున్.

5) మ.  ధనగర్వంబున కార్మికోత్తములపై ధాష్టీకమున్ జూపు దు
ర్జనులన్ సంఘము పారద్రోలవలె, ఘోరంబుల్ వినన్ రాదిలన్,
వినుతానందము కార్ముకాళికమరన్ విశ్వంబె భాసించు,భా
వన చేయన్ నుతకార్మికాళి కిదియే భానుప్రకాశంబగున్.

జైహింద్.

స్థానేష్వేవ నియోక్తవ్యా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. స్థానేష్వేవ నియోక్తవ్యా  -  భృత్యా ఆభరణాని చl

న హి చూడామణిః పాదే  -  ప్రభవామీతి బధ్యతేll

తే.గీ.  సేవకులనాభరణములఁ జింతఁ జేసి

యుండుటకు తగ్గ చోటునే యుంచవలయు,

చూడచక్కనంచెంచుచు వాడలేము

పాదములకుచూడామణిన్ పరవశించి.

భావము.  సేవకులను, ఆభరణములను వారి వారి స్థానములందే ఉంచాలి. 

"ఇది శ్రేష్ఠం" అని తలచి చూడామణిని పాదానికి బంధించముగదా! 

అనగా ఎవరు ఏ హద్దులో ఉండదగినవారో వారిని ఆ హద్దులోనే ఉంచవలెను.

జైహింద్.

25, డిసెంబర్ 2024, బుధవారం

శ్రీ రావు పంగనామముల ఫౌండేషన్ మరియు నేషనల్ రీసోర్స డవలప్మెంట్ కోపరెటీవ్ సొసైటీ హైదరాబాదు వారి నుండి (లైఫ్ టైం ఎచ్చీవ్మెంట్ ఎవార్డ్) జీవిత సాఫల్య పురస్కారము పొందుచున్న శుభ సందర్భంలో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మహోదయులుకు నా హృదయపూర్వక అభినందనలు.

0 comments

 జైశ్రీరామ్.




శ్రీరస్తు   ..   శుభమస్తు   ..   అవిఘ్నమస్తు.

శ్రీ రావు పంగనామముల ఫౌండేషన్ మరియు నేషనల్ రీసోర్స డవలప్మెంట్ 
కోపరెటీవ్ సొసైటీ హైదరాబాదు వారి నుండి (లైఫ్ టైం ఎచ్చీవ్మెంట్ ఎవార్డ్) జీవిత సాఫల్య పురస్కారము 
పొందుచున్న శుభ సందర్భంలో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మహోదయులుకు నా హృదయపూర్వక అభినందనలు.

శా.  శ్రీన్నానావిధమంత్ర పుష్పములతో జిజ్ఞాసతోఁ గొల్చు మీ 
రన్నన్ శ్రీహరి కంతు లేని కృప, మోహాదుల్ విడంజేయుటన్ 
మన్నింపంబడుచుందురంతటను దీమంతా! శుభాకార! శ్రీ
మన్నారాయణ! వెల్గుడీ ధరణిఁ బ్రేమన్ మీరు మీ పత్నితోన్.

మ.  క్షితినత్యద్భుత పంగనామముల రావ్ శ్రీమత్ పురస్కారమున్
మతిమంతుల్ వరణీయ సద్గుణయుతుల్ మాన్యుల్ గనం జాలువా
రతుల ప్రాభవ యుక్తిచే ధరను, మీరత్యంతయోగ్యంపు జీ
వితసాఫల్య పురస్కృతిన్ గనిరి భావింపన్ చిదానందులే.

శా.  శ్రీమల్లాప్రగడాన్వయా! శుభమయా! శ్రీచక్రసంవాసినిన్
బ్రేమన్ మీరు సతంబు గొల్చి శుభముల్ విఖ్యాతిగా బొందుచున్,
క్షేమంబే జనపాళికిన్ గొలుపగా శ్రీకావ్య సద్భాష్యముల్
ధీమంతుల్ విని మెచ్చఁ బల్కుదురుగా, దేదీప్యమానంబుగా.

శా.  యన్నార్డీ. మరి యార్పియఫ్. కలిసి శ్రేయంబున్ సదా పంచు శ్రీ
మన్నారాయణ యంచు నెంచి ధర సమ్మాన్యంబుగా నిచ్చిరే
మన్నింపంబడు సత్కృతిన్, తమకు శ్రీమంతా! గుణోపేత! శ్రీ
మన్నారాయణమూర్తి మీకు శుభముల్ మాన్యా! సదా కొల్పుతన్.

ఉ. మంగళమౌత మీకు ధర మాన్యమహోదయ! మంగళాకరా!
మంగళమౌత మీ సతికి మంగళమౌ జనపాళికిన్ సదా,
మంగళమౌ కవీశులకు, మంగళమౌ వర భక్తపాళికిన్,
మంగళమౌత శాంభవికి మంగళమౌ మన భారతాంబకున్.

బుధజన విధేయుఁడు,
చింతా రామకృష్ణారావు.

26/12, 8:06 am] Mallaapragada Sreemannaaraayana: 
మీ సౌజన్య మనన్యము
మీ సంస్కారము తరగని
          మేల్మి పసిడియౌ
మీ సౌహార్దము వెన్నెల
మీ సంభాషణ చెలిమికి
          మేలిమి గురుతౌ. 
🙏🙏🙏🙏🙏🙏
[26/12, 8:14 am] Mallaapragada Sreemannaaraayana: 
సౌజన్యము నాత్మీయత
సాజంబగు రూపు గొనెనొ!
          సాక్షా ద్వాణీ
తేజమె 'చింతా' కవియై
ఈ జన్మకు దక్కెనిట్లు
          నీశ్వరు కరుణన్.
🙏🙏🙏🙏🙏🕉️
[26/12, 8:46 am] Chinta Ramakrishnarao: 
ఉ.  మాటలు రావు నాకు గుణమాన్యులు మీరె గణింప నన్ను, మీ

పాటి మనోహరుండనిన భక్తజనాశ్రయుఁడౌ నృసింహుఁడే,

ధాటిగ సత్సభా స్థలి సుధల్ ప్రసరించెడి వాగ్విదాంవరా!

మాటలవెట్లు వచ్చు పరమంబగు మీ నుతులాలకించినన్?
🙏🏻🙏🏻🙏🏻

జైహింద్.

24, డిసెంబర్ 2024, మంగళవారం

స్వశరీరే స్వయం జ్యోతిః . ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  స్వశరీరే స్వయం జ్యోతిః  -  స్వరూపం సర్వ సాక్షిణం,

క్షీణ దోషాః ప్రపశ్యంతి   -  నేతరే మాయయావృతాః. (అన్నపూర్ణోపనిషత్. 4-36).

తే.గీ.  దేహమందునె వెలిగెడి దివ్య మైన

సర్వసాక్షియౌ జ్యోతిని సాధు జనులు

పాపదూరులె చూతురు, పాప యుతులు

కానగాలేరు నిజమిది కమలనయన.

భావము.  

తన శరీరమందే స్వయముగా ప్రకాశిస్తూ సర్వ సాక్షిగా ఉండే ఆత్మస్వరూపమును 

దోషరహితులు మాత్రమే దర్శింపఁగలరు. మాయలో చిక్కినవారు దర్శింపలేరు.

జైహింద్.

శ్రీ అవుశుల భావుప్రకాశ్ గ్రంథావిష్కరణ సందర్భముగా నాకు సత్కారము.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీ అవుశుల భావుప్రకాశ్ గ్రంథానిష్కరణ సందర్భముగా నాకు జరిగిన సత్కారము.
సభలో నా కవిత.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

సభాధ్యక్షుఁడు పోలీస్ వేంకటదాసు ను ఉద్దేశించి.
కం.  వేంకటదాసు శుభాస్పద
సంకటహర పరమహంస సన్నిభుఁడెన్నన్,
జంకకసభలన్ బలుకుచు
శంకలులేనట్టి ఘనుఁడు, సన్నుతుఁడు ధరన్.

ముఖ్య అతిథి డా. కసిరెడ్డి వేంకటరెడ్డిని ఉద్దేశించి
కం.  కసిరెడ్డి సన్నుతాత్ముఁడ!
వసివాడని మందహాస భాసుర ముఖుఁడా!
యసమాన పాండితీద్యుతి!
ఋషికల్పుల మిమ్ముఁ జూడ తృప్తిగనుండున్.

భానుప్రకాశ్ ను ఉద్దేశించి

ఉ.  భాసిల్లన్ భువి శ్రామికుల్ నిరతమున్ భానుప్రకాశాఖ్యులీ
భాసించే వర కస్పి గ్రంథ సుమమున్ భాగ్యంబుగా నిచ్చుటన్
భాషాపాండితినొప్పువారి నుతులన్ భాగ్యంబుగా పొందెడున్.
మీ సాన్నిధ్యము మేలు గూర్చు ప్రజకున్ మీకున్ మమస్కారముల్.

శ్రమజీవన సౌందర్యం / పని సంస్కృతి 

1) శా.  శ్రీమన్మంగళ భారతావని జనుల్ చిద్భావనోద్భాసితుల్,
ప్రేమన్ బంచుచు నెల్లవారి సుఖమున్ విశ్వంబునన్ గోరుచున్,
భూమిన్ శ్రామిక జీవులై జగతికే పూజ్యంబుగా నొప్పుచున్,
శ్రీమంతంబుగ వెల్గుచుందురు ధరిత్రిన్ దివ్య సత్కీర్తితో.

2) ఉ.  శ్రామిక జీవన మ్మవనిఁ జక్కని సన్నుత జీవనమ్ము, స
ద్ధీమతులెల్లవేళలు క్షితిన్ శ్రమఁ జేయుచు నాత్మ గౌరవం
బే మహితంబుగాఁ దలచి వెల్గుచునుందురు విశ్వమందునన్,
భూమియు పొంగు నా జనుల పూజ్య విధానము గాంచి మెచ్చుచున్.

3) మ.  తినునాహారము శ్రామికాళి కృషి, యత్నంబున్ సదా చేయుచున్,
ఘనమౌ పంటలు పండఁ జేయు కృషిచే, ఘర్మంబు చిందించుచున్,
వినయంబున్ సువివేకమున్ గలిగి సద్విజ్ఞాన తేజంబుతో
ననయంబున్ సుభకారులై జగతికిన్ హాయిన్ బ్రసాదింతురే.

4) ఉ.  కమ్మరివారు, కుమ్మరులు, కాడిని పట్టుచు దున్నువారు, యా
తమ్ములు పట్టువారు, ఘవతన్ గృషిచేసెడి నేతవారు, మ
త్స్యమ్ముల బట్టువారు, వినుతంబుగ వీధులనూడ్చువారు, క్షే
మమ్మును గోరువారె కద, మాన్యులు కార్ముక వీరులిందరున్.

5) మ.  ధనగర్వంబున కార్మికోత్తములపై ధాష్టీకమున్ జూపు దు
ర్జనులన్ సంఘము పారద్రోలవలె, ఘోరంబుల్ వినన్ రాదిలన్,
వినుతానందము కార్ముకాళికమరన్ విశ్వంబె భాసించు,భా
వన చేయన్ నుతకార్మికాళి కిదియే భానుప్రకాశంబగున్.

అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.



సర్వం పరవశం దుఃఖం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సర్వం పరవశం దుఃఖం   -  సర్వం ఆత్మవశం సుఖమ్ |

ఏతత్విద్యాత్సమానేన   -  లక్షణం సుఖదుఃఖయోః ||

తే.గీ.  పరవశంబగు స్వధనంబు బాధపెట్టు,

మనవశంబగు మనదేను మనకు సుఖము

నిచ్చు నీవిషయంబునే నెఱుగి సుఖము

గొలుపునదినది కోరి చేయుచున్ గొనుము సుఖము. 

భావము. మనదే అయినా ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే 

కలిగిస్తుంది. మనకు దక్కింది మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సుఖదుఃఖాలను

 ఇలాగే నిర్వచించుకోవాలి. అంటే మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని, 

ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని భావం.

జైహింద్.

23, డిసెంబర్ 2024, సోమవారం

పుంభావ భారతీ బిరుదుప్రదానము ........ గ్రహీత చింతా రామకృష్ణారావు... ప్రదాత స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. విద్వాన్ బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు.

2 comments

 జైశ్రీరామ్.

శ్రీ జగన్మాత ప్రేరణతో నేను సౌందర్యలహరిని తెలుఁగు పద్యములలోనికి అనువదించగా అది చదివి సహృదయ శిరోమణి విద్వాన్ బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంతరాజారావు మహోదయులు అత్యంత ఆనందభరితులై నాకు  *పుంభావ భారతీ* బిరుదుప్రదానము చేయుచు వ్రాసిన అభినందన  పంచరత్నములు. 

అవధాన భారతి. సాహితీ చతురానన. ఛందో వైవిధ్యనిష్ణాత. ఛందస్సవ్యసాచి. 

స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. 

విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., 

విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. 

పుంభావ భారతీ బిరుదుప్రదానము చేయుచు పంచరత్నములు.

కం.  చింతా యను పద భావమె

చింతించుట యగును, మీరు చిత్తమునందున్

సంతతము చింత చేయుచు,

సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.

కం.  ఎన్నని వ్రాయుదురయ్యా!

ఎన్నగ మీ ప్రాయ మెంత? యెసగెడు చిత్తం

బున్నట్టి శక్తి సంపద

లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!

కం.  పద్దెములెన్నివిధంబులొ

యద్దెస మీ గమనముండు, నాలోచనముల్

తద్దిశ మెరయున్ గావ్యం

బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.

కం.  పుంభావ భారతీ యని

సంబోధనతోడ మిమ్ము చక్కగఁబిలుతున్

బింబోష్ఠివాణి ఘనధీ

సంబంధయుతుండవౌట సత్కవివర్యా!

కం.  సొంపగునీ బిరుదమ్మున్

సొంపుగ నే నిచ్చుచుంటి సుందరమతితో

న్నింపుగ నను మన్నించుచు

కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!

చక్రాల లక్ష్మీకాంతరాజారావు

19 . 10 . 2024.

సహృదయశిరోమణియైన బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారి అవ్యాజానురగమునకు ఏవిధముగనూ ఋణము తీర్చుకోలేనివాఁడను. వారికి ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను పాదాభివందనములర్పించుకొనుచున్నాను.

జైహింద్.

ద్వితీయం సంస్కృత సమ్మేలనమ్...........2024 డిశంబరు 27 - 28 - 29 తేదీలలో.

0 comments

 జైశ్రీరామ్

జైహింద్.

ఉత్థానేన జయేత్తన్ద్రీం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. ఉత్థానేన జయేత్తన్ద్రీం  -  వితర్కం నిశ్చయాజ్జయేత్|

మౌనేన బహుభాష్యం చ  -  శౌర్యేణ చ భయం త్యజేత్||

(మహాభారతమ్)    

తే.గీ.  యత్న మున సోమరితనంబు నణచవచ్చు,

శాస్త్ర నిశ్చయము వితర్క జయమొసంగు,

మౌనముననతివాగుడు మాయమగును,

శౌర్యమున పిరికితనము చక్కఁ బాయు.

భావము.  ప్రయత్నం వలన సోమరితనాన్ని , శాస్త్రనిశ్చయం వలన 

విపరీతతర్కాన్ని , మౌనం వలన అతివాగుడును , శౌర్యం వలన భయాన్ని 

విడిచిపెట్టాలి.

జైహింద్.

22, డిసెంబర్ 2024, ఆదివారం

పురాణాల్లో ఉండే ప్రస్తుత నగరాలు.

0 comments

 జైశ్రీరామ్.

1. అంగ రాజ్యం - కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

2. అశోకవనం (9-311-వ.) - సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

3. ఆయోధ్య (9-266-క.) - శ్రీరాముని జన్మస్థలం, - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

4. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

5. కారుష రాజ్యము - దంతవక్రుని రాజ్యం, (9-722-వ.) - దాంతియ జిల్లా, మధ్యప్రదేశ్.

6. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన (10.1-1639-ఉ.) స్థలం - గిర్నార్, గుజరాత్.

7. కిష్కింద - ఆంజనేయ పర్వతం, హనుమంతుడి జన్మస్థలం, (2) సుగ్రీవుని రాజ్యం, (3) ఋష్యమూక పర్వతం (9-271-వ. - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక

8. కుండినపురము - రుక్మిణిదేవి జన్మస్థలం, విదర్భ ముఖ్యపట్టణము, (10.1-1687-చ.) - కుండినపుర, మహరాష్ట్ర

9. కుంతి - పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు - గ్వాలియర్.

10. కుచేలుడు (10.2-965-సీ.) నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.

11. కోసలదేశం(9-362-ఆ.) - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

12. ఖాండవవనము / ఇంద్రప్రస్థము - పాండవుల రాజధాని, (1-361-క.) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

13. గంగాసాగర్,- కపిల మహర్షి ఆశ్రమం, శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది (9-231-మ.), వెస్ట్ బెంగాల్

14. గంగోత్రి - భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం (9-230-వ.), ఉత్తరాఖండ్

15. చిత్రకూటం (9-267-క.) - సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

16. చేది రాజ్యము - శిశుపాలుని రాజ్యం, (10.1-1697-ఉ.) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

17. జనమేజయుడు సర్పయాగం (12-26-వ.) చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.

18. జరాసంధ్ కీ ఆఖరా జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్. (10.2-718-వ.)

19. దండకారణ్యం (9-268-ఉ.) - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

20. ద్వారక - శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరము (10.1-1615-వ.) - ద్వారక,గుజరాత్.

21. నిషాద రాజ్యం (10.2-348-ఉ.) నల మహారాజు రాజ్యం - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్.

22. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్.

23. నైమిశారణ్యం (1-39-వ.) వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

24. పంచవటి - శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం (9-269-సీ.) - నాసిక్, మహరాష్ట్ర.

25. పాంచాల దేశం - ద్రుపద మహారాజు రాజ్యం, (1-365-సీ.) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

26. పాండవుల, లాక్షగృహ (3-14-క.) దహనం- వర్నాల్, హస్తినాపూర్.

27. ప్రతిష్టానపురము (9-32-వ.) పురూరవుని రాజధాని -ఝున్సి, అలహాబాద్.

28. ప్రభాస తీర్థం (11-87-సీ.) - శ్రీ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి జరిపిన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

29. ప్రాగ్జ్యోతిష్యం - నరకాసురుని రాజధాని (10.2-156-వ.) - తేజ్ పూర్, అస్సాం.

30. మత్స్య దేశం (1-243-వ.) విరాట మహారాజు రాజ్యం -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

31. మద్ర దేశం - పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు, (3-62-మ.) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

32. మధుర - కంసుని రాజధాని, (10.1-18-వ.) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

33. మహావిష్ణువు గజేంద్రుడిని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం (8-42-మ.) - గజేంద్ర ధామ్, దేవ్ ధాం, మానససరోవరము దగ్గరలో, నేపాల్.

34. మహీష్మతి పురము (9-434-క.) - కార్తవీర్యార్జునుని రాజధాని -మహేశ్వర్, మధ్యప్రదేశ్

35. మహేంద్రము (5.2-55-వ.) అను పర్వతం , పరశురాముడు తపస్సు చేసిన స్థలం - పశ్చిమ ఒరిస్సా

36. మిథిల - సీతాదేవి పుట్టినిల్లు (9-372-వ.) - జనక్ పూర్, నేపాల్

37. వాల్మీకి ఆశ్రమం (9-346-సీ.) - సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరములోని బితూర్.

38. విదర్భ - రుక్మిణిదేవి తండ్రి రాజ్యం, (10.1-1687-చ.) - విదర్భ, మహరాష్ట్ర

39. విభీషణుడు రాముని శరణు కోరిన (9-289-వ.) స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

40. విరాటనగరము - పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం (1-243-వ.) - విరాట్ నగర్,రాజస్థాన్

41. వ్రేపల్లె / గోకులం - (10.2-186-వ.) గోకుల్, మధుర దగ్గర.

42. శమంత పంచకము (9-487-వ.) పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో అయిదు మడుగులు నెలకొల్పిన చోటు మరియు భీముడు దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్రము దగ్గర, హర్యానా

43. శోణపురము - బాణాసురుడి రాజధాని (10.2-318-వ.) - సోనిత్ పూర్, అస్సాం.

44. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు (9-288-క.) - రామేశ్వరము,తమిళనాడు

45. సరయూ నది (9-211-చ.) - ఈ నదీ తీరములోనే అయోధ్య నిర్మితమైనది - ఘాఘర నది.

46. సాళ్వ రాజ్యం - జరాసంధుని మిత్రులలో ఒకడు సాళ్వ దేశపువాడు, (10.1-1682-మ.) - కురుక్షేత్రము దగ్గర.

47. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ,

48. హస్తినాపురము - కౌరవుల రాజధాని, పరీక్షిత్తుని రాజధాని, (1-78-వ.) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

జైహింద్.