గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఆపూర్వమాణమచలప్రతిష్ఠం.. | 2 . 70.||..//..విహాయ కామాన్ యః సర్వాన్.. || 2 .71||..//.. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ .. || 2 . 72.||..//..సాంఖ్యయోగము.

 జైశ్రీరామ్.

శ్లో. ఆపూర్వమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |

తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ||70. 

తే.గీ. నిండుచుండియు జలధి తా నిరత మటుల

చలనమొందక యుండుటన్ సకలజలము 

లందు చేరు నటులె కామ మణగి యున్న

మదిని శాంతియు చేరును మహిత! పార్థ!

భావము.

నదులు సర్వదా నీటిని పూరించుచున్ననూ సుస్థిరమైయండు 

సముద్రమువలే అవిచిన్నమైన కోరికల ప్రవాహముచే కలతనొందని 

మానవుడు మాత్రమే శాంతిని పొందజాలును. తన కోరికలను తృప్తి 

పొందింప యత్నించు వారెల్లపుడునూ శాంతిని పొందజాలరు.

శ్లో. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిః స్పృహః |

నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ||71.

తే.గీ. కోరికలు వీడి యహమును చేరనీక

మమతలను వీడి యాశనన్ మదిని వీడి

మెలఁగు నెవ్వఁడు వాఁడె యీ మేదినిపయి

శాంతి సౌఖ్యంబులందును, సన్నుతముగ.

భావము.

ఇంద్రియముల తృప్తి కొరకు అన్ని కోరికలనూ విడిచి 

నిరపేక్షుడై నివసించు వాడును ఇంద్రియ మమత్వమును అహంకారమును 

విడిచి ఉండువాడును మాత్రమే నిజమైన శాంతిని పొందజాలును.

శ్లో. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |

స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ||72.

తే.గీ. ఇట్టు లెవరు బ్రహ్మజ్ఞాన మిద్ధఁ వడయు 

నతనిఁ జేరవైహిక వాంఛ లంతిమమున

నైన యిట్టి సుజ్ఞానంబు నందినయెడ

మోక్షమది ప్రాప్తమగునయ్య! బుద్ధినిడుమ.

భావము.

ఓ పార్థా! ఇదియే ఆధ్యాత్మికమునూ, దివ్యమునూనయిన జీవితము యొక్క 

పధ్ధతి. దీనిని పొందిన పిమ్మటమానవుడుకలతనొందడు. మరణకాల

మందైననూ  అతనట్లున్నచో వైకుంటము ప్రవేసింపజాలును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.