గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2024, సోమవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరాదు ఉగాది వేడుక చందానగర్ లో ... ౦౭ - ౪ - ౨౦౨౪.

 జైశ్రీరామ్.

శా.  శ్రీమన్మంగళ క్రోధి వత్సరము రాశీభూత సన్మంగళ

శ్రీమాన్యంబులు గొల్పవచ్చె మనకున్, చిన్మార్గ సద్వర్తులన్

క్షేమంబొప్పఁగ గాచునిద్ధరణిపై, ఛేదించు దుష్టాత్ములన్,

శ్రీమత్క్రోధి వసంతమా! శుభములన్ జిందించుమా మా పయిన్.


ఉ.  క్రోధిగ వచ్చితీ విపుడు కూల్చగనెంచి దురాత్మపాళి, న

క్రోధిగ నుండి శిష్టుల పురోగతిఁ జూచెడి నీకు మ్రొక్కెదన్,

బాధలఁ గూడియున్న వర భక్తుల వృద్ధికి హేతు వౌచు, న

క్రోధిగ వెల్గు మమ్మ గుణ కోవిదులందరు నిన్ను మెచ్చగన్.


ఉ.  వేలకు వేల దుష్టులను వేచగ వచ్చిన నీవు మంచిగా

నేలుము మంచివారల ననేకవిధంబుల శోభఁగూర్చి, నీ

పాలన పుణ్యకర్ముల కపార శుభావహమై రహించి గో

పాలుడె నీవనన్ వెలుగు, భవ్య గుణావహ! క్రోధి! సన్నుతుల్.


శా.  రామస్వామిగ రాజ్యమేలుము భువిన్ రాజిల్లు మక్రోధివై,

ప్రేమన్ నిల్పుము నాల్గుపాదములపై విఖ్యాతిగా ధర్మమున్,

నీ మంచిన్ మరువంగరాదు సుజనుల్, నీవింక యక్రోధివై

శ్రీమంతంబుగ స్త్రీలనిద్ధరను రాజిల్లంగ దీవింపుమా.


ఉ.  మంగళమౌత శ్రీపతికి, మంగముల్ శుభక్రోధికిన్, సదా

మంగళమౌత సద్గుణ సమంచితులౌ వర సజ్జనాళికిన్,

మంగళమౌత హిందువుల మంగళ భావన పాళి కెల్లెడన్,

మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్.🙏🏼

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.