గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

క్షీరాబ్దిపుత్రీ! రమా! శతకము .. రచన చింతా రామకృష్ణారావు. ... అనర్ఘ పద్యపఠనం ..... ప్రత్యేక పద్యపఠనం#అనంతచ్ఛందం.తే.10 - 4 - 2024.రాత్రి7గంటలనుండి 10.45 వరకు

జైశ్రీరామ్.
అమ్మవారు ఎప్పుడు ఎవరిలో ఏ రూపంలోబహిర్గరమై ఏమాహాత్మ్యములతో మనకు అద్భుతాలు సృష్టిస్తారో మన ఊహకందదు. ఇది నావిషయంలో నిత్యానుభంలొ జరుగుతున్న సత్యము.
నా జీవితం ప్రారంభం నుండీ కూడా ప్రతీ విషయమూ నా మనసుకు అద్భుతమే. ప్రస్తుతానికి వస్తే
ఈ క్షీరాబ్ధిపుత్రీ! రమా! శతక రచన పూర్వాపరాలు తప్పక చెప్పుకొని తీరాలి. ఎందుకంటే నా ప్రమేయ మేమాత్రమూ లేకుండానే ఈ కార్యక్రమమాద్యంతమూ సుసంపన్నమయిన సంఘటన మీకూ ఆశ్చర్యంగొలుపక మానదు.
నన్ను అన్నగారూ! అంటూ ఎంతో భక్తి ప్రేమలుట్టిపడేలా పిలుస్తూ ఉండే అమ్మవారు నాకు ప్రసాదించిన తమ్ములు  బ్రహ్మశ్రీ తోపెల్లబాలసుబ్రహ్మణ్యశర్మ.  ఏదైనా మహత్కార్యక్రమాలు తలపెట్టితే నాకు ఆప్యాయంగా ఫోన్ చేసి నాకూ ఆ మంచిపనిలో స్థానం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వీరు సుమారు సంవత్సరన్నర క్రితం నుండీ అంతర్జాలంలో  అనర్ఘపద్యపఠనం అనే పేరుతో శతకములనేకములు  అనేకమంది శిష్యులచే పఠనం చేయిస్తూ వ్రాసిన కవికీ పఠించిన భక్తులకూ పుణ్యప్రదంగా ఉండేలా చేయిస్తున్నారు. ఐతే తే.28 - 3 - 2024న రాత్రి 9.54 నిమిషాలు సమయంలోవారు నాకు ఫోన్ చేసారు. అన్నగారూ ఫాల్గుణమాసం లక్ష్మీదేవికి ప్రీతికరమని లక్ష్మీ శతకములను అనర్ఘపద్యపఠనంలో చేయిస్తున్నాను. ఇప్పటికి రెండు శతకాలు పూర్తయాయి. ఇంకా ఒక శతకం కావాలి. నాదగ్గర ఉన్న ఐదువందలశతకాలలో ఆ రెండే తప్ప వేరే లభించలేదు. మీకేమైనా తెలిస్తే నాకు అందిస్తే వచ్చే బుధవారం ఆ పని నిర్విఘ్నంగా చేసినవాడినౌతాను. ఉంటే చెప్పమని అన్నారు. ఐతే నాకు తెలిసి అలాంటివి ఇంకలేవండి. మళ్ళీ చూస్తాను ఉంటే తప్పక మీకు పంపుతాను. మీకు ఏ మకుటంతో కావాలో చెప్పండి. అన్నాను. రమా అనే మకుటంతో కాని లేదా లక్ష్మీదేవికి సంబంధించిన మరేపేరుతోనున్న శతకమయినా చాలన్నారు. నేను వ్రాసి పంపనా అన్నాను. అబ్బో అంత సమయం లేదండి. రేపటికల్లా నాకు అందితే నేను దాని కాపీలు తీసి పాఠకులకు పంపి, వారిచే కంఠస్థం చేయించి బుధవారం ఆకార్యక్రమం చెయ్యాలి కాబట్టి అది ఇంత వేగంగా సాధ్యపడే పనికాదులెండి అనిఅన్నారు. సరే చూస్తానని ఫోనుపెట్టేశాను.

అయ్యో ఇంతకష్టపడి తమ్ముఁడు అంత మంచిపనికి పూనుకొని ఉంటే ఈమాత్రం చేయలేకపోతే  వారిచే అన్నగా ఎలాపిలిపించ్గుకోగలను? అని మనసులో అనుకొని, మరునాడు  యథాప్రకారం ప్రాతః కాలాన్నే సంధ్యావందనాదులు ముగించుకొని, నా ప్రయత్నం మొదలుపెట్టాను. నాకూ తమ్ముడుకోరిన శతకం ఆన్లైన్లో లభించలేదు. ఇలా సమయం వ్యర్థం చేసే బదులు నేనే ఆ శతకాన్ని వ్రాసి వారిప్రయత్నం నిర్విఘ్నంగా సాగేలా ఎందుకు చేసే ప్రయత్నం చెయ్యకూడదు అని భావించినదే తడవుగా అమ్మవారిని మనసులో భావించుకొని శతకరచనకుపక్రమించాను. 
శ్రీమన్మంగళ భాగ్యదాయినిమహా క్షీరాబ్ధి పుత్రీరమా! అనే మకుటం నాకు తోచింది. అంతే వ్రాయడం ప్రారంభించాను. రెండవపద్యం వ్రాస్తుంటే అప్పుడు గుర్తించాను. అరే ఈ మకుటం శార్దూలంలో ఉంది, మకారప్రాసతో ఉంది, అన్నిపద్యాలూ మకారప్రాసతోటే వ్రాయవలసుందే,  సరే  ఇది అమ్మవారు సూచించి వ్రాయించిన మకుటమే కాబట్టి దీనిని మార్చి సుకరంగా ఉండడం కోసం మరొకటి తీసుకోవడం ఎందుకు? ఇలాగే ఎంతవరకూ అమ్మ నడిపిస్తే అంతవరకూ అమ్మ వ్రాయించినట్లు వ్రాయడమే అని భావించి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వ్రాస్తూ రాత్రి సరిగా పది గంటలకి 108వ పద్యం వ్రాయడం జరిగింది. అంతే తమ్ముడు ఈరోజు రాత్రికల్లా అందితే చాలన్నాడుగా, ఈ శతకాన్ని వారికి అందజేద్దామని వెంటనే వాట్సప్ ద్వారా పంపించి ఫోన్ చేసేను. సరిగా వారు భోజనం చేస్తున్నారట. ఐనా నాఫోన్ స్వీకరించి మాటాడితే నేనీ సంగతి వారికి చెప్పాను. వారు వాట్సప్ తెరచి డౌన్లోడ్ చేసుకొని, సంతోషంతో చూచానండి. నాకళ్ళంట నీళ్ళొస్తున్నాయి సంతోషంతో అని చెప్పి, ఈ వారం మరోశతకం లభ్యమైనందున అది నేను ప్రకటించాను. మీరు వ్రాసినది ఉగాదికి మరునాడు బుధవారం 10వతేదీ అనర్ఘపద్యపఠనంలో పఠనం చేయిస్తాను, అని ఎంతో ఆనందంతో చెప్పారు. సరే అలాగే చెయ్యండి. ఈ లోగా నేను టైపింగులో వేగంలో దొర్లిన దోషాలేవైనా ఉంటే మరొకరొతో పరిశీలింపచేసి, సరిచేసి మళ్ళీ మరో శుద్ధప్రతి పంపుతానని చెప్పాను.
ఆ తరువాత బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావుమహోదయులకు వాట్సప్ లో నేను రచించిన రమాశతకము పంపించి, చదివి గుణదోషాలు గుర్తించి దోషములు సరిచేసుకొనే అవకాశం కల్పించమన్నాను. అలాగే బ్రహ్మశ్రీ పోచిరాజు కామేశ్వరరావుగారిని కూడా అర్ధించాను. వారు  రామాయణం రచనలో తలమునకలై యున్నానని, అవకాశం ఉంటే తప్పక చూస్తానని చెప్పారే కాని మరుక్షణం నుండీ చూడడం ప్రారంభించి అవసరమయిన సూచనలు అందించి మహోపకారం చేశారు. శ్రీ రాజారావు గారు స్వయముగా ఫోన్ చేసి వారు గుర్తించిన, చేయవలసిన సవరణలను చెప్పి అప్పటికప్పుడు నాచే సరిచేయించారు. ఈ ఇరువురి సూచనలను గ్రహించి సరిచేసిన ప్రతిని తమ్మునకు పంపగానే వారు నాకు ఆత్మవంటి మరో సహోదరులు బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్నశర్మగారికి ఈ విషయం చెప్పారట, వారు వెంటనే ఆ శతకం పంపమనగానే తోపెల్లతమ్ముడు పంపించారట.  అనంతకృష్ణ నాకు ఫోను చేసి ఎంతసంతోషం వ్యక్తం చేశారో మాటలలో చెప్పలేను.ఈ జరిగిన విషయమంతా ఫేస్ బుక్ లోవారి గోడపై ప్రకటించమని చెప్పుటతో నేనీ విషయమంతా మార్చి 30వ తేదీని రాత్రి 12.10కి వారు చెప్పినట్లుగానే ప్రకటించాను. తరువాత నేను మిన్నకున్నాను.
09 - 4 - 2024న సాయంత్రం ఖైరతాబాద్ ఆనంద్ నగర్లో విజ్ఞాన సమితిలో శ్రీ సుజ్ఞాన్ గారు శతావధాని శ్రీ పటువర్ధన్ గా రిఅష్టావధానం ఏర్పాటు చేయగా ఆ  సభలో నేను నిషిద్ధాక్షరి పృచ్ఛకుడనయినకారణం నన్నూ వేదికపైకి ఆహ్వానించారు. పృచ్ఛకుడుగా నా స్థానంలో నేను కూర్చున్నాను. అవధానంప్రారంభించే ముందు సంచాలకులు మధురభారతి ఆచార్య బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణగారు అవధానానికి ముందు ఒకద్భుతమైన గ్రంథావిష్కరణ  ఉంది అని ప్రకటించి,  దీని విషయం శ్రీ దత్తాత్రేయశర్మ ప్రకటిస్తారు అని చెప్పగా శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మతమ్ముఁడు ఏవేవో ప్రశంసలు చేస్తూ ఉండగా నేను భుజాలు తడుముకున్నాను గాని, ఇప్పుడు నేను వ్రాసిన గ్రంథమేదీ ఆవిష్కరణకు సిద్ధంగా లేదు కదా అని నాకు అహం పెరిగిపోయిందని నన్ను నేనే దూషించుకుంటుండగా నాపేరు ప్రకటించడంతో అవాక్కయ్యాను.
ఇంతకీ ఆ ఆవిష్కరణకు నోచుకొంటున్న గ్రంథం నేను తోపెల్లవారి ప్రేరరణతో వ్రాసిన రమాశతకమే. ఇది కలా నిజమా? నేను ముద్రించే ఆలోచనలోకూడా లేనే? ఎవరు చేసి ఉంటారు? అని నేను ఆలోచించేసరికి నాకప్పుడు స్ఫురించారు మా తమ్ముడు శ్రీ అనంతకృష్ణ ఇంత వేగంగా ఇటువంటి కార్యం చేయడం అనన్యసాధ్యం వీరికి తప్ప అనుకున్నాను. అంతే ప్రకటించారు అనంతకృష్ణగారు అతిరహస్యంగా అత్యంత వేగంగా ఈ గ్రంథాన్ని ముద్రింపించారని, మధురభారతిశ్రీమన్నారాయణగారిని అభిప్రాయంవ్రాసి వెంటనే పంపవలసినదిగా కోరుతూ పీడీయఫ్ వారికి పంపించారట. వారు 45 నిమిషాలలో గ్రంథం మొత్తం చదివి వారి ఆప్తవాక్యాన్నిఅనంతకృష్ణగారికి పంపగా, ఈ లోపున అనంతకృష్ణగారు అట్టల డిజైన్ చేసి, ఈ మొత్తం సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కందిశంకరయ్య గారికి పంపి, విషయమంతా చెప్పి, మీ అభిప్రాయం వ్రాసి జోడించి ముద్రణకు వీలుగా డీటీపీ చేసి అత్యంత వేగంగా పంపమన్నారట. వారు ఎంతో పొంగిపోతూ మొత్తం చదివి ప్రశంసాపద్యములు శీర్షికతో తన అభిప్రాయాన్ని పద్యరూపంలో వ్రాసి ఈ గ్రంథంలో చేర్చి, రెండు గంటలవ్యవధిలోనే పీడీయఫ్ అనంతకృష్ణగారికి పంపించారుట. నేననుకున్నాను. ఈ గ్రంథంలో గ్రంథకర్తగా వ్రాయవలసుండగా అది తమ్ముడే వ్రాసేసుంటారా అని.  నా తమ్ముడెప్పుడూ ఏ పొరపాటూ జరిగే అవకాశం ఇవ్వడనిభావించాను. ఇంతలో ఆ గ్రంథం నాచేతికి రాగానే ఆ గ్రంథంలో ఉన్న నా అభిప్రాయం చదివి నోరెల్లపెట్టాను. మా తమ్ముని తెలివితేటలికి. అదేమిటంటే నాతో ఫోన్ లో ముచ్చటిస్తూ గ్రంథరచన పూర్వరంగమంతా నామాటలద్వారా రాబట్టి అదే నా అభిప్రాయంగా ప్రకటించారని గ్రహించిన నా ఆశ్చర్యానికి అంతులేకుండాపోయింది. గ్రంథావిష్కరణ చేసిన శ్రీమన్నారాయణగారు ఈ విషయమంతా చెప్పుతుంటే నాకిది కలా? నిజమా? అని సందేహం,  ఆగ్రంథం నాచేతిలో పెట్టి నన్ను సన్మానించడంతో ఇది నిజమే అని నిర్ధారణకు వచ్చాను.
ఆ సభలో నాకు వీరందరిలోనూ ఆలక్ష్మీమాతయే గోచరించింది కాని మరొకటి తోచలేదు. ఆ తల్లి చేయించే వింతలు అప్పుడప్పుడు నాలాంటి అల్పులకూ ఔన్నత్యాన్ని ఆపాదిస్తూ ఉంటాయి. ఈ మాట అనడానికి ఈ సంఘటనయే కారణం.
ఇదంతా ఇలాఉంటే
బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ సహోదరులు 10వ తేదీన రాత్రి 7 గంటలకు అంతర్జాలంలో నానీస్ మహతీ చానల్ శ్రీ శిష్ట్లా నరసింహంగారి జూమ్ వేదికపై సుమారు ఏభైమంది భక్తులకు ముందుగనే ఈ పద్యాలన్నీ రెండేసి, మూడేసి పంపించి, కంఠస్థం చేయించి, పెద్దపెద్దవారినెందరినో ఆహ్వానించి, అనర్ఘపద్యపఠనం కార్యక్రమంలో ఈ శతకాన్ని గూర్చి వారు చెఇ
ప్పి, పెద్దల అభిప్రాయాలను కూడా చెప్పించి, రాత్రి 10.45.వరకూ నిరాఘాటంగా ఎంతో ఓపికతో చేయించారంటే అది అంత సామాన్యమయిన విషయం కాదు. ఈ తమ్మునకు, అనంతకృష్ణ తమ్మునకు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉండుట చేతమాత్రమే ఇంతటి బృహత్కార్యక్రమాలు అనంతంగా అద్భుతంగా చేయగలుగుతున్నారు. ఆ జగన్మాత లోకకల్యాణ కారకులైన యీ తమ్ములను నిరంతరం పొత్తిళ్ళలో పెట్టుకొని చూచుకొంటూ మంగళప్రదులుగా కాపాడుతూ ఉండాలని మనసారా కోరుకొంటున్నాను.
అనర్ఘపద్యపఠనం కార్యక్రమంలో పెద్దలు బ్రహ్మశ్రీ ముద్దురాజయ్యగారు, కటకం వేంకటరామశర్మగారు, శ్రీమతి కటకం విజయలక్ష్మిగారు, శ్రీశివశంకరప్రియ, ఇంకా ఎందరెందరో ప్రతీ ఒక్కరూ నన్ను అభిమాన పూర్వకంగా చేసిన ప్రశంసలన్నీ ఆ జగన్మాతకే చెందునని హృదయపూర్వకంగా విన్నవించుకొంటున్నాను. వీరందరికీ ఆ జగన్మాత అనుగ్రహం నిరంతరం లభించాలని కోరుకొంటున్నాను.
ఈ శతక ముద్రణలో సుమారు ఏబది పద్యములలో క్షీరాబ్ధిపుత్రీ! రమా! అని, ఆ తరువాత పద్యాలలో క్షీరాబ్ధి కన్యా రమా! అనీ నేను వ్రాసియుంటిని. అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఏది ఏమైనా రెంటికీ అర్థం ఒకటే, ఇది రమా శతకమే.

విధేయుఁడు చింతా రామకృష్ణారావు.

ఇక మీరు ఈ క్రింది వివరాలలోనికి వెళ్తే జరిగినది మీ కళ్ళకు కట్టక మానదు.

శతక రచన కుపక్రమించినది  తే.29 - 3 - 2024 అరుణోదయ సమయంలో 
సంధ్యావందనానంతరం.
ఆఖరి 108వ పద్యము పూర్తి చేసినసమయం అదే రోజు రాత్రి 10.00
ముద్రిత గ్రంథావిష్కరణ. తే.09 - 4 - 2024 సాయంత్రం గం. 6.30 ని..లకు.

శ్రీరస్తు     శుభమస్తు     శ్రీరామ.

రమా (ఏకప్రాస) శతకము.

రచన ..  చింతా రామకృష్ణారావు.

శ్రీమహాలక్ష్మీముపాస్మహే. 

శాII శ్రీమన్మంగళ భారతావని జయశ్రీవై ప్రకాశించుచున్

క్షేమంబున్ జన పాళికిన్ గొలుపుచున్ జెల్వొందు నిన్ గొల్చెదన్

నీమం బొప్పఁగ భక్తితోడ జననీ నిత్యంబు, భవ్యాత్మవౌ

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII ప్రేమోదారసుధాస్రవంతి! విలసద్విజ్ఞానతేజోనిధీ!

నీ మాహాత్మ్యము నెన్ననాకు వశమా? నీ పాదపద్మమ్ములన్

నీమంబొప్పగఁ గొల్చినన్ సుకవితల్ నీ రూపమై వెల్వడున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII సామాన్యుల్ నిను పూజచేయుటకునై సంసిద్ధులయ్యున్ ధనం

బేమాత్రంబును లేని కారణముచే నేదో విధానంబునన్

నీమంబొప్పఁగఁ గొల్చినంతనె కృపన్ నీ ప్రేమ చూపింతువే?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII శ్రీమన్మార్గ కవిత్వ తత్త్వనిపుణుల్ చిత్రాదులన్ బద్యముల్

నీమంత్రాక్షర బంధన ప్రతిభతో నీ దివ్య తేజంబునే

క్షేమంబున్ గొన వ్రాయఁ గల్గుదు రిలన్ శ్రీదేవి! నీ సత్కృపన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII మా మీదన్ గృపఁ జూపు నీ సుగుణ మేమాత్రంబు మా యూహకే

శ్రీమాతా! కన నందదమ్మ! యిక మా చిత్తంబులన్ నీ పయిన్

నీమంబొప్పఁగ నిల్పుశక్తి నిడు నీ నేర్పున్ గనన్ సాధ్యమా?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII భూమిన్ బుట్టిన నెవ్వఁడైన నిలుచున్ బూజ్యంబుగా నెప్పుడున్

బ్రేమన్ నీ కడగంటి చూపు పడినన్, విఖ్యాతినార్జించుచున్,

నామీదన్ గురిపింపుమమ్మ కృప, నేనా జ్ఞాన దూరుండ, నో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII ధీమంతుల్, వరపండితాళి, కవులున్, దేదీప్యమానంబుగా

నీ మీదన్ దగు భక్తి నిల్పిన గదా నిత్యంబు లోకంబునన్

క్షేమంబొప్పగ నొప్పియుందురు, శుభశ్రీమూర్తులై, తల్లిరో!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII ఏమా భాగ్యము, శ్రీనివాసుఁడనుచున్ హృద్యంపు సత్ఖ్యాతినే

ప్రేమన్ నిన్ గొనినంత పొందె హరి, నీవే శక్తి వాసామికిన్,

నీ మార్గంబు నృసింహు మార్గమె కనన్, నీవే నృసింహాత్మవున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII సోముండున్ నినుఁ బోలి బుట్టుటనె తా శోభిల్లె శ్రీ శాంభవీ!

ప్రేమోదంచిత సాంబు శీర్షముపయిన్ విఖ్యాతినే గాంచె, నా

సోముండొప్పుగ తోడబుట్టువగుటన్ శోభిల్లె మా మామగా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! .

 

శాII శ్రీమాతా! జనరంజనీ! శుభకరీ! చిద్రూపిణీ! కావుమా,

నీ మంత్రార్థము లెన్న నేరని ననున్ నీవే కృపన్ గాంచుమా,

యేమాత్రంబును నీకు దూరమయినన్ బృథ్విన్ మనన్ జాల నో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦.

 

శాII మామా భాగ్యఫలంబులౌదువటగా? మాతా! కృపాంభోనిధీ!

శ్రీమాతా! జయమమ్మ నీకు, మహితాశీర్వాద మీవే సదా

యేమాత్రంబును సంశయింపక నినున్ హృద్యంబుగాఁ గొల్వనీ!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౧.

 

శాII గోమాతన్ భజియింప నీకు మదిలోఁ గూరున్ గదా కూర్మి? నీ

ప్రేమన్ మాపయి నిల్పుచుందువటగా? వెల్గై మదిన్ నిల్చు నీ

నామంబేకద మాకు రక్ష, జననీ! నారాయణీ! కావుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౨.

 

శాII మా మాయే ప్రతిబంధకంబు తగ నీ మాయన్ గ్రహింపంగ, మా

కేమాత్రంబొ యొసంగి విజ్ఞత నిలన్ హేమప్రభా! నిల్పితే

యీ మాలో నిరతంబు నిల్చి జయముల్ హృద్యంబుగాఁ గొల్పుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౩.

 

శాII నీ మాతృత్వమమేయమమ్మ! తలపన్, నీ ప్రేమతో సాటిగా

నేమాత్రంబును జూపరెవ్వరును, దేహీయన్న మాత్రంబునన్

క్షామంబున్ నశియింపఁజేసి సిరులం గల్పింతువే తల్లిరో!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౪.

 

శాII శ్రీమంతుండగు తోపెలాన్వయుఁడు నీ చిచ్ఛక్తికిన్ రూపమా?

నీమంబున్ సతతంబు నీదు శతకానీకంబు నేర్పించుచున్

బ్రేమన్ బాఠన మొప్పఁ జేయునటులన్ విద్యార్థులన్ జేసె, నో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౫.

 

శాII ఏమమ్మా! కని నీ కుమారుని మదిన్ స్వేచ్ఛన్ ప్రవర్తించి, సం

క్షేమంబొప్పెడి మార్గమందు నడుపన్  జిత్తంబు రాదేలనో?

ధీమంతుండగు భక్తపుంగవునిగా దీపింపగాఁ జేయుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౬.

 

శాII రామానందమె బ్రహ్మతత్త్వ మయినన్, రాముండు నీ భర్తయై

యీ మాయన్ రచియించె కోరి యడఁపన్, హేయంబొ? కాదో? కనన్

నీ మార్గంబున మాయ వీడనగు నీ నీడన్ బ్రవర్తించుచున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౭.

 

శాII కామాంధత్వము మూసివేయుఁ గనులన్ గల్యాణి! కాపాడుమా,

శ్రీమన్మంగళ మూర్తులౌ గురువులన్ జేరంగ నీకమ్మ యా

కామోద్దీపన, కావుమమ్మ వర సుజ్ఞానప్రభన్ గొల్పుచున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౮.

 

శాII మోమాటంబది యేలఁ జేయ నడుగన్ బూజల్ సదా నీకు, నో

శ్రీమాతా! శుభ సంహతుల్ గొలుపు నీ చిత్తంబులో నిల్పి న

న్నీమాయల్ తొలగించి నీవు గొనుమా యిష్టంబుతో పూజలన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౯.

 

శాII సామాన్యుల్ తమ కార్య నిర్వహణలో సద్భక్తితో నిన్నె, తా

మేమాత్రంబును భక్తి వీడక యహంబే లేక పూజింతు రా

సామాన్యుల్ కద ధన్య జీవులు ధరన్, సంతోషమున్ గాంతురే,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౦.

 

శాII భూమిన్ దున్నెడి రైతు నాగలికిలన్ పూజించు నీ ధ్యాసతోన్,

భూమిన్ బండెడి సస్యమీవె యనుచున్ పూజ్యాళికిన్ బంచుచున్

క్షేమంబున్ సతతంబు కోరు ధరణిన్ శ్రీమంతులా రైతులే,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౧.

 

శాII హేమంబీవె, నృసింహురాణి! జననీ! హేమప్రభారాశి! మా

ప్రేమన్ గాంచుమ, హేమమున్ గెలుచు  సద్విశ్వాస సంపత్ప్రభల్

నీమంబొప్పగ నిమ్ము మాకు, కృతులన్ నిన్ గొల్వగా నెంచుచున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౨.

 

శాII రామానందము పొందనెంతుమిల, శ్రీ రామా! హరీ! యంచు మా

కేమాత్రంబును భక్తి వీడని గతిన్  హృద్యంపు తన్నామముల్

ప్రేమన్ బల్కగఁ జేయుమా! కొలుతు నిన్ శ్రీనాథ పత్నీ! కృపన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౩.

 

శాII భూమిన్ గల్గెడి ధాన్యముల్, ధనము, సత్ పూజ్యా! మహా భాగ్యమున్,

శ్రీమంతంబగు మానసంబు, పలుకుల్, శ్రీదేవి రూపంబుగా

ధీమంతుల్ నిను నన్నిటన్ గనుదురో ధీరూప! లక్ష్మీసతీ!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౪.

 

శాII ధామంబీవె, మహత్వమీవె, శుభ సంతానంబు నీవేకదా?

యేమాత్రంబును శంకలేదు, కన నీవే సర్వమిద్ధాత్రిపై,

శ్రీమద్వర్తన నీదు సత్కృప కనన్, శ్రీమాత! నిన్ గొల్చెదన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౫.

 

శాII ఏ మాతృప్రభలెల్లవారికి శుభంబెంచంగనౌనో సతం

బే మాధుర్య మనోజ్ఞవర్ణచయమే యీ బాధలన్ బాపునో,

యామంత్రాక్షరమీవె చూడ, రమణీయానంద సంధాయినీ!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౬.

 

శాII ఏ మాన్యుండిల నిన్ను సమ్మనమునన్ హృద్యంబుగాఁ గొల్చునో,

యామాన్యుండు కృతార్థుఁడెన్న, ధర తా నాద్యంతమున్ సౌఖ్యముల్

ప్రేమానందము, ముక్తిఁ, గాంచు, జననీ! విశ్వాసమే మూలమై,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౭.

 

శాII నామంబుల్ కలవెన్నియో జనని! నీ నామంబె సౌఖ్యప్రదం

బేమా మాధురి! నీదు నామమున, ధ్యానింపంగ సద్భాగ్యముల్

మామీదన్ గురిపించునమ్మ! శుభముల్ మాకున్ బ్రసాదించుచున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౮.

 

శాII శ్రీమన్నారదుఁ డెన్ని పాడు సతమున్ శ్రీమంతుఁడౌ నీ పతిన్,

శ్రీమాతా! నిను తాను దాల్చెననుచున్ చింతించి, కాకున్నచో

నేమాత్రంబును చేరకుండును హరిన్ స్వేచ్ఛాప్రవృత్తిన్ గనన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౨౯.

 

శాII శ్రీమాధుర్య సుధా స్రవంతి కన వాసిన్ గొల్పు నీ నామమే,

యే మాత్రంబు మదిన్ దలంచి కొలువన్ ధ్యేయంబునే చేర్చు, నే

నా మంత్రాక్షరమైన నామము మదిన్ ధ్యానింతు నిత్యంబిలన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౦.

 

శాII వామాంకస్థిత జానకీ సతివిగా వామాక్షి! రామ ప్రభున్

నీమంబొప్పఁగ వర్తిలంగ ధరణిన్ నీవేకదా మార్గమున్

బ్రేమన్ జూపి కృతార్థుఁడై మనగ దేవీ! చేసితే? తోడువై,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౧.

 

శాII లేమా మేము సతంబు నిన్నె వనమాలిన్ గూడి మా చిత్తమం

దేమాత్రంబును నిల్పగా, హరియుతా! హేమప్రభారాశివై

ధీమాన్యుల్ గని మెచ్చనుండుమిఁకపై దేదీప్యమానంబుగా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౨.

 

శాII క్షేమంబీవె, సుఖంబు నీవె, మదిలోఁ గేళిన్ బ్రవర్తిల్లుచున్

ధీమంతుల్ మది పొంగ నుండునదియున్ ధీరూపిణీ నీవెగా,

మా మీదన్ గురిపింపుమమ్మ శుభ సమ్మానంపు నీ దృక్కులన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౩.

 

శాII కామాయత్త విచిత్ర చిత్త గతి నే కాంక్షింప నోయమ్మ! సు

క్షేమంబున్ పరమందు నైహికమునన్ చిద్రూపిణీ! కొల్పుమా,

యీమాత్రం బిల చాలునమ్మ! జననీ! యీశాని! ప్రార్థింతు నిన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౪.

 

శాII హేమాడంబర మేల నాకు? సతతం బీవే మదిన్ నిల్చినన్?

శ్రీమాతృ స్తుత పాద సత్ప్రభలె నా చిత్తంబులో నిండినన్

క్షేమంబే సతతంబుఁ గొల్పు నిల వాసిన్ గొల్పుచున్ దల్లి! యో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౫.

 

శాII క్షామంబన్నదెఱుంగనీవు ధరణిన్  గాంక్షించి నీ సేవలన్

బ్రేమన్ జేసెడి సజ్జనాళికిలపై, నిత్యంబు సంతోషమున్

ధీమంతుల్ గనఁ జేయు నీదు కృపనే దీపింప వర్ణింపనా?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౬.

 

శాII హే మాధుర్య వచోనిధాన జననీ! హేమప్రభారాశిమా

క్షేమంబేకద నీవు కోరునది? రాశీభూత ప్రేమప్రభా!

నీ మాటే హరికర్ణపేయ మరయన్, నిన్ గొల్చెదన్ నిత్యమున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౭.

 

శాII గోమూత్రంబున, గోమయంబునను, మాకున్ మేలు చేకూర్చి సు

క్షేమంబున్ గలిగించు దివ్యగుణముల్ చేర్చంగ నెట్లాయెనో?

నీ మాతృత్వమహత్వమెన్న నదియే, నిత్యప్రభాపూర్ణ! యో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౮.

 

శాII కామాక్షీ! యని పిల్చినన్ గరుణతో కన్పింతు వీవే కృపన్,

శ్రీమాతా! యనినన్ దయామృతమునే చిందింతు వీవెప్పుడున్,

హైమాయన్నను నీవె చూచెదవు, మోహంబున్ విడన్ జేయుచున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౩౯.

 

శాII లేమిన్ బాపెడి నిత్యపూజ్య జననీ! లేరెన్న నీసాటి, ని

న్నేమంచు న్వివరింప నాకునగు? భావింపంగ నీ రూపమే

ధీమంతుల్ కను సృష్టి మొత్త మరయన్, ధీరూపిణీ! సంస్తుతుల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౦.

 

శాII నా మాటల్ మహనీయమంత్రచయమౌన్, నారూపమే దివ్యమౌన్,

నా మాన్యోజ్జ్వల వృత్తి నిత్యశుభమౌన్, నా భావనల్ నీవెయౌన్,

నామేనన్ గన నీవె యుందువిఁక నీ నా భేదమున్ బాపినన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౧.

 

శాII ఏమమ్మా! కన రావు నన్ను గృపతో నే నేమి దోషంబులన్

బ్రేమన్ వీడి యొనర్చితిన్నెఱుఁగ? నీవే జ్ఞానమున్ గొల్పి నా

కామాదుల్ విడి నిన్నె గొల్చునటులన్ గల్పింపుమా నిత్యమున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౨.

 

శాII ధూమంబట్టుల పాపముల్ ముసురుచున్ దోపంగనీవమ్మ నీ

శ్రీమంతంబగు సుస్వరూపము మదిన్, చేఁ బట్టి నన్ గావుమా,

ధీమంతుల్ చను మార్గమున్ నడుపుమా! ధీమార్గమీవౌచు, నో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౩.

 

శాII వేమారుల్ నినుఁ గోరనేల జననీ! ప్రీతిన్ గ్రియాశక్తివై

ప్రేమన్ జేయఁగఁ జేయుచుందువుకదా విశ్వంబునన్ గార్యముల్,

నామాటల్ క్రియలెన్న నీవె కనఁగా నా భావనల్ నీవె యో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౪.

 

శాII ఏమాత్రంబు పరాకు నొందక మదిన్ హేమామహావిద్య! నీ

వే మాన్యంబుగ నుండి కాచుకొనుమా, యిష్టంబుతో నెప్పుడున్,

నా మీదన్ గల తల్లి ప్రేమ కననీ నన్నున్, మహామాత! యో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౫.

 

శాII సామాన్యుల్ మదిలోన నిన్ను నిలుపన్ సాక్ష్యంబుగా వారిలో

శ్రీమాతా! రహియింతు వీవె కృపతో, చెన్నార రక్షించుచున్,

నీమాహాత్మ్యము నెన్న నేరికగు నో నిత్యోజ్జ్వలా! చంద్రికా!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౬.

 

శాII సోమేశుండును వాని పత్నియు నినున్ శుద్ధాత్ములై కొల్తు రా

ప్రేమోద్భాసిత మూర్తులందు జననీ! విశ్వాసమై నిల్చితే,

యే మానీ మహనీయశక్తి? గనలేమే మేము సావిత్రి! యో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౭.

 

శాII ఏమాత్రంబును నీకు దూరమయినన్ హేయంబు, శ్రీవైష్ణవీ!

మే మీ ధాత్రిని యుంటయే, జనని! భూమిన్ నీదు ప్రేమద్యుతిన్,

మా మీదన్ దయఁ జూపి నిల్పుము మమున్  మాతల్లి! నీ సన్నిధిన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౮.

 

శాII హే మందస్మిత సుందరీ! వినుత బ్రాహ్మీ! నీకృపాదృష్టియే

మా మీదన్ గురిపింపకున్న జయముల్ మమ్మేలునా? కాలికా!

ప్రేమన్ బద్యశతంబు నొక్కదినమున్ వేలార్చితీవెట్లిటుల్?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౪౯.

 

శాII హే మందస్మిత సుందరీ! సువిలసద్ధేమాంబరాడంబరీ!

హైమారాధ్య! సుపూజితా! శుభకరీ! యానంద సంధాయినీ!

క్షేమంబొప్పగ నిన్ను గొల్చునటులన్ కీర్తిప్రదా! చేయుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౦.

 

శాII మేమా మానవ జన్మనెత్తితిమి, భూమిన్ బాప కార్యంబులన్

కామాదుల్ మముఁ జుట్టిముట్టుటను లోకంబందునన్ దౌష్ట్యముల్

శ్రీమాతా! యొనరించినాము, కృపతో ఛేదించు మా పాపముల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౧.

 

శాII వేమారుల్ నిను వేడనేల జననీ! భీతిల్లు చున్నట్టి నన్

బ్రేమన్ గాచెడి తల్లివీవగుటచేఁ, బ్రీతిన్ నినున్ గొల్వ, నా

కేమాత్రంబును భీతి కల్గదు, నిజం బీవే కదా రక్ష? మా

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౨.

 

శాII సామాన్యంబగునట్టిదా? జనని! నీ సామీప్యమున్ సద్గతిన్,

భూమిన్ బొందుట యన్నచో, గొలుపుమో పూజ్యా! ననున్ గావగా,

నీమంబుల్ గని దాటబోను, జగతిన్ నీ పజ్జనన్ మెల్గెదన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౩.

 

శాII మాతా! పరమంబుగా నిలుపు మోహోయంచు మెచ్చన్ బుధుల్

నా మాన్యంబగు మానసంబుననె, సన్నామా! స్వతంత్రేచ్ఛ! నీ

వే మా చిద్వర తేజమై వెలుగుమా, విశ్వాసమున్ గొల్చెదన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౪.

 

శాII శ్రీ మందారము, కామధేనువు, తగన్ శ్రీమాత! నిన్ బోలవే

ప్రేమన్ గోర్కెలనిచ్చుటందనుదురే  విఖ్యాత సత్ పండితుల్,

నా మందారము నీవె, కాంచ భువిపై నా తల్లివీవేకదా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౫.

 

శాII ఏమమ్మా! గుణదోషముల్ కవితలో నెంచంగ నే నేర్వనే,

శ్రీమన్మంగళ సత్కవిత్వఝరినే శీఘ్రంబుగా కొల్పుదీ

వే  మాకంచును నెంచి వ్రాసితిని, నీవే చూచుకొమ్మింకపై

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి కన్యా! రమా! ౫౬.

 

శాII ఏమో, నేనె భవత్పదాబ్జ రజమేనేమో? తలంపంగ, నీ

వే మాన్యాద్భుత సత్కవిత్వముగ సద్వేగంబుగా నేడిటుల్

ప్రేమన్ వెల్వడుచుంటివేమొ? జననీ విఖ్యాతినే కొల్పగా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౭.

 

శాII నా మంచిన్ గననేరరెవ్వ రదియున్ నాలోన లేకుండుటన్,

నీ మంచిన్ గన నేర్తురమ్మ కృతి రాణింపున్ మదిన్ గాంచుచున్,

లేమా! వేరుగ నీవు నేను జగతిన్ లేమమ్మ, నిక్కంబిదే,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౮.

 

శాII లేమల్ సన్నుతసద్గుణప్రభలతో లీలావినోదంబుగా

క్షేమంబే కలిగింపఁ జేసెదరు వాసిన్ గార్యముల్ సర్వమున్,

భామల్ నీ ప్రతిరూపిణుల్ నిజముగా, భావింతు నే నట్టులే,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౫౯.

 

శాII హేమంబేకద ముఖ్యభాగ్యముగ దేవీ! నేడు లోకంబునన్

శ్రీమంతంబుగ వెల్గుచుండె నిజమా శ్రీమాత నీవే యిటన్

హేమంబట్టుల వెల్గుచుంటివొ?నిజంబే వేరుగానుండెనా?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౦.

 

శాII ప్రేమన్ జూపి, విషంబు చిందు కుజనుల్ విశ్వంబునన్ గల్గిరే,

నా మంచిన్ గని వారు మారగలరా? నా మాట మన్నింతురా?

శ్రీమాతా! మరలించు వారి గుణముల్, చిత్తంబులన్ వెల్గుచున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౧.

 

శాII శ్రీమన్మంగళధాత్రికిన్ శుభములన్ జేకూర్చుమా తల్లి! నీ

ప్రేమన్ భక్తజనాళికిన్ జయములన్ విఖ్యాతిగా నీయుమా,

యేమాత్రంబును దోషమెన్నకుమ, నీవే కావగా రమ్ము, మా

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౨.

 

శాII నీ మాటల్ మహనీయమంత్రచయమై, నీ పద్యముల్ మేల్గతిన్

బ్రేమన్ లోకులకంద వ్రాయుదువుగా విఖ్యాతిగా నీవె యో

శ్రీమాతా! నను నిల్పి వ్రాసితివి, నే చింతింప నిన్ నిత్యమున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౩.

 

శాII ప్రేమానందము మాయయా? జగతిలో విఖ్యాతితోవెల్గు నే

ప్రేమో నే నెఱుగంగ సాధ్యమగునా? వెల్గొందు నీ ప్రేమయే

ప్రేమంచున్ మది నెంచెదన్ నిజముకావే చూడగా నన్యముల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౪.

 

శాII హోమాదుల్ పచరింపఁ గల్గు ఫల మోహో! వచ్చు నిన్ దల్చినన్,

హేమా! మాతృక బీజరూపిణివి! దేహీ యంచు నే గోరెదన్,

నీమంబుల్ కలవారి కందు మిలపై నిన్వేడినన్ గుర్తుగా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౫.

 

శాII మోమాటం బది యేల నమ్మ! పలుకన్ ముద్దార నిన్ బిల్చితిన్,

శ్రీమాతా! మది వెల్గు తల్లి వనుచున్ శ్రీమత్కవిత్వాకృతిన్

బ్రేమన్ గన్బడుమందు నంతె కద? నీవే చిత్తమందుండుటన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౬.

 

శాII ఏమాత్రంబును లెక్కచేయ నిల నీవే కల్గ నన్యంబులన్,

ధీమాహాత్మ్యము నీవె యౌచు మదిలో దేదీప్యమానంబుగా

ప్రేమోదారసువాక్కులై వెలువడన్ విఖ్యాతిగా వెల్గెదన్

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౭.

 

శాII ధీమంతుల్ నిను నిత్యమున్ గొలుతురే, ధీశక్తి నాశించుచున్,

నీమంబొప్పగ నిన్నెనమ్మి, జగతిన్ నీ మంత్రభాష్యంబులన్

క్షేమంబున్ గన సాధనన్ నిలుతురే, సేవల్ గొనన్ లేవొ? మా

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౮.

 

శాII ధామంబేలను మాకు నీదు కృప నిత్యా! బోధనే కొల్పఁగాఁ

బ్రేమన్ నిల్చి రహింపఁ జేయుచు నహంబే లేని నిత్యాకృతిన్

క్షేమంబున్ గలిగింప నిచ్చుటను, భాసింపంగఁ జేయన్ మమున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౬౯.

 

శాII శ్రీమన్మంగళ వార్ధి పుణ్యఫలమై చెల్వొంది సత్పుత్రిగా,

శ్రీమంతుండగు శ్రీహరిన్ పతిగ వాసిన్ గొల్పఁ జేఁబట్టి, సు

క్షేమంబున్ వరసృష్టికిన్ గొలుపగా శ్రీదేవివై యుంటివా?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౦.

 

శాII ఏమా పుణ్యఫలంబు నా కమరె నే డీరీతి నీ సద్గుణ

స్తోమంబున్ శతకంబుగా జగతిలో శోభిల్ల వ్రాయించెనే,

నీ మాతృత్వము నెన్నపుత్రకునిగా నే నేరనమ్మా! నతుల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౧.

 

శాII మాతా! నను రామకృష్ణ కవిగా నొప్పంచు గుర్తించి రా

ధీమంతుల్ కవి పుంగవుల్, వరగుణుల్, దివ్యాత్ములౌ పండితుల్,

ప్రేమన్ జూపుచు నంతె కాని, నిజ మీవే చూడ కావ్యాత్మ వో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౨.

 

శాII ఏమాత్రంబును చెప్పలేను కవినంచెవ్వారికిన్ ధాత్రిపై,

నీ మాతృప్రభ సత్కవీశునిగ నన్ నేర్పారగా నిల్పె నం

తే మాతా! నిను వీడినట్టి కృతులన్ దేజంబు లేకుండుటన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౩.

 

శాII కామాదుల్ నను వంచలేవు కద నీ కారుణ్యమున్ జేసి యో

శ్రీమాతా! కరుణాసమేత! సుగుణశ్రేయంబులన్ గొల్పుటన్,

నే మంచిన్ గన నీవె కారణముగా నిత్యం బిలన్ మాధవీ!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౪.

 

శాII హైమా యన్నను నీవె కన్బడుదువే, యానందమున్ గొల్పుచున్,

మేమా నిన్నిల లక్ష్మిగానె మదిలో మేల్గాంచఁగాఁ జూతుమో

శ్రీమాతా! జయమమ్మ నీకు సతమున్, జేకొమ్ము నా సంస్తుతుల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౫.

 

శాII ఏమమ్మా! జయముల్ పరాజయములున్ హృద్యంబుగా నెవ్వరున్

బ్రేమన్ జేకొన లేమదేలనొ ధరిత్రిన్ మంచినే యెంచుటన్,

నీమీదన్ మది నిల్పినన్ జయములే నిత్యంబు మాకబ్బు నో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౬.

 

శాII క్షేమంబేది తలంప? నీ సుగుణముల్ కీర్తించుటే యౌనుగా,

క్షామంబున్ దొలగించునెద్ది? జననీ సద్భావనా వృష్టియే,

క్షేమంబిచ్చుచు క్షామమున్ డులుచు నీ శ్రీశక్తికిన్ సన్నుతుల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౭.

 

శాII శ్రీమద్వేంకట వీర రాఘవవరుల్ శ్రీమద్గురుల్ నాకు

త్ప్రేమన్ విద్యను నేర్పినారు కృపతో వీక్షించి నన్ బుత్రుగా,

నీ మాత్రంబు కవిత్వమా గురులదే, యెంతున్ మదిన్ వారలన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౮.

 

శాII సామాదుల్, వరవేదముల్, నిధులు, సంసారంబులో మున్గుచో

నీ మార్గంబును జూపునవ్వి జననీ! నీతేజమన్ బెన్నిధిన్

బ్రేమన్ మాకు నొసంగు నేర్చుకొనినన్, విశ్వంబునన్ వెల్గు మా

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౭౯.

 

శాII కామారిన్ కదిలించినన్ దెలుపు నీ కామ్యార్థ దాతృత్వమున్,

శ్రీమాతా! సుగుణాకరుండనగ నన్ జేయంగదే నిత్యమున్?

నీ మాన్యంబులు పోవునా? తరుగునా? నీవింక నన్ బ్రోవుమా!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి కన్యా! రమా! ౮౦.

 

శాII నా మీదన్ దయ వీడి బ్రహ్మ నుదుటన్ నాకున్ లిఖించెన్ గదా

యేమాత్రంబును నోర్వరాని గతులన్, హే మాధవీ! నన్నిలన్

బ్రేమన్ గావగ నిన్నె వేడెదను నా విశ్వాసమున్ నిల్పి, యో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౧.

 

శాII మేమా మాయల మున్గియుందుమిల, మా మీదన్ దయన్ వీడి యా

కామాదుల్ మదులందు చేరు మము నేకంబై క్షితిన్ గొల్పుఁగా,

మా మీదన్ దయఁ జూపి శాత్రవతతిన్  మానుండి పోఁ ద్రోలుమో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౨.

 

శాII ఏమీ నిన్ననలేముగా జననివై యే మార్గమున్ జూపినన్,

నీ మార్గంబదె మాకుఁ బ్రీతి జననీ! నిష్టన్ నినున్ జేర్చు నా

శ్రీమార్గంబునె మమ్మిలన్ నడుపుమా, చేరంగ నిన్ వేగమై,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౩.

 

శాII క్షేమంబున్ గృషిఁ జేయు భక్తులకు సత్కీర్తిప్రదా! కొల్పుచున్,

నీ మాధుర్య గుణంబుఁ జూపుమ దయన్  నిత్యోత్సవోద్భాసినీ!

భూమిన్ గార్మిక వర్గమెంచు నిను సత్పూజ్యప్రభా రాశిగా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౪.

 

శాII శ్రీమత్తోపెల సోదరుండడుగగా శ్రీదా! శతాధిక్యమౌ

శ్రీమార్గంబున పద్యముల్ గొలిపి యాశీర్వాదమందించితే?

ధీమంతుల్ గన నొక్క రోజుననె, ఖ్యాతిన్ గొల్పగా నెంచియా?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౫.

 

శాII శ్రీమాతా! యభిమానమే ధనముగా చెల్వొందు నీ భక్తులన్

నీమార్గంబున నీవిలన్ నడుపుమా, నిన్ జేరనిమ్మా కృపన్,

నీ మార్గంబది మోక్షదాయకముగా నే నెన్నుదున్ నిత్యమున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౬.

 

శాII మా మీదన్ దయఁ జూపునట్టి నిను సమ్మాన్యంబుగా పల్కగా

నేమాత్రంబును నేర్వమమ్మ! మనమందేతీరునన్ గొల్చినన్

నీమంబొప్పగ నిన్ను దెల్పవలెగా, నిత్యప్రభారాశి! యో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౭.

 

శాII రా మాతోనని నిన్ను కోరకనె చేరన్ వచ్చి కాపాడు నీ

ప్రేమన్ దల్లియుఁ జూపనేర్వదనినన్ విద్వన్నుతుల్ పొంగరే?

నీ మాన్యత్వము నెంచకుందురె? శుభానీకంబులన్ గొల్పు మా

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౮.

 

శాII మామా చంద్రుఁడ! మమ్ము చూడుమనినన్ మాసోదరిన్ జూడుమం

చేమాత్రంబును శంకలేక తెలుపున్,హృష్టాత్ముఁడై యొప్పుచున్,

శ్రీమాతా! తమ సోదరుండె తెలిపెన్, చిద్రూపిణీ! కావుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౮౯.

 

శాII రాముండిక్కఁడె రావణున్ దునుముచున్ రాజిల్లడంచెంచి నీ

ప్రేమన్ జూపుచు సీతవై చనితివా వెంటన్ దయన్ బోడుకున్?

నీ మార్గంబది నిర్వివాదముకదా, నీకున్ నమస్కారముల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౦.

 

శాII నీ మందస్మిత మందఁజేయు శుభముల్, నీ మార్గమున్ జేర్చు

మ్మో మాతా! నినుఁ గొల్తుమమ్మ! విజయమ్మో? స్వర్గమో? గొల్పుమా,

మా మర్యాదను కావుమా, శుభములన్ మాకిమ్మ, నీ సత్ కృపన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౧.

 

శాII ప్రేమన్ జూపెడి యమ్మవీవె జననీ! విజ్ఞానమందించు సత్

ప్రేమోద్భాసిత! తండ్రివీవె కనగా విశ్వాసమొప్పారగా

మేమున్ నిన్ భజియింతుమమ్మ! దయతో మేలున్ సదా కూర్పుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౨.

 

శాII శ్రీమంతుండగు నారసింహునెదలో శ్రీదేవివై వెల్గు నిన్

ధీమంతుల్ కని వర్ణనప్రతిభతో దీపించు పద్యాళినే

బ్రేమన్ వ్రాయగ నేర్తురమ్మ! నిను నే విఖ్యాతిగా వ్రాయనా?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౩.

 

శాII ఏమాత్రంబును దోషముల్ గనను, నా కేమాత్రమందింతువో

యామాత్రంబె రచించుదున్ శతకమై యానందమున్ గూర్పగా,

శ్రీమాతా దినమందునన్ శతకమే చెన్నార వ్రాయించితే?

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౪.

 

శాII భూమిన్ గల్గినవెల్ల నీదు ప్రతులే పూజ్యంబులే చూడగా,

నేమా భాగ్యము? నిన్నె యన్నిటఁ గనన్ హృద్యంబుగా సాధ్యమై

క్షేమంబొప్పరహింపఁగా నగునుగా  సీమంతినీ! సంస్తుతుల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౫.

 

శాII రామారత్నమ! నిన్నె పోలుదురుగా రాజీవనేత్రల్ భువిన్,

నీమార్గంబున నీ వలెన్ మెలగుచున్ నీవే యనన్ వెల్గుచున్

క్షేమంబున్గనువారికిన్ నతులు, రాశీభూత చేతోనిధీ!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౬.

 

శాII శ్రీమన్మంగళ మూర్తులౌ మహిళలన్  జిత్తంబునన్ గొల్తు నే

నీమంబొప్పగ నీదురూపులనుచున్, నీ ధ్యాసతో వెల్గుచున్,

శ్రీమాత్రద్భుత శక్తి వారె కద వాక్ఛ్రీనొప్పుచున్ నిల్తురే,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౭.

 

శాII నా మార్గంబున నీవె నిల్చి పదముల్ నాలోన గుంభించి యీ

శ్రీమన్మంగళ పూర్ణమౌ శతకమున్ చిద్రూపిణీ! వ్రాయగా

నీమంబొప్పఁగఁ జేసితీవె కద! నిన్ నేర్పార నన్ జేరనీ,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౮.

 

శాII శ్రీమన్మంగళ కార్యకర్తవగుచున్ జేతన్ ననున్ బట్టి నీ

వే మార్గంబయి జీవితాంతమిటులే విశ్వాసమొప్పారగాఁ

బ్రేమన్ దోడ్కొని పోవు నీకు నతులన్ బ్రీతిన్ భువిన్ జేసెదన్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౯౯.

 

శాII ఏమేమీ! జననీ పదాబ్జ యుగళిన్ హృద్యంపు పద్యాళిలోఁ

బ్రేమన్ వ్రాయఁగఁ బూనినంతనె శతంబే కాదు పైనింకనున్

శ్రీమంతంబుగ వేగవంతముగ వచ్చెన్? నాకు వ్రాయంగ నో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౦.

 

శాII శ్రీమాతా! మది నెంచు మింక నను, నే చింతాన్వయుండన్, ధరన్,

బ్రేమన్ నన్ గనె రత్నమాంబ, సుతునై వెల్గొందుటన్ గాంచి తా

శ్రీమంతంబుగ నన్నుఁ జూచి మురిసెన్ చిద్వీథి నన్ నిల్పుచున్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౧.

 

శాII శ్రీమాతా! వరలక్ష్మి! భార్గవి! కృపన్ జేకొమ్మ యీ గ్రంథమున్,

నీమంబొప్పఁగ నీవె వ్రాయునటులన్ నేర్పార చేయించి నీ

ప్రేమన్ జూపితివమ్మ నాపయిని, నీవే ప్రేమఁ జేకొమ్ము, మా

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౨.

 

శాII ప్రేమన్ మంగళముల్ రచింపుమిలపై విజ్ఞానులౌ వారికిన్,

నీమంబొప్పగ కావు మీవె కృపతోన్ వీక్షించి భక్తాళినే,

నా మీదన్ దయఁ జూపి మంగళములన్ నాకున్ బ్రసాదింపుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౩.

 

శాII ఏమేమో రచియింపఁ జేసితివి నీవేనమ్మ నా తల్లివై,

నీ మాటల్ వర పద్యపాదములుగా నిల్చెన్ గనన్ పాఠకుల్,

క్షేమంబందఁగఁ జేయుమా చదివినన్ సేవించినన్ దీని నో

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౪.

 

శాII శ్రీమన్మంగళ! మంగళంబగుత నీ చిద్రూపమున్ గాంచినన్,

శ్రీమంతుండగు శ్రీహరిన్ దలచినన్ జేరున్ గదా పుణ్యముల్,

భూమాతన్ రహియించు పావనులకున్ మున్ గొల్పుమా శోభనల్,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౫.

 

శాII మా` ప్రాసయె యన్నిటన్ నిలుపుచున్నిచ్ఛన్ గృతిన్ జేసితిన్,

శ్రీమాతృప్రభ మంగళంబనుచు నే చెన్నార నిన్ గొల్చుచున్

క్షేమంబందగ వ్రాసితిన్ జనని! రాశీభూత చైతన్యమా!

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౬.

 

శాII నీమంబుల్ గణియింపనో రచనలో, నిన్ భక్తితో చూపనో,

యేమాత్రంబును నమ్రతా సుగుణమేనిందున్ బ్రదర్శింపనో,

శ్రీమాతృప్రభఁ గాంచకుందునొ, కృపన్ శ్రీమాత మన్నింపుమా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౭.

 

శాII శ్రీమన్మంగళరూపిణీ! జయమగున్ జింతింప తోపెల్లకున్,

శ్రీమన్మంగళమౌత దీనులకు, వాసిన్ గన్న స్త్రీ జాతికిన్,

శ్రీమన్మంగళమౌత మాకు, నిలపై శ్రీదేవి వెల్గొందగా,

శ్రీమన్మంగళ భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౮.

స్వస్తి.

చింతా రామకృష్ణారావు కవి ఏకదిన విరచిత  రమాశతకము సమాప్తము.

తేదీ. 29 – 3 – 2024. రాత్రి పదిగంటలకు పూర్తయినది.


జైహింద్.
Print this post

4 comments:

అజ్ఞాత చెప్పారు...

ఇది సంపూర్ణముగా మీకు మాకు మా అందరికీ లక్ష్మీ కటాక్షముగా భావించుచున్నాను అన్నగారూ!

అజ్ఞాత చెప్పారు...

అద్భుతమైన రచన అమ్మవారి దయ మెండుగా గల తమరికి సాధ్యం కాని దంటూ ఏమీ లేదు, తమరి వినూత్న ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకోవాలని అమ్మవారి ని ప్రార్థిస్తున్నాను,

అజ్ఞాత చెప్పారు...

అద్భుతం. ఆసాంతం చదివితిని. అమ్మ కృపకు పాత్రుడనయినితిని.
శ్రీ చింతా రామకృష్ణారావు గారికి వేన వేల నమస్కృతులు.
ఈ సందేశమును 8 గంటలకు చూచితిని తొమ్మిది పదిహేను నిమిషముల
చదివి(మధ్యలో భోజన విరామం) వ్రాస్తున్నాను.
కడయింటి కృష్ణమూర్తి. 12-4-24

అజ్ఞాత చెప్పారు...

అత్యద్భుత శతక రాజము గురువుగారు.
అమ్మ శారద తమవెంట ఉండి నడిపిస్తుందున మీరు గంటల్లోనే శతక ము పూర్తి చేయగలరు. ఇది నిజము.

ధన్యవాదములు గురువుగారు 🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.