గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2026, శనివారం

67. శ్లోII అధికాంచి వర్తమానా మతులాం ... ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.


67. శ్లోII  అధికాంచి వర్తమానా మతులాం కరవాణి పారణా మక్ష్ణోః  

ఆనంద పాకభేదా మరుణిమ పరిణామ గర్వ పల్లవితామ్‌. 


తే.గీ.II  హ్లాద పాకభేదముతోడ నతులితయును, 

కంచి సంచారి, యరుణిమ క్రమ పరిణతి

గర్వ పల్లవితయునగు కామనేత్రి

యొక్క దర్శనమును బొంది యొప్పుదునిల.


తాII ఆనందపరిపాక విశేషమును, ఎఱుపురంగుయొక్క క్రమపరిణామ గర్వముచే జిగురించుదానిని,  కాంచి యందు వర్తించు దానిని, దర్శించుకొనుదును.


అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

అమ్మవారికి గర్వము ఉన్నదని చెప్పవచ్చా? మూక కవి అలా ఎందుకు చెప్పారు?      తాడేపల్లిపతంజలివివరణ.                                 ​ఈ శ్లోకంలో కవి అమ్మవారి అందాన్ని, ఆమె ఇచ్చే ఆనందాన్ని రెండు అందమైన పోలికలతో వివరించారు:

​1. ఆనంద పాక విశేషం (పరమానంద రసం)

​శివుడు నిరంతర ఆనంద స్వరూపుడు. ఆ శివుడి ఆనందమే ఒక స్త్రీ రూపం దాల్చితే, ఆ రూపమే కామాక్షి అమ్మవారు.

​మనం వంట చేసేటప్పుడు పదార్థాలు బాగా పాకం పడితే రుచి అద్భుతంగా పెరుగుతుంది. అలాగే, శివునిలోని ఆనందం అనే భావం బాగా పక్వానికి వచ్చి (పాకమై), మరింత రుచికరంగా మారిన రూపమే అమ్మవారు.

​ఆ పరమశివుడికే అమితమైన ఆనందాన్ని ఇచ్చే ఆ తల్లి రూపం, మన కళ్లకు దొరికే ఒక పెద్ద విందు భోజనం లాంటిది.2.సాధారణంగా చెట్లకు వచ్చే కొత్త చిగురుటాకులు (పల్లవములు) చాలా లేతగా, ఎర్రగా ఉంటాయి.

​ అమ్మవారు నిలువెత్తు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్నారు. "ఈ ప్రపంచంలో నాకంటే ఎర్రగా, అందంగా ఎవరూ లేరు" అనే ఒక చిన్న గర్వం (అభిమానం) అమ్మవారికి ఉంది.

​ఒకవేళ ఆ గర్వానికి కూడా ఒక రూపం ఉండి, అది కూడా ఎర్రగా మారిపోతే ఎలా ఉంటుంది?  ఎర్రగా ఉన్న చిగురుటాకు మీద, ఈ గర్వం అనే మరో ఎరుపు రంగు వచ్చి చేరినట్లు ఉంది. అంటే... ఎరుపుకు ఇంకొక ఎరుపు తోడైతే అది ఎంత గాఢంగా, ఎంత అందంగా మారుతుందో, అమ్మవారి రూపం అంతటి ఎరుపుదనంతో ప్రకాశిస్తోందని భావం. కవిత్వంలో ఒక వస్తువు యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి "గర్వం" అనే పదాన్ని ఒక అలంకారంగా వాడతారు.

​ఉదాహరణకు: "ఆ పువ్వు అందం ముందు మిగిలిన పువ్వుల గర్వం అణిగిపోయింది" అంటాం. అంటే అక్కడ పువ్వుకు పొగరు ఉందని కాదు, దాని అందం అంత గొప్పదని అర్థం.

​ఇక్కడ కూడా, "అమ్మవారి ఎరుపుదనం ముందు సృష్టిలోని మరే ఎరుపు రంగు సరితూగదు" అని చెప్పడమే ఆ 'గర్వం' యొక్క ఉద్దేశం.మూకకవి వాడిన 'గర్వము' అనేది అహంకారం కాదు; అది "సౌందర్య పరాకాష్ఠ" (అందానికి ఆఖరి హద్దు). అమ్మవారి రూపం అంతటి దివ్యమైన, తిరుగులేని కాంతితో ప్రకాశిస్తోందని చెప్పడానికి కవి భక్తితో, ప్రేమతో వాడిన పదం అది. కాబట్టి కవిత్వ పరిభాషలో దీనిని తప్పుగా భావించనవసరం లేదు🕉️🙏🕉️

శ్రీ పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.