గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మార్చి 2019, ఆదివారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 36వపద్యమునుండి 40వ పద్యము వరకు.

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణా
 36. ఉ. లెక్కకు మించి ముష్కరులు లీలగ దుష్కృతముల్ ఘటింతు రే
ప్రక్కను గన్న వారలె. ప్రపన్నులఁ గావగలారు లేరు. నీ
వొక్కడవే దురాత్మకులనుక్కడగించి జనాళీఁ బ్రోచు మా
దిక్కువు యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 37. ఉ. సంతసమెల్ల వేళలను చక్కగ నుండఁగ మాకు చేయు మీ
వింత యొనర్చినన్ నిరతమేము శుభాస్పద కార్యదీక్షతో
శాంతిని నింపనేర్తుమిల. చక్కఁగ సంతస మీయ నిన్నుఁ బ్రా
ర్థింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 38. చ. స్మృతిని వచించితీవు పరిసేవ్య శుభావహ ధర్మ వర్తనల్.
బ్రతుకుటె భారమౌటను సభక్తిగ నీకు నమస్కరించి యా
స్మృతులు పఠించలేము. పరీశీలన చేయుము. మార్చుమయ్య మా
స్థితినిక. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 39. ఉ. గుప్తములయ్య వేదములు. కోవిదపాళి గ్రహింపనౌను. సం
క్షిప్త పదార్థ భావములు చెప్పిన మేము గ్రహింతుమయ్య. మా
ప్రాప్తమదేమొ చెప్పరయ. భాగ్యవిధాతవు నీవె చెప్పుసం
తృప్తిగ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 40.  ఉ. పంతము మాని, నీ స్మృతిని బాగుగనందరెఱుంగునట్లు, ర
వ్వంత కృపావహుండవయి ప్రస్ఫుటరీతి గ్రహింప చెప్పుమా.
సాంతము నీవు నేర్పిన. ప్రశాంతము లోకమునెల్ల చోట్ల సా
ధింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

(సశేషమ్)
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అభినందన మందారములు

raju చెప్పారు...

sidhu moose wala video song
geetha govindam video song download
rowdy baby video song download
pu degree 5 sem results
degree 1 sem results 2019

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.