గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2019, ఆదివారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 71వపద్యమునుండి 75వ పద్యము వరకు.

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.
71. చ. ఘనమగు సంహితన్ రవి సుఖంబుగ నీకు ననుగ్రహించెనా. 
క్షణమును నిల్వజాలకయు చక్కఁగ చేసెన పాఠనంబు. నీ
వనుపమరీతి నేర్చుటను భవ్య ఫలప్రదుడయ్యె నీకు నా
దినపతి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 72. ఉ. జ్ఞాన నిధానమీవు. వరగణ్యుల లోపల గణ్యుఁడీవు. వా
దైన యనంత వేదముల తత్వమెఱింగితివీవు. నీవికన్
మౌనము వీడి, నీజనుల మాన్యతనిల్పఁగ హెచ్చరింపుమో
ధీనిధి యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 73. ఉ. అప్పులు చేయనొప్పని మహాత్ములు నీ వర శాఖ భూసురుల్
తప్పులు చేయనొప్పరు. యదార్థమునందు చరించు ధీనిధుల్. 
తప్పఁగఁ జేయు వారి పరితాపము, దుర్విధిఁ  గల్గుచున్న యా
తిప్పలు, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 74. ఉ. న్యాయము తప్పనేరరు. సనాథులనాథులు కాణ్వ శాఖజుల్.
ధ్యేయముతోడ వర్తిలెడి ధీవరులెల్లరు. చూడు వీరికిన్
న్యాయము చేయుమెల్లెడల, నార్తిని చేయుము జీవితాలనే
దీయగ. యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 75. ఉ. చక్కఁగ నీదెయౌ ప్రథమశాఖను పుట్టినవారలందరున్ 
నిక్కము నిన్నె నమ్మిరయ. నేరరు దుర్వ్యవహారముల్ధరన్.  
మక్కవతోడ నిన్గొలుచు మాన్యులుపల్కుదురయ్య నీవె మా 


దిక్కని. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

(సశేషం)
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందమైన ఉత్పలములతో యాజ్ఞవల్క్య గురుదేవుని చక్కగా స్తుతించిన పద్యములు వీనుల విందుగా నున్నవి. ధన్య వాదములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అన్ని పద్యములు అలరించు చున్నవి " చక్కగ నీదెయౌ ప్రధమ శాఖను బుట్టిన వారలందరున్ " ఈ పద్యము మరింత మక్కువగా నున్నది. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.