జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏽
మూకపంచశతి..ఆర్యా శతకము.
65. శ్లోII కుసుమశర గర్వసంప త్కోశగృహం భాతి కాంచి దేశగతమ్
స్థాపిత మస్మి న్కథమపి గోపిత మంత ర్మయా మనోరత్నమ్.
తే.గీ.II మన్మథుని గర్వసంపద మందిరమ్ము
కంచియందొకటున్నది ఘనతరముగ,
నా మనంబను రత్నమున్ బ్రేమనెటులొ
దాచిపెట్టితి నచ్చట తత్త్వమరసి.
తాII మన్మథగర్వసంపదకు భాండాగార మొకటి కాంచి మధ్య దేశమందు ప్రకాశించుచున్నది. నా మనస్సు అనెడి రత్నమును దానియందు దాపరిక మొనర్చితిని.
అమ్మ దయతో🙏🏽
చింతా రామకృష్ణారావు.
ఈ శ్లోకానువాదము పఠించిన బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులు ఈ విధముగా వ్యాఖ్యానించియున్నారు.
శివుడు తన మనసును ఎంతో నిగ్రహించుకోగలడు. కానీ అమ్మవారిని చూడగానే ఆయన యోగసాధనలన్నీ పక్కన పెట్టి, ఆమె ప్రేమలో పడిపోతారు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. శివుడంతటి ఇంద్రియ నిగ్రహం గలవాడు లేడంటారు.మరి మూకకవి "మన్మథ గర్వ సంపద" అనే పదం ద్వారా వ్యంగ్యంగా శివుని ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు తక్కువ చేశారు? తాడేపల్లి పతంజలి జవాబు శివుడి ఇంద్రియ నిగ్రహాన్ని తక్కువ చేయడం కవి ఉద్దేశం కాదు; శివుడి నిగ్రహాన్ని సైతం కరిగించగల అమ్మవారి దివ్య సౌందర్యం, సర్వవ్యాప్త శక్తి ఎంత గొప్పవో కొనియాడడమే మూకకవి గారి ముఖ్య ఉద్దేశం.శ్లోకం చివరి భాగంలో కవి "తస్మిన్ మయా అంతః స్థాపితం మనోరత్నమ్" (అందులో నా మనసనే రత్నాన్ని దాచాను) అన్నారు. దీనికి కారణం:
శివుడి అంతటి మహా యోగిని సైతం కట్టడి చేయగల శక్తి ఒక్క అమ్మవారికే ఉంది. అంతటి శక్తివంతురాలైన అమ్మవారి పాదాల చెంత లేదా ఆమె హృదయంలో తన మనసును దాచితే, ఇక ఏ లౌకిక మాయలు, కామక్రోధాలు ఆ మనసును దొంగిలించలేవు.
మన మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటూ కోరికల వైపు పరిగెడుతుంటుంది. దాన్ని నిగ్రహించడం ఎవరికైనా కష్టమే. అందుకే కవి తన చంచలమైన మనసును అమ్మవారికి అప్పగించేశాడు. శివుడి మనసునే కరిగించిన అమ్మవారు, తన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుందని కవి నమ్మకం. మనలని కూడా అలా చేయమని ఉత్తమ సందేశం🕉️🙏🕉️
చక్కని వివరణనందించిన పతంజలి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.