జై శ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏽
మూకపంచశతి..ఆర్యా శతకము.
69. శ్లోII కిం వా ఫలతి మమాన్యై ర్బింబాధర చుంబి మందహాసముఖీ
సంబాధకరీ తమసా మంబా జాగర్తి మనసి కామాక్షీ || 69
తే.గీ.II అధర బింబమున్ ముద్దిడు మధుర హసన
ముననునొప్పు మోమున, తమంబును హరించు
లోక జనని కామాక్షి నా లోననుండ
నితర దేవతలొసగునదేమి యుండు?
తాII దొండపండువంటి పెదవిని ముద్దుపెట్టుకొను మురిపెంపు జిఱునవ్యు
నెమ్మోమునం దులకింప, తమంబు హరించు జగజ్జనని కామాక్షి నా మనసునందే వర్తించుచుండ నా కితర దేవతల వలన నొరుగ బోవు ఫల మేమి?
అమ్మ దయతో🙏🏽
చింతా రామకృష్ణారావు.
ఈ శ్లోకమునకు శ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల వివరణ.
జీవితంలోని చీకట్లను (అజ్ఞానాన్ని) తాత్కాలికంగా కాకుండా, మరెప్పటికీ తిరిగి రాకుండా పూర్తిగా నాశనం చేసేది కామాక్షి అమ్మవారే. దొండపండులా ఎర్రగా ఉండే పెదవిపై, ఎల్లప్పుడూ మురిపించే చిరునవ్వుతో ప్రకాశించే ఆ తల్లి ముఖం నా మనస్సులో నిరంతరం మేల్కొని (ప్రకాశిస్తూ) ఉంది. మోక్షాన్ని ఇచ్చే ఆ కామాక్షి దేవి నా మనసులో ఉండగా, సంసార బంధాలలో మునిగి తేలే ఇతర దేవతలు నాకు ఎలాంటి ఫలాన్ని ఇవ్వగలరు? (అంటే, అమ్మవారి అనుగ్రహం ముందు ఇతర దేవతలు ఇచ్చే చిన్న చిన్న కోరికల ఫలాలు నాకు అక్కర్లేదు.
1.
ఎర్రని పెదవి - తెల్లని నవ్వు: అమ్మవారి పెదవి దొండపండులా ఎర్రగా ఉంది. దానిపై తెల్లని చిరునవ్వు మెరుస్తోంది. ఇక్కడ కవి ఒక అద్భుతమైన భావనను చూపిస్తున్నారు. ఎరుపు రంగు అమ్మవారికి ప్రతీక అయితే, తెలుపు రంగు శివునికి ప్రతీక.
అమ్మవారి పెదవిని ఆ చిరునవ్వు ముద్దాడుతున్నట్లు ఉంది. కానీ అంతర్లీనంగా చూస్తే, సాక్షాత్తు ఆ పరమశివుడే అమ్మవారిని ముద్దాడుతున్నాడా అన్నట్లుగా ఆ దృశ్యం కవి ఊహకు తట్టింది. శ్లోకంలోని ‘చుంబి’ (ముద్దు పెట్టుకోవడం) అనే పదం ఈ శివశక్తుల అద్భుత కలయికను మనకు తెలియజేస్తోంది.
2. సాధారణంగా సాయంత్రం వచ్చే సంధ్య చీకటిని తాత్కాలికంగానే పోగొడుతుంది. మళ్లీ మరుసటి రోజు చీకటి వస్తుంది. కానీ, కామాక్షి అమ్మవారు అలా కాదు. మన మనస్సులోని అజ్ఞానమనే ‘తమోగుణాన్ని’ (చీకటిని) శాశ్వతంగా తరిమికొడుతుంది. అందుకే ఇక్కడ సంధ్యతో పోలుస్తూనే, సంధ్య కంటే అమ్మవారే గొప్పదని చెప్పడం వల్ల ఇది ‘వ్యతిరేకాలంకారం’ అవుతుంది.
3.
‘సంధ్యే సృష్టిరాహ హి’ అనే బ్రహ్మ సూత్రం ప్రకారం, నిద్రకు, మెలకువకు మధ్య ఉండే ‘స్వప్న అవస్థను’ (కలల స్థితిని) సంధ్య అంటారు. మనసు లోపల మేల్కోవడం అనేది ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక స్థితి.
మోక్షాన్ని ప్రసాదించే కామాక్షి దేవి నా మనస్సులో నిరంతరంగా మేల్కొని ఉంది. అందువల్ల ప్రాపంచిక సుఖాలు, చిన్న చిన్న కోరికల పట్ల నాకు పూర్తి విరక్తి (వైరాగ్యం) కలిగింది. అలాంటి నాపై ఇతర దేవతలు ఇచ్చే తాత్కాలిక ఫలాలు ఎలాంటి ప్రభావం చూపలేవు. నాకు కావాల్సింది అమ్మ ఇచ్చే మోక్షమే. కామాక్షీ దేవ్యై నమః.🕉️🙏🕉️
చక్కని వివరణనందించిన పతంజలిగారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.