గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2022, గురువారం

శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మ గారు మాయింటికి అభిమానముతో వేంచేసిన సందర్భముగా ప్రేమతో సమర్పించిన అభినందన మందార మాల.

జైశ్రీరామ్.

సహృదయశిరోమణి శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మగారు గత నవంబరు ఆఖరు వారములో మాయింటికి వచ్చిన స<దర్భముగా మియాపూర్ మిత్రమండలి అభిమానంతో వచ్చి శ్రీ దత్తాత్రేయశర్మగారిని గౌరవార్థం కలిసిన సందర్భములోని ఛాయా చిత్రము.దత్తాత్రేయులవారికి కుడిప్రక్కనున్నది  నేను. శ్రీ బండికాడ అంజయ్యగారు, శ్రీముద్దురాజయ్యగారు, ఎడమప్రక్కనున్నది శ్రీకవిశ్రీ సత్తిబాబుగారు, శ్రీ కటకం వేంకట రామశర్మగారు, శ్రీ మాచబవోలు శ్రీధరరావుగారు, శ్రీ ధనికొండ రవిప్రసాదు గారు.

శ్రీరస్తు...శుభమస్తు...అవిఘ్నమస్తు
శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మ గారు మాయింటికి అభిమానముతో వేంచేసిన సందర్భముగా  ప్రేమతో సమర్పించిన
అభినందన మందార మాల. 

శా.  శ్రీమన్మంగళ భావనా కలితుఁడున్, జిన్మార్గ సద్వర్తియున్,
ధీమంతుండును, పండితుండు, కవనోద్దీప్తుండు దత్తాఖ్యుఁడే
శ్రీమంతంబుగ నేగుదెంచి రిటకున్ శ్రేయంబులన్ గొల్పగాఁ
బ్రేమన్ స్వాగతమార్య! మీకు, సుకవీ! శ్రీరాముఁడేలున్ మిమున్. 

శా.  సాహిత్యాభిరతిన్ నిరంతరముగా సత్సంగముల్ గొల్పుచున్
మోహాతీత మనోజ్ఞ భావ కలనన్ బుణ్యాత్ములన్ గొల్చుచున్
స్నేహంబున్ బ్రకటించుచున్ సుజనలన్ జేకొంచు మిత్రాళిగా
సౌహార్దంబును జాటు మీకు శుభముల్ సౌందర్య భాస్వన్మణీ!

ఉ.  దక్షతతోడఁ గార్యములు తన్మయతన్ బొనరించు చుందురే,
యక్షయమైన బ్రేమను సమాదరలీలను జూపుచుందురే,
శిక్షణ నొందు వారలను జేరి సుశిక్షణనిచ్చుచుందురే
రక్షణ మీరె భాషకు, వరమ్ముగ భారతి మిమ్ము మాకిడెన్.

చం.  పరమదయా పరత్వమున భాసిలు మీ ముఖమండలం బహో,
నిరుపమ భాషణాలహరి నిత్య సుగంధ పరీమళంబె, కి
న్నెర పలుకుల్ తలంపగ, మనీషులు మెత్తురు మీదు వాగ్ఝరిన్,
ధరణిని మంగళాకృతుఁడ! ధార్మిక వృత్తిని వెల్గుడెల్లెడన్.

మ.  అవధానాద్భుత విద్యలో ఘనులు. మీ రానంద భాగ్యోన్నతుల్,
నవనీతాన్విత చిత్తతేజులు సదానందప్రదుల్, సత్కృతుల్
కవిలోకంబునకాచరించు సచివుల్ కల్యాణ సంపత్కరుల్
భువికే మంగళకారియౌచు సతమున్ పూజ్యుండుగా వెల్గుడీ.
స్వస్తి.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.