గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2019, సోమవారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 41వపద్యమునుండి 45వ పద్యము వరకు.

జైశ్రీమన్నారాయణ.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.


 41. ఉ. భీమవరంబునందునిల పేరును గాంచిన కాణ్వ శాఖజుల్
నీ మహనీయ జన్మదిన నిస్తుల భవ్యమహోత్సవంబు ని
ష్కామముతోడచేయు. శుభకర్ముల బాధ్యత భక్త బంధు నీ
దే మరి యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 42. ఉ. అప్రతిమాన పండిత మహాత్ములు కల్గిరి కాణ్వ శాఖలో.
నీ ప్రతిభా విశేషము, మనీషయునెల్లెడ చాటువారలే.
విప్రకులోత్తముల్ ప్రబల వెల్గఁగజేయుమ వారిలోపలన్
ధీప్రభ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 43. చ. వ్రతములు, యజ్ఞముల్, సతము రమ్యముగా పచరించు దీక్షితుల్
వెతలను తాళఁ జాలరయ. వేగమె నీవు గ్రహించి వారికిన్
సతతము సంఘమందు ఘన సత్కృకతులొప్పగ కొల్పుమా సమా 
దృతినిల యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 44. ఉ. కష్టములన్ భరించుచు ప్రకాశ మనంబున మెల్గు నైపుణిన్,
దృష్టి మరల్చకుండ వినుతించుచు నిన్ గను శక్తియుక్తులన్,
శ్రేష్టుల సంగతిన్ గొలుపు శ్రేష్టతనొప్ప మనోజ్ఞమౌ మహ
ధ్దృష్టిని, యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 45. ఉ. వేగిరపాటు చేత ప్రభవించునయాచిత దుర్నిమిత్తముల్.
సాగెడి జీవితంబున ప్రశాంతి రయంబగు దానిచేతనే.
నా గతి మార్చుమయ్య కరుణన్ ననుఁగాంచుమ. నీవు పాపుము 


ద్వేగము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

(సశేషమ్)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.