గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మార్చి 2019, శుక్రవారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 96వపద్యమునుండి 100వ పద్యము వరకు.

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.

 96. ఉ. కష్టములెల్లనొక్కటయి కాల్చుచునుండె మనంబు నక్కటా
దృష్టిని నీపయిన్నిలుప తేలిక కాదు. మహాత్మ నీవికన్
కష్టములెల్లఁ బాపి, మము కావఁగ భావనఁ జేసి పెట్టుమా
దృష్టిని. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 97. చ. సతతము నిన్స్మరించు, గుణసాంద్రులు సద్వర కాణ్వశాఖజుల్,
క్షితి నను గౌరవించుతరి చిన్మయమూర్తులకంజలించి నే
నతులితభక్తి నీశతక మంచితరీతి రచించినాడ స
త్కృతిగను యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 98. సరసుఁడు, వేదశాస్త్ర పరిషత్ ఘనపాఠియు నప్పనాఖ్యులా 
పరమ పవిత్రమూర్తి నను వర్ధిలఁజేయఁగ సత్కరించుటన్
గరువము పెంచినారు.  శుభకామితముల్ నెరవేర్చు వారికా 
తిరుపతి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 99.  ఉ. కనుము దయానిథీ. సుకవి కల్పకముల్ ధర మెచ్చునట్లుగా
ఘనముగ నీ జయంతిని ప్రగాఢమనమ్మున వ్రాసినాడ నీ
మనమునకెక్కనీ కృతిని. దీనిని చేఁ గొనుమయ్య. నీవె యం            .     
దిన, తగు. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

100. ఉ. శ్రావ్యముగా పఠించినను, శ్రద్ధగ దీనిని భోధ చేసినన్,
దివ్యత కొల్పి, దీప్తమగు ధీప్రభ పెంచుము వారికిద్ధరన్.
భావ్యము నీకు పాఠకుల వర్థిలఁ జేయుట. భక్తబాంధవా!


దివ్యుఁడ! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా

(సశేషం)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
దయానిధీ , భక్త బాంధవా మా సోదరులు చిరంజీవి శ్రీ చింతా వారు మరిన్ని శతకములు మాకందిచ వలెనని ఆశీర్వదించుము తండ్రీ .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.