గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఏప్రిల్ 2024, గురువారం

కవితాసుందరి కావ్యము నుండి పది పద్యములు. .. డా. నలవోలు నరసింహా రెడ్డి

జైశ్రీరామ్. 

 కవితాసుందరి కావ్యము  

కం. శ్రీకర మా, వాణీ, గిరి 

జా కర సంపూర్ణ కరుణ జలజాకరమై 

సాకర 'కావ్యమునకు' సమ

తాకర శుభకర మిడుత! సుధాకర కరమై 1


సీ.నిండు పున్నమిరేయి పండు వెన్నెలవోలె

        మధుపమ్ము గొనితెచ్చు మధువువోలె

పంట చేనుల నూగుపసిడి కంకులవోలె

         మింట విద్యుల్లతమెరుపువోలె

పచ్చ కర్పూరంపు పరిమళంబులవోలె

        ఆటాడుహరిదాసు పాటవోలె

తల్లి గుండెలపైనతనరు పాపలవోలె

        పసిబిడ్డనును వేడి స్పర్శవోలె

గీ. ముద్దు ముద్దుగ తెలవారు పొద్దువోలె

పల్లెకోవెల యందలి పాటవోలె

సాహితీ ప్రియుల్‌ తలలూచి చప్పటులను

జరచుచుండ కవిత్వంబు సాగవయు   2


సీ. మల్లె పూవులు బూచి మరులుగొల్పెడు రీతి

             చల్లనౌ ముత్యాలజల్లు రీతి

మధు మాసమున బూయు మావి తావుల రీతి

             తీయతీయని జుంటి తేనె రీతి

చిన్ని పాపల నోట చిలుక పల్కుల రీతి

              జున్ను మీగడ పాల వెన్న రీతి

మోహంపు ప్రియురాలు ముద్దు వడ్డన రీతి

              షడ్రసోపేత భోజనము రీతి

గీ. పాలుత్రాగిన దూడల పరుగు రీతి

లేడి కూనలు చెంగున నాడు రీతి

మధుర మంజుల సాహిత్య సుధలు జిందు

కవిత వ్రాయగా వలె నిల కవివరుండు 3


సీ. మండు వేసవిలోన మధురపానీయంబు 

            తనివితీరెడు రీతి త్రాగు నట్లు 

చిరు జల్లువెనువెంట గురియు చుండగ వేడి

            మిరుప బజ్జీలను కొరికినట్లు

సరసంపు రాత్రిలో చిరు హెచ్చరింపుగా

            తొలి కోడికూతయై దోచునట్లు

నల్లమబ్బులజూచి మెల్లగాపురి విప్పి

            హాయి గొల్పగ నెమళ్ళాడునట్లు

ఆ. కొండ కోన లోన కోకిలమ్మల పాట

గాలి తెరల పైన తేలినట్లు

రసిక జనులుమెచ్చి మిసమిస లొలకించు

కవితవ్రాయ వలయు కవివరుండు 4


సి. రాగసుధలు జింద రసమయ జగతికి 

              రాణించు మాణిక్య వీణయగుచు 

రమ్య గీతిక భంగి రంజిల్లు రాగాల

            పల్లవించుచునుండి నుల్లమలర 

మెదడు నిద్దురబాపి మేలుకొల్పగ జేసి  

            నవ్యమార్గములందు నడుపుచుండి 

నవనవోన్మేషపుం నాట్యమయూరమై 

           తకధింత తద్ధింత తాళ గతుల 

గీ. నర్తనము సల్పి మనుజాళి నాల్కలందు 

 గుండె గుండెను కదుపుచు క్రొత్తదనము 

కలిగి జనులలో  చైతన్య కాంతి నింపి  

అలరు నట్టిదే యగునచ్చమైన కవిత 5


సీ. కవన నిర్మాణమ్ము గావింప వలెనన్న 

         నరుదైన అంశమ్ము నరయవలయు 

అరయబూనిన కైత అద్భుతంబగురీతి  

          చెన్నుమీరెడుభంగి జెప్పవలయు

చెప్పబూనిన కైత చిత్తమ్ము లలరించ 

          కొమరారు పదములం దమర వలయు   

అమర బూనిన కైత పరమార్ధమును దెల్పు     

           భావపుష్టి గలిగి పరగ వలయు 

ఆ. పరగి నట్టి కైత పండితాళురు మెచ్చ 

ఆటవెలది యగుచు నాడవలయు 

కవన మిట్టులున్న కలకాలమందున 

కవికి గలుగు నిల నఖండకీర్తి 6


సీ. మధుమాస మరుదెంచి మంగళారతి నెత్త 

            శుకపిక రవమ్ముల శోభలట్లు 

 కమనీయ మైన ఉగాది పచ్చడి లోని 

             కొత్తనౌ రుచు లారు గ్రోలునట్లు 

పచ్చచీరను గట్టి ప్రకృతి కాంత యిలపై  

             పొలుపైన సొగసార బోసినట్లు 

పాల్గారు చెక్కిళ్ళ పసిపాప మోవిపై 

            చిరునవ్వు నింపార జిందునట్లు 

గీ. నందనారామ సీమలానందముగను 

నేత్రపర్వమై పులకించు యాత్ర సలిపి 

చిత్త మందున సంతృప్తి జెందునట్లు

కవిత కూర్చగా వలె కలకండ యట్లు   7


సీ. కొత్త పాతలలోని కుదురు సాహిత్యమ్ము  

           నెలవైన బుద్ధితో నేర్చి నేర్చి

సరసమై వెల్గొందు శబ్దపల్లవముల 

           క్రొమ్మెరుంగులు జింద  గూర్చి కూర్చి

ఇటుక వామును దెచ్చి యిల్లు గట్టినయట్లు  

           పేరైన పదములం బేర్చి పేర్చి 

అతివ మేనికి సొమ్ము లందగించిన రీతి

           తెలి యలంకారముల్  తీర్చి తీర్చి    

గీ.  సరళ సుందర సన్మార్గ శైలినొప్పి  

మనసు నాకట్టుకొనునట్లు మార్చి మార్చి  

సొబగు లీనుచు సర్వాంగ సుందరముగ 

కవిత లల్లగావలె నిల కవి వరుండు.  8


సీ. కాలి యందెలు ఘల్లు ఘల్లంచుప్రభవింప

          కుటిల కుంతల యౌచు కులుక వలయు

కులుకగా సరిపోదు .. గుండె గుండెనుమీటి

           మోహన రాగమై మ్రోగవలయు

మ్రోగగా సరిపోదు..మూర్ఖత్వమును బాప

           పంచ కల్యాణియై బరగ వలయు

బరగగా సరిపోదు..స్వార్థభూతము నుండి

           మనిషినిమనిషిగా మార్చవలయు

గీ. మార్చగా సరిపోదు..సమాదరించి

మొలక నవ్వులు మోవిపై మొలువ జేసి

మంజు కావ్యమై రసరమ్య రంజితముగ

కవిత సాగగా వలయు నే కాలమైన  9


సీ. మధుర నిష్యందమై మకరంద బిందువై  

            సిరులొల్కు సింధువై చెలగు భంగి

 కనగా విచిత్రమై వినసొంపు గాత్రమై   

            దరిజూపు నేత్రమై తనరు భంగి 

సిరిమల్లె తావియై విరబూచు మావియై 

            జలతారు కావియై యలరు భంగి  

జగతిలో సత్యమై సరములో ముత్యమై  

            హృదయాల నిత్యమై యెసఁగు భంగి 

గీ.  త్రాగ మధురంపు నీరమై తనరు భంగి 

చదువ భావగంభీరమై యొదవు భంగి 

కవుల కాధారమై నిల్చు కావ్య మటులు 

కవిత లల్లగా వలయు సత్కవులు సతము  10


డాంఅలవోలు నరసింహారెడ్డి గారి కవిత ద్రాక్షాపాకం. కవులకు మార్గదర్శక

 పద్యదశకమిది.

కవికి నా అభ్గినందనపూర్వక ధన్యవాదములు.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.